డబ్బున్నవారి కథ

 చదువరి

డబ్బున్నవారి కథ
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మనిషికి డబ్బు వల్ల వచ్చే అనధికార హక్కులు,ప్రత్యేకతల ప్రభావాన్ని గురించి స్పష్టం చేసే నవల కొడవటిగంటి కుటుంబరావుగారి ‘లేచిపోయిన మనిషి’నవల. ఈ నవలలో ప్రధాన పాత్ర యశోద.ఆమెకు తల్లి లేదు.తండ్రి చలమయ్య. ఆమె మేనమామ కాంతం. యశోదకు బాల్యంలో నారాయణ శాస్త్రితో పెళ్ళి అవుతుంది.అప్పటికి ఆమెకు పదేళ్ళు,భర్తకు పద్నాలుగేళ్లు.ప్రస్తుతానికి వస్తే పాతికేళ్లు వచ్చిన ఆమెకు అనుకోకుండా ఓ బంధువు వరసయ్యే ముసలమ్మ చనిపోవడంతో ముప్పై వేలు వస్తుంది.
దానితో ఆమె హోదా సమాజంలో పెరుగుతుంది,యశోద కోరుకోకపోయినా. కాంతం మొదట ధనవంతుడు.అంతా విలాసాలకు ఖర్చు పెట్టి ప్రస్తుతం బికారిగా మారాడు. ధనవంతురాలైన మేనకోడలి ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
“ఇతరులను హీనంగా చూడటానికి, ఇతరులు చేయడానికి భయపడే పనులు ధైర్యంగా చేయడానికి నీకిప్పుడు కొంత అధికారం వచ్చిందన్న మాట.డబ్బు విలువ దాని దుర్వినియోగంలోనే ఉంది.నన్ను చట్టాలు తయారు చేయమంటే ఆదాయాల వారీగా నీతి,న్యాయమూ ఏర్పాటు చేస్తాను.”అంటాడు కాంతం యశోదతో. దీనిని బట్టి డబ్బు మనిషికి ఇచ్చే అనధికార అధికారాలను స్పష్టం చేశారు రచయిత.
మొదట యశోదను మంచి చేసుకుని వివాహం చేసుకుందాం అని అనుకుని ఆమెతో చనువుగా ఉండబోయే ప్రయత్నం చేస్తే ఆమె గొడవ చేయడంతో అతను ఊరి వదిలి ముంబై పారిపోతాడు.అక్కడ అతనికి రమణమూర్తి పరిచయమవుతాడు. అతన్ని యశోద భర్తగా నాటకం ఆడించి అతని ద్వారా ఆ డబ్బును తాను దక్కించుకోవాలనే పథకం వేసి ఉద్యోగం లేదన్న అతన్ని ఒప్పించి ఊరికి తీసుకువెళ్తాడు.
నారాయణశాస్త్రి వచ్చాడన్న వార్త గుప్పుమంటుంది.రమణమూర్తి తన గురించి ఏమి చెప్పకపోయినా,అతను అలా గంభీరంగా ఉండటం వల్లే అతనే నారాయణ శాస్త్రి అని అక్కడి వారు ఆమోదిస్తారు. చలమయ్య అతను తన అల్లుడో కాడో తేల్చుకునే వరకు అతన్ని తన ఇంట్లోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అక్కడ ఉన్న రమణమూర్తి ఆ ఊరిలోని ఓ హోటల్ లో సర్వర్ గా జేరతాడు. అక్కడ ఓ నెల పని చేసిన తర్వాత అక్కడ యజమాని నుండి ఓ ఆడ పిల్లను కాపాడే ప్రయత్నంలో అతన్ని కొట్టడం జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుంది. చలమయ్య జరిమానా కట్టి అతడిని విడిపిస్తాడు.
అదే సమయంలో యశోదకు వచ్చిన ఆస్తి మీద కొందరు కేసు వేస్తారు. ఈ విషయంలో కాంతం సాయం తీసుకుంటూ ఉంటాడు చలమయ్య. అదే సమయంలో కాంతం చలమయ్య ఈ కోర్టు విషమయై తన మీద ఆధారపడ్డాడు కనుక ఇక తనకు విలువనివ్వని రమణమూర్తి ఆట కట్టించాలనుకుంటాడు. ఆ ప్రయత్నం చేసినప్పు రమణమూర్తి ముందు లేచిపోయిన నారాయణ శాస్త్రి అని తెలుస్తుంది.
ఈ కథ సాధారణమైనదే అయినా సరే కుటుంబరావు గారు దీని ద్వారా చెప్పదలచుకున్న సందేశం గొప్పది.డబ్బు మనుషులకు ఇచ్చే అనధికార గౌరవాన్ని,ఇతరులను తన డబ్బును సాయం లేదా అప్పు పేరుతో ఆకట్టుకుంటూ వారికన్నా గొప్ప వారీగా చలామణి అయ్యే భావనను కుటుంబరావు గారు స్పష్టం చేశారు.ఈ భావాలను వ్యతిరేకిస్తూ డబ్బు వల్ల మనిషి తన గొప్పతనాన్ని నిరూపించుకునే శైలిని వ్యతిరేకించే పాత్రగా నారాయణ శాస్త్రిని చిత్రీకరించారు.
“మీ నాన్నకు ఎదుటి వాళ్ళు తనను దేవుడిగా భావిస్తే తప్ప సంతోషం ఉండదు.నన్ను ఎవరూ మనిషిలా చూసినా నాకు ఆనందం కలుగుతుంది”,అంటాడు యశోదతో నారాయణ శాస్త్రి. ఈ దేవుడనే అధిక భావన ఆ డబ్బు నుండే ఉత్పన్నమైంది అని వేరే చెప్పనక్కర్లేదు.
ఇది చిన్న నవల. యువ మాస పత్రికలో ప్రచురించబడింది. కుటుంబరావు గారి రచనల్లో కథ కన్నా,పాత్రల అభిప్రాయాలే పాఠకులను ఆకట్టుకుంటాయి అని స్పష్టం చేసే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!