జీవం ఉన్న జీవితంలోకి

 జీవం ఉన్న జీవితంలోకి

-శృంగవరపు రచన



మనిషి తన జీవితంలో తనకు ఏది విలువైందో,ఏది కాదో ఎప్పుడు తెలుసుకుంటాడు? తనకున్న విలువైన ప్రతిభ తనలో అస్తమిస్తున్నప్పుడు దాని విలువ తెలిసి వస్తున్నప్పుడు దాని ప్రాధాన్యతను తన జీవితంలో ఎలా పెంచుకుంటాడు? మనిషి లోపల దాగి ఉన్న బాధ,అపరాధ భావం,ఎవరు లేని తనం నుండి జన్మించే మానసిక అపసవ్యతలు మనిషికి ఏం నేర్పిస్తాయి? మనిషి జీవితంలో తనకు అవసరం లేని వాటిని చేయనవసరం లేదని,మనిషి తనను గురించి తెలుసుకున్నాక ఎలా బ్రతకాలో,ఆ తెలుసుకోవడంలో కొన్ని సార్లు ఎన్ని అవరోధాలు దాటాలో స్పష్టం చేసే ఆంగ్ల నవల ప్రీతి షెనాయ్ రాసిన ‘Life is what you make it.’
ఈ నవలలో ముఖ్య పాత్ర అంకిత. అంకిత తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు. ఆమె తండ్రికి బదిలీ అవ్వడం వల్ల కొచ్చిన్ లో వారితో కలిసి ఉంటుంది. ఆమె అంతకు ముందు ఢిల్లీలో ఉన్నప్పుడూ ఆమె స్నేహితుడు వైభవ్. అతనితో స్నేహం ఉన్నప్పటికి అది స్నేహామో,ప్రేమో ఆమెకు స్పష్టత లేదు.అంకిత తల్లిదండ్రులు మగపిల్లలతో మాట్లాడటం, ఇంటికి రావడం వంటివి నచ్చవు. అందుకని అంకిత తల్లిదండ్రులు వాకింగ్ కు వెళ్లినప్పుడు తల్లిదండ్రుల గదిలో ఉన్న ల్యాండ్ లైన్ నుండి వైభవ్ తో మాట్లాడేది. అతనికి ఉత్తరాలు రాస్తూ ఉండేది. ఆమె సెంట్ ఆగ్నెస్ వుమన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది.
అక్కడ కాలేజ్ ఎలక్షన్స్ లో ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీ అవుతుంది.ఆ కాలేజీ తరపున జరిగే ఎన్నో ఈవెంట్స్ కు సెంట్ ఆగ్నెస్ కాలేజీ ఎన్నికల్లో నాయకులైన మిగిలిన అమ్మాయిలతో కలిసి అంకిత కూడా వెళ్తూ ఉంటుంది. అలా మహావీర్ కాలేజితో జరిగే పోటీకి కూడా వెళ్తుంది. అక్కడ ఆమెకు అభిషేక్ పరిచయం అవుతాడు. పరిచయం అయిన మొదటి రోజే ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. తర్వాత ఆమెకు ఓ ప్రేమ లేఖ పంపిస్తాడు.ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అతని ఇంటికి వెళ్తుంది.అతని గురించి తెలుసుకుంటుంది. అతనికి తల్లి లేదని, తండ్రి క్రైస్తవ మత సంస్థకు ఆఫ్రికాలో పని చేస్తున్నాడని, తనను కూడా అందులో భాగం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకు తనకు ఇష్టం లేకపోవడం వల్ల తనను వచ్చినప్పుడల్లా కొడతాడని, తన తల్లి హిందూ అవ్వడం వల్ల తనను అందులో భాగం చేసి తన తప్పు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడని చెప్తాడు.అక్కడ అభిషేక్ తో ఉండేది అతని తల్లి తండ్రి అయిన తాతయ్య మాత్రమే. అలా అభిషేక్ గురించి తెలుసుకున్నాక అతనికి తన మనసులో ఉన్న ప్రేమ చెప్పకపోయినా అతన్ని ఇష్టపడుతుంది.
ఆ తర్వాత అతనితో సన్నిహితంగానే ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు ఎమ్ బి ఏ లో బాంబేలో పెద్ద కాలేజీలో సీట్ వస్తుంది. కానీ అభిషేక్ కు రాదు. అందుకోసం ఆమెను కూడా తనతో పాటు అక్కడే ఉండిపోమ్మని అడుగుతాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఆ సీట్ ను వదులుకోవడానికి ఆమె ఇష్టపడదు. దానితో అభిషేక్ తో కూడా ముభావంగానే ఉంటుంది.చివరి సారిగా అతన్ని కలుస్తుంది. తనతో టచ్ లో ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు అభిషేక్. ఆ తర్వాత రోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడని వార్తల్లో వస్తుంది. ఇంట్లో ఆమె ప్రేమ గురించి తెలియదు. ఆ తర్వాత ఆమె బాంబే కళాశాలలో చదువుకోవడానికి తల్లిదండ్రులకు కూడా అక్కడికే బదిలీ కావడంతో వెళ్ళిపోతుంది.
