మృగాల మధ్య ....

ఆంధ్రభూమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ 


మృగాల మధ్య ....

-రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)


    ‘ప్లీజ్ ....డోర్ క్లోజ్ చెయ్యొద్దు....నాకస్సలు ఇష్టం లేదు ...’

‘ఇక్కడ నీ ఇష్టం కాదు ...కెరీర్ ముఖ్యం .ఆలోచించుకో ..’

శృతి ముఖం ఎర్రబడింది. మొదటి రోజు నుండే తాకాలని చేసిన వెకిలి చేష్టలు ఎలాగో భరించింది. తర్వాత బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే ఎలాగో తప్పించుకుంది. తన మౌనాన్ని అంగీకారంగా అనుకుని ప్రతి రోజు ఏదో విధంగా బాధ పెడుతున్నా, ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఇన్నాళ్ళు భరించింది. కానీ ఈ రోజు తలుపు మూసేవరకు వ్యవహారం రావడంతో ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది.

‘షటప్ మిష్టర్ సూర్యా ...కెరియర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం నాకు. ప్రతిభ ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు .’

‘అబ్బా ...వెళ్ళు వెళ్ళు ..ఎక్కడికి వెళ్ళిన ఆడది ముందు ఆడది ..........తరువాతే ఉద్యోగి గుర్తు పెట్టుకో ...’ వెకిలిగా నవ్వుతూ అన్నాడు సూర్య.

‘నీ లాంటి మృగాలే అన్ని చోట్లా ఉండరు. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం. అక్కడ మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇంతకన్నా బాగానే బ్రతకగలను. ‘

‘ఇంతకన్నా బాగా బ్రతుకుతావా? ఇక్కడ ఇదంతా కామన్. బాస్ ని తృప్తి పరిస్తే జాబ్ లో సెక్యూరిటీ, ఇంక్రిమెంట్ లు , ప్రమోషన్లు త్వరగా వస్తాయి. లేకపోతే ఉన్న జాబ్ కూడా పోవచ్చు. అందరూ ఇలాగే ఉంటారని ...ప్రతి చోటా ఇంతేనని నువ్వే తెలుసుకుంటావులే.’

‘అది చూద్దాం’, అంటూ విసురుగా డోర్ దగ్గర అడ్డంగా నిలుచున్న సూర్యను గట్టిగా పక్కకి తోసి బయటికి నడిచింది శృతి.

* * *

ఆటో ఎక్కింది శృతి. ఆమెకు అమ్మ ,నాన్న గుర్తుకొచ్చారు. ఆ రోజు ఆమెకు ఇంకా గుర్తే.

‘నాన్నా ...నేను హైదరాబాద్ కు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను.’

‘ఇక్కడ ఏడవలేక పోయావు ....ఇంకా అక్కడ ఏం ఏడుస్తావు?’

‘అక్కడ అవకాశాలు ఎక్కువ నాన్నా ....నేను వెళ్తాను .’

‘అక్కడ వెళ్ళి ఎక్కడ ఉంటావ్ ? ఆడపిల్లవి ....ఒక్కదానివి ... ఏమైనా జరిగితే మేము ఊళ్ళో తలెత్తుకోగలమా? ఓ మంచి సంబంధం వచ్చింది. నోరు మూసుకుని పెళ్లి చేసుకో.’

‘ఏమేవ్ ...నీ పెంపకం అలా ఏడ్చింది...ఇది హైదరాబాద్ వెళ్తుందట!’

‘శృతి ...నాన్న చెప్పేది నీ మంచికేగా ...ఎందుకు తల్లి నీకు లేనిపోని ఇబ్బందులు? నాన్న చెప్పినట్టు చెయ్యి .’

‘లేదమ్మా ...ఏమైనా సరే నేను వెళ్ళి తీరుతాను ‘,శృతి పంతంగా అంది.

శ్రుతిది ఓ పల్లెటూరు. ఇంజనీరింగ్ చదివాక క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగం రాలేదు. ఆమెకు ఓ ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఓ కోరిక. అలా తల్లి తండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా మంచి అవకాశాలు ఉంటాయేమోనని హైదరాబాద్ కి వచ్చేసింది. వచ్చిన నాలుగు నెలలకు ఎలాగో కష్టపడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించింది.

