పగిలిన ప్రతిమ

 చదువరి

                  పగిలిన  ప్రతిమ

                                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          స్త్రీ   మనసును  అన్వేషిస్తూ  నవలలు  ప్రతి  దశాబ్దంలోనూ  ఎన్నో  వస్తూనే  ఉన్నాయి. 1970 వ దశకంలో  'పగిలిన  ప్రతిమ 'కూడా    కోవకు  చెందిన నవలే. ఏ ఎస్  మణి  గారు 'అరవింద 'కలం    పేరుతో  రాసిన  నవల ఇది. జలసూర్య ,కల్లోలానికి  ఆవల  వంటి  రచనలతో  పాఠకులకు  సుపరిచితమైన అరవింద గారి  రచనల్లో  ఎన్నో  ప్రశ్నలు  ఉంటాయి. వాటికి  సమాధానాలు  దొరుకుతాయా  లేవా  అన్నది  ఇక్కడ  చర్చించాల్సిన  అంశం  కాదు, కానీ     ఆలోచనా  శైలి  మాత్రం   సహజమేనని  కాకపోతే  చాలా   మంది  స్త్రీలు  వాటికి  దూరంగా  పారిపోతారే  తప్ప   అన్వేషించే    ధైర్యం  చెయ్యలేరు. అలా  ఎందుకు  చెయ్యలేరు  అన్న  ప్రశ్నలకు  మాత్రం  సమాధానం  ఈ నవలలో  దొరుకుతుంది.

            నవల  ప్రధానంగా  రెండు కుటుంబాల కేంద్రంగా సాగుతుంది. కేశవ్ ,మోహన్ కాలేజీ రోజుల నుండి స్నేహితులు. మోహన్ కు తల్లి ,చెల్లి విశాల. తండ్రి లేడని తల్లి గారాభం ఓ వైపు, ప్రతి పనికి ఆమెను గద్దించే అన్న ఇంకో వైపు ,ఈ పరిస్థితుల వల్ల విశాల లో అంతర్లీనంగా ఎన్నో కళలు ఉన్నప్పటికీ కూడా ఆమెను అమాయకురాలిలాగానే చూస్తారు అందరూ. కేశవ్ కాలేజీలో లెక్చరర్ . దానితో పాటు అతను మంచి రచయిత కూడా.అతను మొదటి నుండే విశాలలోని సున్నిత భావాలను కళలను ఆరాధిస్తూ ఉంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకుంటాడు.

          కేశవ్ కు ముగ్గురు తోబుట్టువులు. విమల ,నళిని ,రమ. రమ, విశాల ఒకే ఈడు వారు. విమల అప్పటికే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తుంది. నళిని మెడిసిన్ చదువుతుంది. కేశవ్ తల్లిదండ్రులిద్దరికీ కూడా ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ,వారి కాళ్లపై వారే నిలబడాలని భావించే మనస్తత్వం కలవారు. వారికి వివాహం  కాకుండా తాను వివాహం చేసుకుంటే బావుండదని భావించిన కేశవ్ తన పెళ్ళి గురించి ఎత్తడు.

          కేశవ్ పెద్దమ్మ కొడుకు వాసు ఈ లోపు విశాలను వివాహం చేసుకుంటాడు. దానితో కేశవ్ మనసులో బాధపడతాడు. అప్పటివరకూ ప్రతి విషయానికి భయపడుతూ పెరిగినప్పటికీ ఆంగ్ల పుస్తక పఠనం, పాటలు పాడటం, చిన్న గేయాలు రాసుకోవడం వంటివి చేసిన విశాల వివాహమై భర్తతో కలకత్తా వెళ్లిపోయాక కేవలం భర్తతో సంసారంలో మునిగిపోతుంది. 

          విమలకు ముప్పై ఏళ్ళు దాటుతున్నా కట్నం ఇవ్వకపోవడం వల్ల వివాహం కాకపోవడంతో తన సహోద్యోగినే వివాహం చేసుకుంటుంది. నళిని తనతో పాటు మెడిసిన్ చదువుతున్న సుదర్శన్ అనే అతన్ని కులాంతర వివాహం చేసుకుంటుంది. కేశవ్ లలితను వివాహం చేసుకుంటాడు. కొన్నాళ్ళకి హార్ట్ ఎటాక్ తో కేశవ్ తండ్రి మరణిస్తాడు. అప్పటి నుండి తల్లిని తన దగ్గర ఉంచుకుంటానని గుంటూర్లో తను లెక్చరర్ గా పని చేస్తున్న చోటుకు తీసుకువెళ్తుంది రమ.

