అతడికై ఆమె ...

తనను  అనుమానించిన భర్తకు ఎలా ఓ భార్యా సమాధానం చెప్పిందో తెలిపే కథే అతడికై ఆమె 
(వార్తా ఆదివార అనుబంధ పత్రికలో ప్రచురితం )

అతడికై ఆమె ...

-రచనశ్రీ దత్త (శృంగవరపు రచన)

కులాసాగా సోఫాలో కూర్చుని హెడ్ సెట్ తో మమేకమైన రామ్ కి కాలింగ్ బెల్ మోత చిరాకు కలిగించింది.

‘ఈ దిక్కుమాలిన చుట్టాలకు ,సేల్స్ మ్యాన్ లకు వేళా పాళా ఉండదు ...’అని గొణుక్కుంటూ డోర్ తెరిచాడు.

ఎదురుగా కార్పొరేట్ డ్రెస్సింగ్ స్టయిల్ లో నిలబడ్డ ఓ యువకుడు కనిపించాడు. వయసు పాతిక ముప్పై మధ్య ఉండొచ్చు. అతని ముఖం చూస్తే బాగా తెలిసిన ముఖంలా అనిపిస్తుంది.

‘ఎక్స్క్యూజ్ మి సర్ ...’ రామ్ ఆలోచనలు పూర్తి కాకముందే ఆ అపరిచితుడు లోపలికి రావోచ్చా అన్నట్టు సంజ్ఞ చేశాడు.

‘రండి ...లోపలికి రండి ...’ తేరుకుని లోపలికి ఆహ్వానించాడు రామ్.

అతను కూర్చొనే లూపే రామ్ పజిల్ విడిపోయింది. ఇతను ఆదిత్యా ...కోట్లకు పడగలెత్తిన బిజినెస్ మాగ్నెట్ ....ప్రతి రోజు ఏదో ఒక వార్తా పత్రిక అతని గురించి డప్పు కొడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆ జ్ఞప్తితో అతని వైఖరిలో కూడా మార్పు వచ్చింది.

‘ఆదిత్యాగారు ....నమస్తే ...మీరు మా ఇంటికి ....కలలో కూడా అనుకోలేదు ...’ ముక్కలు ముక్కలుగా వస్తున్నాయి రామ్ నోటి నుండి మాటలు.

‘అదేం లేదండీ ....రేవతి గారిని చూద్దామని .... ఒక్కసారి థాంక్స్ చెపుదామని వచ్చాను...ఒక్కసారి రేవతి గారిని పిలుస్తారా ?’

‘దానికేం భాగ్యం....

రేవతి ....రేవతి ...’ అన్న పిలుపు తో బయటికి వచ్చింది ఆమె.

‘రేవతి .... ఆదిత్యా గారు ...తెలుసు కదా ...స్వయంగా నిన్ను కలవాలని వచ్చారు ...’

రేవతి అతనికెలా తెలుసు అన్న కుతూహలం,ఉత్సాహం ఉన్న అవి పక్కన పెట్టి పిలిచాడు. భర్త మాటలు రేవతికి అగమ్యగోచరంగా అనిపించాయి.

ఏం మాట్లాడాలో రేవతికి అర్ధం కాలేదు. అసలు ఎంత గుర్తు తెచ్చుకుందాం అన్నా అతనెవరో ఆమెకు గుర్తుకు రావడం లేదు.

‘నమస్తే మేడమ్ ...మీరు నన్ను మర్చిపోయి ఉండవచ్చు... కానీ మీతో ఆర్తి లాడ్జింగ్ అండ్ రెస్టారెంట్ లో గడిపిన నాలుగు రోజులు నా జీవితాన్ని మార్చేశాయి. నన్ను ఈ రోజు ఇంత పెద్ద బిజినెస్ మాగ్నెట్ ను చేశాయి.’

