నిగ్రహ సాధన

నిగ్రహ సాధన
-శృంగవరపు రచన


మనిషికి తెలిసి జరిగేవి, తెలియకుండా జరిగేవి, జరిగిపోతే తప్ప అర్ధం కానివి అని మూడు రకాలుగా జీవితం విభజించబడి ఉందో లేకపోతే మనిషికి తెలిసినా గుర్తించే చైతన్యం మనిషిలో లోపించడం వల్ల మనిషి మనశ్శాంతిని కోల్పోతున్నాడో తెలియని సంఘర్షణను ఆధ్యాత్మిక సాధన కోణంలో స్పష్టం చేయడానికి ప్రయత్నం చేసిన నవల శ్రీమతి శుభ గారి 'చిరుదివ్వెను వెలిగిద్దాం రండి!' ఈ నవలలో కాస్త సందిగ్దంగా జీవితం ఉన్నప్పటికి కూడా కొంతమేరకు ఆలోచింపజేసే ప్రయత్నం చేసిన నవల అది.
ఈ నవలలో ముఖ్య పాత్రలు సుధీర,ఆమె స్నేహితురాలు మాధవి. సుధీర అన్నయ్య సౌజన్య. సుధీర తల్లిదండ్రులు వరలక్ష్మి,రామారావు.సుధీర కొంచెం దుడుకైన స్వభావం కల అమ్మాయి.ఓ రోజు మాధవితో కలిసి సినిమాకు వెళ్తుంది సుధీర. అక్కడ హాల్లో పోకిరి కుర్రాళ్ళూ నలుగురు వారిని అల్లరి చేసినప్పుడు సుధీర వారిలో ఒకతన్ని సూదితో గుచ్చుతుంది. ఆ తర్వాత హాలు బయట వారు అల్లరి చేసే ప్రయత్నం చేస్తే వారిని ఎదిరించి ధైర్యంగా ఇంటికి వెళ్తుంది సుధీర. సుధీరకు పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఆమె కుటుంబం ఉంటుంది. కానీ కట్నం లేకుండా తన్నౌ గౌరవించే వ్యక్తినే వివాహం చేసుకుంటానని పట్టు పడుతుంది ఆమె.
సుధీర తాతయ్య వరదరాజు. ఆయనకు ఉన్న సాధన వల్ల భవిష్యత్తులో జరగబోయేవి ఊహించగల శక్తి కొంతమేరకు ఆయనకు ఉంది.అది సాధన వల్ల కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, లేకపోతే ఆలోచనల ఏకాగ్రత వల్ల కావచ్చు లేకపోతే మనకు తెలియని,ఇంకానిరూపించబడని శక్తి ఏదో సాధన వల్ల ఆయనకు వచ్చి ఉండవచ్చు. ఆయనకు నలుగురు కొడుకులు. ఒక్కో కొడుకు దగ్గర నాలుగు నెలలు గడుపుతారు.
ఆయన విజయకు, సుధీరకు అపాయం జరగబోతుందని ముందే చూచాయగా చెప్తాడు. ఇల్లు వదిలి మళ్ళీ వస్తానని వెళ్లిపోతాడు. మాధవి,సౌజన్య ప్రేమించుకుంటారు.ఓ రోజు సాయంత్రం వారిద్దరూ బయటకు వెళ్తారు. ఏకాంత ప్రదేశంలో వారు ఉన్న సమయంలో సినిమా హాల్లో ఏడిపించిన పోకిరిలు ఆమెను రేప్ చేస్తారు. అప్పటికే వరదరాజులు చెప్పినాదానిని బట్టి ఆమె తనకు చావు వస్తుందని భయపడుతున్న సమయంలో ఇది జరగడం,ప్రేమించిన వాడి ఎదుట ఇది జరగడం వల్ల ఆమె మరింత క్రుంగిపోతుంది.హాస్పటల్ లో మరణిస్తుంది. కానీ చనిపోయెవరకు తనకు చనిపోవాలని లేదని చెప్తూనే ఉంటుంది.