ఎమ్ బి ఏ లో జాయిన్ అయిన అంకితలో క్రమక్రమంగా మార్పులు వస్తూ ఉంటాయి.అవి సాధారణ మార్పులే అయినా ఎంతో జాగ్రత్తగా గమనిస్తే తప్ప గుర్తించలేని మార్పులు. అంకితకు రాత్రుళ్లు నిద్ర పట్టదు. ఆ సమయంలో బాగా చదవడం, నోట్స్ తయారు చేసుకోవడం వంటివి చేస్తుంది. అలాగే పెయింటింగ్ వేయడం కూడా ప్రారంభిస్తుంది.జాగింగ్ అలవాటు చేసుకుంటుంది. ఆమె కొన్ని రోజుల్లోనే రికార్డ్ స్థాయి వేగంతో జాగింగ్ చేస్తుంది. అలాగే కవిత్వం కూడా రాస్తుంది. ఇన్ని పనుల్లో మునిగిపోయిన ఆమెకు తన రూమ్ ను శుభ్రంగా ఉంచుకోలేకపోతుంది. అదో రకమైన ప్రవృత్తి ఆమెలో అలవడుతుంది. ఏది చేసినా తొందరగా చేయాలనుకోవడం,ఓపిక ఉండకపోవడం ఆమెలో వచ్చిన మార్పులు. ఆమె గది శుభ్రం చేస్తున్న సమయంలో ఆమె తల్లి వైభవ్, అభిషేక్ ఆమెకు రాసిన ఉత్తరాలను చూస్తుంది. అంకిత ఇంటికి వచ్చిన తర్వాత గొడవ అవ్వడం,వాటిని కాల్చేయ్యడం జరుగుతుంది.
అప్పటి నుండి అంకితలో భయం మొదలవుతుంది. ఎందుకో తెలియని భయం ఆమెను వెంటాడుతూ ఉంటుంది. ఆమె కాలేజ్ కు కూడా వెళ్ళలేకపోతుంది. భయం,శూన్యం ఆమెను వెంటాడుతూ ఉంటాయి.ఎన్ని రోజులైనా ఆమె స్థితిలో మెరుగుదల లేకపోవడం వల్ల ఓ ఇద్దరు సైకియాట్రిస్ట్ లకు చూపించడం,వారి మందులు పని చేయకపోవడం,అంకిత రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఆమెను బెంగుళూరులో పేరు పొందిన మెంటల్ ఇన్స్టిట్యూషన్ లో చేర్పిస్తారు. అక్కడ వైద్యంతో కోలుకుంటుంది అంకిత. ఆమెకు బైపొలార్ డిజార్డర్ ఉన్నట్టు, దాని వల్ల మ్యానియాక్ దశలో ఆమెకు ఎనర్జీ ఎక్కువ ఉండటం, డిప్రెషన్ దశలో భయం,శూన్యత ఉండటం జరిగిందని డాక్టర్ స్పష్టం చేస్తాడు. ఈ డిప్రెషన్ దశలోనే ఆమె పుస్తకాలు కూడా చదవలేకపోతుంది. ఒకప్పుడు తన తెలివిని చూసుకుని గర్వపడిన ఆమెకు కనీసం అక్షరాలు చదివి అర్ధం చేసుకునే పరిస్థితిలో కూడా లేకపోవడం వల్ల జీవితంలో తాను కోల్పోయినదేమిటో తెలుసుకుంటుంది. మెల్లగా అభ్యాసం మీద ఆమె మరలా చదవగలుగుతుంది. అక్కడ వైద్యం పూర్తి అయ్యాక ఆమె ఎమ్ బి ఏ వదిలేసి క్రియేటివ్ రైటింగ్ కోర్స్ ,ఆర్ట్ కు సంబంధించిన కోర్సులు చేస్తుంది. ఆర్ట్ థెరపిస్ట్ గా స్కూల్స్ ,కాలేజీలకు, కార్పరేట్ సంస్థలకు పని చేస్తుంది.ఆమెను అర్ధం చేసుకునే భర్తను పెళ్లి చేసుకుంటుంది. తల్లి అవుతుంది. అలా తన జీవితంలో తనలో అంతర్గతంగా ఉన్న అసలైన వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని జీవించేలా చేసి తాను జీవించింది అంకిత.
జీవితంలో మనిషికి నచ్చి,తనకు మాత్రమే సంతృప్తి ఇచ్చే ఎన్నో అభిరుచులకు మనిషి ప్రాధాన్యత ఇవ్వకపోయినా,అవి చేయలేని దశలో ఉన్నప్పుడూ మాత్రం వాటిని అన్నింటికన్నా ప్రాధాన్యత ఉన్న అంశంగా భావిస్తాడు. దానికి కారణం నేటి మనిషి జీవితంలో నచ్చినవి ఎప్పుడైనా చేయవచ్చనే అభిప్రాయం ధృఢపడి ఉండటం. కానీ ఆశాశ్వతమైన జీవితంలో నచ్చింది చేయలేని పరిధిలో ఇమడటం అంటే ఇంకా జీవితాన్ని జీవించే దశకు చేరుకోనట్టే. కారణాలు లేని వారు లేరు, కానీ జీవించాలా ?వద్దా ?అన్నది వ్యక్తి తనకు తాను మాత్రమే స్పష్టత ఉంచుకోగల అంశం.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!