చరిత్ర మరువకూడని వీరుడు!

                                                         చరిత్ర మరువకూడని వీరుడు!

                                                                         -శృంగవరపు రచన


                                                     

     చరిత్రలో ప్రజలకు తెలియని వీరులు ఎందరో ఉన్నారు. ఆ తెలియని వీరులను గురించి తరువాతి కాలంలో తెలుసుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆ వీరులు ప్రజలతో కాకుండా వారు నాయకులతో పని చేయడం వల్ల కావచ్చు. కానీ ప్రజలకు తెలిసిన వీరులను కూడా చరిత్రలో మిగలకుండా చేయడానికి జరిగే కుట్రలు కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఈ కోణంలో చారిత్రకంగా అన్యాయమైన వ్యక్తి ఒడ్డే ఓబన్న. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విప్లవంలో ఓబన్నది సహాయక పాత్ర కాదు, ప్రత్యక్ష వ్యూహ మరియు ఆచరణాత్మక పాత్ర.అయినా ఆయనకు సరైన గుర్తింపు నేటికి దక్కలేదనే చెప్పవచ్చు. ఒడ్డే ఓబన్న గారి పాత్రను కొంతైనా ప్రజలకు తెలియజెప్పడానికి ఆయన ఆరవ వంశస్థులు అయిన ఒడ్డే బాల నరసింహుడు గారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి విప్లవం-ఒడ్డే ఓబన్న పాత్రఅనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తక రచయిత మరియు సంపదకులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు. ఆయనే రేనాటి సూర్యచంద్రులు పుస్తకాన్ని రచించారు. అప్రాంతీయకరణ సాహిత్య వర్గంలోకి ఈ రచనలు వస్తాయి. రాయలసీమ ప్రాంతానికి చెందని వారైన తంగిరాల వెంకట సుబ్బారావు గారు పరిశోధనా దృష్టితో ఈ రచనలు చేశారు కనుక ఈ రచనను ప్రామాణిక రచనగా భావించవచ్చు.

          ఆంగ్లేయుల ఉత్తరాల మూలంతో మరియు తన స్వీయ పరిశోధనతో  ఈ పాత్రను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి గారితో పాటు సమ ప్రాధాన్యత ఓబన్న గారికి కూడా దక్కాల్సిన కోణాన్ని గురించి చూద్దాము. నరసింహారెడ్డిగారికి వ్యక్తిగా వచ్చిన గుర్తింపు కన్నా కూడా తన పూర్వీకుల నుండి వచ్చిన పాలెగాళ్ళుగా ఉండటం వల్ల వచ్చిన అధికారం వల్ల ప్రజల్లో వచ్చిన గుర్తింపు ఎక్కువ అని ఒప్పుకోవాల్సిందే. అలాగే అగ్రకులం అవ్వడం వల్ల, నాటి కాలంలో ప్రజలను కులం ఆధారంగా మనుషులను గొప్పవారిగా భావించే సంస్కృతిలో ఆయన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత దక్కడం వల్ల కూడా అని ఒప్పుకోవాల్సిందే.అధిక కులం వారి పట్ల వెనుకబడ్డ కులాల వారిలో ఉన్న భయం, ఆ భయం ఆధారంగా సమాజంలో అగ్రకులాల వారికి దక్కిన అధికారం మరియు పదవులను గమనించిన ఆంగ్లేయులు నరసింహారెడ్డి గారిని వీరోచితంగా హత్య చేస్తే ప్రజల్లో భయం నిలిచే ఉంటుందని ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, ఓబన్న మరియు వెంకన్న లాంటి ముఖ్యుల మరణం అజ్ఞాతంగా ఉంచి ఉండవచ్చు.