ఆ తర్వాత మాధవిని కాపాడుకోలేకపోవడం వల్ల సుధీరను కాపాడుకోవాలని అనుకున్న సౌజన్య చెల్లిలో గదిలోనే ఉంటాడు.ఆ రాత్రి అతన్ని చూడగానే సుధీరకు మాధవి అతన్ని ప్రేమించడం, చనిపోయే ముందు నాకు చనిపోవాలని లేదని చెప్పడం అంతా తన అన్నాను ఉద్దేశించే అని ఆమెకు అర్ధమయ్యే కొద్ది అన్న మీద జాలి,అన్న పట్ల బాధ కలుగుతుంది. అతన్ని ఓదార్చాలనే ప్రయత్నం కాస్త వారిద్దరి మధ్య శారీరక కలయిక జరిగేలా చేస్తుంది. అది చూసిన తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఉదయం చూసేసరికి సౌజన్య ఉండడు. సుధీర గొంతు నులిమి చంపబడి ఉంటుంది. మొదట ఈ హత్య చేసింది సౌజన్య అని అందరూ భావించినా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అది ఆత్మహత్య అని సుధీర తనను తానే గొంతు నూలుముకుని మరణించిందని చెప్తాడు. ఎంత ఆలోచించినా వారు ఎందుకు ఆ పని చేశారో ఎవరికి అంతు పట్టదు.
వరదరాజులు ఇంటికి తిరిగి వస్తాడు. ఆయన చెప్పినట్టే జరగడంతో ఆయన్నే ఏం జరిగిందో చెప్పమంటారు. మాధవి చనిపోయినా ఆమె కోరిక తీర్చుకోలేకపోవడం వల్ల ఆమె ప్రేతాత్మ సుధీరను ఆవహించి తన కోరిక తీర్చుకుంది అని,అది జరుగుతున్నది మెదడుకు సుధీరకు తెలుస్తూనే ఉన్నా జరిగిపోయాక ఆమె జరిగింది తెలుసుకుని మాధవిని తన నుండి వదిలించుకునే ప్రయత్నంలో ఆత్మహత్య చేసుకుందని చెప్తాడు. సౌజన్య సన్యాసం స్వీకరించి ఆశ్రమంలో చేరాడని వారిని కూడా చేరమని సలహా ఇస్తాడు.
ఈ కథలో హేతువు ఉందో లేదో చెప్పడం కష్టం కానీ ప్రశాంత జీవనానికి ఓ రకమైన సాధన అవసరం అని, దానికి ఆశ్రమ జీవనం ఒక మార్గం అని, ప్రస్తుతం సమాజంలో ఉన్న అశాంతి నుండి మనిషి శాంతిని ఈ మార్గంలో పొందవచ్చని చెప్పే ప్రయత్నంగా ఈ నవలను ముగించారో లేక ఒక సామాజిక సమస్యకు ఇది పరిష్కారం అని చెప్పదలచుకున్నారో అర్ధం కాలేదు కానీ మనిషి ఆలోచనల్లో మనిషి చేసే పనులకు తప్పు ఒప్పులు ఆపాదించబడినప్పుడు మనిషి వాటిని సమర్ధించుకోవడానికి కొన్ని సార్లు ఎన్ని రకాలుగా అయినా నిజాన్ని ఒప్పుకోకుండా కూడా ప్రయత్నించవచ్చు అని అయితే అనిపించింది.మనం చేసే పనులు అన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేయలేము కానీ కొన్ని మాత్రం మూడో మనిషిగా మనకు నచ్చని వాటిని కూడా వ్యక్తిగతంగా చేస్తాము. అందుకు కారణ మూలాలు మనిషిలో ఉండే అపరాధ భావం,అభద్రత,భయం ఇలా ఎన్నో మనోభావాల నుండి జన్మించవచ్చు. ఏమైనా ఈ భావాల నుండి మనకు నచ్చని పనులు చేయకూడని మనోనిగ్రహానికి అయితే సాధన అవసరమే.

* * * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!