తన భార్య లాడ్జిలో ఓ అబ్బాయితో గడపటం ...అతను ఇంత ధైర్యంగా ఆ విషయాన్ని చెప్పడం ...రామ్ లోని అనుమానాన్ని తారా స్థాయికి చేర్చింది.

ఎదుట ఉన్నది కోట్లకు పడగలెత్తిన ఓ బిజినెస్ మాగ్నెట్ కాబట్టి తన మనోభావాల్ని అణచుకున్నాడు .

‘ఆదిత్యా ...నువ్వా ?’

ఛీ ఛీ ..భర్త ముందే ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంది ఇది అని అనుమాన బీజాలు మనసులోనే విత్తడం మొదలు పెట్టాడు.

‘అవును మేడమ్ ..మీరు నేర్పిన ఆ విలువలు ,ధైర్యమే నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టాయి. ఈ సంవత్సరం ‘బిజినెస్ సర్వే ‘లో మొదటి పది లో ఉన్నందుకు నాకు స్విట్జర్ లాండ్ లో సన్మానం జరుగుతుంది. మీరు ,సర్ తప్పకుండా రావాలి ...’ అంటూ రామ్ వైపు తిరిగాడు.

‘సర్ ..తప్పకుండా మీరు, మేడమ్ స్విట్జర్ లాండ్ కి రావాలి. మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకు వెళ్ళడం మొదలుకుని మిమ్మల్ని తిరిగి ఇక్కడికి తీసుకు వచ్చేవరకు అంతా బాధ్యత నాదే . దయ చేసి నా ఆహ్వానాన్ని మన్నించి ,ఆతిథ్యాన్ని స్వీకరించండి ‘, అన్నాడు ఆదిత్య .

‘అయ్యో ..మీరంతగా చెప్పాలా ? తప్పకుండా వస్తాం ఆదిత్యా గారు ..’ అంటూ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు రామ్ .

‘సరే మేడమ్ . మీ రాక నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. సర్ ..మీరు కూడా తప్పకుండా రావాలి. ఇక నేను వెళ్లొస్తాను …’అంటూ వెళ్లిపోయాడు అతను.

అవును మరి ...అలాంటి అందగత్తె రాక ఎవరికి ఆనందాన్ని ఇవ్వకుండా ఉంటుంది? 38 ఏళ్ల వయసులో కూడా కళ, నిగారింపు , చిరునవ్వు ,లావణ్యంతో ఉండే ఆమెను కోరుకొని వారు ఎవరుంటారు? మనసులోని అతని అనుమానపు విత్తనాలు వృక్షాలు అవుతున్నాయి .

‘ఏవండీ ..ఎదిగిన కొద్ది ఒదగడం అంటే ఇది కదా ...ఇంత ఎత్తుకి ఎదిగిన ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తిని ఇంతగా అభిమానించి , గుర్తు పెట్టుకు రావడం గ్రేట్ కదా! అందుకే 22 ఏళ్ల వయసుకే అంతా ఎత్తుకి ఎదిగాడు’, అంది ఏదో తెలియని సంభ్రమంలో మునిగిన రేవతి.

ఆ క్షణంలో ఆమె భర్త ముఖ కవళికలు గమనించలేదు కానీ ...ఒకవేళ చూసి ఉంటే మాడి మసైపోయేది.

* * *

గాఢనిద్రలో ఉన్న ఆనంద్ కాలింగ్ బెల్ మోతకు మేల్కున్నాడు .

‘వీడెవడ్రా బాబు ...ఎవడైనా ఒకట్రెండు సార్లు బెల్లు కొడతారు ...వీడు ఆపకుండా కొట్టేస్తున్నాడు ‘, అని చిరాగ్గా అనుకుంటూ బెడ్ మీద నుంచి లేచి బట్టలు సర్దుకుంటూ తలుపు తీశాడు.

ఎదురుగా ఉన్న రామ్ ని చూసి ఆశ్చర్యపోయాడు.

