'చివరకు మిగిలేది' నవలా సమీక్ష

జీవితమే శూన్యమేమో!

       -శృంగవరపు రచన

                             


     కొన్ని రచనలు చదువుతుంటే ఆ రచయిత బహుశా ఆ రచనా సృజన కోసమే జన్మించారేమో అన్న భావన కలుగుతుంది. బుచ్చిబాబు గారు రాసింది  చివరకు మిగిలేది అన్న ఒక్క నవలే అయినా, ఇంకా తాను చెప్పదల్చుకున్నది అంతకు మించి ఉండదేమో అన్నంత తీవ్రమైన సంఘర్షణ,ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలను జీవిత వలయంలో గిరగిరా తిప్పుతూ, వాటిని ఓ గమనింపుతో చూస్తూ, జీవితం గురించి ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, జీవితం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ, ఆ జీవితాన్ని జీవించడంలో సంతోషం లేదని, మనుషుల అనుబంధాలు-సంఘం కలిసి మనిషిలో జీవించాలనే కోరికను హత్య చేసే ప్రయత్నాన్ని గురించి, జీవితంలో చివరకు మిగిలేది ఏమి లేదని తేల్చడానికి రచన కథన పద్ధతి, సందర్భాలను,కథకుడి జీవితాన్ని, జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘ నైతిక వలయాన్ని గురించి, జీవితానికి సంబంధించిన అనేక వాదనలను గురించి రచయిత రాసింది చదువుతుంటే, ఇదే కదా జీవితం అంటే అని పాఠకుడికి అనిపించడం వల్ల ఈ రచనలో పాఠకుడు తన జీవిత ఉద్దేశ్యాన్ని గురించి కూడా ఆలోచించుకునే ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంది. నైతికత,ఆధ్యాత్మికత, స్త్రీ పురుష సంబంధాలు, రాజకీయాలు, మనుషుల మధ్య ఉండే గొడవలు అన్నీ ఈ నవలలో ఉన్నాయి ;అవి సంఘటనలుగా మాత్రమే ఉండిపోతే ఈ నవలకు విశిష్టత ఉండేది కాదు అవి లోతైన దృష్టితో రచయిత చేత సృజింపబడటం వల్ల ఈ సాధారణ ఘటనల్లో అసాధారణత్వం స్పష్టం అవుతుంది. ఈ కథా కాలం రెండు ప్రపంచ యుద్ధాలను ప్రపంచం చూశాక తలెత్తిన మార్పుల ఘర్షణ ఉద్రిక్తంగా ఉన్నప్పుడూ కొంత ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రమాన్ని కూడా చిత్రించింది.

       ఈ నవలలో ప్రధాన పాత్ర దయానిధి. అతని జీవితంలో జరిగిన ఘటనలు, వాటి పట్ల సమాజం స్పందించే తీరును అనుసరించే కథ ముందుకు సాగుతూ ఉంటుంది. దయానిధి తల్లి పాత్రను చిత్రించడంలో రచయిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వాస్తవానికి ఆ తల్లి ఈ కథ మొత్తంలో ఎక్కడా ప్రత్యక్షంగా కనబడదు. మొదట్లోనే ఆమె మరణిస్తుంది కూడా. కానీ దయానిధి జీవితంలో అతని చర్యలు నచ్చనప్పుడు అతని బంధువులు, సమాజం, అతనంటే గిట్టని వారు కూడా ఆ తల్లి నైతికతలోని అపసవ్యతల గురించి ప్రస్తావించి, ఆ ప్రభావమే అతనిలో పతనానికి కారణమవుతుందని ఆరోపించడం వల్ల ఆ తల్లి జీవితం దయానిధి ఆలోచనలను సంఘం పట్ల అతను ఏర్పర్చుకున్న దృక్కోణ విస్తృతిని ఎలా ఏర్పడేలా చేస్తుందో స్పష్టం చేస్తుంది.

       సమాజంలో జీవించే వ్యక్తుల జీవితాలను ముఖ్యంగా స్త్రీ పురుషుల సంబంధాల కేంద్రంగా నైతికతను నిర్దారించే లక్షణం ఎప్పటి నుండో మన సంస్కృతిలో బలపడిపోయింది. దయానిధికి స్త్రీలతో ఉన్న సంబంధాలను కేవలం లైంగిక సంబంధాలుగా భావించి, దాని గురించి ప్రచారం చేస్తూ సమాజం ఓ రకమైన దుగ్ధను తీర్చుకుంటుంది ఈ నవలలో. నవల మొదటిలో అతనికి స్త్రీ పట్ల, ప్రేమ పట్ల ఉన్న భావనకు ముగింపుకి వచ్చేసరికి అతనిలో వచ్చిన మార్పు,ఆ మార్పులను గమనిస్తూ జీవితంలో చివరకు మిగిలేది శూన్యమని తెలుసుకోవడమే లక్ష్యంగా ఉండటం, ఆ లక్ష్యాన్ని అర్ధవంతంగా చెప్పడానికి రచయిత అతని జీవితంలోని ప్రతి మలుపులో జీవితం గురించిన ఓ లోతైన తార్కిక దృక్కోణంలో అతని ఆలోచనలు సాగుతూ ఉండటం వల్ల పాఠకులు ఈ పాత్ర జీవితంలోని ప్రతి ఘటనను ప్రత్యేకంగా చూడగలరు. అదే ఈ నవలా కథనంలో ఉన్న ప్రత్యేకత.

