మనిషిలో తాత్వికత

 మనిషిలో తాత్వికత

(రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం' నవలా సమీక్ష)
-శృంగవరపు రచన
కథను చెప్పే నవలలు ఓ రకం.సంఘర్షణలను చెప్పే నవలలు ఇంకో రకం.మనం పొందలేని జీవితం గురించి చెప్పే నవలలు ఇంకో రకం.చరిత్ర పోరును చెప్పే నవలలు ఇంకో రకం.కానీ రణరంగమైన రాష్ట్ర అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంతో మనిషిని పరిచయం చేసే నవలలు అరుదు.అటువంటి నవలల్లో ఒకటే రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం.'.సమాజంలో వ్యక్తికి,పరిపాలకులకు,ఉద్యమాలకు మధ్య ఎంత దూరం ఉందో అంత దగ్గరితనము ఉంది.ఆ దూరాలు,దగ్గరలు మనుషులకు తమ నేలపై ఉన్న ప్రేమ,ఆ ప్రేమతో వచ్చే హక్కులు-బాధ్యతల నుండే జన్మిస్తాయి.తెలంగాణ రచయితల్లో రామా చంద్రమౌళి గారి శైలి విశిష్టమైనది.ఆయన ఆలోచనల్లోని తాత్విక చింతన ఆయన స్పృశించే ప్రతి అక్షరంలోనూ ప్రవహిస్తూ పాఠకులను తమ లోపలి మనిషిని చూసుకునేలా చేస్తుంది.'ఆవేశం-తాత్వికత' రెండు వ్యక్తి-సమాజ నిర్మాణానికి అవసరమే అయినా,ఏదీ ఎక్కువైనా వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమవుతుంది.ఆలోచన లేని ఆవేశం,మనిషిని కార్య పరిణామాల గురించి ఆలోచింపచేయలేని తాత్వికత రెండు ప్రమాదకరమైన అస్త్రాలుగానే మారతాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం ఈ నవలలో ప్రధానాంశం అయినా,ఆ నేపథ్యంతో నాటి తెలంగాణలో సాధారణ వ్యక్తుల అసాధారణ త్యాగాలు-వాటి ప్రభావాలు,రాజకీయ కుట్రలు-కుతంత్రాల గురించి చెప్తూనే,హద్దులు లేని వైజ్ఞానిక ప్రగతి ప్రభావాన్ని మనిషిలోని అంతర్ముఖ చిత్రాన్ని పరిచయం చేసే విధంగా నవలను తీర్చిదిద్దిన తీరు,ఈ మొత్తం నవలలో పుస్తకం ద్వారా మనిషిలో మారే ప్రపంచాన్ని పాఠకులకు దర్శింపజేయడం వంటి అంతర్లీన అంశాలు ఈ నవల గంభీరతను,రచయితకున్న సమన్వయ శైలిని స్పష్టం చేస్తాయి.
ఈ కథలో ముఖ్య పాత్రలు సుభద్ర,ముక్త.వీరి జీవితంలో పెనవేసుకున్న వారి ద్వారా 'ప్రత్యేక తెలంగాణ' ఉద్యమం ఊపందుకున్న కాలంలో ఈ కథ ప్రస్తుతంగా ఉంటుంది.
