త్యాగోచిత పాత్ర

 త్యాగోచిత పాత్ర

-శృంగవరపు రచన



సాహిత్యం కాలానికి ప్రతీక. ఆ కాలంలో ఉండే మార్పులకు సంకేతం. సాహిత్యంలో ఏది ఉంటే పాఠకులు చదువుతారని భావిస్తారో అలాంటి అంశాలను ఎన్నుకునే రచయితలు-పాఠకులు ఎలా ఉన్నారో కూడా స్పష్టం చేసే ఆయుధం. కానీ కొన్ని కథలు ఎప్పటికీ మారవు. కారణం ఆ కథలు అలా ఉండటంలో ఆ పాత్రలు ఏదో ఒక ఊహాజనిత ఆదర్శాన్ని అల్లుకుని,దానిలో నివసిస్తూ దాని నుండి బయట పడటం తమకు ముప్పు తెస్తుందేమో అన్న భయాన్ని త్యాగం పేరుతో కప్పిపుచ్చుకోవడంలో ఆ పాత్రలు ఒక రకమైన సంతోషాన్ని,సంతృప్తిని పొందుతాయి. 1980ల్లో వచ్చిన నవలల్లో దాదాపు ఈ రకపు సాహిత్యానికి ఆదరణ ఉన్నది. అవే కాస్త విస్తరిస్తూ నేటి సీరియల్స్ గా మారాయి అనుకుంటా. అటువంటి నవలే 1981 లో జ్యోతి అనుబంధ నవలగా వచ్చిన కరుణారుణ గారి ‘మలివెలుగు.’
ఈ నవల చదవమని,చదవవద్దని రెండు నేను సూచించను. కానీ సాహిత్యం మీద కన్నా కూడా రచయిత కథను నడిపే తీరులో మనం ఎన్నో అంశాలను గమనించవచ్చు. ఆ అంశాల్లో ఒకటి రచయిత తన కోసం రాస్తున్నాడా?లేక రచనలకు ఒక పరిధి నిర్మించుకుని రాస్తున్నాడా?రచనల్లో పాత్ర ఔచిత్యం అంటే ఏమిటి?ఓ పాత్రకు త్యాగం ఆపాదించడం వల్ల ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది?ఆ త్యాగం ఎందుకు జన్మిస్తుంది?అసలు త్యాగం అంటే ఏమిటి? ఏది త్యజిస్తే త్యాగం?జీవితాన్ని త్యజిస్తే అది త్యాగమా?త్యాగం వల్ల ఎవరికి ఉపయోగం? ఇటువంటివి అన్నింటి గురించి ఆలోచించే అవకాశం ఇచ్చిన నవల ఇది. 1980-2000 వరకు వచ్చిన సాహిత్యంలో కథనంలో పాత్రలు-కథలు ఆ కాలాన్ని,ఆ జ్ఞాపకాలను ఎలా స్మృతుల్లోకి తెస్తాయో,నాటి సాహిత్యంలో మూలం ఎలా ఈ త్యాగం అన్న అంశంతో ఆదర్శంగా రూపొందుతుందో కూడా స్పష్టం అవుతుంది.
ఈ నవలలో కథ గొప్ప కథ కాదు. మామూలు కథ. కథలో ముఖ్య పాత్ర సీత.ఆమెకు ఎన్నో కష్టాలు. ఆమెకు ఓ పినతల్లి. ఆమెకు ముగ్గురు సంతానం. సీత అన్న ఈ పినతల్లి బాధలు పడలేక ఎదిరించి వెళ్ళిపోతాడు. కష్టపడి చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని తన బ్రతుకు తాను బ్రతుకుతాడు. ఇక తండ్రికి తాగుడు వ్యసనం. వారు ఉండే ఇంటి పక్కన వాటాలో ఉండే మురళి ఆమెను ప్రేమిస్తాడు. మొదట సీత కుటుంబ పరిస్థితి తెలుసుకున్న అతను సీత తండ్రికి తాను సీతను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు తండ్రి ఒప్పుకుంటాడు. ఇంతలో ఓ ముసలి కాంట్రాక్టర్ కు రెండో పెళ్ళాం అయితే తనకు డబ్బు వస్తుందని భావించిన పినతల్లి,తండ్రి ఆమెను అతనికిచ్చి కట్టబెట్టాలని అనుకుంటారు. ఈ లోపు మురళి ఆమెను లేపుకుపోవాలని అనుకుంటాడు.ముందు సరేనన్న సీత తర్వాత తన కుటుంబం తన వల్ల ఉద్దరింపబడుతుందని భావించి ఆ ముసలి వాడిని పెళ్లి చేసుకుంటుంది.
