అనుభూతుల మజిలీ

 సినీ సంచారం 

                        అనుభూతుల మజిలీ

                        -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)


    కథలు ,సినిమాలు  జీవితాలకు   చాలాసార్లు  దగ్గరగా   ఉన్నట్టే  ఉంటాయి. దానికి  కారణం సందర్భాలు,   జీవితాలు వేరైనా ఎదుర్కోవాల్సిన  సమస్యలు సన్నిహితంగా ఉండడం. అలా ఓ రచయిత్రి  తన జీవితంలో  ఎదురైనా ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఎటువంటి కొత్త  మార్గంలో పయనించిందో తెలిపే ఆంగ్ల సినిమానే ‘Under The Tuscan Sun.’ వాస్తవానికి ఈ సినిమా ఇదే పేరుతో అమెరికన్ రచయిత్రి ఫ్రాన్సిస్ మెయిస్ తను    ఇటలీ లోని టస్కన్ లో గడిపిన ఎన్నో అనుభూతులను ఎన్నో నవలలుగా మలచారు. అందులో ఒకటే ఈ ‘Under The Tuscan Sun.’

            అమెరికన్  రచయిత్రి  ఫ్రాన్సిస్  తన భర్త తనను  మోసగిస్తున్నాడని గ్రహించి అతనితో విడాకులు తీసుకునే క్రమంలో  ఆమె తన ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. డిప్రెషన్ లో ఉన్న  ఫ్రాన్సిస్ ను ఆ మూడ్ ను బయటకు తీసుకు రావడానికి ఆమె స్నేహితురాలైన ప్యాటి ఆమెకు టస్కన్ వెళ్ళేందుకు ట్రిప్ టికెట్ తీసుకుంటుంది. మొదట నిరాకరించినా తర్వాత అక్కడికి వెళ్తుంది.

            అక్కడ ఓ  విల్లాను చూసి దానిని ఇష్టపడిన ఫ్రాన్సిస్ దానిని కొనుక్కుంటుంది. అక్కడ దానిని బాగు చేయించడానికి పోలాండ్ నుంచి వచ్చిన కొందరు వలస కూలీలను పెట్టుకుంటుంది. అక్కడి కొత్త జీవితం ఆమెకు బాగానే ఉంటుంది. అక్కడ ఆమె అనుకోకుండా ఓ రోడ్ మీద కలిసిన మార్సేల్లో తో సంబంధం నడుపుతుంది. అదే సమయంలో ఆమె స్నేహితురాలైన ప్యాటి అప్పటికే గర్భవతి అయి ప్రసవించే సమయానికి  ఫ్రాన్సిస్ ను కలవడానికి వస్తుంది. ఆ తర్వాత ఓ బిడ్డను కంటుంది.

            స్నేహితురాలు రావడంతో ఆమె మార్సేల్లో ను కలవలేకపోతుంది. తర్వాత అతన్ని కలుసుకోవడానికి వెళ్తే అప్పటికే అతను ఇంకో అమ్మాయితో సంబంధం కలిగి ఉండటం చూసి అతనికి గుడ్ బై చెప్పి వెనక్కి వచ్చేస్తుంది. ఆమె దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ లో యువకుడైన పావెల్ అక్కడి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తండ్రి ఆ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో తనే పావెల్ కుటుంబం అని ఒప్పించి తన విల్లాలోనే వారిద్దరి వివాహం జరిగేలా చూస్తుంది.

            తన సొంత ఇల్లు ,ఆ ఇంట్లో ఓ వివాహం ,ఆ ఇంట్లో తను వండిపెట్టడానికి ఎవరో ఒకరు ఉంటే బావుండు అని కోరుకున్న  ఫ్రాన్సిస్ కోరికల్లో ఒకటైన వివాహం అలా పావెల్ వివాహం తో తీరుతుంది. అదే పెళ్ళిలో ఇంకో అమెరికన్ రచయితను కలవడంతో ఆమె భవిష్యత్తు మళ్ళీ అతనితో మొదలవుతుంది. ఇక్కడితో సినిమా ముగుస్తుంది.

            జీవితంలో మనందరికీ ఏదో ఒక పరిస్థితుల్లో నిస్పృహ సర్వసాధారణం. దాని నుండి బయట పడటానికి ఏదో ఒక మార్గం వెతుక్కుని పయనించాలి. జీవితంలో ఏదో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్తూ సంతోషంగా  ఉండగలము అనే సందేశం ఈ సినిమాలో ఉంది.

            జీవితంలో  సంతృప్తి అనేది ఒకోసారి ఏ వ్సిహాయంలోనూ మనకు లభించకపోవచ్చు ,కానీ మనకు దొరికే వాటిల్లో సంతృప్తిని అనుభవించడమే జీవితం. ఫీల్ గుడ్ సినిమాల్లో ఇది ఓ మంచి సినిమానే. మనిషి మనస్తత్వంలో పరిస్థితులతో ఏర్పడే ఊహించని మలుపుల గురించి చెప్పే సినిమా ఇది.

                    *    *    *

 

     

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!