తెలంగాణ పోరాట స్ఫూర్తికి భారత చరిత్రలో ఓ ప్రముఖ స్థానముంది.ముస్లిం సుల్తానుల పాలన,తరువాత నిజాం నవాబు పాలనలో తెలంగాణ ప్రజలు తమ ఉనికిని,బాషా-సంస్కృతులను,జీవించే హక్కును,భావ ప్రకటనా స్వేచ్ఛను అన్నింటిని కోల్పోయారు.మరాఠీలు,కన్నడిగులు,కొందరు మదరాసీయులు,తెలుగు వాళ్ళతో కలిసిన ఈ ప్రాంతంలో వివిధ నేపథ్యాలు గల వీరి మాతృ బాషలకు గుర్తింపు లేదు,బలవంతంగా ఉర్దూనే రుద్దబడింది.ఉర్దూ బాషను గౌరవించి అక్కడి వారు నేర్చుకున్నా,అదే గౌరవం అందరి మాతృబాషలకు ఇవ్వలేదు.ఇక వెట్టి చాకిరి గురించి వేరే చెప్పనవసరం లేదు.నిజాం అధికారులే కాదు దేశ్ ముఖ్ లు,పటేల్ లు,పనుల మీద వచ్చే అధికారులు అందరికి ఉచితంగా సేవలు అందించాల్సిందే అక్కడి జనులు.ఇక పన్నుల బెడద కూడా వర్ణనాతీతం.అధికారుల ఇంట్లో చావులకు,పుట్టుకలకు,సంబరాలకు కూడా శిస్తు సామాన్య జనులు కట్టాల్సిందే.ఇక రైతుల పంటల ఫలాలు కూడా పాలకులకే.సహించి,భరించి ఇక మనవల్లకాదనుకున్న ప్రజలంతా ఈద్యమ స్ఫూర్తి ఉన్న నాయకులతో కలిసి ఎదురుతిరిగి 'రైతాంగ సాయుధ పోరాటం'తో తమ నేల కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టగలమని నిరూపించి ప్రపంచం తమ వైపుకు చూసేలా చేశారు.ఎలాగో మొత్తానికి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సైనిక చర్య వల్ల నిజాం పాలన తొలగిపోయినా ఇంకొన్ని దశాబ్దాలు తోటి రాష్ట్రపు కుతంత్రాలతో తమదైన అస్తిత్వాన్ని కోల్పోవలసి వచ్చింది.
తెలంగాణ జనులకు విద్య-సంస్కారం తగిన స్థాయిలో లేవని ఆంధ్రదేశం నుండి ఉద్యోగులను తీసుకురావడం,ఆ ఉద్యోగులు తెలంగాణ జనులను అవహేళన చేయడం మొదటే తెలంగాణవాసులను విశాలాంధ్ర ప్రతిపాదన పట్ల విముఖత ఏర్పడేలా చేసింది.నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సమయంలో ఆంధ్ర ప్రాంతంలోని విజయవాడ,కర్నూలు ప్రాంతానికి తల దాచుకోవడానికి వెళ్ళిన వారిని నిరాదరించడం కూడా వారి మనసులో స్థిరపడిపోయింది.'ఆంధ్ర-తెలంగాణ' అని పేరు పెట్టాలని నిర్ణయించి 'ఆంధ్రప్రదేశ్'గా స్థిరపరిచి తెలంగాణ ఉనికిని నామస్థాయిలో కూడా లేకుండా చేశారు పాలకులు.ధనిక ప్రాంతమైన తెలంగాణ వనరులను,నిధులను,ఉద్యోగాలను,భూమిని తెలంగాణకే వినియోగిస్తామని చేసుకున్న 'పెద్ద మనుషుల ఒప్పందం' ఒప్పందంలానే మిగిలిపోయింది.తెరాస ఏర్పడినప్పటి నుండి ఈ ఉద్యమం ఉదృతమైంది.ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు ఎక్కువయ్యావు.2009లో ప్రత్యేక తెలంగాణ ఇస్తానని హోంశాఖామంత్రి ప్రకటించినా మరలా అది రాజకీయ లాబీయింగ్ వల్ల 2014వరకు వాయిదా పడుతూనే వచ్చింది.
ఈ నవలలో సుభద్ర ఓ మామూలు స్త్రీ.పెద్దగా చదువుకోలేదు.రాజేశం అనే వ్యక్తిని ప్రేమించింది.ఇద్దరూ పెళ్ళి అనే సంబంధం లేకుండా రెండేళ్ళు కలిసి ఉన్నారు.డబ్బు సంపాదించడానికి సౌదీ వెళ్ళిన అతను రెండేళ్ళ తరువాత వర్క్ పర్మిట్ అయిపోవడంతో దొంగతనంగా మస్కట్ నుండి ట్యాంకర్ లో పారిపోతుండగా దాన్ని ట్రయల్ రన్ చేయడంతో అక్కడికక్కడే మరణిస్తాడు.అలా అనాధ అయిన సుభద్ర పసిబిడ్డగా దొరికిన ఓ బాబును స్వంతకొడుకులా పెంచుకుంటుంది.అతనే మొగిలి.సుభద్ర బిడీలు కడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది.మొగిలి సుభద్రకు ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరు గురించి చెప్తూ ఉంటాడు.సుభద్రను మంచి పుస్తకాలు చదివేలా చేస్తాడు.మొగిలి ఎంతగానో సుభద్రను ప్రభావితం చేస్తాడు. బిటెక్ మూడవ సంవత్సరంలో మొగిలి ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తాడు.ఈ సంఘటనతో సుభద్ర పూర్తిగా మారిపోతుంది.