          లలిత బాల్యంలోనే తల్లి మరణించడం,అక్కతో కలిసి సవతి తల్లి దగ్గర పెరగటం వల్ల బాల్యం నుండి ఆమె మనుషుల్లో స్వార్ధాన్ని మాత్రమే చూసింది. కేశవ్ ను మంచివాడిగా భావిస్తూ అతన్ని ప్రేమిస్తుంది లలిత. విశాల కలకత్తాలో ఉన్నప్పుడే ఇద్దరు పిల్లల తల్లి అవుతుంది. వాసుకు ఎప్పుడు పార్టీల్లో సరదాగా తిరగటం ఇష్టం. విశాల పిల్లల వల్ల అతనితో కలిసి వెళ్లలేకపోతుంది. అదే సమయంలో కలకత్తాలో స్నేహితుడైన ఆనంద్ భార్య పట్ల తన భర్త ఆకర్షితుడవుతున్నాడెమోనని భయం,అభద్రతా పెంచుకుంటుంది. మూడేళ్ళ తర్వాత కలకత్తా నుండి మళ్ళీ హైదరబాద్ కు వచ్చే సమయానికి విశాల మళ్ళీ గర్భవతి అవుతుంది.

          సమాజానికి ఇంకేదో చేయాలని తలంచిన కేశవ్ వాసును కూడా ఒప్పించి వాసు తల్లి పేరుమీద 'శ్రీదేవి శాంతి నిలయం' ను స్థాపిస్తారు. దానిలో అనాధలకు ఆశ్రయం కలించటం ,స్త్రీలకు అనేక విద్యలు నేర్పించటం వంటి కార్యాచరణలు ఉంటాయి. వాసు తన సమయం కేటాయించలేకపోయినా కేశవ్ ఎంతో సమర్ధవంతంగా నడుపుతూ ఉంటాడు. కేశవ్ తన భార్య లలితను కూడా ఆమెకు ఇష్టమైన కళలు నేర్చుకోమని ప్రేరేపిస్తూ ఉంటాడు.లలిత సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. క్రమంగా వాసు ధనిక వర్గంలోకి చేరిపోతాడు. విశాల కూడా ఎంతో అందంగా అలంకరించుకుంటూ అతనితో కలిసి క్లబ్బులకు, పార్టీలకు వెళ్తూ ఉంటుంది. కానీ ఆమెలో ఎప్పుడూ అసంతృప్తి ఉంటూనే ఉంటుంది.

          లలిత కూడా తన భర్త విశాలను మెచ్చుకోవడం ఆమె కళల గురించి చెప్పడం ఆమెలో కూడా అభద్రతను కలిగిస్తుంది. దానితో ఆమె అదే సమయంలో వాసు క్యాంప్ పని మీద వెళ్ళి తిరిగి వచ్చాక తిరుపతికి తీసుకువెళ్తానని చెప్పిన ఆ రోజుకి రాకపోవడంతో అదే సమయంలో ఓ లెక్చర్ ఇవ్వడానికి తిరుపతి వెళ్తున్న కేశవ్ ను అడిగి అతనితో కలిసి వెళ్తుంది విశాల. అదే సమయంలో భర్త తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనుకుని  లలిత సంగీతం నేర్చుకుంటున్న వేణు మాస్టారితో కలిసి సినిమాలలో పాడటానికి మద్రాసు వెళ్లిపోదామని నిర్ణయించుకుంటుంది. తీరా రైల్ ఎక్కాక వేణు నిద్రా పోయాక మధ్యలో దిగేసి విమల ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత కేశవ్ కు  విమల ఉత్తరం రాయడంతో అతను ,లలిత అలా మళ్ళీ కలుసుకుంటారు. లలిత మనసు తెలుసుకుని ఆమెను కూడా శాంతి నిలయంలో భాగం చేస్తాడు కేశవ్.