          దయానిధి సోదరుడు రామనాధం. కథ ఆరంభానికన్నా ముందే అతనికి వివాహం జరిగిపోతుంది. తల్లి ప్రవర్తన పట్ల అతను వ్యతిరేకత ప్రదర్శించడం, కథ మొదట్లోనే తల్లి మరణించడం, అది అనారోగ్యం వల్ల అని మొదట భావించినా, తర్వాత ఆమెను తండ్రి హత్య చేశాడన్న వదంతి బలపడుతుంది. దయానిధి మెడిసిన్ చదువుతూ ఉన్న సమయంలో కథ మొదలవుతుంది. దయానిధి  బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. వేశ్యా వృత్తికి చెందిన కోమలిని అతను మొదట్లో వాంఛిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, కేవలం ఆమె తన వాంచకు మాత్రమే అర్హురాలని భావిస్తాడు. దానికి కారణాలు కోమలి వృత్తి, ఆమె కుటుంబ నేపథ్యం కూడా కావచ్చు. తండ్రిని ఎదిరించి ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశ్యం మాత్రం దయానిధికి లేదు. దయానిధి  తన అభిప్రాయాల గురించి, ఓ చర్యకు తనను ప్రేరేపించే  తన నమ్మకాల గురించి,ఆ నమ్మకాలు ఏర్పడిన స్థితుల గురించి తనకు తానుగా తెలుసుకుంటూ జీవితంలో వచ్చిన పరిస్థితుల గురించి విశ్లేషణ చేసుకుంటూ, సాగిపోయే పాత్ర.

         దయానిధికి బంధువులు అమృతం, సుశీల. తల్లి చనిపోయిన ఆరేడు నెలలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి సుశీల, ఆమె తల్లి నరసమ్మ, అమృతం, ఆమె తమ్ముడు జగన్నాథం ఉంటారు. సుశీల, అమృతం ఇద్దరూ కూడా దయానిధికి మరదళ్ళు అవుతారు. అమృతానికి అప్పటికే వివాహమైపోయింది. ఈ ఇద్దరికి దయానిధి పట్ల ఆసక్తి ఉంది. ఈ రెండు పాత్రల ద్వారా రచయిత నైతికత విలువలను దాటిన ఆకర్షణలు స్త్రీ పురుషుల మధ్య ఉంటాయని, కాకపోతే సంఘానికి  లోబడి నడుచుకునే తత్వం ఉండటం వల్ల మనసులోని ఆకర్షణలను వివిధ భావోద్వేగాల ద్వారా వ్యక్తపరుస్తారని రచయిత చెప్పినట్టు అనిపిస్తుంది. సుశీల తండ్రి తాసిల్దారు. దయానిధి పట్ల సుశీలకు ఆసక్తి ఉన్నా, అతను కోమలి పట్ల ఇష్టం పెంచుకోవడం పట్ల అయిష్టత ఉండటం,ఆ అయిష్టం అతని మీద ఉన్న ఇష్టాన్ని డామినేట్ చేయడం వల్ల అతనితో పెడసరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దయానిధి పట్టుపడితే అతనితో తన వివాహం జరుగుతుందని భావించిన సుశీల అతని నిర్లిప్తత పట్ల ఓ రకమైన కోపాన్ని పెంచుకుని అతన్ని బాధిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు. మొత్తానికి సుశీలతో సంబంధం మొదట అనుకున్నా కొంత దయానిధి తల్లి శీలాన్ని శంకించి ఆ సంబంధం తప్పిపోతుంది.

        తండ్రి తెచ్చిన సంబంధం పెళ్లి చేసుకుంటాడు దయానిధి. పెళ్లి కూతురు ఇందిర. తండ్రి ,పెదనాన్న పోలీస్ ఉద్యోగులు. ఆంగ్ల ప్రభుత్వానికి విధేయత ప్రకటించే మనస్తత్వం ఆ ఉద్యోగంతోనే వారి జీవితంలో స్థిరపడిపోయింది. కార్యం రోజు స్వతంత్ర సంగ్రామ తరుణంలో ఓ సభలో మిత్రుల అభ్యర్ధనపై ప్రసంగించడం వల్ల స్వయంగా మామగారి వల్లే దెబ్బలు తినడం, అలా ఆశయ-ఆలోచనల విరుద్ధత సంభవించడంతో ఇందిర కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండిపోవడం జరుగుతుంది. అలా పెళ్లయ్యి బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు దయానిధి. అతని పెళ్ళికి ముందే కోమలి ఓ ధనవంతుడితో వెళ్లిపోతుంది.

