కళానుభూతి

 కళానుభూతి

-శృంగవరపు రచన


నేను చదివిన తెలుగు నవలల్లో రసానుభూతిని పొందిన నవల ‘మనోధర్మపరాగం.’ ఈ నవలలో పాత్రలు,కథ ఏవి కూడా ఓ క్రమంలో సాగినవి కావు. అయినప్పటికి అసలు కళకు అర్ధం ఏమిటో స్పష్టం చేసే నవల ఇది . కళ ఎన్ని రకాలుగా కళాకారులను తయారు చేసినా చివరకు కొందరే ఆ కళగా మారిపోగలరు. అటువంటి ఓ కళాకారిణి జీవితమే ఈ నవల అయినా, కథ ఎన్నో పాత్రలు ఆ ముఖ్య పాత్ర జీవితంలో ఏదో ఒక రకంగా దగ్గరగా లేదా దూరంగా ఉన్న పాత్రలుగా మారి ఆ ముఖ్య పాత్ర కథను చెప్తాయి. నిజానికి మనిషి జీవితంలో కళ ఓ భాగమా? లేక కళే జీవితమా?లేక వ్యాపారమా?లేక కళ ఓ ఎస్కేపిజమా? కళలో లీనమవ్వడం జీవితాన్ని మర్చిపోవడమా?లేక కళ తప్ప వేరే జీవితం ఉందన్న సత్యాన్ని వ్యక్తిగతంగా అసత్యం చేసుకోగలగడమా? అసలు కళకు గుర్తింపు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆ గుర్తింపు బహిరంగ స్వేచ్చను, అంతర్ముఖ నిర్బంధాన్ని ఒకే సారి జీవితంలోకి చొచ్చుకుపోయేలా చేస్తే ఆ కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వారు కళను ఏ కోణంలో చూడాలో ఆ జీవితాలు ఎలా నేర్పిస్తాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు-వాటికి ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో పాత్రల జీవితాల నుండి దొరికే సమాధానాలు, ఎన్నో ఎన్నెన్నో వ్యథలు స్పష్టం చేసే నవలే ఇది.
దేవదాసీ వ్యవస్థ గురించి తెలియడం వేరు,దేవదాసీ మనసును గురించి తెలియడం వేరు. రచయిత ఈ రెండు అంశాలను పూర్తిగా మనసుతో శోధించి, ఆ పాత్రల మనసుల్లో ఉన్న నవరసాలకు తనదైన భావతార్కిక సంపత్తిని జతపరిచి గొప్ప నవలగా దీనిని మలిచారు. ఈ కథలో ఎందరో దేవదాసీల జీవితాలు ఉన్నాయి. కానీ అన్ని పాత్రలు తమ జీవితాన్ని కుదించి నాగలక్ష్మి జీవిత ప్రస్తానంలో తాము ఉన్న బిందువు దగ్గరకు వచ్చి కలిసిపోతాయి. ఇది నాగలక్ష్మి జీవిత కథ అని ఓ కోణంలో చెప్పవచ్చు,అదే రకంగా ఆమెతో పయనించిన పాత్రల జీవితాలు కూడా ఉన్నాయి కనుక వారి జీవితాల్లోకి కొంతమేరకు పాఠకులు తొంగి చూడవచ్చు.
ఇప్పటికే దేవదాసీల మీద వచ్చిన రచనలు ఎక్కువగా వారి లైంగిక జీవితం-బాధలకే పరిమితమయ్యాయి. కానీ దానిలో కళాత్మకతను,జీవితంలో వారి సాధనా పరిణతి గురించి,కళ సిద్ధించిన వారి జీవితంలో ఉండే కనబడని వెలుగును గురించి, అలాగే వారిలా కళను అభ్యసించే బ్రాహ్మణ స్త్రీలలో కళాకారుల గురించి, వివాహం ఈ రెండు వర్గాల స్త్రీల కళను ప్రభావితం చేసే తీరును గురించి చాలా చక్కగా రచయిత చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండటం సహజం. కానీ రచయిత సమస్యను ఎన్నుకునేటప్పుడు కేవలం అది సమస్య అని దానికి సంస్కరణ మాత్రమే పరిష్కారం అని సూచించే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ ఈ రచనలో ఆ సమస్యలు ఎలా సహజమవుతాయో అన్నది దేవదాసీ స్త్రీలు వివాహితులుగా మారడం, బ్రాహ్మణ స్త్రీలు వివాహం తర్వాత జీవితంలో మారడం వంటి అంశాల ద్వారా ఈ వ్యవస్థలో ఉన్న సమస్యలు సామాన్య స్త్రీలకు కూడా ఎలా వర్తిస్తాయో,ఎలా సమస్యలు సహజ వారధిగా జీవితంలో మారిపోతాయో కూడా రచయిత చెప్పడం వల్ల ఈ రచనలో ఎక్కడా కూడా రచయిత మలచిన అంశం లేదా పాత్ర పట్ల పక్షపాతం కనిపించాడు కానీ, కళ ఎలా మనిషిలో మమేకం అయ్యేలా ఆ సమస్యలు, పరిస్థితులు కూడా దోహదపడతాయో అన్న అంశాన్ని కూడా రచయిత సానుకూలంగా చెప్పే ప్రయత్నం కూడా ఈ నవలలో కనబడుతుంది.
