మరణ శిక్షలు లేని కలల లోకం!

                                         మరణ శిక్షలు లేని కలల లోకం!

                                                                -శృంగవరపు రచన

                                      


        ప్రతి రచయిత ఎంత నాటకీయంగా రాసినా తాను చెప్పదలచుకున్న అంశానికి ఆ నాటకీయత బలాన్ని చేకూర్చేలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. రాయడంలో విభిన్నత, కాలానికి తగ్గట్టు కథనాన్ని, శైలిని మార్చుకుంటూ, చెప్పాలనుకున్న అంశాన్ని పాఠకులకు అర్ధమయ్యేలా సులభంగా చెప్పే రచయిత టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి గారు. కలల రాజ్యం నవలలో మరణ శిక్షలు లేని కొత్త లోకం కోసం కలలు కంటున్న ఓ డాక్టర్ కు అనుకోకుండా తారసపడ్డ ఓ రోగి ఎలా కనక్ట్ అయ్యాడో, ఆ కొత్త రాజ్యంలో ఆ రోగి మరణ శిక్షలు ఉండాలని ఎందుకు కోరుకున్నాడో అన్న అంశాన్ని ఓ ప్రేమ కథ చుట్టూ ఉన్న పరిస్థితులతో చక్కగా రాశారు.

         ఉదయబాబు, రాజారావు స్నేహితులు. ఇద్దరూ నిరుద్యోగులు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న లావణ్యను కాలేజీ రోజుల నుండే ఉదయబాబు ప్రేమిస్తూ ఉంటాడు.కానీ ఆమెను రోజు దూరం నుండే చూస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. లావణ్య కూడా అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. వీరిద్దరి ప్రేమ ఇద్దరికి చొరవ లేకపోవడం వల్ల అలానే ఉండిపోతుంది. ఈ సమయంలో రాజారావు లావణ్యకు ఉదయబాబు గురించి చెప్తాడు. ఉదయబాబుకు ఉద్యోగం వచ్చేవరకు తాను వేచి ఉంటానని చెప్తుంది లావణ్య. ఈ ప్రక్రియలో లావణ్య స్నేహితురాలు స్వాతితో రాజారావు ప్రేమలో పడటం, వారిద్దరికి వివాహం కూడా అవుతుంది. ఉదయబాబుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ తర్వాత అతనికి  ఎయిడ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బ్రహ్మచారి అయిన ఉదయబాబుకి ఏదో ఇంజెక్షన్ వల్ల లేదా అతనికే తెలియని రీతిలో ఆ రోగం రావడంతో లావణ్యను బాధ పెట్టడం ఇష్టం లేక ఆమెకు నిజం చెప్పి, ఆమె తన బావను వివాహం చేసుకునేలా చేస్తాడు.

            ఉదయబాబు వైద్యం కోసం వెళ్ళే డాక్టర్ ను పిచ్చి డాక్టర్ అని పిలుస్తూ ఉంటారు అందరూ. ఆయన ఎప్పుడు తన కలల రాజ్యం గురించి చెప్తూ ఉండేవాడు.

        “మేము కలలు కనే రాజ్యంలో మరణ శిక్షలు ఉండవు. కరకు హంతకులకు, తీవ్రవాదులకు సైతం ఇతర శిక్షలు ఉంటాయి తప్ప మరణ శిక్షలు ఉండవు. హత్య కాదు కదా, చిన్న నేరం చేయడానికి కూడా ఏ మనిషీ సాహసించే అవకాశం ఉండదు. ఎందుకంటే మరణశిక్ష తప్ప ఇతర శిక్షలు అన్నీ ఉంటాయి. అవి చాలా కఠినంగా ఉంటాయి. ఆ రాజ్యంలో బహిరంగ ప్రదేశాల్లో అనవసరంగా అయిదారుగురికి మించి ఎక్కడా, ఎవరూ సంచరించరాదు. అలా కలవడం వల్లనే కదా అనాగరికతకు అంకురార్పణ జరిగేది. బంద్ లు చేసే వారికి, స్త్రీలపై అత్యాచారాలకు,హింసకు పూనుకునేవారికి, పనేది చేయకుండా రాజకీయాలు చేసే సోమరిపోతులకు, దొంగలకు, దొంగలను పెంచి పోషించే వారికి కూడా కఠిన శిక్షలు ఉంటాయి. “ఇలా ఆ లోకం గురించి ఇంకేన్నో విషయాలు చెప్తాడు ఆ డాక్టర్.

      వాస్తవానికి మామూలు స్థితిలో ఉంటే ఉదయబాబు ఆ మాటలను పెద్దగా లెక్క చేసే వాడు కాదేమో. కానీ తాను కొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసిన తర్వాత ఆ మాటలు అతన్ని ప్రభావితం చేశాయి. అతనికి ఆ రాజ్యంలో మిగిలిన అంశాలలో శిక్షలు కఠినంగా,అనాగరికంగా అనిపించినా, మరణ శిక్ష లేకపోతే ప్రజల్లో భయం ఉండదని భావిస్తాడు. తాను మరణించేలోపే తాను కూడా ఆ రాజ్యం కోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తాడు. కానీ అందులో మరణశిక్షలు ఉండాలని భావిస్తాడు.

      అందులో భాగంగా అతను అవినీతిపరుడైన ఓ వైద్యుడిని, మందు వ్యసనంతో ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా డ్రైవింగ్ చేసే ఓ డ్రైవర్ ను, ఆడపిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న ఓ స్త్రీని, తన స్నేహితురాలిని మానభంగం చేసిన ఓ వ్యభిచారిని వరుస హత్యలు చేస్తాడు. వారిని హత్య చేసాక వారి శవాల ప్రక్కన కొత్త లోకం గురించి ప్రస్తావిస్తూ రాసిన నోట్ ఉంచేవాడు. చివరకు అతను పోలీసులకు పట్టుబడినా పోలీసులు అతని స్థితిని గమనిస్తారు. అలాగే అతను చంపినవారు నేరస్తులే కనుక వారు పెద్దగా బాధపడరు. అతను చివరి రోజుల్లో ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర గడపటానికి అక్కడకి పంపిస్తారు. ఆకొత్త లోకంలో మరణశిక్ష ఉండాలని కోరుకుంటూనే అతను మరణిస్తాడు.

       మనమందరం ఈ వ్యవస్థలో మార్పు కోసం సమాజంలో తప్పు జరగకుండా ఉండటానికి న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని కోరుకుంటాము. మార్పుల గురించి వ్యక్తి తన జీవితానుభవాలను అనుసరించి వివిధ ఆలోచనలు చేస్తాడు. అటువంటి మనందరి కలలకు అక్షర రూపమే ఈ నవల. ఈ అంశం కొత్తది కాకపోయినా అటువంటి ఆలోచనలే ఏదో ఒక రోజు సమాజంలో మార్పుకి కారణమవుతాయి. మంచి నవల రాసిన రచయితకు ఈ సందర్భంగా అభినందనలు.

   *         *      *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!