‘మనం’ ఉన్న జీవితంలోకి

 ‘మనం’ ఉన్న జీవితంలోకి

-శృంగవరపు రచన



మనం చేసే పనులకు మూలం ఏమిటి? మనం ఇష్టపడే అంశాలు ఏవి? మనం జీవించడంలో మన ఆలోచనలకు పనులకు మధ్య సమన్వయం ఎంత వరకు ఉంటుంది ? మనం చేసే పనుల్లో యాంత్రికత,భయం,బాధ్యత ఉన్నాయా లేక మనల్ని సూచించే మన ఇష్టాలు-అభిరుచులు ఉన్నాయా? మనం మన కోసం జీవించడం కోసం నిజంగా ఏం చేస్తున్నాము? ఏం చేస్తే మనం మన కోసం బ్రతకగలము? ఇన్నాళ్ల జీవితంలో మనకు ఏది ఇష్టమో,ఎందుకు ఇష్టమో అన్న అంశాలకు మనం ఏ మేరకు ప్రాధాన్యత ఇచ్చాము? మన ఇష్టాలు ఎలా జన్మించాయి? వాటి మీద మన ప్రభావం ఉందా? లేక సమాజం,కుటుంబం ప్రాధాన్యతలు వాటిని ప్రభావితం చేస్తున్నాయా? నిజంగా ఈ క్షణం మనం మన జీవితం మార్చుకోవాలంటే వేటిని వదిలించుకోవాలి? ఆ వదిలించుకోవడంలో మనల్ని మనం ఎలా వెతుక్కోవాలి? మనం చేయలేమనే న్యూనత లేదా మన మనసు పొరల్లో ఉన్న ఆదిక్యత వంటి భావనలను,అలాగే మన స్వరూపంలో తప్పులు చూసినప్పుడు వాటిని ఆమోదించలేని డినైల్ దశను ఎలా దాటాలి? భయాలను,ఇగో ఫీడ్ లను,అభద్రతలను వీటి నుంచి జన్మించే భయంకర వ్యక్తిత్వం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ‘మంచి మనుషులు’ అని అనిపించుకోవడానికి మనల్ని మనమే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలి? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని స్పష్టం చేసే నవలే జలంధర గారి ‘పున్నాగపూలు’ నవల.
ఈ నవలలో జి.కె. హాస్పటల్ లో అడ్మిట్ అయ్యే రోగులకు రోగం మూలాలకు,ఆలోచనలకు,అపసవ్యమైన పాటర్న్స్ ను మొదట తెలుసుకుంటూ, సైకోథెరపీ ద్వారా,ఆలోచనలను అఫర్మేషన్స్ ద్వారా ట్రెయిన్ చేస్తూ,మందులకు తోడుగా ఆ రోగాన్ని సమూలంగా తెలుసుకుంటూ, ఆ రోగం అందించే సందేశాన్ని రోగికి తెలిసేలా చేస్తూ,ఆ రోగి రోగాన్నే కాకుండా జీవితాన్ని సైతం మార్చేలా చేస్తుంది. ఆ హాస్పటల్ గోకుల కృష్ణ పేరు మీద ఆయన ఆలోచనలు,ఆశయాలను ప్రతిబింబించేలా కట్టబడింది. ఆయన రాధకు పెదనాన్న. ఈ నవలలో రాధ ప్రధాన పాత్ర. ఈ నవలలోని రాధలో ప్రతి సగటు గృహిణి శాతం మాత్రం ఎంతో కొంత ఉంది.