ఏం లాభం? అక్కడ చేరిందో లేదో మేనేజర్ నుండి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. బూతు మెసేజ్ లు. వీడియోలు మామూలే. ఈ రోజు వ్యవహారం మరి శృతి మించడంతో ఉద్యోగం వదిలేసింది శృతి. ఎందుకో ఆమెకు ఇంటికి వెళ్లిపోదాం అనిపించింది. కానీ ఇంటికి వెళ్లిపోవడం పరిష్కారం కాదు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఎవరో ఒకరితో పెళ్లి చేస్తారు. మళ్ళీ ఇంకొకరిపై ఆధారపడటం అనేది జీవితాంతం ఎదుర్కోవాల్సిన ఇంకో సమస్య.

* * *

శృతి ఆలోచనలు సాగుతుండగానే హాస్టల్ వచ్చేసింది.

‘ఏమైంది శృతి ? అలా ఉన్నావు ..’ పలకరించింది రూమ్మేట్ రవళి.

‘మా బాస్ గురించి నీకు తెలిసిందేగా రవళి ...ఒట్టి రోగ్ వాడు ...ఈ రోజు మరి హద్దులు దాటాడు...’

‘ఏం చేశాడు ?’

‘ఏకంగా డోర్ క్లోజ్ చేశాడు.’

‘కమాన్ శృతి ....టేకిట్ ఈజీ ...మా బాస్ కన్నా బెటర్ మీవాడు ...ఇవన్నీ పట్టించుకుంటే ఉద్యోగాలు చేయడం కష్టం ‘, కల్పించుకుంది ఇంకో రూమ్మేట్ హరిత.

‘చెయ్యి పట్టుకోవడం , ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించడం, డోర్ క్లోజ్ చేయడం ...ఇవన్నీ కామనా?’ అడిగింది శృతి.

‘మరి కామన్ కాక ఇంకేంటి? అలా అని ఉన్న ఉద్యోగం వదిలేస్తావా? ఎక్కడికెళ్లినా ఇదే భాగోతం. తెలివితక్కువుగా ఉండి మంచి జీతం తెచ్చే ఉద్యోగం వదులుకోకు’, అంది హరిత.

‘అదెప్పుడు అంతేలేవే ...వదిలేయ్ దాని మాటలు ..’ అంది రవళి.

* * *

రోజులు గడిచాయి. శృతి కష్టపడి ఇంకో ఉద్యోగం వెతుక్కుంది. జాయిన్ అయిన పదిహేను రోజుల తరువాత అక్కడ కూడా అదే కధ. మనసు చంపుకుని రాజీపడలేక మానేసింది.

‘ఎక్కడ మొదలైన ఇక్కడికే వస్తుంది. లోకం ఇంతే ‘, అనుకుంది ఆమె.

ఎన్ని ప్రయత్నాలు చేసిన మంచి ఉద్యోగం దొరకలేదు. చేతిలో డబ్బులు అయిపోవచ్చాయి.

‘ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోవడం ఒకటే మార్గం. నేను పూర్తిగా ఓడిపోయాను. ఇంట్లో వాళ్ళ ఇష్టానికి తల వంచి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేనేమో ‘, అనిపించింది శృతికి .

ఇంటికి వెళ్ళే ముందు అమ్మకి ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంది శృతి. అమ్మ ఏమంటుందో ? ‘నీకు అలా జరగాల్సిందే .మమ్మల్ని కాదని వెళ్లావుగా,అనుభవించు ‘,అని ఎత్తిపొడుస్తుందేమో .

పోన్లే అంటే అనని , అమ్మేగా . తనకీ శాస్తి కావాల్సిందే. ఇంట్లో వాళ్ళని కాదని వచ్చినందుకు ఇలా జరగాల్సిందే-తనని తానే తిట్టుకుంటూ ఫోన్ చేసింది పొర్లుకొస్తున్న దుఃఖంతో.

‘హలో అమ్మా ...’

‘హలో శృతి ....చెప్పరా ఎలా ఉన్నావ్ ?’

చాలా రోజుల తర్వాత అమ్మ గొంతు వినేసరికి ఏడుపు వచ్చేసింది శృతికి.

‘అసలు ఏం బాలేదు అమ్మా ఇక్కడా ‘, అంటూ భోరున ఏడ్చేసింది.

‘ఏమైందిరా ? ఒంట్లో బాగోలేదా ?’ కంగారుగా అడిగింది సునంద.

