శక్తి (మండోదరి ముచ్చట్లు )
హద్దులున్నాయి కానీ .....
-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)
ఈ సమాజంలో బ్రతికే ప్రతి మనిషికి స్వేచ్ఛ ,సామాజిక భద్రత, సౌకర్యం కావాలి. మనిషి
ఆర్ధిక స్థితిగతులను అనుసరించి వ్యక్తిగత పరిధుల్లో ఈ మూడు ఉంటాయి. కానీ స్త్రీ
జీవితంలో ఈ మూడు అంశాల సమన్వయం గురించి ఆలోచించాల్సిన సమయమే ఇది.
తరాలు మారుతున్నాయి. ఎన్నో కొత్త ఆలోచనలతో సమాజం కళకళలాడుతుంది. కానీ కొన్ని
అంతర్లీన ,ఆంతరంగిక కోణాల్లో ఆలోచిస్తే చెప్పుకోలేని అసంతృప్తి పై మూడు అంశాల్లో ఒకటి
లేకపోవడం వల్ల స్త్రీ జీవితంలో సంభవిస్తుంది అన్నది ఒప్పుకోవాల్సిన నిజమే.
ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉన్నారు. కానీ రాష్ట్రంలో, దేశంలో లేదా ఏ చిన్న ప్రాంతంలోనైనా
సరే వారి కన్నా అధికంగా ఉద్యోగం చేయని స్త్రీలు ఉన్నారు. ఉద్యోగం అనేది స్త్రీకి ఆర్ధిక
స్వావలంబనతో పాటు వ్యక్తిగత ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో పాత్ర వహిస్తుంది. కానీ
ఉద్యోగం లేని స్త్రీలలో ఎంతమంది ఈ మూడు అంశాలను పరిపూర్ణంగా
అనుభవించగలుగుతున్నారు?
ఆర్ధికంగా ఆధారపడటం అనేది ఒక అంశమైతే దానికి సామాజిక భద్రత కూడా
తోడౌతుందని తమ స్వేచ్ఛను త్యాగం చేసే మహిళలు ఎందరో. తమకు వివాహ పూర్వం ఎన్ని
అభిరుచులు ఉన్నా ఆర్ధిక ఆలంబన, సామాజిక భద్రత కోసం తమదైన ఉనికిని నిలిపే అస్తిత్వ
చిహ్నాన్ని త్యాగం చేసే మహిళలు ఎందరో.
ఆమె వయసు 9 ఏళ్ళు. వివాహం జరిగిపోయింది. అవి సాంఘికంగా స్త్రీలపై ఎన్నో
ఆంక్షలు ఉన్న రోజులు. నిరక్షరాస్యురాలు అయిన ఆమెను ఆమె భర్త అక్షరాస్యురాలిని
చేశాడు. అక్కడితో ఆమె ఆగిపోలేదు. కులమత భేదాలకు అతీతంగా ఆమె ప్రేమించింది.
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848
జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు,
పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం
చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె. ఆమె సావిత్రిబాయి ఫూలే.
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన
దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను
ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫూలే పాఠశాలలు
ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు.
సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. జెండర్ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి 'సత్యశోధక్ సమాజ్ 'ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు.
గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన
వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ
ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం
చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం
చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873
సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్ సమాజ్’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి,
సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్ సమాజ్ మహిళా విభాగం
సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా
నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది.
1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో
మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి
తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య
నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.
ఇది జరిగింది 19 వ శతాబ్దంలో. ఇప్పటికీ 21 వ శతాబ్దంలో ఉన్న మనలో కూడా ఆ
సాంఘిక అభిప్రాయాలను పట్టించుకునే సంస్కృతితో తమ ఆశయాల్ని మట్టిలో పాతేసే
భావజాలం ఉన్నప్పటికీ ,తన చదువుకు ఓ సార్ధకత చేకూర్చడం కోసం సమాజ ప్రవాహంలో
కొట్టుకుపోకుండా తనదన్న ఉనికిని నిలుపుకున్న ఆ స్త్రీ మూర్తి నాకు ఆర్ధిక
స్వావలంబన,సామాజిక భద్రత మాత్రమే హద్దు అనుకోలేదు. ఆ హద్దులు దాటి తన జీవిత
సామర్ధ్య శక్తిని నిరూపించింది. ఆ హద్దులు దాటే వారే విజయాన్ని అధిరోహించే స్త్రీలు.
* * *



Comments
Post a Comment