నాగలక్ష్మి తల్లి కుముదవల్లి. దేవాదాసీల వైభవం పోయిన తర్వాత ఈ కథ మొదలవుతుంది. దేవదాసీలు నిత్యసుమంగుళులు. వారికి పోషకులు ఉంటారు. వీరు కచ్చితంగా సంగీతం,వాయిద్యం,నాట్యం వంటి కళల్లో నిష్ణాతులు అయ్యే ఉంటారు. ఈ దేవదాసీ కుటుంబంలో తల్లులే ఇంటికి పెద్దలు. తండ్రి అనే మగవాడు ఉన్న ఆ పేరు కొన్నిసార్లు పిల్లలకు తెలిసినా,అందరి ముందు తండ్రిగా చెప్పుకోలేని పరిస్థితులు. ఇక ఈ ఇంట్లో పుట్టే మగవాళ్ళు కూడా ఏదో ఒక వాయిద్యం నేర్చుకుని,సహా వాయిద్యకారులుగా మిగిలిపోవడమో,ఎలాగో బ్రతకడమో జరుగుతుంది. ఆస్తులు కూడా తల్లి తర్వాత కూతుళ్లకే చెందేలా ఉంటుంది. ఇక ఈ వంశంలో స్త్రీలు ఆడపిల్లలు పుట్టాలనే కోరుకుంటారు. ఒక పోషకుడు మరణించినా లేక వదిలేసినా ఇంకో పోషకుడిని వెతుక్కోవచ్చు. కుముదవల్లి చెల్లెలు మరకతవల్లి. కుముదవల్లి మదురై నుండి చిత్తూరుకు వచ్చింది. ఆమె పోషకుడు ఒక వకీలు.నాగలక్ష్మికి ముందు ఇద్దరు మగపిల్లలు ఆమె తల్లికి. నాగలక్ష్మి తన తండ్రితో అనుబంధాన్ని పెంచుకుంది. వ్యక్తిగతంగా ఆయన ఎంత బాగా చూసుకున్నా,సమాజంలో మాత్రమే ఆయన అపరిచితంగానే ఉండిపోవడం, ఆయన చనిపోయిన నెల తర్వాత గాని ఆ కుటుంబానికి ఆయన మరణం గురించి తెలియకపోవడం,దేవదాసీ వ్యవస్థలో పోషకుల పట్ల ఆమెకు విముఖత పెరిగేలా చేసింది. ఓ మంచి గృహిణిగా మారాలనే కోరిక ఆమెలో బలపడింది.
నాగలక్ష్మి జీవితాన్ని కేవలం దేవదాసీ జీవితంగా గమనిస్తే ఈ నవల సమగ్రతను పాఠకుడు ఆస్వాదించలేడు. దేవదాసీలను దాదాపుగా వేశ్యలుగా మాత్రమే భావించే సంస్కృతి సమాజంలో ఉంది. అటువంటి సమాజంలో దేవదాసీ వ్య్వస్థలో జన్మించే స్త్రీలకు కళాస్వేచ్చ ఉన్నప్పటికి గృహిణిగా మారే అవకాశాలు తక్కువ. ఇకపోతే బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించిన స్త్రీలకు కళాభిరుచి ఉన్నప్పటికి కూడా వారు దానిని కేవలం తమ కుటుంబాలకు,ఆ పరిధిలో ఉండే వేడుకలకు మాత్రమే పరిమితం చేసుకోవాల్సిన పరిస్థితులు. నాగలక్ష్మి పెరిగిన వాతావరణంలో తండ్రి లేకపోవడం, తమను,తమ వృత్తిని అందరూ చులకనగా చూడటం వల్ల తనకు అటువంటి జీవితం వద్దని నిర్ణయించుకుంది. ఆ జీవితామే ఆమెను సంగీతంలో మునిగిపోయేలా చేసింది. ఎప్పటికీ విద్యార్ధినిగా ఉండే వినమ్రత ఆమెలో ఉండేలా చేసింది. కళ పట్ల ఆమెకున్న వినమ్రత,వినయం ఆమె జీవితం పట్ల కూడా ప్రదర్శించింది. సంగీతమే జీవితంగా మార్చుకుని అతి చిన్న వయసులోనే రికార్డుల్లో పాడటం, రేడియో స్టేషన్ లో పాడటం,కచేరీల్లో ప్రసిద్ధి పొందడం జరిగింది.