            నరసింహారెడ్డిగారిది 9,000 సైన్యం అని ఆంగ్లేయుల వ్రాతల వల్ల స్పష్టం అవుతుంది. వారికి సైన్యాధ్యక్షుడు ఒడ్డే ఓబన్న. ఆ సైన్యంలో వెనుకబడిన వర్గాల వారు- నేడు బహుజనులుగా చెప్పబడుతున్నవారు –గిరిజనులు ఉన్నారు. కట్టుబడి బంట్రోతులు(విలేజ్ పోలీస్ మెన్), చెంచు వాళ్ళు, వడ్డే వాళ్ళు, బోయ వాళ్ళు, యానాదులు మొదలైన వాళ్ళు కూడా ఉన్నారు. చివరకు కొందరకు బ్రాహ్మణులు కూడా ఈ సైన్యంలో ఉన్నారని బండి గోపాలకృష్ణారెడ్డి గారి ద్వారా స్పష్టం అవుతుంది. వీరిని ఒక్క త్రాటి మీద నడిపించినవాడు ఒడ్డే ఓబన్నగారు. అంటే సైన్యం ఉండటానికి అవకాశం లేకుండా ఆంగ్లేయులు కట్టుదిట్టం చేశాక పాలేగాళ్ళకు అధికారం లేని సమయంలో సాధారణంగానే ప్రజల సమస్యలు తీర్చడానికి అధికారం కోల్పోయిన సమయంలో నరసింహారెడ్డి గారు కూడా వ్యక్తి స్థాయిలోనే ఉన్నారు. అధికారంతో వచ్చే సైన్యానికి నాయకత్వం వహించడం క్లిష్టం కాకపోవచ్చు. కానీ అధికారం, సైన్యం లేని సందర్భంలో వేలల్లో సైన్యంను సమీకరించడం సులభమైన విషయం కాదు. ఈ కోణంలో ఆలోచిస్తే నిమ్న కులాల వారు అధికంగా ఉన్న ఈ సైన్యాన్ని తప్పకుండా ఓబన్న గారే సమీకరించారు అన్నది కూడా ఒప్పుకోవాల్సిన సత్యమే. నరసింహారెడ్డి గారికి అధికారంతో పాటు కుటుంబ సహకారం కూడా లేని సమయంలో ఆయనకు తోడుగా నిలిచిన వారు ఓబన్న. కానీ ఆయనకు ఆ ప్రాధాన్యత చరిత్రలో దక్కలేదు.

     ఈ పుస్తకంలో ఓ విచారఘటన ఉంది. ఈ పుస్తకం మొదట్లో ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా నాయకత్వం వహించిన సైన్యం గురించి ఆధారాలతో సహా పేర్కొన్న సుబ్బారావు గారు తన సంపాదక వాఖ్యలో ఈ సైన్యానికి సైన్యాధ్యక్షుడు మాత్రమే ఓబన్న అని, ఆయన కేవలం ఓ సామాన్యుడు అని, నరసింహారెడ్డి గారు ఒక్కరే నాయకులని, ఆయనకు మాత్రమే శిక్ష పడిందని, ఓబన్న-వెంకన్న కేవలం సేవకులు మాత్రమే అని రాయడం కొంత శోచనీయం. కులం మాత్రమే సమాజంలో ప్రాధాన్యత ఉన్న నాటి కాలంలో అలా భావిస్తే కొంత సమంజసంగా ఉండవచ్చు కానీ నేడు కులరహిత సమాజం కోసం అడుగులు పడుతున్న తరుణంలో కూడా మనుషులకు సమాన ప్రాధాన్యతను ఇవ్వడానికి సంకోచించడం, మరలా ఇదే పుస్తకంలో రేనాటి వీరుడు నవలలో ఓబన్న గారికి ప్రాధాన్యత ఇచ్చిన వైనాన్ని ప్రస్తావించి కూడా ఈ వాఖ్య చేయడం కొంత బాధను కలిగించక మానదు.రేనాటి వీరుడు లో జయరామారావు గారు ఓబన్న, వెంకన్న గార్లు నరసింహారెడ్డి గారి ప్రాణం కాపాడే ప్రయత్నంలో మరణించారని రాశారు. నేటి చారిత్రక ఆధారాలను సాహిత్యం ఆధారంగా నిర్ణయిస్తే ఈ రచనలో ఉన్న ఈ అంశాన్ని అంగీకరించకుండా వారి మరణాలు కూడా తెలియకుండానే ఉండిపోయాయి అనడం కూడా వీరుడి మరణం గురించి తెలియడం ప్రజల్లో వారికి ప్రాధాన్యత దక్కే అవకాశం లేకుండా చేయడానికి కావచ్చు.