రాధ భర్త రాజారావు.అతనికి లివర్ పాడవ్వడంతో వైద్యం కోసం జి‌.కె హాస్పటల్ లో చేర్పిస్తారు. ఈ హాస్పటల్ లోనే రాధ తన గురించి, తన జీవితం గురించి తెలుసుకుంటుంది.సాధారణ గృహిణి అయిన రాధ భర్త,అత్తమామల చేత మంచి అమ్మాయి అనిపించుకోవడానికి అన్నింటిని భయంతో భరిస్తూ అదో భద్రతా వలయం అనుకుని బ్రతికింది. ఆమెకు తెలిసిన ప్రపంచంలో ఆమె పుట్టినప్పటి నుండి తెలిసిన మనుషుల్లో ఆమెకు జీవితం పట్ల ఏర్పడిన అవగాహన మంచిగా ఉండే ప్రయత్నం చేయటమే జీవితం అని స్పష్టం చేసింది. ఆ మంచిగా ఉండటం తన కోసం కాదని తన చుట్టూ ఉన్నవారికి మంచిగా ఉండేలా ఉండాలనే ఆమె భావిస్తూ బ్రతుకుతుంది.
జి.కె. హాస్పటల్ లో జాయిన్ అయ్యే వివిధ రోగుల వల్ల సమాజంలోని అనేక రకాల మనుషులు ఎలా తమకు సంబంధం లేని,తాము లేని జీవితాలు బ్రతుకుతున్నారో స్పష్టం అవుతుంది. ఈ హాస్పటల్ లో షీలా సైకో థెరపిస్ట్. రోగులకు వారి మనస్థితులను అనుసరించి వారి ఆలోచనలల్లో మార్పు తీసుకురావడానికి అఫర్మేషన్స్ రాయించడం, వారు వారి జీవితాన్ని ఎటువంటి అభద్రతలు,భయాలు లేకుండా చూసే మార్పును తీసుకువచ్చే సెషన్స్ నిర్వహించడం,వీటికి శాస్త్రీయ పరిశోధనలు, అప్పటికే జి‌కె బ్రతికి ఉన్నప్పుడు అవలంబించిన పద్ధతులను పాటించడం ఈ వైద్యంలో భాగంగా జరుగుతుంది.
రాధ భార్యగా ఎలా బ్రతికింది?ఎలా బ్రతుకుతుంది?అన్న అంశం గురించి కానీ,తన జీవితం గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు. ఆమెకు పిల్లలు లేరు. అత్తవారింట్లో అందరికీ నచ్చేలా ఉండటానికి భరించడాన్ని మంచిగా భావించడం,అలానే భర్త హింసించినా భరించడం,అదే జీవితం అనుకోవడం తప్ప ఆమెకు వేరేలా ఆలోచించడం రాదు. ఆమె తల్లి లావణ్య.ఆమె గొప్ప అందగత్తె.ఒకప్పుడు ఆమె,జి‌కె ప్రేమించుకున్నారని,అలానే లావణ్య తండ్రితో జికె వ్యాపారం కూడా చేసి నష్టపోయాడని, కానీ తర్వాత జి‌కె వైద్యుడవ్వడం లావణ్య మనస్తత్వంతో పొసగకపోవడంతో వారిద్దరూ వివాహం చేసుకోలేదని,ఇంకొకరితో గర్భవతి అయిన లావణ్యను జికె తమ్ముడు వివాహం చేసుకోవడం జరిగిందని రాధాకు తెలుస్తుంది. ఆ హాస్పటల్ లో ఉండగానే తన జీవితంలో తన ప్రమేయం లేకుండా జరిగిపోయిన,జరుగుతున్న ఎన్నో సంఘటనల గురించి రాధ తెలుసుకుంటుంది.
భర్తకు ఇంకో స్త్రీతో సంబంధం ఉండటం మరియు వారికి ఓ కొడుకు ఉండటం గురించి కూడా రాధ తెలుసుకుంటుంది. ఒకప్పుడు జికె శిష్యుడు అయిన కృష్ణకు,రాధకు వివాహం చేయించాలని జి‌కె చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి లావణ్య,అలాగే కృష్ణ తల్లిదండ్రులు కలిసి ఆ సంబంధం కలవకుండా ఉండాలని రాజారావు గురించి కొంతమేరకు తెలిసిన సరే పంతంతో రాధ వివాహం చేయించారని కూడా తెలుసుకుంటుంది రాధ.