శూన్యమైన సుభద్ర జీవితం మొగిలి మరణంతో మొగిలి ఆశయం కోసం పోరాడాలన్న నిర్ణయంతో మలుపు తిరుగుతుంది.మొగిలి రాసుకున్న డైరీల ద్వారా,పుస్తకాల ద్వారా తెలంగాణ చరిత్రను తెలుసుకున్న సుభద్ర క్రమక్రమంగా ఓ గొప్ప కార్యకర్తగా మారుతుంది.ఆమెకు ఈ పయనంలో చెన్నకేశవులు దంపతులు ఎంతగానో సహకరిస్తారు.ప్రత్యేక తెలంగాణ రావడం,సుభద్ర ఏ పదవులు ఆశించకుండా దీక్షతో కార్యకర్తగా తన విధులు నిర్వహించుకోవడంతో సుభద్ర కథ ముగుస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ లోతట్టు ప్రాంతమైన వాంఖేడ్ లో జన్మించిన ముక్త బాల్యంలోనే తమ ప్రాంత ప్రజలను ఎలా పాలకులు దోపిడి చేస్తున్నారో గమనిస్తూనే పెరుగుతుంది.నక్సలైట్లకు ఆశ్రయమిచ్చిన నెపం పై ఆమె తల్లిదండ్రులను,అవ్వను హత్య చేస్తారు.ఆమెను కామ్రేడ్ నాయకుడైన రాములు నాయక్ వసతి గృహంలో చేర్పించి,విద్య ఏర్పాట్లు చేస్తాడు.ఆమెకు ముక్త అన్న పేరు పెట్టింది కూడా అతనే.చదువునే ఆయుధం చేసుకున్న ముక్త గొప్ప పరిశోధన శాస్త్రవేత్తగా ఎదిగి కొలంబియాలో మనిషి యవ్వనాన్నీ తిరిగి తెచ్చి,మరణం లేకుండా చేసే ప్రయత్నంలో భాగమవుతుంది.అమరత్వం ద్వారా మనిషిలో అరాచకత్వం-హింస కూడా ఎక్కువవుతావా?ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఎంతమేరకు న్యాయం అనే ఆలోచనలతో సతమతమైన ఆమె చివరకు ఆమె ఆలోచనలకు దగ్గరగా ఉన్న కృష్ణచైతన్యకు దగ్గరవ్వడంతో ఆమె కథ సుఖాంతమవుతుంది.
సుభద్రకు అండగా ఉన్న చెన్నకేశవులు పాత్ర కూడా ఈ నవలలో ప్రధానమైనదే.సమాజంలో జరుగుతున్న అవినీతి వార్తలను మార్కర్ తో హైలైట్ చేయడం,సమాజ మార్పులను గమనించడం నిత్యకృత్యం చేసుకుని వేదన చెందిన చెన్నకేశవులకి చివరకు డిమెన్షియా రావడం,తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం,అతన్ని చూసుకునే బాధ్యత సుభద్ర తీసుకోవడంతో చెన్నకేశవుల పాత్ర ముగుస్తుంది.
ఈ నవలలో ఉద్యమం ఓ పక్క కథగా నడుస్తూ ఉన్నా దాని కోసం సామాన్యజనులు,విద్యార్ధులు పడిన తపన,రచయిత వాస్తవిక సంఘటనలను జోడించడం,నవలలో పాత్రలు ఊహాత్మకమైన వాటిని పాఠకులు యదార్ధంగా దర్శించే తీరుగా నవలను నిర్మించడం వల్ల ఈ నవల పఠనీయతను సంతరించుకుంది.
మనిషి పుట్టినప్పుడు విద్య లేదా సామాజిక ప్రభావం వల్ల లక్ష్యాలు నిర్ణయించుకున్నా,ఉనికి ప్రశ్నార్ధకమైనప్పుడు ఆ మనిషి ఎన్నో కోణాలలో ఆలోచించి తన పరిచయాన్ని తానే మార్చుకునే ప్రయత్నం చేస్తాడు.పరిస్థితులు మనిషిని మనిషికి,సమాజానికి కొత్తగా పరిచయం చేసి,అస్తిత్వ ఉద్యమంలో అంతర్లీన భాగం చేస్తాయి అని ఈ నవల స్పష్టం చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!