కాసేపటికి తమాయించుకుని .....

‘ఇక్కడ ఏం బాలేదమ్మా ...నేను ఇంటికి వచ్చేస్తాను ‘, అంది శృతి.

‘బాగోలేకపోవడం ఏంటిరా తల్లీ ! చక్కగా ఉద్యోగం చేస్తున్నావు. నీ కాళ్ళ మీద నిలబడ్డావు. ఇప్పుడు ఏమైందిరా ?’

‘లేదమ్మా ...ఇక్కడ మగాళ్లందరూ మృగాళ్ళేనమ్మా. మొదట జాయిన్ అయిన ఆఫీస్ మేనేజర్ చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. అది వదిలేసి ఇంకోటి వెతుక్కుంటే మళ్ళీ అదే పరిస్థితి. ఇక నా వల్ల కాదమ్మా . ఇక్కడ ఉండలేను . ఇంటికి వచ్చేస్తానమ్మా .’

తల్లి తెల్లబోయింది . ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అంది.

‘ఇంటికి వచ్చి ఏం చేస్తావు తల్లీ ...ఇక్కడికి వస్తే పెళ్లి చేస్తాం ....పెళ్లి అయిన తర్వాత వచ్చేవాడు కూడా ఓ మృగం అయితే ఏం చేస్తావు ? ఉద్యోగం లేక జీవితాంతం వాడి కాళ్ళ దగ్గర పడి ఇలాగే ఏడుస్తావా ?’

అమ్మ అలా మాట్లాడుతుందని ఊహించని శృతి కి అది పెద్ద షాక్.

‘అమ్మా ....’

‘అమ్మనే మాట్లాడుతున్నాను. నా సంగతే చూడు. పద్దెనిమిదేళ్ళకి నాకు పెళ్లి చేశారు. అప్పటి నుండి నేను సాధించినదేమిటి? నాకు చదువుకుని జాబ్ చేయాలని ఉండేది. కానీ బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత నాన్న మాటే నాది తప్ప ఏ విషయంలోనూ నాకు స్వేచ్ఛ లేదు. నా మాటకు విలువ లేదు. రేపు నీ గతి నాలానే కావాలా? ఇంత చదువుకుని సమస్యలకు భయపడి వెనక్కి వచ్చేస్తానంటుంటే నాకు వింతగా ఉంది. నీకూ సంగతి చెప్పనా ? ఆ రోజు నాన్న వద్దన్నా నువ్వు హైద్రాబాద్ వెళ్లినప్పుడు పైకి చెప్పలేదు కానీ నేను సంతోషపడ్డాను. నా చిట్టి తల్లి నాకంటే నయమని మనసులో గర్వపడ్డాను. ఆడదాని జీవితమంతా మృగాల మధ్య సాగే ఆట. నువ్వు నా కన్నా బాగా చదువుకున్నదానివి. ఇంతకి మించి నాతో చెప్పించుకోవనే అనుకుంటున్నాను. ఓడిపోయి ఇంటికి తిరిగి వస్తావో నీ సమస్యల్ని తేల్చుకుని జీవితాన్ని జయిస్తావో నువ్వే తేల్చుకో. నేను చెప్పేదేమీ లేదు. నీ ఇష్టం’, అని ఫోన్ పెట్టేసింది సునంద.

తల్లి మాటల్తో ఆలోచనలో పడింది శృతి.

‘అమ్మ ...తనకీ ఇన్నాళ్ళు నాన్న చాటు అమ్మగానే తెలుసు. చిన్నప్పటి నుండి తను అమ్మని చూస్తూనే ఉంది. ఎప్పుడు నాన్న చెప్పింది చేయడమే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోవడం తను ఎప్పుడు చూడలేదు. నాన్న చెప్పిందానికల్లా తల ఊపడమే అమ్మకి ఇష్టం అని అనుకునేది ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు అర్ధం అయింది. అది ఇష్టం కాదు, ఓ రకమైన బానిసత్వం అని. స్వతంత్రంగా బతకలేక, మనసులో మాట చెప్పలేక , చెబితే ఏమవుతుందోనన్న ఓ రకమైన భయంతో , అభద్రతా భావంతో గడిపిన జీవితం అమ్మది అని ఇప్పుడు అర్ధం అయ్యింది. ఇంటికి వెళ్ళే ఆలోచనని విరమించుకుంది శృతి.

