ఆ కొందరు!

 ఆ కొందరు!

-శృంగవరపు రచన




జీవితంలో మన ఆలోచనలు,మన పరిస్థితులు,మన సమస్యలు,మన సుఖాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకేలా ఉంటాయని అప్పుడప్పుడూ భ్రమ పడుతూ మనదన్న పరిధిని మనమే నిర్మించుకుని అందులో నివసిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం మన పరిధిలో జీవితాన్ని ఒంటరిగా జీవించలేమని తెలుసుకుంటామో,అప్పుడు ఎవరో ఒకరు ఉంటే బావుండు అన్న భావన మనం మరలా మన పరిధిలో ఇమిడి పోయేవరకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కొందరు ఏదో ఒక దశలో ఉండే ఉంటారు. జీవితంలో ఆ కొందరి ప్రాముఖ్యతను స్పష్టం చేసే ఆంగ్ల నవలే సవి శర్మ రాసిన ‘Stories we never tell.’
ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు జాన్వి,ఆశ్రయ్. జాన్వి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. టీనేజ్ నుండి తన ఫోటోలు సోషల్ మీడియాల్లో పోస్టు చేసి సెలబ్రిటీగా ఎదిగింది.లైక్స్,ఫాలోవర్స్ మీద వచ్చే ఆదాయం,అవకాశాలే ఆమె జీవితం. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు. ఆమె ముంబై లో ఉంటుంది. ఆమె స్నేహితురాలు కావ్య.ఈ సోషల్ మీడియా లోకంలో మునిగిపోయిన ఆమెకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. దానికి కారణం అవతలి వారు ఆమె తమతో ఇన్ వాల్వ్ కాకపోవడం అని స్పష్టం చేశారు.
జాన్వి తనది కానీ వ్యక్తిగా లోకాన్ని మెప్పించాలని,తనకు తెలియని వారి దృష్టిలో బావుండాలనే ఆలోచనతోనే జీవితాన్ని గడుపుతూ ఉంది. లైక్స్ తగ్గినా,ఫాలోవర్స్ తగ్గినా ఆమె తట్టుకోలేని స్థితి. ఈ సమయంలోనే ఆమెకు గోవా ఫెస్టివల్ ఆఫర్ రావడం,అక్కడకు వెళ్ళడం,ఆ తర్వాత ఫాలోవర్స్ పెరగడం జరిగింది. కానీ ఈ క్రమంలో ఆమె మందుకు బానిస అయ్యింది. ఆ సమయంలో ఆమె స్నేహితురాలు కావ్య ఆమెకు చేయూతను ఇచ్చే ప్రయత్నం చేసినా ఆమె చెప్పిన మంచి జాన్వి తలకెక్కలేదు. కావ్యను అవమానించి పంపేసింది. ఆ తర్వాత ఓ క్లబ్ ఓపెనింగ్ కు పిలవడం,అక్కడ తాగి మీడియాకు చిక్కడం వల్ల మరలా ఫాలోయింగ్ తగ్గిపోవడంతో ఆమె డిప్రెషన్ కు లోనై మరలా మందును ఆశ్రయించింది.ఆ మోతాదు మించి ఆమె తాగి ఇంట్లో స్పృహ లేకుండా పడిపోతే కావ్య ఆమెను హాస్పటల్ లో జాయిన్ చేసి ఆమె తల్లిదండ్రులను పిలిపిస్తుంది.
ఆశ్రయ్ అనాధ. అతన్ని పెంచుకుంది అక్షిత.బాల్యంలోనే తన తల్లిదండ్రులు తనను వదిలేయడం అన్నది ఆశ్రయ్ పై ఎంతో ప్రభావం చూపింది. తల్లి సాయంతో ఆ బాధను అధిగమించాడు. అతనికి ఓ సంస్థలో ఉద్యోగం రావడం,అదే సమయంలో సాక్షి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమించిన ఆమె తర్వాత తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని అతన్ని వదిలేస్తుంది. తాను ప్రేమకు అర్హుడను కాదని,తనను ఎవరూ ప్రేమించరనే భావనలో మరింత డిప్రెషన్ కు గురవుతాడు ఆశ్రయ్. దాని నుండి కోలుకోకముందే అక్షిత హార్ట్ ఎటాక్ తో మరణిస్తుంది. దానితో పూర్తిగా కుప్పకూలిపోతాడు ఆశ్రయ్. అతనికి ప్యానిక్ ఎటాక్స్ ఎక్కువ అవుతాయి. ఆ సమయంలో అతనికి అండగా ఉంటాడు అతని స్నేహితుడైన ఋషి.
కావ్య సాయంతో జాన్వి, ఋషి సాయంతో ఆశ్రయ్ కోలుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఇద్దరు సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తారు. అక్కడ కలిసిన జాన్వి,ఆశ్రయ్ ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు. ఇద్దరూ ఒకే బాధను వివిధ రూపాల్లో అనుభవించడం వల్ల ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. తర్వాత ఇద్దరూ కోలుకోవడం,ఆశ్రయ్ తల్లి పేరు మీద తమ లాంటి వారికి సాయం అందించే సంస్థగా ‘లైఫ్ అండ్ పీపుల్’ అనే సంస్థను నెలకొల్పుతారు.
జీవితంలో కొన్ని సార్లు క్రుంగిపోవడం సహజం. ఆ సమయంలో ఆ కొందరు ఎవరైనా సరే మిత్రులైనా,ఆప్తులైనా ఎవరైనా సరే వారి సాయం తీసుకోవడం మనల్ని తక్కువ చేయదు. మనను జడ్జ్ చేయకుండా మన కోసం ఉండేవారిని కొందరిని అయినా మన కోసం ఉండేలా చూసుకోవడమే జీవితం అని ఈ నవల స్పష్టం చేస్తుంది. కానీ అందరికీ అలాంటి వారు ఉండకపోవచ్చు. ఆ సమయంలో సాయం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ కొందరిని వెతుక్కోవడం కొన్నిసార్లు బలహీనత అయినా ఆ కొందరూ అర్ధం చేసుకునేవారు అయితే వారే బలంగా మారతారు.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!