జీవితమే అనుభూతుల విందు!

                            జీవితమే అనుభూతుల విందు!

                                                               -శృంగవరపు రచన

                                   


        థల ప్రయోజనం లోతైన  అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే, మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి, కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం,సంతోషం,జీవితానికి ఇది చాలు అనే భావాన్ని కలిగించే కథలే నేతి సూర్యనారాయణ శర్మ గారి శ్రీ దోస గీత కథలు. ఇందులో మొత్తం 18 కథలున్నాయి.

      మనిషి జీవితంలోని ప్రతి అంశాన్ని ఎంత సున్నితంగా, హాస్యంగా చూస్తూ, జీవితంలో సంతృప్తి పొందవచ్చో అన్న అంశాన్ని స్పష్టం చేసే కథలు ఇవి. భారతంలో పాఠోలి కథలో పాఠోలి వంట ఎలా భీముడు వండాడో, దానికున్న సందర్భం ఏమిటో అన్న అంశాన్ని ఎంతో హాస్యంగా, వంటకు మన జీవితంలో ఉన్న పాత్రను స్పష్టం చేస్తూ రాశారు. ఇందులో కథల్లో కొన్ని జిహ్వాకు సంబంధించినవే. తెలుగు ఫలహారం కథలో అచ్చంగా తెలుగు వంటకాలు వండే వైవిధ్యభరితమైన హోటల్ గురించి చెప్తూనే ఇంకో పక్క మనిషి డబ్బు కోసం సొంత వారిని సైతం మోసం చేసే వైనం, జీవితాన్ని ఏ దశలో అయినా నలుగురికి సంతృప్తి కలిగించేలా ఎలా మలచుకోవచ్చో ఈ కథలో స్పష్టం చేశారు.

      నాసికా ఉపాఖ్యానంలో ముక్కు గురించి రచయిత చెప్పిన తీరు నిజంగానే నవ్వు తెప్పిస్తుంది. ముక్కు గురించి మాట్లాడటానికి ఏముంటుందని మనం అనుకుంటాము కానీ, ముక్కుల్లో రకాలు, ఆ రకాలను అనుసరించి మనుషుల మనస్తత్వాలు, ముక్కు తిమ్మన నుండి నేటి యోగాలోని ప్రాణాయామాల వరకు ఎంతో చమత్కారంగా ఈ కథను రాశారు. స్త్రీల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో పెళ్లిళ్ల కోసం తపస్సులు చేసే మగవారి సంఖ్య పెరగడం గురించి హాస్యంగా రాసిన కథే నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడు అను. భార్య ఇలా ఉండాలి అనే అంచనాలు లేకుండా పెళ్లి అయితే చాలనుకునే సమాజం ఎలా ఉంటుందో చక్కటి హాస్యంతో ఓ జంట ద్వారా ఈ కథలో చెప్పారు రచయిత.

     తప్పని సరి పరిస్థితుల్లో వంట ఎలాగో చేసుకునే పురుషులకు పెళ్లి అయ్యాక వారి రుచులకు తగ్గట్టు భార్య వందకపోతే వారి జీవితం ఎలా ఉంటుందో చమత్కారంగా రాసిన కథ విందుకు రావయా! చెప్పుల గురించి, అవి తెగినా, కొత్తలో కరిచినా పడే ఇబ్బందుల గురించి రాసిన కథ చెప్పు అలిగిన వేళ. పచ్చళ్లను ఇష్టపడని వారు ఉండరేమో! పచ్చళ్ళల్లో ఉండే రకాలను ఆరోగ్య కోణంలో కూడా చెప్తూ, కథనంలో ఆసక్తి ఉండేలా రాసిన కథ మామిళ్ల తోట కాదా మాటేస్తే... స్త్రీలకు గోర్లు ఎంత అందంగా ఉంటాయో వివాహమయ్యాక గొడవల్లో అవే ఎలా ఆయుధంగా మారుతాయో అన్న అంశం కేంద్రంగా రాసిన కథే గోటి పురాణం.

