రహస్యపు జీవితం

 చదువరి

రహస్యపు జీవితం
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మనుషుల జీవితాల్లో సుఖాంతాలు మనకు కథల్లోనూ,నవల్లలోనూ కనిపిస్తూ ఉంటాయి.అలాగే అసంభవాలు,కష్టాలను దాటే సుఖాలు ఇలా ఇవన్నీ మనకు ఈ ఊహా లోకంలోనే కనిపిస్తాయి. ఇవి కల్పనలైనా మనల్ని కొన్ని పరిస్థితుల గురించి ఆలోచించేలా చేసి,ఆ పాత్రల జీవితాల్లో మునిగిపోయేలా చేస్తాయి. ఓ స్త్రీ జీవితంలో అనూహ్యంగా సంభవించిన ఓ ఘటన ఆమె జీవితాన్నే ఎలా మార్చేసిందో స్పష్టం చేసే నవలే జి.భవానీకృష్ణమూర్తి గారి ‘ వసంతాగమనం.’ ఇది ఆంధ్రభూమిలో పొట్టి నవలగా ప్రచురించబడింది.
‘ చైల్డ్ కేర్ సెంటర్’ నడుపుతున్న సుభద్రకు చెల్లెలు సుశీల. వారి మేనత్త సుందరమ్మ. సుభద్రకు ఓ సారి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆమె బదులు సుశీల డే కేర్ సెంటర్ కు వెళ్తుంది. అక్కడకు వచ్చిన డాక్టర్ హరికృష్ణ ఆ డే కేర్ సెంటర్ పిల్లలను చూస్తూ ఉంటాడు. అలా పరిచయం అయిన హరికృష్ణ సుభద్రను తన చెల్లెలుగా భావించినట్టే సుశీలను తన సోదరిగానే భావిస్తాడు. అలా ఎమర్జన్సీ సమయాల్లో సుభద్రకు ఒంట్లో బాగోలేనప్పుడు హరికృష్ణ ను పిలవడానికి అతని ఇంటికి వెళ్తుంది సుశీల. అలా హరికృష్ణతో ఆమెకు అనుబంధం ఏర్పడుతుంది. సుశీల ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఉపాధ్యాయ వృత్తి మీద ఆసక్తితో ఉపాధ్యాయినిగా చేరాలనుకున్న ఆసక్తిని ప్రకటిస్తే హరికృష్ణ తనకు తెలిసిన హై స్కూల్ లో ఆమెను రికమెండ్ చేస్తాడు. సైన్స్ టీచర్ గా ఆమెకు ఉద్యోగం వస్తుంది. దానికి అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి అతని ఇంటికి వెళ్తే హరికృష్ణ భార్య మాధవి వారిద్దరికి సంబంధం అంటగట్టి ఆమెను అవమానిస్తుంది. ఆ తర్వాత హరికృష్ణ స్కూల్ కి వెళ్ళి సుశీలకు క్షమాపణ చెప్పి మాధవికి మొదటినుండి అనుమానం ఉందని,ఇప్పుడు పిల్లలను కూడా తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్తాడు.
సుభద్ర నడుపుతున్న చైల్డ్ కేర్ సెంటర్ లోనే తన సోదరి బిడ్డ కూడా ఉండటం వల్ల రాంబాబుతో ముందే సుశీలకు పరిచయం ఏర్పడుతుంది. తర్వాత అతను కూడా సుశీల పని చేస్తున్న స్కూల్ లోనే క్యాషియర్ గా పని చేయడంతో ఆ పరిచయం స్నేహం,ఆ తర్వాత ప్రేమగా పరిణమిస్తుంది. సుశీల ఆ విషయం సుభద్రకు చెప్తుంది. సుభద్ర తాను రాంబాబుతో మాట్లాడతానని చెప్తుంది. రాంబాబును కలిసిన సుభద్ర తన గతం గురించి తాను దాచిన రహస్యం గురించి చెప్తుంది.