     దయానిధి ప్రాక్టీస్ సరిగ్గా ఉండకపోవడం, అతని భార్య కాపురానికి రాకపోవడంతో అతనికి పరిచయం ఉన్న స్త్రీలతో అతనికి సంబంధాలు అంటగట్టడం, అతన్ని నైతిక భ్రష్టుడిని చేయడం, దానికి కారణంగా అతని తల్లిని చిత్రించడం జరుగుతూ ఉంటుంది. అమృతం ఓ సారి అతని దగ్గరకు వచ్చినప్పుడు రాత్రి ఆమెతో సంగమించి ఉదయం ఆమె డబ్బు కొంత తీసుకుని రాయలసీమలో జిల్లాల్లో ఉన్న ప్లేగు వంటి వ్యాధుల బారిన పడిన రోగులను కాపాడటానికి వెళ్ళిపోతాడు. ఇష్టపడిన కోమలికి దగ్గర అవ్వకుండా, కట్టుకున్న భార్యకు కూడా దూరంగా ఉన్న దయానిధి అమృతంతో అలా వ్యవహరించడం మానవుడు తన ఆశయాలకు విరుద్ధంగా ఎలా కొన్నిసార్లు ప్రవర్తిస్తాడో స్పష్టం చేస్తుంది. సర్కారు జిల్లా వాడైన దయానిధి రాయలసీమకు వెళ్ళడం ద్వారా అక్కడ రాజకీయ వాతావరణంలో అతను ఎలా మరలా ఒంటరి అయ్యాడో కూడా రచయిత స్పష్టం చేస్తాడు.

        అనంతాచారి దయానిధికి అక్కడ పరిచయం అవుతాడు. ఆయన కుటుంబం దయానిధిని ఆదరిస్తుంది. అక్కడ మామూలుగా అతని జీవితం గడచిపోతున్న తరుణంలో అతనికి అక్కడ ఓ వజ్రాన్ని కనుగొనడం, దానిని అమ్మడంతో ధనవంతుడిగా మారతాడు. తల్లి విగ్రహాన్ని కట్టిస్తాడు. ఓ హాస్పటల్, స్కూల్ నిర్మాణాలకు కూడా పూనుకుంటాడు. ఆ సమయంలో అతనికి అమృతం ఆడపిల్లను కన్నదని తెలుస్తుంది. తాను తీసుకున్న డబ్బును ముందే పంపిస్తాడు. ఆ పాపకు తండ్రి తానే అన్న భావనతో ఉంటాడు దాయనిధి. దానికి కొంత గర్వం, కొంత భయం కూడా అతనిలో ఉంటుంది. ఆ పాపను చూడాలన్న కోరిక ఉన్నా కొంత భయంతో ఆగిపోతాడు. కోమలి మరలా అతని దగ్గరకు తిరిగి వస్తుంది.ఒకప్పుడు అతను ఎంతో వాంచించిన ఆమె ఇప్పుడు అతనిలో వాంఛను కలిగించలేదు.ఆమెకు శారీరకంగా దూరంగానే ఉంటూ ఆమెను స్నేహితురాలిగా చూడాలని అనుకుంటాడు. మరలా కోమలి అతనితో ఉండటం పట్ల మరలా వదంతులు వ్యాపిస్తూ ఉంటాయి. ఈలోపు ఇందిరకు క్షయతో మరణిస్తుంది. ఆమె తండ్రి ఆమె కాపురం పాడు చేసినందుకు పశ్చాత్తాప పడతాడు. అలా దయానిధి జీవితం భార్య శకం ముగుస్తుంది.

       దయానిధి మిత్రుడు ఒకడు రాజకీయ ప్రచార చర్యల్లో భాగంగా ఆంధ్ర తో రాయలసీమ సమైక్యం కావాలన్న వాదనలో రాయలసీమ ప్రజలను దూషించడంతో సర్కారు జిల్లా నుండి వచ్చి అక్కడ స్థిరపడిన దయానిధికి వ్యతిరేకం అవుతారు అక్కడి ప్రజలు. అనంతాచారి దయానిధి తరపున నిలబడినా వారి మీద దాడి జరగడంతో తన వల్ల వారికి కీడే జరుగుతుందని భావించిన దయానిధి అక్కడ నుండి కోమలిని తీసుకుని వేరే చోటుకి జీవించడానికి వెళ్ళిపోతాడు.