‘రా బావా...నువ్వా ?...రియల్లీ సర్ప్రైజింగ్ ...నీ పెళ్ళైన పన్నెండేళ్లలో అన్ని సార్లు మేము రావడమే తప్ప నువ్వు ఒక్కసారి రాలేదు ఎంత రమ్మని పిలిచినా. అలాంటిది నువ్వు ఇన్నాళ్ళకి రావడం ...నాకు చాలా ఆనందంగా ఉంది బావా ... ‘ అంటూనే అతని చేతిలోని బ్యాగ్ ని అందుకుని లోపలికి నడిచాడు రామ్ తో.

‘అదేం లేదోయ్ ...అనుకోకుండా విజయనగరం వచ్చాను...ఎందుకో చూడాలనిపించింది వచ్చాను ...ఇంతకీ చెల్లాయి లేదా? ఇంత నిశ్శబ్దంగా ఉంది ఇల్లు ...’

‘సరిగ్గా చెప్పావు బావా ...తాను ఏదో మీటింగ్ ఉంటే ఢిల్లీ వెళ్లింది. తాను ఉంటే మనం ఇలా మాట్లాడుకోవడానికి గ్యాప్ ఉండేదా?’ నవ్వుతూ అన్నాడు ఆనంద్ .

‘ఓ నాలుగు రోజులు ఉంటావా బావా ? రాక రాక వచ్చావు అసలే ...’

‘లేదురా ... రేపు ఉదయమే వెళ్లిపోవాలి .అసలు ఇక్కడికి ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను.’

‘అదేంటి బావా ...నువ్వు వచ్చిందే ఈ సాయంత్రం పూట. మరి బొత్తిగా ఓ పూటే ఉంటావా? అన్నట్టు మర్చేపోయాను...’ అంటూ ఫోన్ డయల్ చేశాడు.

‘హలో లక్ష్మి ...నేనమ్మా ఆనంద్ ను ....మా బావగారు వచ్చారు ...కొంచెం వచ్చి ఈ పూట వంట చెయ్యమ్మా ‘ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

‘ఇది బావా ...ఇక్కడ పనిమనుషుల బాగోతం ...వాళ్లిష్టం వచ్చినప్పుడు వస్తారు , వెళ్తారు. అవసరం మనదైతే ...అమ్మా బాబు అంటూ బ్రతిమాలాలి ఇలా.’

‘ఇది ప్రతిచోటా ఉండే భాగోతమే ...అలవాటుపడటమే..’

‘ఇంతకీ విషయమేమిటి బావా ?’

‘ఏమి లేదు ఆనంద్ ...నీకు పారిశ్రామిక వేత్త ఆదిత్య తెలిసే ఉంటాడు ...’

‘అదేంటి బావ ...అతని గురించి తెలియని వారెవ్వరుంటారు ? సంవత్సరం నుండి విజయభేరి ముగిస్తున్నాడు. అందులోనూ ఒకప్పుడు నా దగ్గర పని చేశాడు కూడా.’

ఆ పాయింట్ కోసమే ఎదురు చూస్తున్న రామ్ ... కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా తన మాటలని తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

‘అతన్ని మా కంపెనీ తరపున ఓ ఈవెంట్ విషయమై సత్కరించాలని నిర్ణయం తీసుకుంది. అతని గత జీవితం, విజయ ప్రస్థానం ...వీటన్నిటి మీద అన్నీ డీటైల్స్ నన్ను చూసుకోమన్నారు. ఈ విషయం అనుకోకుండా రేవతికి చెప్పాను. తనకు ఆదిత్య మీ ఆర్తిలో పరిచయం అని అప్పుడు చెప్పింది. అలాగే నీ దగ్గరికి వెళ్తే ఇంకాస్త హెల్ప్ అవుతుందని. అందుకే వచ్చాను ఆనంద్.

‘అవును బావ ...నేనెప్పుడు ఊహించలేదు ఆదిత్యా ఇంత సాధిస్తాడని ...ఇంకా చెప్పాలంటే వీటన్నిటికి కారణం రేవతియే ...’