          ఆ తర్వాత విశాల, వాసు ఢిల్లీ వెళ్లిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళకి విశాల జబ్బు పడటంతో మళ్ళీ ఆమెను స్థల మార్పిడి కోసం హైదరబాద్ తీసుకువస్తాడు వాసు. ఆ సమయంలో శాంతి నిలయంలో సమయం గడుపుతూ కొంచెం గా కోలుకుంటూ ఉంటుంది విశాల. కానీ ఆమెను ,కేశవ్ ను అనుమానించిన వాసు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోదామనుకుని ఆమెకు, కేశవ్ కు లేఖల్లో విశాలకు అక్కడ బాగుంది కనుక అక్కడే ఉంచమని రాస్తాడు. వెంటనే అది తీసుకుని విశాలకు ఇచ్చి ఆమెను బయల్దేరమంటాడు కేశవ్. అలాగే భర్త కోసం వెళ్ళి విమానాశ్రయంలో కలుసుకుని ఇద్దరు వెళ్లిపోతారు. తాను వెళ్ళే ముందు శాపగ్రస్థురాలు,పగిలిన ప్రతిమ అనే రెండు పెయింటింగ్స్ ఆ శాంతి నిలయానికి తన జ్ఞాపకార్థం ఉంచమని ఇస్తుంది విశాల.

          అక్కడే ఉంటే విశాల తనలో ఉన్న కలలన్నింటిని సార్థకం చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక పిల్లలకు,భర్తకు తన అవసరం లేని దశలో కూడా వారి కోసమే తన కళలను పక్కన పెట్టింది విశాల. స్త్రీ తన జీవితంలో భర్త ,పిల్లలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఎప్పటికీ కూడా తన వ్యక్తిగత అభిరుచులకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాటిని అధిగమించడానికి భయపడుతూనే ఉంటుంది. అటువంటి స్త్రీయే విశాల కూడా. ఇకపోతే లలిత కూడా బాల్యం నుండి తల్లిదండ్రుల ప్రేమ లేని వాతావరణంలో పెరిగి, అందరిలోనూ స్వార్థాన్ని చూసిన స్త్రీ. భర్త నుండి ఆశించిన ఆప్యాయతను అనుకున్నతగా పొందలేకపోయాను అనే భావనలో కొంతకాలం ఉన్నప్పటికీ అతని జీవితం అతనిది అనుకుని తనకు ఉన్న నైపుణ్యాలను మెరుగుపెట్టడానికి ప్రయత్నించింది. కానీ కేశవ్ కూడా విశాల పట్ల పెంచుకున్న సుకుమార భావనలను లలిత పట్ల మళ్ళించలేకపోయాడు.

          భావుకత్వం,అంతర్లీనంగా ఉన్న కళలు ఆ ఒక్క విషయం పట్లే కుతూహలం కలిగి ఉంటారు. కానీ మిగిలిన విషయాల్లో అమయాకంగా ఉంటారు అని విశాల గురించి విమల మొదట్లో అంటుంది. అమయకంగా ఉన్న విశాల తర్వాత జీవితానికి అలవాటు పడిపోయింది.దానికి కారణం ఆ పాటికే ఆమెలో భర్త పట్ల కలిగిన ప్రేమ ,ఎక్కడ తనకు దూరమవుతాడో అన్న అభద్రత ఇంకోవైపు ,తర్వాత పిల్లలు ,తర్వాత తనను తాను మళ్లించుకోవడానికి భక్తి వంటివి ప్రయత్నించినప్పటికీ కూడా ఆమెలోని అసలు కళలు మరణించక తప్పలేదు.

          స్త్రీ అభిరుచులు,ఆసక్తులు ఎన్ని ఉన్నా వాటిల్లో రాణించాలనే తపన ,అందులో ఉండే సాధకబాధకాలను ఎదుర్కునే ధృఢ సంకల్పం లేకపోతే ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె అగౌరవపర్చుకున్నట్టు.ఇలాంటి విశాలలు ఎంతమందో ఇంకా మన సమాజంలో.

 

               *    *   *        

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