ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

    ఉద్యోగ పర్వంలో సగటు మనిషి  

                                                                                                  -శృంగవరపు రచన

                                               


 

        నిషి జీవితంలో కుటుంబాన్ని మించి ముఖ్య పాత్ర పోషించేది ఉద్యోగం.ఆశలతో తన జీవితాన్ని నిర్మించుకునే వ్యక్తికి జీవితపు అసలైన అర్ధాన్ని బోధపరిచేది ఉద్యోగమే.కుటుంబాన్ని ప్రేమించే మనిషికి బాధ్యతను నేర్పించేది ఉద్యోగమే.లోతుగా ఆలోచిస్తే వ్యక్తి తన కోసమే కాకుండా తన కుటుంబం కోసం పాటు పడే ధైర్యాన్ని ఇచ్చేది ఉద్యోగమే.ఈ సమాజంలోని మనుషులకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే కుటుంబాలు ఎన్ని విచ్చిన్నమయ్యేవో! మనిషికి నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం ఉండటం అన్న అంశాన్ని అతని సామర్ధ్యానికి, బాధ్యతకు ప్రతీకగా భావించే సమాజ దృష్టి అనాది నుండి ఉంది. ఉద్యోగుల్లో అనేక రకాల మనుషులు ఉంటారు.కానీ సగటు భారతీయ ఉద్యోగికి పడే పాట్లు మాత్రం కొంత మేరకు ఉద్యోగాలు చేస్తున్న అందరూ తమ తమ స్థాయిల్లో అనుభవిస్తూనే ఉంటారు. అటువంటి ఓ ఉద్యోగి తన అనుభవాలను పంచుకునే క్రమాన్ని సగటు ఉద్యోగి నవలగా శ్రీరాగి కలం పేరుతో రాశారు స్వర్గీయ కె.పి.ఎస్.సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. సమాజ-దేశ-రాజకీయ పరిస్థితులు, కార్యాలయంలోని రాజకీయాలకు ఎలా సగటు ఉద్యోగి జీవితం తారుమారు అవుతుందో, కొందరు ఉద్యోగులు తమ అలవాట్లు ఉద్యోగానికి సరిపడకపోయినా, ఎలా దౌర్జన్య ధోరణితో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి అయినా తమ లక్ష్యాలను సాధించుకుంటారో, ఇంకొందరు నిజాయితీ-అపరాధ భయాలతో ఎలా వీరి దౌర్జన్యాలకు బలైపోతారో, వ్యక్తిగా అవినీతికి వ్యతిరేకమైనా తన ఉద్యోగ జీవితంలో ఎలా దానికి కూడా సర్దుకుపోతాడో, ఇలా సగటు ఉద్యోగి జీవితంలో ఉండే అనేక సర్దుబాట్లు, కుటుంబం కోసం ఉద్యోగాన్ని ఎప్పుడు ఎలా రక్షించుకునే ప్రయత్నాలు చేస్తారో ...ఇలా వివిధ అంశాలను రచయిత ఈ నవలలో సామాన్యుని జీవిత అనుభవంతో చిత్రీకరించారు.

    ఈ నవలలో ప్రధాన పాత్ర సదాశివరావు. రచయిత స్వయంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంటులో లే సెక్రటరీగా మెడికల్ కాలేజీ కర్నూలులో రిటైర్ అయ్యారు కనుక ఇందులో ఆయన స్వయంగా చూసినా,కొన్ని పరిస్థితుల్లో అనుభవించిన అనేక పరిస్థితులు ఈ నవలలో పాఠకుడికి కనిపిస్తాయి. స్వీయ పరిశీలనతో రాసింది కనుక, రచయిత నవలా శీర్షికకు తగ్గట్టుగా సగటు ఉద్యోగి ఉద్యోగ పర్వాన్ని అంచెలంచెలుగా విస్తరించి, ఆ పాత్ర మనస్తత్వాన్ని,ఆ ఉద్యోగ వాతావరణం చుట్టూ ఇమిడి జమిలిగా పని చేసే అనేక శక్తులను గురించి క్రమ పద్ధతిలో చక్కగా రాశారు. సామాన్యుని జీవితాన్ని సామాన్యుని బాషలో రాసి, నవలను చదివే పాఠకులు కూడా సదాశివరావు పాత్ర పట్ల ఓ రకమైన మానసిక అనుబంధాన్ని ఏర్పరచుకునేలా జాగ్రత్త తీసుకున్నారు.