        ఇక్కడితో నవల ముగుస్తుంది. ఈ నవలలో దయానిధికి ఈ సమాజం పట్ల, ఆ సమాజం తనను చెడ్డవాడిగా చిత్రిస్తున్న అంశం పట్ల కోపం ఉంది. కానీ చివరి వరకు నిరసనను ప్రకటించలేదు. చివరిలో అతను తన గురించి మాట్లాడుకుంటున్న వారిని తన జీవితం వల్ల వారికి జరిగిన నష్టం ఏమిటో చెప్పమంటే ముఖం చాటేస్తారు.ఈ నవల సమాజంలో వ్యక్తి నైతికతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ, ఆ నైతికతే మనిషికి సమాజంలో జీవించడానికి గౌరవాన్ని, అర్హతను ఇస్తుందన్న భ్రమను కలిగిస్తూ, ఆ నైతికత కేవలం స్త్రీ పురుషుల శరీరాలకే సంబంధించిన అంశంగా భావిస్తూ, వ్యక్తి గుణాన్ని అతని చరిత్రలో నైతికత ఆధారంగా నిర్ధారించుకుంటూ ఆ వ్యక్తిపై ముద్ర వేస్తూ అతన్ని బలహీనున్ని ఎలా చేస్తుందో అన్న అంశాన్ని దయానిధి పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత.

    ఈ నవలలో సుశీల పాత్రకు కూడా విచిత్రమైన మనస్తత్వం ఉంది. ఆమె సుఖవ్యాధుల బారిన పడిన వ్యక్తిని తెలిసి కూడా వివాహం చేసుకోవడం, తర్వాత ప్రసవ సమయంలో మరణించడం, ఆమె బిడ్డకు తండ్రి వేరే వ్యక్తి అయ్యి ఉండవచ్చు అన్న భావన పాఠకులకు కలిగేలా పరిస్థితులను రచయిత చిత్రించడం వల్ల వ్యక్తి ప్రేమ ప్రకటనకు నోచుకోనప్పుడు, ఆ మనిషిలో ఉన్న ప్రేమ కాస్త ఓ రకమైన స్వీయ ధ్వంసానికి దారి తీస్తుందని స్పష్టం చేసినట్టు అనిపిస్తుంది.అలాగే రచయిత ఈ నవలలో దయానిధి దగ్గరకు అతని స్నేహితుడి చెల్లెలను తీసుకువచ్చినపుడు ఆమెకు సౌందర్యారాహిత్యం అనే జబ్బు ఉందని చెప్పడం, దానిని తన పద్ధతిలో బాగు చేసే ప్రయత్నం చేయబోయి నిందల పాలు కావడం వంటి సందర్భాలను సృష్టించడం కూడా మనుషుల మనసుల్లో అసంతృప్తులు వివిధ కారణాల వల్ల ఎలా ఉద్భవిస్తాయో,అవి ఎలా విచిత్ర రూపాల్లో బయట పడతాయో స్పష్టం చేయడానికే అని అనిపిస్తుంది.

     ఆధ్యాత్మిక జీవనం గురించి ఈ నవలలో జరిగిన చర్చలు, రాజకీయ పరిస్థితుల గురించి జరిగిన వాదనలు, ప్రేమ-ద్వేషం మాత్రమే మనిషి జీవించడానికి కోరికను కలిగించే ఉద్వేగాలు అని రచయిత వివిధ సందర్భాల్లో స్పష్టం చేయడం, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనిషి చేసే అన్వేషణలో మనిషికి ఆ పయనం మాత్రమే స్మృతిగా మిగులుతుంది తప్ప, జీవితంలో చివరకు ఏమి మిగలదనే ఉదహరింపుతోనే మనిషి అస్తమించడమో లేక తిరిగి జీవితాన్ని ప్రారంభించడమో చేస్తాడని రచయిత ఈ నవలలో స్పష్టం చేశారు.

         మంచితనం-చెడ్డతనం గురించి, ఒకరికి ఒకరు అర్ధం కాకుండానే సమాజంలో కుటుంబంలో సంబంధాలు ఎలా సాగిపోతూ ఉంటాయో, ఈ సమాజంలో మనిషిగా చలామణి కావడానికి ఎటువంటి సందర్భోచిత లౌక్యాలు ఉపయోగపడతాయో, మనిషి తన అహాన్ని ఎన్ని రూపాల్లో తనకు కూడా తెలియకుండానే సంతృప్తి పరచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో వంటి అనేక అంశాలపై ఆలోచింపజేసే ఈ నవల తప్పకుండా కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ పాఠకులను ప్రభావితం చేస్తుంది.

  *       *      *

     

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

చరిత్ర మరువకూడని వీరుడు!

జీవితమే అనుభూతుల విందు!