      ఓబన్న గారి ఆరవ వంశీయులు అయిన శ్రీ వడ్డే బాలనరసింహుడు గారు నంద్యాలలో “వడ్డే ఓబన్న సేవా సమితి” ని స్థాపించి, ఈ కులం వారిని చైతన్యవంతులను చేస్తున్నారు. ఓబన్న గారి కుటుంబం గురించి అదే కుటుంబీకులు అయిన నరసింహుడు గారు తెలియజేసిన వివరాల ప్రకారం, “వడ్డే ఓబన్నగారు నొస్స౦ గ్రామంలో వడ్డే సుబ్బన్న-సుబ్బమ్మ దంపతులకు 1807లో జనవరి 11 వ తేదీన జన్మించారు. వడ్డే సుబ్బన్న గారు నొస్స౦ గ్రామ కట్టుబడిగా(గ్రామ పోలీసుగా) నొస్స౦ పాళెగాడు చెంచుమల్ల జయరామిరెడ్డి గారికి (ఉయ్యలవాడ నరసింహారెడ్డి  గారి మాతామహునకు)  అత్యంత నమ్మస్తుడిగా ఉండేవాడు. అప్పట్లో నొస్స౦ గ్రామంలో 63 వడ్డెర గడపలు ఉండేవి. వీరు ప్రధానంగా రాతి పని, మట్టి పని, చెరువులు-బావులు-కాలువలు త్రవ్వడం, భవనాలు నిర్మించడం మొదలైన పనులలో నిమగ్నులై ఉండేవారు- కొందరు వ్యవసాయం చేసేవారు. వీరందరికి వడ్డే ఓబన్న కులపెద్దగా వ్యవహరించేవారు. ఈ పుస్తకంలో వడ్డెర కులస్తుల చరిత్ర కూడా లిఖించబడింది. వారి వృత్తి, కుటుంబ సంబంధాలు, వారి జీవనంలో వస్తున్న మార్పులు గురించి కూడా క్షుణ్ణంగా రాశారు.

         ఓబన్న గారి గురించి చరిత్ర మౌఖికంగా ఉన్న మాట నిజమే. అలాగే లిఖిత సాహిత్యంలో కూడా రేనాటి వీరుడులో ఉన్నది. అలాగే తెలుగు పాఠ్యాంశంలో మన మహనీయులులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి ఉన్న కథనంలో కూడా ఓబన్న గారిని కుడి భుజంగా పేర్కొనడం జరిగింది. ప్రపంచ చరిత్రలో విప్లవాలకు ముఖ్యం ప్రజలు. పాలనకు రాజుల పాత్ర ముఖ్యం కావచ్చు కానీ విప్లవానికి ప్రజలే ముఖ్యం. అందుకనే  ఆ ప్రజలను సమీకరించడమే కాకుండా, తన ప్రాణాలు పోయెవరకు గెలిచే అవకాశం తక్కువ ఉన్న ఉద్యమం కోసం ప్రాణాలు విడిచిన ఓబన్న గారి గురించి ఏ పాత్ర లేనట్టు, ఆయన ప్రజల్లో ఒకడు సామాన్యుడు అన్నట్టు అని రాయడం నేడు శోచనీయం. దానికి కారణం నరసింహారెడ్డి గారి పోరాటం తన భరణం విషయంలో జరిగిన అవమానం వల్ల మొదలైంది దానికి అంతకు ముందు ఉన్న అసహనం కొంత కారణం కావచ్చు. కానీ ఓబన్న గారి పాత్ర అది కాదు. నరసింహారెడ్డి పై నమ్మకం మాత్రమే కాదు, దేశం కోసం ఏదో చేయాలన్న కాంక్ష ఉండటం వల్లే సైన్యాన్ని ఆయన సమీకరించి ఉంటారు. నరసింహారెడ్డి గారి కుటుంబమే ఆయనకు వెన్నుపోటు పొడిచినా నిలబడిన ఓబన్న గారి లాంటి వారిని కొంత సాహిత్యకారులు ప్రాంతీయ అభిమానం వల్లో లేక తమ సొంత దృక్కోణాల వల్లో నిర్లక్ష్య పరిచినట్టు అనిపిస్తుంది. ఓబన్న నరసింహారెడ్డి గారి విప్లవంలో భాగమే, అది కాదనలేని సత్యమే కానీ ఈ విప్లవం నరసింహారెడ్డి గారి అధికారాలన్నీ పోయినప్పుడు జరిగింది కనుక దీనిలో ఖచ్చితంగా  ఓబన్న గారి పాత్ర ప్రధానమైనది అన్నది కూడా సత్యమే.