‘రేవతినా ? అదెలా ...’

‘సుమారు పదునాలుగేళ్ల క్రిందటి మాట ఇది. ఆదిత్య ముంబై నుండి వచ్చాడు. ఇక్కడ పొట్టకూటి కోసం నా దగ్గర చేరాడు. అప్పుడు రేవతి ఏవో పరీక్షలకని విజయనగరం వచ్చింది. నాలుగు రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. మా ఇంట్లోనే ఉండమని నేను,సరళా ఎంత బలవంతం చేసినా వినకుండా పట్టుబట్టి మా హోటల్ రూంలో ఉంది.

ఆ టైమ్ లో రూమ్ బాయ్ గా ఉండేవాడు ఆదిత్యా. అలా రేవతికి పరిచయం అయ్యాడు . చిన్నప్పటినుండే అనాథగా ఉన్న ఆదిత్య ఎప్పుడు ముభావంగా ఉండేవాడు. ఎవరితోనైనా చిరునవ్వుతో మాట్లాడటం, వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎవరిని తక్కువ చేయకుండా సమ గౌరవం ఉండటం రేవతికి ఉన్న సుగుణాలు.

ఎప్పుడు ముభావంగా, ఏమి పట్టనట్టు ఉండే ఆదిత్య తను ఉన్న నాలుగు రోజుల్లో చాలా చలాకీగా మారిపోయాడు. కస్టమర్స్ తో అతని తీరు కూడా సంతృప్తికరంగా మారిపోయింది. దానితో పాటు అతన్ని ‘ఇంగ్లీష్ నేర్చుకొమ్మని ...కస్టమర్స్ వేటిని ఇష్టపడుతున్నారు ,వారి అభిరుచులు ఏంటి’ .... తెలుసుకోమని తరచూ చెబుతూ ఉండేది.

తరువాత రేవతి వెళ్ళిపోయిన తరువాత ఆమె నంబర్ ఇవ్వమని అడిగినా నేను ఇవ్వలేదు. ఆ తరువాత మూడు నెలలకే నా దగ్గర పని మానేసి పెట్టుబడి లేకపోయినా ఇంగ్లీష్ నేర్చుకుని, కష్టమర్ల నాడి పట్టుకుని ...పట్టుదలతో వాటినే పెట్టుబడిగా పెట్టి ఈ రోజు ఇలా ఎదిగాడు బావ.’

ఒక్కసారిగా పాతాళంలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది రామ్ కి. తనకు తన భార్య అంటే చాలా ఇష్టం. దూరపు చుట్టం ఆనంద్ కి ఉన్నంత గొప్ప నమ్మకం పన్నిండేళ్ళు కాపురం చేసిన తనకు లేకుండా పోయింది. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి తన కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలి అనిపించింది.

‘బావా ...ఇక నేను బయల్దేరుతున్నా ….’ అని తన బ్యాగ్ భుజాన వేసుకుని ఒక్క ఉడుతను పరుగు లాంటి నడకతో బయటికి గెంతాడు రామ్.

‘బావా ..ఏమైంది ?’ అంటున్న ఆనంద్ మాటలు అతని చెవిలో పడనంత వేగంగా రైల్వే స్టేషన్ వైపు పరుగులు పెట్టసాగాడు.

ఎందుకొచ్చాడో ...ఎందుకెళ్లాడో తెలియక ఓ అయోమయంలో పడి అలాగే సోఫాలో కూలబడి అనవసరంగా నిద్ర చెడిపోయింది అని అనుకున్నాడు ఆనంద్.

* * *

‘రేవతి ...రేవతి ...’ అని అరుస్తూ గుమ్మం నుండే లోపలికి వెళ్ళాడు రామ్. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఈ లోపు ఫోన్ లో మెసేజ్ మోత మోగింది.

‘బుక్ షెల్ఫ్ లో ఉన్న టు కిల్  ఏ మాకింగ్ బర్డ్ అన్న పుస్తకం చదవండి’ అన్న మెసేజ్ రేవతి నంబర్ నుండి వచ్చింది.

