సంకల్ప సిద్ధుడు 'బాదం రామస్వామి'

 సంకల్ప సిద్ధుడు 'బాదం రామస్వామి'

-శృంగవరపు రచన

గొప్పవారి జీవితాలను, వ్యక్తిత్వాలను కాలం కొన్నిసార్లు చరిత్రలోని వివిధ రూపాల్లో నమోదు చేస్తుంది. అలా నమోదు చేయబడని వారిలో కూడా ఇంకా ఎందరో గొప్పవారు ఉన్నారు. అందులో ఒకరు శ్రీ బాదం రామస్వామి గారు. ఆయన జీవితం మీద భగీరథ గారు ‘మహర్జాతకుడు’ పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకం 2004 లో రాశారు. గూగుల్ మరియు మిగిలిన సోషల్ నెట్వర్క్ వేదికల్లో కూడా రామస్వామి గారి గురించి ఏ వివరాలు అందుబాటులో లేవు. నాకు తెలిసింది కేవలం ఈ పుస్తకంలో రాయబడిన విషయాలు మాత్రమే. బహుశా ఆయన గొప్పతనం, ఆయన చేసిన పనుల గురించి ఆయన సమకాలీకులకు, ఆయన ద్వారా మేలు పొందిన వారికి, ఆయన పరిచితులకు తెలిసి ఉండవచ్చు. కానీ ఈ పుస్తకం తప్ప ఏ అంతర్జాల వేదికల్లో కూడా ఆయన నామమాత్రపు వివరాలు కూడా ఉండకపోవడం శోచనీయం. కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి, ‘సంగం థియేటర్’ , ‘కృష్ణ హోటల్’, ‘భాగ్యనగర్ ఫిల్మ్ స్టూడియో’ వంటివి స్థాపించి, ఎన్నో ఛారిటబుల్ ట్రస్టులు నిర్వహించిన ఆయన పేరున నేడు స్టేడియం కూడా ఉన్నా, వ్యక్తిగా ఆయన గురించి తెలుసుకోవడానికి అంతర్జాలం ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఓ విశిష్ట చరిత్ర మరుగున పడకుండా అందరికీ తెలియజేయడానికి ఈ పుస్తకం ద్వారా మంచి ప్రయత్నం చేసిన జర్నలిస్ట్ మరియు రచయిత అయిన భగీరథగారికి అభినందనలు మరియు ధన్యవాదములు.
రామస్వామి గారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరులో గ్రామంలో జన్మించారు. వెంకటయ్య, బాలకిష్టమ్మ ఆరుగు సంతానంలో ఆయన ఆఖరి వారు. 1925 డిసెంబర్ ఆరున ఆయన జన్మదినం. ఆయన తండ్రి ఆ ఊరిలో ధర్మవడ్డీకి అప్పులు ఇస్తూ ఉండేవారు. రామస్వామి చిన్నతనంలోనే ఆయన కాలుకి మేకు గుచ్చుకోవటం, మధుమేహం వల్ల విషమంగా పరిణమించి ఆయన మరణించడం జరిగింది. అప్పటి వరకు సంపదలతో తులతూగిన ఆ కుటుంబం లేమిని అనుభవించాల్సి వచ్చింది ఈ ఘటనతో. రామస్వామి అన్నయ్య బాలయ్య మరియు మిగిలినవారు కుటుంబానికి ఆసరాగా ఉండటం గమనించాడు. బాలయ్య అప్పటికే కిరాణా దుకాణం నడుపుతున్నాడు. దానికి కావలసిన సరుకులు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి రామస్వామి తీసుకుకువచ్చేవారు. ఇంట్లోని పరిస్థితుల వల్ల ప్రాథమిక విద్యతోనే ఆయన విద్యాభ్యాసం ముగిసిపోయింది. ఆ తర్వాత వనపర్తిలోని ఓ రైసు మిల్లులో ఆయన పని చేశాడు. అక్కడ ఆయన కార్యదీక్షత వల్ల సూపర్ వైజర్ స్థాయి నుండి క్యాషియర్ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఆయనకు 19 ఏళ్ల వయసులో సరోజిని గారితో వివాహం జరిగింది.
ఆ సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వనపర్తిలో జరిపిన వేడుకల్లో పాల్గొన్నందుకు యువకులను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అందులో రామస్వామి గారు కూడా ఉన్నారు. అలా దేశం పట్ల తన భక్తిని కూడా ఆయన ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కర్నూలుకు భార్యతో సహా వచ్చారు. మొదట నర్సారావుపేట, కంభంలో నాణ్యమైన బియ్యం తక్కువ ధరకు లభించడంతో అక్కడ కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని ఆయన కర్నూలు దుకాణాల్లో అమ్మేవాడు. ఆయన బావగారు చిన బాలయ్య కాంట్రాక్టర్లకు అప్పులు ఇచ్చేవారు. ఆయన సహకారంతో కాంట్రాక్టర్ వృత్తిలోకి అడుగు పెట్టారు రామస్వామి. తన కార్యదీక్షతతో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.