                                            * * *

ఆ రోజు శృతి నిద్ర లేచేసరికి బాగా ఆలస్యమైంది. అప్పటికే కింద నుండి అరుపులు వినిపిస్తున్నాయి. హాస్టల్ మేట్స్ అందరూ బాల్కనీ గోడ దగ్గరికి చేరి కిందకి చూస్తున్నారు. శృతి కూడా అటువైపు నడిచింది. కింద హాస్టల్ దోబీ - సావిత్రి హాస్టల్

ఓనర్ తో గొడవ పడుతుంది. ‘ఏంట్రా రెచ్చిపోతున్నావ్ ? నీకెంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తావ్ ? నీకు సదువులు సదివే కూతుళ్లు లేరు... సచ్చినోడా ...ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చమ్ డాలు వలిచేస్తా ...’

ఆమె చెయ్యి అతని కాలర్ మీద ఉంది. అప్పటికే రెండు చెంపలు వాయించినట్టు ఉంది. వరహల్రావు బుగ్గలు రెండు బూరెల్లా అయిపోయాయి. బిక్క చచ్చి పోయి అటూ ఇటూ చూస్తున్నాడు అతను.

‘నువ్వేంట్రా నన్ను పనిలోకి రావోద్దనేది ? నీ దగ్గర పని కాకపోతే పది కొలువులు నాకు. నువ్వు ఏం చేసినా నేను పడుంటాననుకున్నావురా ? నాకు రావాల్సిన సొమ్ములు తియ్యి .’అప్పటికే అందరూ తమ వైపే చూస్తుండటంతో చేసేది లేక ఆమె పని డబ్బులు తీసి ఆమెకి ఇచ్చాడు.

‘థూ...’ అని అతని మొహం మీద ఉమ్మేసి ...అక్కడి నుండి వెళ్లిపోయింది సావిత్రి.

అందరూ రూముల్లోకి వచ్చారు.

‘సావిత్రిలా ఉండాలే ... ఆ ఓనర్ గాడికి చదువుకున్న మనమే ఎంతో భయపడతాము. వాడు ఎన్ని వెకిలి వేషాలు వేసినా చూసి చూడనట్టు పోతూ ఉంటామే. అలాంటిది సావిత్రి అంత ధైర్యంగా వాణ్ణి ఉతికేసింది’, అంది పక్క రూమ్ అర్చన.

అందరూ తలో రకంగా సావిత్రి గురించి కామెంట్ చేస్తున్నారు. సావిత్రే శృతి కళ్ల ముందు మెదిలింది.

‘సావిత్రి కి ఉన్న ధైర్యం కూడా నాకే లేదే. ఇంకో పని దొరకదేమో అన్న బెంగ లేదు సావిత్రికి. ఏం చదువుకోకపోయినా ఆమెకు తన మీద తనకు ఎంత నమ్మకం. బతుకు మీద ఎంత భరోసా ? మరి అమ్మ ఎంతో కొంత చదువుకుంది. తను, తన హాస్టల్ మేట్స్ బాగానే చదువుకున్నారు. కానీ నలుగురికి తెలిస్తే ఏమవుతుందో , ఎవరేం అనుకుంటారో , పరువుగా బతకలేమేమోనన్న భయాలు, అభద్రతా భావాలు తమ లాంటి చదువుకున్న వారికి ఎక్కువనుకుంటా!

సమస్య నుంచి ఇంకో సమస్య వైపు పరిగెత్తడమే పరిష్కారం అనుకుంటారు తమ లాంటి వాళ్ళు. వేటలో మృగాలకు రెండే ఆప్షన్స్. ఒకటి ఎప్పుడు వేటగాడికి ఛాయిస్ కాకుండా పరిగెడుతుండటం. లేదా ధైర్యంగా తిరగబడటం. మొదటిది తనలాంటి వాళ్ళకైతే , రెండోది సావిత్రి లాంటి వాళ్ళకి . స్వంతంగా తన కాళ్ళ మీద నిలబడుతూ ఎందరికో ఆసరా కల్పిస్తున్న స్త్రీ పారిశ్రామికవేత్తలు, ఇంటి నుండే ఆన్ లైన్ బిజినెస్ లు చేస్తున్న మహిళలు ఎందరు లేరు? ఒళ్ళంతా గాయపరచిన మృగం దగ్గర దొరికే పంచ భక్ష్య పరమాన్నాల్లకంటే సొంతంగా చేసుకుని తినే పచ్చడి మెతుకులే బావుంటాయి.