సుభద్ర ఓ మోతుబారి రైతైన రాఘవయ్య కూతురు.ఆమె అన్న జగన్. అతను కాస్త దురుసైన స్వభావం కలవాడు. వారిదగ్గర పనిచేస్తున్న మల్లన్న దంపతుల కొడుకు బలరాం. బలరాం,సుభద్ర బాల్యం నుండి స్నేహితులు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు కూడా. కానీ జగన్ వారిద్దరికి ఎప్పుడూ అడ్డు పడుతూ ఉండేవాడు. జగన్ పట్టణం వెళ్ళి చదువుకుంటున్నాడు. బలరాం కూడా పట్టణం చదువుకోవడానికి వెళ్తాడు. పట్టణం వెళ్ళిన జగన్ తల్లిదండ్రులకు చెప్పకుండా సరోజను వివాహం చేసుకున్నాడు. సుభద్ర ఖాళీ సమయంలో సంగీతం నేర్చుకుంటూ ఉంది. పట్టణం నుండి జగన్ ఇంటికి తిరిగి వస్తాడు.అదే సంయమలో బలరాం కూడా తిరిగి వస్తాడు.
బలరాం అదే ఊరిలో లేకపోయినా రోజు తోటలో ఉండి కాసేపు గడిపే సుభద్ర ఆ రోజు కూడా అలానే గడుపుతూ ఉంటుంది. ఆ రాత్రి ఎవరో ఆగంతకుడు ఆమెను మానభంగం చేస్తాడు. అతను ఎవరో ఆమె చీకట్లో గుర్తు పట్టలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది ఆమె. అప్పటికే ఇంటికి ఆలస్యంగా ఇంటికి వచ్చిన చెల్లిని ఆ రోజే భార్యతో ఇంటికి వచ్చిన జగన్ బలరాంతో అంతసేపు గడిపింది అనుకుని దూషిస్తాడు.అదే రోజు బలరాం ఊరు వచ్చినట్టు సుభద్రకు తెలియదు.ఆమె చెప్పేది వినిపించుకోకుండా బలరాం దగ్గరకు వెళ్ళి తరువాతి రోజుకల్లా ఊరు విడిచి వెళ్లకపోతే బలరాం,అతని తల్లి దండ్రుల బ్రతుకులు ఉండవని బెదిరిస్తాడు జగన్. తల్లిదండ్రులు కూడా సుభద్ర కోసం అతను అక్కడే ఉండిపోతే తాము మరణిస్తామని బెదిరించడంతో మర్నాటి ఉదయానికే నిస్సహాయంగా ఆ ఊరినుంచి తల్లిదండ్రులతో వెళ్ళిపోతాడు బలరాం.
సుభద్రకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెకు పెళ్లి కుదర్చడానికి ఆమె తల్లిదండ్రులు,అన్న జగన్ బయల్దేరతారు. ఆ కారుకు యాక్సిడెంట్ అయ్యి వారు ముగ్గురు మరణిస్తారు.అదే సమయంలో అక్కడ సుభద్ర తండ్రి చెల్లెలు సుందరమ్మ విధవ అయ్యి ఎప్పటినుండో అక్కడే ఉంటుంది. సరోజ వారి మరణాలకు కూడా సుభద్రనే నిందిస్తూ ఉంటుంది.అప్పటికే సరోజకు ఓ బాబు. అప్పటికి సుభద్ర గర్భవతి. సుందరమ్మకు ఆ విషయం చెప్తుంది.అప్పటికే సుభద్రను ద్వేషించే సరోజ ఆమెను ఆదరించడాని గుర్తించిన సుందరమ్మ తీర్ధయాత్రలకు తీసుకువెళ్తున్నానని చెప్పి తనతో పాటు సుభద్రను కూడా కొంత డబ్బు,నగలతో తీసుకువెళ్తుంది. అలా ఆమెకు ప్రసవమై ఓ ఆడపిల్ల పుడుతుంది. తండ్రి ఎవరో తెలియని ఆడపిల్లను పెంచడం కష్టమని ఆమెను సుభద్ర చెల్లిలిగా పెంచమని చెప్తుంది సుందరమ్మ.ఆలాగే చేస్తుంది సుభద్ర.అక్కడ నుండి పట్టణానికి వచ్చి మొత్తానికి ఎలాగో బేబీ కేర్ సెంటర్ పెట్టుకుని ఓ స్థాయికి ఎదిగి సుశీలను చెల్లిలిగానే సమాజానికి పరిచయం చేసింది సుభద్ర.
