Survival Protection Instinct
Survival Protection Instinct
మనిషి మనుగడ కోసం ఏమైనా చేయడం ఒక దశ అయితే, ఆ దశలో వచ్చే ప్రమాదాల నుండి తనను తాను కాపాడుకోవడం రెండో దశ. ఈ రెండు దశలు మనిషి జీవితంలో అనుసంధానమై ఉంటాయి. ఆ రెండు దశల మధ్య మనిషి ఎలా మారిపోతాడో స్పష్టం చేసే సినిమానే 'ఫ్యామిలీ డ్రామా.'
ఓ కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకుకి ఉద్యోగం లేకపోవడం వల్ల అతన్ని తండ్రి ఇంటి నుండి గెంటేస్తాడు.అతను డ్రగ్స్ కు అలవాటు పడతాడు. తర్వాత చిన్న కొడుకు ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకురావడం, అతనికి ఉద్యోగం రాకపోవడం వల్ల అతన్ని కూడా ఇంట్లో ఉండనివ్వనని తండ్రి హెచ్చరించడంతో అన్నతో కలిసి తండ్రికి పక్షవాతం వచ్చే మందు కాఫీలో తల్లి చేత కలిపించి ఇస్తారు. తల్లిని కూడా తండ్రి హింసించడం వల్ల తల్లి కూడా సహకరిస్తుంది. తర్వాత ఆయనకు శరీరం అంతా చచ్చుబడటం జరుగుతుంది. అదే అదనుగా భావించి పెద్ద కొడుకు తన భార్యతో సహా అక్కడ అడుగు పెడతాడు.పెద్ద కొడుకు రామం, అతని భార్య మహా. చిన్న కొడుకు లక్ష్మణ్, భార్య యామిని.
ఓ రోజు అప్పు అడగటానికి వచ్చిన మిత్రుడు నగేష్ ను రామమ్ హత్య చేసి, ఇంటి వెనుక పాతిపెడతాడు. అది యామిని చూస్తుంది. భర్తకు చెప్తే ఆ ఇల్లు తమ పేర వచ్చేలా అన్నను ఒప్పించే వరకు అనుమానం రాకుండా ఉండమని యామినికి చెప్తాడు లక్ష్మణ్.తండ్రి స్నేహితుడు రోజు ఇంటికి వచ్చి అతనితో కబుర్లు చెప్తూ ఉంటాడు. ఓ రోజు హెల్మెట్ కోసం వెనక్కి వచ్చిన ఆ స్నేహితుడు రామమ్ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నిజం తెలుసుకుంటాడు.ఆ నిజం అతనికి తెలిసిపోవడంతో అతన్ని అన్నదమ్ములు వెంబడించి, ఓ చోటుకు తీసుకువెళ్తారు. అక్కడ లక్ష్మణ్ అతన్ని హత్య చేస్తాడు. ఆ హత్య మహా చూస్తుంది. పక్కన ఉన్న రామమ్ ను ఆమె చూడదు. తర్వాత రామమ్ కు లక్ష్మణ్ గురించి చెప్తుంది.అతను కూడా ఆమెతో ఆస్తి దక్కే వరకు మౌనంగా ఉండమని చెప్తాడు. యామిని నిజాన్ని గ్రహిస్తుంది.మహాకు కూడా రామమ్ గురించి చెప్తుంది.అప్పటికే వార్తల్లో ఉన్న సీరియల్ కిల్లర్ ఒకరు కాదని, ఆ ఇద్దరు అన్నదమ్ములు అని వారికి అర్ధమవుతుంది.
ఆ తర్వాత మహా మావయ్య స్నేహితుడి కొడుకుకు ఫోన్ చేసి అతని తండ్రిని హత్య చేసారని అజ్ఞాతంగా చెప్తుంది. ఆ తర్వాత అతను రావడం అతన్ని కూడా అన్నదమ్ములు హత్య చేయడం జరుగుతుంది. చివరకు లాయర్ వచ్చాక తల్లి తండ్రి సంతకాలు అయ్యేవరకు వారిని ఇంటి నుండి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేయడం, సంతకాలు అయ్యాక, అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో యామిని, మహా ఆ ఇద్దరు అన్నదమ్ములను హత్య చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారి అత్తయ్య పోలీసులకు కాల్ చేసి తన కోడళ్ళే కొడుకులు హత్య చేసారని, వారే సీరియల్ కిల్లర్స్ అని చెప్పడం, వారు అరెస్ట్ అవ్వడంతో సినిమా ముగుస్తుంది.
మనిషి జీవితం క్రూరత్వం-మానవత్వం మధ్య ఇరుక్కుపోయినప్పుడు క్రూరత్వమే ప్రమాదకరం కనుక దానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు.తనను తను కాపాడుకునే క్రమంలో మనిషి తన వరకే ఆలోచిస్తాడు.అటువంటి మనుషుల మధ్య ఎలా బ్రతకాలో అప్పటికే ఆ తల్లికి ఓ స్పష్టత రావడం వల్లే ఆమె అలా చేసి ఉండవచ్చు. తాను భర్తకు మందు ఇవ్వడం బయట పడవచ్చు అందుకే తనను తాను కాపాడుకుంది. ఆ ప్రక్రియలో ఇంకొకరు అనవసరం. ఇదే మనుగడ రక్షణ సూత్రం.
* * *
Comments
Post a Comment