          తాజ్ మహల్ కట్టింది షాజహాన్ ,ఆయనకు పేరు రావడం అన్నది ఆయన డబ్బుతో ఆ కూలీల శ్రమను కొన్నందువల్ల కావచ్చు కానీ ఓబన్న లాంటి వారి దేశభక్తి కొన్నది కాదు. అసలు ఈ పోలిక ఇక్కడ సరైంది కాదు. శ్రమ దోపిడి వేరు. ఇక్కడ అది కాదు జరిగింది. దీనిని  గురించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంగ్లేయులు నరసింహారెడ్డి గారిని దోపిడి దొంగగా చిత్రీకరించడం ఎలా బాధను కలిగిస్తుందో ఓబన్న గారి లాంటి వారిని ఇటువంటి పోలికల్లో జమ కట్టడం కూడా అంతే శోచనీయం.

     కానీ హర్షణీయమైన అంశం ఏమిటంటే నేడు ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రభుత్వం సైతం స్వాంతంత్ర సమరవీరులను గుర్తిస్తుంది. భారతదేశం 75 వ స్వాతంత్ర  వేడుకల సందర్భంగా ఓబన్న గారి ఆరవ తరం వారసులైన బాల నరసింహుల కుటుంబాన్ని నంద్యాలలో కలిసి వేడుకలలో పాల్గొనడానికి ఆహ్వానించడం ప్రభుత్వం ఓబన్న లాంటి వీరులను స్మరించుకోవడమే. అలాగే ఈ వేడుకల్లో భాగంగానే లలితా కళా అకాడమీ-ఢిల్లీ మరియు ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ వారిచే సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది స్వాతంత్ర్య సమర యోధుల యొక్క రూప చిత్రాలను మరియు వారి యొక్క చరిత్రను క్లుప్తంగా వివరిస్తూ స్వాతంత్ర్య స్పూర్తి- తెలుగు దీప్తి అనే ఒక చక్కటి పబ్లికేషన్ ను రూపొందించారు. ఇందులో సమరయోధులు వడ్డే ఓబన్న గారి చిత్రపటం కూడా ఉండటం గర్వించదగిన విషయం.  దీనితో పాటు అనేక చోట తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో కూడా ఓబన్న గారి విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి.తెలంగాణలో మూడు చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి.  తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలోని రామేశ్వర్ పల్లె గ్రామంలోనూ, యూసఫ్ గూడలోనూ,జగిత్యాల జిల్లా రాఘవ పేట మండలలో ,మొత్తం  మూడు చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. బెస్తరపల్లి గ్రామంలో కూడా విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఆంధ్రాలో కర్నూల్ పట్టణంలోని బిసి భవన్ లో, అనంతపూర్ జిల్లా ,కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేశారు.   పిడుగురాళ్ల, గుంటూరు జిల్లాలో కూడా ఈ డిసెంబర్ 5 న ఇంకో విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ దిశలో కొంత కృషి జరగడం అభినందనీయం. పోతిరెడ్డి ప్రాజెక్టును వడ్డే ఓబన్న ప్రాజెక్టుగా పేరు మార్చాలని కూడా కలక్టర్ గారికి వినతి చేయడం జరిగింది. ఇలా స్మృతులు ఏర్పాటు చేయడం వల్ల అమరవీరుల్లో చరిత్ర మరచిపోయినవారికి కనీసం ఇప్పుడైనా గౌరవం దక్కి, కొందరికి స్ఫూర్తిని కలిగిస్తుంది.ఈ దిశలో పోరాడుతున్న ఓబన్న వారసులు అయిన బాల నరసింహుల గారికి అభినందనలు.

   *        *       *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!