ఆ తర్వాత హైదరబాద్ కు ఆయన మకాం మారింది. ఆ తర్వాత ఆయన కృష్ణ హోటల్, సంగం థియేటర్, భాగ్యనగర్ ఫిల్మ్ స్టూడియోస్ వంటివి స్థాపించారు. ఆయనకు ఒక్క కొడుకు బాలకృష్ణ. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా మారారు. ఆయన ఈ జీవిత పయనంలో ఎన్నో నేర్చుకున్నారు. విద్య మధ్యలోనే ఆగిపోయినా తన అనుభవాలతో, వృత్తిలో భాగంగా ఎందరినో కలవడం వంటి వాటి వల్ల, ప్రపంచ పర్యటనల వల్ల ఆయన జీవితంలో నిత్య విద్యార్ధిగానే ఎదుగుతూ ఉన్నారు. ఈ పుస్తకంలో కొన్ని వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించటం జరిగింది. సమాజంలో పెరిగిన హోదాను అనుసరించి రామస్వామిగారు ఓ సారి తాగి ఇంటికి వచ్చారు. ఆయన భార్య ఆయనను ఇంటి దగ్గరే తాగమనడం,ఆయన పేరు గురించి, ఆయన హోదాను నిలబెట్టేలా హుందాగా ప్రవర్తించడం ఆవిడ గొప్పతనం అయితే, దాదాపు దశాబ్దానికి పైగా సంతానం కలగని పరిస్థితుల్లో రామస్వామి గారిని ద్వితీయ వివామ్ చేసుకోమని ఆయన తల్లి బలవంతపెట్టినా భార్యను విడిచిపెట్టకుండా ఆమె పట్ల అచంచల ప్రేమతో నిలబడటం, వారిద్దరి దాంపత్య బలానికి కారణం.
రామస్వామి గారికి తాను చదువు కోలేదనే బాధ ఉండేది. ‘బాదం రామస్వామి ఛారిటబుల్ ట్రస్టు’ ను ఏర్పాతి చేసి ఎందరో పేద విద్యార్ధులకు విద్యను అందించారు ఆయన. తర్వాత అభ్యర్ధనలను అనుసరించి ఈ సేవలను కళాశాల విద్యార్ధులకు కూడా విస్తరించారు. వారు ఉద్యోగం వచ్చాక కొంత ఆ ట్రస్టుకు కట్టాలి. దానికి వారు సంతోషంగా అంగీకరించారు. అలా విద్య లేదన్న తన అసంతృప్తిని కొంతమేరకు రామస్వామి గారు అధిగమించే ప్రయత్నం చేశారు. ఆయన భార్య పేరు మీద కూడా ఇంకో ట్రస్టును ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో మహిళల కోసం కుట్టుమిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళలకు శిక్షణ ఇచ్చి, వారిని ఆర్థికంగా నిలబడటానికి ఇది తోడ్పడింది. ఆ తర్వాత దీనిని అన్ని ప్రాంతాలకు విస్తరించారు. ఈ ట్రస్టు ద్వారా ఒక కంటి ఆసుపత్రి, ఒక నృత్య పాఠశాల, వయోవృద్ధుల ఆశ్రమం కూడా నడిపారు. తర్వాత భార్య మరణం ఆయనను క్రుంగదీసినా, ఆ బాధ నుండి బయటపడి తను చేయాల్సిన పనులను చేస్తూనే ఆయన కొనసాగారు. ఎన్నో వసతి గృహాలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ శిధిలావస్థలో ఉంటే దాని పునర్నిర్మాణం కూడా ఆయనే చేయించారు. అలాగే సినిమా కల్చరల్ సెంటర్ నిర్మాణం ఖర్చు కూడా కొంత భరించారు. ఇలా ఎన్నో దానాలు, సాయాలు ఆయన జీవిత పుటల్లో నిండిపోయాయి. తర్వాత తను పుట్టిన ప్రాంత పరిసరాల్లో చేయాల్సిన కార్యక్రామాల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పడంతో ఈ పుస్తకం ముగుస్తుంది. అంతర్జాలంలో కూడా ఆయన పేరు మీద ఓ స్టేడియం ఉందన్న విషయం మినహాయించి ఏమి స్పష్టం చేయలేకపోయింది.
పుట్టిన పరిస్థితులు, విద్య కన్నా కూడా మనిషి జీవితంతో పాటు ముందుకు సాగుతూ ఎదగడమే విజయానికి మూల సూత్రం అనడానికి నిదర్శనమే బాదం రామస్వామి గారి జీవితం. ఆయన జీవితంలో కలిమి,లేమిలను అనుభవించారు. వాటి విలువను తెలుసుకున్నారు. వ్యక్తిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరుడిగా కూడా ఆయన జీవితం సార్ధకమైంది. మనుషుల జీవితపు పుటల్లో కొన్ని పేజీలు ఎప్పుడు ఇతరులు చదవడానికే అని స్పష్టం చేసే పుస్తకాలే మనుషుల జీవితాల కేంద్రంగా వచ్చేవి. పాఠకులకు సమాచారం లభ్యం అవ్వని వ్యక్తుల గురించి వచ్చే పుస్తకాలు ఇంకా విలువైనవే. అటువంటి విలువైన పుస్తకం ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