ఆ సమయంలోనే తన కూతురు జీవితం ఇంకా బాగుంటుందని ఆమెకు మంచి అవకాశాలు వస్తాయని ఆమె తల్లి ఆమెను మద్రాసుకు మార్చింది. అక్కడ ఆమెకు విశ్వనాథ్ అనే విలేఖరి పరిచయం కావడం,అతను ఆమె ఇంటర్ వ్యూ ప్రచురించడం, ఆ తర్వాత తల్లి పోషకుడితో ఉండాలని ఒత్తిడి చేయడంతో అతని ఇంటికి పారిపోయి రావడం జరుగుతుంది. అప్పటికే విశ్వనాథ్ కు వివాహమైంది. ఓ భార్య,కూతురు కూడా ఉన్నారు. ఆ భార్య రెండో సారి ప్రాసవానికి పుట్టింటికి వెళ్లింది. ఆ ఇంట్లో విశ్వనాథ్ ఏది చెప్తే అది జరుగుతుంది.ఆమె తల్లి కూడా అతని మాట వినాల్సిందే. అలా నాగలక్ష్మి ఆ ఇంట్లో ఉంది. ఈ లోపు ఆమెకు కచేరీలు,సినిమాల్లో నటిగా అవకాశాలు తీసుకువచ్చాడు విశ్వనాథ్. విశ్వనాథ్ పత్రికలో పని చేయడం మానేశాడు. నాగలక్ష్మి ద్వారా తన ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యలో నాగలక్ష్మి తల్లి ఆమెను ఇంటికి రప్పించే ప్రయత్నం చేసిన అది జరగనివ్వలేదు. అప్పటికే కాంగ్రెసు పార్టీలో ఉన్న విశ్వనాథ్ దేవదాసీ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్న కార్యక్రమంలో కూడా పార్టీ భాగం అవ్వడం వల్ల భాగమైపోయాడు. నాగలక్ష్మికి నటించడం ఇష్టం లేకపోయినా విశ్వనాథ్ కోసం నటించింది.
ఈ లోపు విశ్వనాథ్ భార్య రెండో బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చింది. భర్తకు ఎదురుతిరగలేనితనం వల్ల కొంతమేరకు సహించినా ఇక సహించలేని పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్లిపోయింది. అదే సమయంలో నటిస్తున్న చిత్రంలో తనకన్నా ఎంతో పెద్దవాడైనా నాయకుడితో ప్రేమలో పడిన నాగలక్ష్మి ఆ ప్రేమ సాధ్యం కాదని తెలుసుకుని తన మనసులోనే ఉంచుకుంది. ఆ తర్వాత విశ్వనాథ్ భార్య ఆత్మహత్య చేసుకోవడం,అప్పటికే గృహిణిగా మాత్రమే స్థిరపడాలని నిర్ణయించుకున్న నాగలక్ష్మి విశ్వనాథ్ ను వివాహం చేసుకుంటుంది. కాంగ్రెస్ లో సభ్యుడు అయినందువల్ల ఆమెకు పోషకుడిగా ఉండే అవకాశం లేదు కనుక ఆమెను వివాహం చేసుకుంటాడు విశ్వనాథ్. పెళ్లి అయిన తర్వాత తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాడు. విశ్వనాథ్ ఇద్దరు ఆడ పిల్లలనే తన సొంత పిల్లలుగా పెంచుకుంటుంది.
అవసరం-అవకాశం-ఆకర్షణ మనిషిని ఎటువైపు లాగినా సరే మనిషి మనసులో పాతుకుపోయిన కులం మాత్రం వాటిని కచ్చితంగా ఏదో రకంగా జయించి తీరుతుంది. వివాహం అయ్యాక నాగలక్ష్మి బ్రాహ్మణ మహిళగానే మారిపోయింది. సంపాదన ఆమేదే అయినా సరే భర్త మాటను ఏ రోజు జవదాటలేదు. ఆమె అలా ఉండిపోవడం అన్నది ఆమె జీవన సూత్రానికి సంబంధించింది.ఆమె కుటుంబ జీవితానికి మొదటి ప్రాధాన్యత,సంగీతానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చింది.