వెంటనే బుక్ షెల్ఫ్ దగ్గరికి పరుగు పెట్టి ఒక్క ఉదుటున ఆ పుస్తకంలోని లెటర్ అందుకున్నాడు. అందంగా మడత పెట్టబడి ఉన్న ఆ ఉత్తరపు మడతలు విప్పి అక్షరాల వెంట కళ్లను పరుగులు పెట్టించాడు.

‘డియర్ రామ్ ...

నీకు నేనంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అని నాకు తెలుసు. నా అభిప్రాయాలు,అభిరుచులు గౌరవిస్తావని కూడా నాకు తెలుసు. కానీ ఓ చిన్న అపార్థం చాలు పాలసంద్రం లాంటి మన ప్రణయాన్ని పాయిజన్ గా మార్చడానికి. ఆర్తి హోటల్ అన్న పేరు వినగానే నీ మనస్సులో మొలకెత్తే ఎన్నో అనుమానాల బీజాలు నేను ఊహించగలను.

నన్ను అడిగితే నేను ఏమనుకుంటానో అని నువ్వు ఆ హోటల్ నడిపిన ఆనంద్ అన్నయ్య ఇంటికి వెళ్తావని ఊహించాను. కచ్చితంగా అనుమాన నివృత్తి అయ్యాకే తిరిగి వస్తావని తెలుసు.

రామ్ ...భార్యకు భర్తకు మధ్య ఉండే భాష మాటలతో ఉండదు. స్పర్శ, అభిమానం, ఆలింగనం ,అనుబంధం ,నమ్మకంతో ముడిపడి ఉంటుంది. భార్య భర్తలు అపరిచితులు కారు ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడానికి. ఒకరిలో ఒకరు ...ఒకరికై ఒకరు.

మన మధ్య ఉండాల్సింది స్పష్ఠత కానీ సందిగ్ధత కాదు. నువ్వు ఒకరోజు ఆఫీసు మీటింగ్ విషయమై ఓ అమ్మాయితో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు అది నేను నిన్ను డైరెక్ట్ గా అడిగి తెలుసుకున్నాను. అలా ఓపెన్ గా ఉండటం మన మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.

ఇకనుంచి అయినా అలాంటి నమ్మకంతో గాఢమైన అనుబంధంతో లేసుమాత్రం అనుమానాన్ని కూడా ఉంచుకోకుండా ...ఒకవేళ ఉంటే నాలా ఓపెన్ గా ఉంటావని ఆశిస్తున్నాను.

నువ్వు ఈ ఉత్తరం చదివాక ...ఏ అనుమానాలు మిగలనట్లైతే ....

నీకు ఇష్టమైన నెమలి రంగు షిఫాన్ చీర కట్టుకుని... తలలో మరుమల్లెలతో ...మన ఫార్మ్ హౌస్ దగ్గర నీ కోసం వేచి చూస్తూ ఉంటాను ...నీ రేవతి .’

ఒక్కసారిగా ఆ ఉత్తరంతో భార్య మీద గౌరవం అధికమైంది రామ్ కి. తాను ఆదరబాదరగా బట్టలు సర్దుకుని ఆఫీసు పని మీద వెళ్తున్నాను అని చెబితే... అది అబద్దమని తెలిసి కూడా ...ఏమి అనలేదు సరి కదా ...చిరునవ్వుతో సాగనంపింది.

తన మీద అనుమానంతో భర్త వేరొకరిని అడగడానికి వెళ్తున్నాడని తెలిసి కూడా తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. తాను వెళ్ళి అనుమాన నివృత్తి చేసుకుని వచ్చాకే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

‘ఐ లవ్ యు రేవతి’ అని మనసులో అనుకుని కార్ తాళాలు అందుకుని ఫార్మ్ హౌస్ వైపు కార్ పరుగులు పెట్టించాడు రామ్.

* * *









Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