నిర్ణయం తీసుకున్నాక హాయిగా నిద్ర పట్టింది శృతికి.

                                    * * *

మర్నాడు శృతి లేచేసరికి ఫ్రెండ్స్ అందరూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.

‘నాకు మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టమే. కానీ ఇక్కడ దొరికేదీ చల్లారిపోయాకో లేక రుచి లేకో ఉంటాయి. ‘

‘నాక్కూడానే సరళా ....ఇంతకు ముందు హాస్టల్ లో ఉన్నప్పుడూ దగ్గరలో ఉన్న బండి దగ్గర కూడా పెద్ద బావుండేవి కాదు’, జ్యోతి కల్పించుకుంది.

‘ఏదో చేస్తారులే కానీ ....ఇంట్లో ఉన్నట్టు ఉండే ఆ రుచే అస్సలు ఉండదే బాబూ ‘, అంది గోప్య.

‘అందరికీ ఇష్టమైన ఐటం అది. అవి అంతగా బాగుండకే ఈ పానిపూరీలు ,కట్ లెట్ లు అన్నీ కూడా తింటున్నది’, అంది రమ్య.

శృతి మనసులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది.

‘అమ్మగారు! మీరు బాగా చదుకున్నోరు . నాకు ఎక్కడైనా పని ఇప్పించరు’, అన్న పక్కింటి యాదమ్మ గుర్తుకు వచ్చింది.

తన ఎకౌంట్ లో ఉన్న అమౌంట్ చెక్ చేసింది. నలభై వేలుంది.

‘హమ్మయ్య’, అనుకుంది శృతి.

వెంటనే రెడీ అయ్యి , హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయల్దేరింది. యాదమ్మని కల్సింది.

‘యాదమ్మా ఎలా ఉన్నావ్ ?’ పలకరించింది.

‘బానే ఉన్నానమ్మా ...వాడు తెచ్చిందంతా తాగుతూనే ఉంటాడమ్మా ...మిగిలేదేం ఉండదు....చూస్తే పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు’, అంది నిరుత్సాహంగా.

‘యాదమ్మా ...నీకు నెల జీతం నేనిస్తాను. నువ్వు రోజూ బజ్జీలు చేయగలవా ?’

ఆ మాటలకు యాదమ్మ మొహం మతాబులా వెలిగిపోయింది.

‘చేస్తానమ్మా ...ఏమైనా చేయగలను ‘, అంది యాదమ్మ.

‘సరే ...ఎప్పుడు చేయాలో నేను చెప్తాను ‘, అని బయటికి వచ్చేసింది శృతి .

ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ , మార్కెటింగ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లింది శృతి. వాళ్ళతో మాట్లాడి ‘బజ్జీ బజార్ ‘ పేరుతో ఓ సైట్ క్రియేట్ చేసింది. తర్వాత యాదమ్మ తో బజ్జీలు చేయించింది. తనకు పరిచయస్తులైన వారందరికి వారి అడ్రస్ లకు మిర్చి బజ్జీలు పంపింది వేడి వేడిగా.

బజ్జీలు ఇంటికే రావడంతో అందరి నుండి మంచి స్పందనే వచ్చింది శృతికి. తర్వాత తనకు తెల్సిన హాస్టల్ లోని ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపింది. అది డబ్బులకి కాకపోయినా , ఆ రుచి వారికి చేరితే ....వాళ్ళే తమ మాటలతో పబ్లిసిటీ చేస్తారని శృతికి తెలుసు. అనుకున్నట్టుగానే హాస్టల్స్ నుండి , బిజినెస్ యూనిట్స్ నుండి రెండు నెలలు తిరిగే లోపే ఆర్డర్లు పెరిగిపోయాయి. యాదమ్మ ఒక్కతే సరిపోవడం లేదు. ఇంకా నలుగురు మహిళలను నియమించింది వంటకు. సంవత్సరం తిరిగేసరికి దానికే ఓ బిజినెస్ సైట్ తీసుకోవాల్సి వచ్చింది. నలుగురు కాస్త ఇరవై మంది అయ్యారు పనివాళ్లు. జిల్లా నుండి రాష్ట్రానికి పెరిగింది వ్యాపారం.

సావిత్రికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది శృతి.

                                        * * *













Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