ఇకపోతే ఆమె తల్లి మరణించినప్పుడు కూడా ఆమెను ఇంకో దేవదాసీ స్త్రీ వచ్చేవరకు కూడా తోడు లేదని పంప పలేదు ఆమె భర్త. అంటే విశ్వనాథ్ ఆమెను వివాహం చేసుకున్న కారణాలు ఏవైనా సరే ఆమెను సంపూర్ణంగా తన భార్యగా అంగీకరించలేదు. ఆమె కచేరీల ద్వారా వచ్చే డబ్బును పార్టీకి ఇవ్వడం వంటివి చేయడం వల్ల ఆమెను కూడా తన లబ్ది కోసం వాడుకునే ప్రయత్నం చేసినట్టు అనుకోవచ్చు. అలానే తన గృహిణి పయనానికి నాగలక్ష్మి ఇవన్నీ అవసరంగా భావించి ఉండవచ్చు.
దేవదాసీల పట్ల చిన్న చూపు ఉండటానికి కారణాలను గమనిస్తే అది వారికి పోషకులను ఎంచుకునే స్వేచ్చ ఉండటం వల్ల కావచ్చు. అలాగే ఆ పోషకులు కూడా మోజు పడి,ఇంట్లో భార్యలను మాత్రం దాసీలుగా చూస్తూ,బయట దేవదాసీల దగ్గర మాత్రం వారికి నచ్చినట్టు ప్రవర్తించే పురుషులు ఎవరిని ఇష్టపడుతున్నట్టు?ఎవరికి కనీస గౌరవం ఇస్తున్నట్టు?ఎవరి పట్ల ప్రేమను ప్రకటిస్తున్నట్టు? వైవాహిక బంధంతో బానిసత్వాన్ని తెచ్చుకోవడం సమాజంలో గౌరవాన్ని ఆపాదిస్తే, పోషకులను ఎన్నుకుని తమ అవసరాలు,జీవితాలు గడుపుకునే దేవదాసీలకు భ్రష్టత్వం అంటగడితే,అసలు సమాజాన్ని పట్టించుకొని మనుషుల మధ్య ఎవరికి స్వేచ్చ,సుఖం ఉన్నట్టు? సమాజం ఆపాదించే కోణాలు వ్యక్తిగత గౌరవానికి,భద్రతకు అడ్డుగా నిలిస్తే, వ్యక్తిత్వం కోల్పోయిన మనిషి కేవలం సమాజ ఆమోదంతో ఏ మేరకు జీవించగలదు? స్త్రీని ఈ రెండు కోణాల్లో స్పష్టం చేసిన నవల ఇది.
నాగలక్ష్మి జీవితంతో పాటు ఈ నవలలో ఎందరో స్త్రీల జీవితాలు కూడా ఉన్నాయి. దేవదాసీలుగా ఉన్న వారు పోషకులు మరణించినా,వారు పట్టించుకోకపోయినా,కచేరీలు చేస్తూ పోషకుల కోసం వెతుక్కుంటూ,సాధారణంగా వచ్చే పోషకులు తమకంటే రెట్టింపు వయసు కన్నా కూడా పెద్ద వారు వచ్చినా సరే కేవలం వారికున్న కళా పరిజ్ఞానంతో వారి యోగ్యతను నిర్ణయించుకుని వారితో జీవితాలు సాగించిన దేవదాసీలు ఎందరో.
కళలో తనను తాను మర్చిపోయే దశ వరకు సాధన చేస్తూనే ఉన్న నాగలక్ష్మి తన జీవితంలో ఉన్న బాధలను తానే కళ అయినప్పుడు మరచిపోయేది.ఆ దశను నిలుపుకోవడానికే ఆమె మరణించేవరకు కూడా సాధన చేస్తూనే ఉంది. మనోధర్మ సంగీతం అంటే గాయకుడో లేక గాయకో అక్కడిక్కడ సృజించిన సంగీతం. ఎంతో సాధన లేకపోతే అలాంటి ప్రయత్నంతో శ్రోతలని మెప్పించడం ఏ మాత్రం సాధ్యం కాదు.ఆ సాధన దశలో ఆ కళాకారిణి సైతం తనను తాను మెప్పించుకోగలగాలి.అప్పుడే ఆ దశలో సఫలీకృతులు కాగలరు. అటువంటి కళానుభవం గురించి,ఆ రసానుభూతిని ఆస్వాదించే వారు,ఎలా జీవితం నుండి ఆ కళలోకి పయనిస్తారో స్పష్టం చేసే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!