     ఈ నవలలో ప్రధాన పాత్ర సదాశివరావు చిన్న ఉద్యోగిగా 1948 లో ఉద్యోగము మొదలు పెట్టి 1983 ఫిబ్రవరి దాకా అంటే 35 సంవత్సరాలు ప్రభుత్వ విధేయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని కొనసాగించాడు. ఈ నవలా కథ 1972 లో అంటే సదాశివరావు ఉద్యోగంలో చేరిన 24 ఏళ్ళకు ఆరంభం అవుతుంది. వైద్య శాఖలో పని చేస్తున్న సదాశివరావు హెడ్ గుమాస్తా గా పని చేసి, వృత్తిలో ఎదిగి ప్రస్తుతం సుపరెంటుగా చిత్తూరుకు బదిలీ అయ్యాడు. సదాశివరావుకి తన పరిధిలో ఎవరికన్నా సాయం చేసే చొరవ ఉంది. దానికి లంచాలు తీసుకునే అలవాటు లేదు. కొంత పాప భీతి ఉన్నవాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యం అని భావించేవాడు. అలా ఉండలేని వారి పట్ల కొంత విముఖత పెంచుకునేవాడు.నిజాయితీ పరులైన అధికారుల పట్ల అభిమానం, గౌరవం ప్రదర్శించేవాడు. సదాశివరావుకి తన వృత్తికి కావల్సిన సమాచారం, నియమాలు అన్నీ పక్కాగా తెలుసు, ప్రభుత్వం సూచించిన విధంగా పని చేయడము తెలుసు. అందుకే అతను ఎందరూ అధికారులతో అయినా పని చేయగలిగాడు.

     సుపరెంటుగా తన సంతకాల కోసం వచ్చిన రిజిస్టర్లలో ప్రభుత్వ నియమాలు వేటిని ఉల్లంఘించకుండా ఉంటేనే సంతకం పెట్టేవాడు. వృత్తి ద్రోహం చేయకూడదు అన్నది మొదటి నుండి అతని పద్ధతి. టెంపరరీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఫైల్స్ మీద కూడా ఆ నియమాలు వర్తించని వాటి మీద సంతకాలు పెట్టేవాడు కాదు.ఆ సందర్భంలో అతని పై కోపం పెంచుకుని ఏదైనా ప్రతిచర్యకు పూనుకున్నా అటువంటి వాటిని లెక్క చేయని మనస్తత్వం అతనిది.

      ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా ప్రభుత్వం ఉద్యోగులను రిటైర్ చేయించిన పరిస్థితిలో కూడా సదాశివరావు నెట్టుకురాగలిగాడు. ఉద్యోగ జీవితంలో భాగంగా ఎల్లప్పుడు ఉండే బదిలీల వల్ల కుటుంబానికి దూరంగా ఉండటం కూడా ఉద్యోగి జీవితంలో ఒక భాగమే. భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ, ఆరోగ్య-ఆహార విషయాల్లో సరైన శ్రద్ధ తీసుకునే వారు లేక అనేక ఇక్కట్ల పాలవ్వడం గురించి కూడా రచయిత ఈ నవలలో చక్కగా సదాశివరావు జీవితంలో చక్కగా చిత్రించారు.

     ఉద్యోగికి ఉద్యోగ జీవితంలో ఇక్కట్లే కాకుండా కుటుంబీకుడిగా ఉండటం వల్ల కుటుంబంలో సంభవించిన మరణాల దుఃఖం, అనారోగ్యాలు, పిల్లల చదువులు, వీటన్నింటి మధ్య కుటుంబ ఆర్థిక స్థితిని సమన్వయం చేసుకుని,పిల్లలకు చదువులు చెప్పించి వారిని కూడా ఉద్యోగస్తులను చేయడం కూడా పరోక్షంగా జరిగిపోతునే ఉంటాయి. సదాశివరావు జీవితంలో కూడా కుటుంబ పరమైన అనేక సమస్యలు కూడా తలెత్తుతూనే ఉన్నాయి. సగటు మనిషిగా వాటితో అతను రాజీపడుతూనే ఉద్యోగిగా కొనసాగాడు.

       ఉద్యోగ జీవితంలో తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు కూడా అతను ఎన్నో బాధలు పడ్డాడు. అతని ఆరోగ్య విషయంలో సెలవు తీసుకున్న క్రమంలో అతని పట్ల కోపంతో పై అధికారులు ప్రవర్తించడం వల్ల అతను తన సీనియారిటీ పోగొట్టుకున్నాడు. ప్రభుత్వ నియమాలను అనుసరించి అయితే అతను అలా పోగొట్టుకునే అవకాశం లేదు.కానీ అధికారుల అధికారం ముందు ఆ ప్రభుత్వం సూచించిన విధానాలను అదే ప్రభుత్వం అవకాశరీత్యా ఉల్లంఘిస్తుందని అతను తన అనుభవంతో తెలుసుకున్నాడు. అంతే కాకుండా ప్రభుత్వం అతనికి ఇచ్చిన స్థలంలో అతని అనుమతి లేకుండా అక్కడి తాసిల్దారు ఇంకొకరికి దానిని డబ్బుకు ఆశపడి అప్పగించడం,ఆ తర్వాత ఎలాగో రాజీపడటం,తర్వాత ఇంకో స్థలంలో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది.