      మనిషి తన అజ్ఞానాన్ని దాచుకునే ప్రయత్నాల్లో కొన్ని ఎలా హాస్యానికి స్పూర్తి అవుతాయో స్పష్టం చేసే కథే అల్లిక జిగిబిగి. ఈ కథలో అల్లం గురించి తనకు తెలుసని చెప్పుకుంటూ ఉన్న ఓ పండితుడు ఎలా సంబాషణలో తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నాడో రచయిత చక్కటి సంబాషణ ద్వారా స్పష్టం చేశారు. వాన అంటే వాతావరణం పరంగా, అనుభూతుల పరంగా ఎంతో ఇష్టంగా ఉన్నా ఆరోగ్యం-పరిశుభ్రత కోణాల్లో చూస్తే కొన్ని సార్లు అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ రెండు కోణాల్లో నుండి మధుర అనుభూతులను, వాన జీవితంలో భాగమయ్యే మధుర జ్ఞాపకాలను కలిపి రాసిన కథే వాన ముచ్చట్లు. నిజం చెప్పాలంటే మంటా అబద్ధం చెప్తే తంటా కథలో భర్త తన భార్యకు వంట వచ్చన్న విషయాన్ని తెలియజేయకూడదని,ఆ సత్యం తెలిస్తే ఆ భర్తే వంట చేయాల్సి వస్తుందన్న అంశాన్ని సున్నితమైన హాస్యంతో కూడిన కథగా మలిచారు.

         చారిత్రక సత్యం ఆధారంగా రాసిన కథ రాజనంది. ఈ నంది పుట్టుక నుండి మరణం వరకు ఎంతో ఆసక్తికరంగా ఈ కథను మలిచారు. ఇది నేడు ఉన్న ప్రదేశం, ఈ మధ్య కాలంలో జరిగిన ఉదంతాలను కూడా సమకాలీన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథకు ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుంది. కష్టపదులు-ఇష్ట రుచులు కథలో తన వంట ప్రయోగాలతో భార్యకు నచ్చకపోయినా శ్రమ పడుతూ ఉండే భర్త గురించి చక్కటి హాస్యంతో రాశారు. మిస్టర్ శ్రీమతికథలో ఫ్యూబరో ఫొనియా అంటే స్త్రీ గొంతు కల మగవాడి జీవితం ముఖ్యంగా కాల్ సెంటర్ లో పని చేయడం వల్ల ఎలా ఉంటుందో,ఆ క్రమంలో అతను ఆమెగా ఎలా మారిపోతాడో అన్న అంశాన్ని పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా హుందాగా రాశారు రచయిత.

      చెవుల గురించి విభిన్నంగా రాసిన హాస్య కథ నవ్య కర్ణామృతం. ఈ కథలో చెవుల్లో రకాల గురించి, చెవులు వినబడకపోవడానికి ఉండే కారణాల గురించి హాస్యంగా చెప్తూనే కథకుడికి వినబడకుండా ఉండకపోవడానికి ఉన్న కారణాన్ని కథకుడు ఊహించిన విభిన్న కారణంతో హాస్యంగా ముగించారు రచయిత. వంట బాగా చేసే భార్య రాకపోవడం భర్తకు ఎంత బాధను కలిగిస్తుందో స్పష్టం చేసే కథే దేవుడు వరమందిస్తే.. స్నానం చేసే తీరును బట్టి మనుషుల తత్వాలను గురించి రచయిత మీ ఒంటి సబ్బుకు తెలుసు ....మీ వ్యక్తిత్వంలో హాస్యంగా చెప్పారు. శ్రీ దోసగీత కథలో దోసకాయ మీద ఉన్న కథలను, దోసకాయకు మన నిత్య జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను ఎంతో కొత్తగా చెప్పారు రచయిత.

            కథ కన్నా కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రచయిత నేటి సూర్యనారాయణ శర్మ. చెవి, ముక్కు, గోరు వంటి అంశాల మీద చక్కటి హాస్యంతో, వాటి విశిష్టతను వినూత్న పద్ధతిలో చెప్పడం తేలికైన అంశం కాదు. ఎందుకంటే అవి వ్యక్తులు కావు, మనస్తత్వమో లేక వ్యక్తిత్వమో ఉండటానికి. వ్యక్తులు లేదా జీవులు కానీ వాటి మీద ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఓ వైపు పండిస్తూనే, మన జీవితాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా స్పష్టం చేశారు. ఆహారం మీద, భార్యాభర్తల మధ్య వంట మీద ఆయన కథలు నిజంగానే మనం మన జీవితంలో ఈ అంశాలను ఎలాంటి ఆరోగ్యకర కోణాల్లో ఇంకా బాగా చూడవచ్చో స్పష్టం చేస్తాయి. ఈ కథల్లో హాస్యమే కాదు, జీవితపు అనుభూతులు కూడా ఉన్నాయి. ఈ కథల్లో కథనం, శైలి కూడా నాటి మహారచయితలను తలపించాయనడం అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా రచయితకు అభినందనలు.

(ప్రతుల కోసం రచయితను సంప్రదించాల్సిన నంబర్ : 9951748340)

     *             *        *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

చరిత్ర మరువకూడని వీరుడు!