ఆ ముసలి కాంట్రాక్టర్ ఆస్తులన్నీ కొడుకు,కూతురు పేరునే రాశాడు. కానీ ప్రేమ ఉంటే చాలని అతని తాగుడు భరిస్తూ అతనితో ఉంటుంది ఆమె. మురళి అప్పటి వరకు డిగ్రీ చదివి లెక్కలు రాసేవాడు, కానీ తర్వాత ఎలానో పోలీసో,లేక దొంగ ఆస్తులను పట్టుకునే అధికారో అవుతాడు. ఈ ఉద్యోగం గురించి స్పష్టత లేదు కానీ అతను ఆ ముసలి కాంట్రాక్టర్ ఆస్తులన్నీ జప్తు చేయించే ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలో సీత గర్భవతి. భార్యాభర్తలు ఆ ఆపద నుండి గట్టెక్కడానికి పారిపోతూ ఉంటారు. ఆ తర్వాత మొత్తానికి డబ్బుతో ఆ సమస్య నుండి బయటపడి ఇంటికి తిరిగి వచ్చాక ఇదంతా సీతను ప్రేమించిన వ్యక్తి చేయించాడని తెలుసుకుని ఆమెను హింసించి మరి మురళిని ఒంటరిగా ఇంటికి రప్పించి,మానభంగం చేసినట్టు గోల చేయమని అలా చేస్తేనే ఆమె నిర్దోషి అని వారు భావిస్తామని చెప్తారు. అప్పటికే ఓ బిడ్డను కూడా ఆమె కంది. ఆమె అప్పుడు మురళి మగవాడని,కనుక అతను ఎలా అయినా బ్రతకగలడని,కానీ తనకు ఉన్న ఒకే లైఫ్ లైన్ అదే అని భావించి అదే చేస్తుంది. మురళి జైలు పాలవుతాడు. ఆ తర్వాత సీత బిడ్డను ఆమెకు దూరం చేసి ఆమెను పుట్టింట్లో వదిలేయడం,అప్పుడు ఆమె మురళి గురించి ఆలోచించి తన మరణ వాంగ్మూలంగా నిజం చెప్పాలనుకోవడంతో నవల ముగుస్తుంది.
సాహిత్యంలో ముందుకు వెళ్ళిన మాట నిజమే కానీ అదే సాహిత్యం నేడు సీరియల్స్ గా సాగతీతతో మారింది. ఇది చదువుతున్నప్పుడు సీతలో చేతకానితనం,తనను తాను కాపాడుకోలేక,భద్రత ఉందనే ఆమె చేసిన ప్రతి పనిని త్యాగం పేరుతో ఆమెను నాయికగా చేయడం వల్ల మంచితనం అంటే భయం అని,ఆ భయస్థులు తమను ఏమి అనరు కనుక వారిని మంచివారుగా ఇంకా వారిని ఆ భయం నుండి బయట పడకుండా చేయడానికి త్యాగం చేసే వారని ఓ దండ పడేస్తే వారితో ఎప్పటికీ అలా ఆడించవచ్చు అని భావించే సమాజంలో ఇలా గొప్ప వారిగా ఉండాలనే ఆశతో అలా వారు ఉండిపోవచ్చేమో!
Indecent Proposal లాంటి హాలీవుడ్ సినిమాలో కూడా స్త్రీ పాతివ్రత్య ధర్మాన్ని,ఆమె త్యాగాన్ని నిరూపించడానికి తెలుగులో వచ్చిన ‘మహాలక్ష్మి’ సీరియల్ లో నాయిక, ఇక ముద్దమందారంలో ‘సావిత్రి’, ‘చిన్న కోడలు’ లో రాధ,మొగలి రేకులులో నాయిక ఇలా పాత్రలలో ఒక రకమైన భరించేతనాన్ని నాయిక లక్షణంగా ఆపాదిస్తూ ఆ శైలిలో నడుస్తున్న సీరియల్స్ లో మాత్రం సాహిత్యంలో వచ్చినంత మార్పు పాత్రల ఔచిత్యంతో రాలేదనే చెప్పాలి. బహుశా ఆ త్యాగంలో ఓ రకమైన సానుభూతిని పుట్టించే ప్రేరకం ప్రేక్షకులకు సంతృప్తిని కలిగించవచ్చు. ఇది స్త్రీ పాత్రలకే కాదు ఆదర్శ పాత్రల ఔచిత్యంలో ఉన్న మార్పులే సమాజంలో మనిషి మనస్తత్వంలో ఉండే ఎన్నో బలాలను,బలహీనతలను స్పష్టం చేస్తాయి. చదవండి...అప్పుడప్పుడు ఇటువంటి సాహిత్యం కూడా. ఎందుకంటే ఒక్కో పాత్ర మనలో కలిగించే భావమే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము?ఆ పరిస్థితుల్లో ఆదర్శాన్ని ఎలా నిర్వచిస్తాము?ఎలా మారతాము? మన కోసం లేని వారితో ఎలా ఉంటాము? ఎలా ఉండాలి? ఇవన్నీ ప్రేక్షకులుగా చూసినప్పుడే అసలైన పాత్ర ఎలా ఉంటే మనం దగ్గరగా ఉంటామో మనకు కూడా స్పష్టం అవుతుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!