జరిగింది విన్న రాంబాబు తాను జగన్ కొడుకును అని తనకు ఈ పెళ్లి ఇష్టమే అని తన తల్లి సరోజ కూడా తర్వాత సుభద్ర గురించి బాధ పడిందని తప్పక ఆమె ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందని చెప్తాడు. తాను తన తల్లికి చెప్పి త్వరలోనే వస్తానని చెప్పి వెళ్తాడు. సుశీల కూడా ఈ వార్తతో ఎంతో సంతోషిస్తుంది. తర్వాత సుశీల హరికృష్ణ భార్య మాధవి ఇంటికి వెళ్ళి హరికృష్ణ తనకు సోదరుడే అని తనకు పెళ్లి కుదిరిందని,ఆమె వెళ్లిపోయాక హరికృష్ణ హాస్పటల్ కూడా మూతపడే పరిస్థితి వచ్చిందని,అతను ఆమె గురించి ఎంతగానో బెంగ పెట్టుకున్నాడని చెప్పి ఆమెను ఒప్పించి ఆ దంపతులను కలుపుతుంది. ఆ దంపతులు ఆ తర్వాత సుభద్ర ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు.
అలా వెళ్ళిన రాంబాబు నెల అయిన తిరిగి రాడు. రాంబాబు చెల్లెలి దగ్గరకు వెళ్ళి అడిగితే తన అన్న తన మేనమామ కూతుర్నే చేసుకుంటాడని చెప్తుంది. దానితో అతని మీద ఆశలు ఒదులుకుంటారు. కొన్నాళ్ళకు రాంబాబు ఒకతన్ని తీసుకుని వస్తాడు. అతనే బలరాం. అతను మిలిటరిలో గాయపడితే ఆసుపత్రిలో చేరిస్తే అతని చిరునామా పట్టుకుని మరి అత్తయ్యతో కలపడానికి రాంబాబు అతన్ని ఇంటికి తీసుకువస్తాడు. ఆ రోజు ఆగంతకుడిగా సుభద్రను అనుభవించింది తానే అని,మామూలుగా వస్తే ఆమె అడ్డు చెప్తుందని సమ్మోహితుడై ఆ రాత్రి అలా చేశానని క్షమాపణ అడుగుతాడు బలరాం. ఇక ఆ దంపతులు ఒకటవుతారు. సరోజ కూడా ఒప్పుకోవడంతో సుశీల,రాంబాబు కూడా ఒకటవుతారు. సుశీలకు చివరకు నిజం తెలిసినా తల్లిని అర్ధం చేసుకుంటుంది.
కొన్ని నవలలు గొప్ప సామాజిక అంశాలను స్పృశించకపోవచ్చు. కానీ జీవితంలో అసంకల్పితంగా జరిగే ఘటనల ప్రభావాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాయి.చదువుతున్నప్పుడు ఏదైనా చదివి,ఓ జడ్జుమెంటుకు రాకుండా ఆ పాత్రలను మన కళ్ల ముందు ఆవిష్కరించుకుని ఆ కథానుభూతిని మాత్రమే ఆస్వాదించాలి. అటువంటి నవలే ఇది.
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