       తన పై అధికారి పొగరుకు,అతను అటెండర్ పట్ల వ్యవహరించిన తీరుకు,తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు అటెండర్ పెట్టిన దొంగ కేసులో ఆ పై అధికారి తప్పించుకుంటే,ఏ పాపం చేయని సదాశివరావు లాంటి వారు మాత్రం ఇరుక్కుపోయి కోర్టు చుట్టూ తిరిగారు. ఇలా ఉద్యోగ జీవితంలో అనేక ఇబ్బందులు పడుతూ కూడా తనకు అన్యాయం జరిగినప్పుడు తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా రాకపోయినా సదాశివరావు మాత్రం చివరి వరకు పోరాడాడు.

     తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 నుండి 56 కి తగ్గించినప్పుడు సదాశివరావు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.కానీ తర్వాత నాదెండ్ల ప్రభుత్వం వచ్చాక ఆ నియమం పోయి, కొందరికి ఉద్యోగాలు వస్తే, ఇంకొందరికి ఆ కాలపు జీతం ముట్టింది. సదాశివరావుకి కూడా అలా జీతం వచ్చినా,అలా ప్రజా ధనం దుర్వినియోగం అయినందుకు బాధ పడ్డాడు.

    ఉద్యోగ జీవితంలో అనేక సార్లు సర్దుకుపోయాడు.తన పై అధికారులు అవినీతికి పాల్పడ్డా సదాశివరావు మాత్రం తన  పరిధిలో అవినీతికి దూరంగానే ఉన్నాడు. తన పరిధిలో ఎవరికైనా మేలు జరుగుతుందని అనుకున్న సందర్భాల్లో మాత్రం అందుకోసం ప్రభుత్వ నియమాలు కొన్ని సార్లు అందరి లాగానే పట్టించుకోలేదు. వైద్య శాఖలో పని చేయడంలో వైద్య రంగంలో జరిగే అవినీతికి ఉండే అనేక ముఖాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. సగటు భారతీయుడి లానే తన చేతిలో లేని వాటిని మార్చాలనే తాపత్రయం అతనికి కూడా లేదు. సగటు ఉద్యోగిలానే ప్రవర్తించాడు. ఎందుకంటే సమాజంలో కూడా అతను సగటు మనిషే కనుక.

      సమాజంలో మనిషి జీవన పరిస్థితులు అతనిలోని భావాలను,ఆశయాలను నియంత్రిస్తూ ఉంటాయి. ఆ నియంత్రణను ఎంతో చక్కగా ఈ నవలలో చిత్రించారు రచయిత. మనిషి  వ్యక్తిగతంగా ఎంత మంచి ఆలోచనలు కలవాడైనా, చిత్త శుద్ధితో ప్రవర్తించాలన్న మనస్తత్వం ఉన్న వాడైనా, సమాజంలో తన స్థాయికి తగ్గట్టు అతని చర్యలు పరిమితమవుతాయని,సగటు ఉద్యోగి కూడా అలానే రూపొందుతాడని, జీవితంలో సంభవించే సుఖదుఃఖాలను అనుభవించే వ్యవధి కూడా లేకుండా ఉద్యోగంలో మునిగిపోయే సగటు ఉద్యోగి మనస్తత్వాన్ని ఈ నవలలో సదాశివరావు జీవితంలో సంభవించిన అనేక ఘటనల ద్వారా రచయిత స్పష్టం చేశారు.

     వ్యక్తి స్థాయిలో మనిషిలో ఉండే నిస్సహాయత, భయం, అభద్రతలు కూడా ఈ నవలలో ఉన్నాయి. వ్యక్తిగతంగా సగటు మనిషి ఎలాంటి వాడైనా సగటు ఉద్యోగిగా మారిన తర్వాత మాత్రం ఉద్యోగ పర్వానికి ఇమిడిపోవడమో లేకపోతే తెలివితో తనకు అనుకూలంగా మార్చుకోవడమో చేస్తాడని కూడా ఈ నవలలో రచయిత పరోక్షంగా చెప్పారు. ఈ సగటు ఉద్యోగిలోని సదాశివరావు తప్పకుండా మనలోనో,మన చుట్టూ ఉన్న వారిలోనే ఉంటాడు గమనిస్తే!

  *     *     * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

చరిత్ర మరువకూడని వీరుడు!

జీవితమే అనుభూతుల విందు!