అప్పటి వరకు ఎమోషనల్ గా మాత్రమే ఆలోచిస్తూ భయపడటమో,బాధ పడటమో చేసే రాధ తాను ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచించుకోవాలో నేర్చుకుంది. ఈ నవలలో ముఖ్య పాత్ర షీలా.సైకో థెరపిస్ట్ అయిన ఆమె రోగులకు ఆలోచించడం,తమ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలా ఆలోచనలను మలచుకోవడం నేర్పించడం చూసిన రాధ కూడా క్రమంగా తన గురించి,తన జీవితం గురించి ప్రేక్షకురాలిగా ఆలోచించడం నేర్చుకుంది. రాజారావు అంటే భయపడటం మానేసింది. కానీ సేవా పరంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంది.అలాగే అక్కడ హాస్పటల్ లో నిస్సహాయంగా ఉన్న రోగులకు తన వంతు సహకారం అందించడం వల్ల అప్పటి వరకు తన ఇంటికే పరిమితం అయిన రాధకు తనలో ఉన్న ఇంకో రూపాన్ని కూడా దర్శించే అవకాశం కలిగింది.రాధ తనలో ఉన్న సౌమ్యతను తన బలహీనత నుండి బలంగా మార్చుకుంది.
రాధలో ఈ మార్పు రాజారావును ఆశ్చర్యపరిచింది. రాజారావుతో సంబంధం ఉన్న స్త్రీని రాజారావు బంధువుగా కలిసి ఆమె గురించి తెలుసుకుంది. అంతే కాకుండా రాజారావు తల్లిదండ్రులను కూడా ఒప్పించి రాజారావుకు ఆమెకు వివాహం కూడా చేయించింది. తాను విడకులతో మౌనంగా అతని జీవితం నుండి తప్పుకుంది. ఆమె ప్రవర్తించిన తీరు ఆమె తల్లిదండ్రులనే కాకుండా రాజారావును,అతని కుటుంబాన్ని కూడా ఆశ్చర్యపరిచింది.
జి‌కె ఆ హాస్పటల్ లో రాధకు పార్టనర్ షిప్ ముందే రాయడం వల్ల ఆమె అప్పటికే స్వతంత్రంగా బ్రతకాలని నిర్ణయించుకోవడం వల్ల ఆమె విదేశంలో చదువుకోవాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోయింది. కృష్ణ తనను ప్రేమించిన విషయం తెలిసినా ఎంతో సంయమనంతో వ్యవహరించి తన జీవితాన్ని మలచుకునే ప్రయత్నమే జీవితంగా రాధ మలచుకుంది.
ఈ నవలలో ఎన్నో ప్రశ్నలు...ఎన్నో సమాధానాలు ...అలానే ఇంకా ఇన్ని తెలుసుకున్నాక ఇంకా ఎప్పటిలానే ఎలా ఉండిపోవడం అనే అసంతృప్తి...ఇలా ఎన్నో భావాలు. మనిషి జీవితంలో సాధారణంగా,అందరిలా జీవించడం మంచిదనే భావనతో ఉంటాడు. కానీ ఏది సాధారణత్వం కిందకి వస్తుందో కూడా స్పష్టత లేని అంశమే.ఒక్కొక్కరి జీవితం ఒక్కో కథ. ఆ ఒక్కో కథలో ఒకేలా ఉండే,ఉందని పరిస్థితులు,మనుషులు ,మార్గాలు. ఇన్ని విభిన్నతల్లో ఏది సహజత్వం?ఏది అసహజత్వం అన్నది ఎలా నిర్ణయించాలి. మనిషికి నార్మల్ గా ఉండే ప్రయత్నంలో తనకు తాను అబ్ నార్మల్ గా తయారు అయితే అది ఎవరికి తెలియదు కనుక వ్యక్తిగతంగా మనిషి మనఃస్థితి వరకే కనుక అది సమర్ధనీయమైన అంశంగా మారిపోతుందా?
మనకు తెలిసిన వ్యక్తులని మనం భావించే వారి గురించి నిజంగా మనకు ఏం తెలుసు? ఎలా తెలుసుకోగలుగుతాము?ఎప్పుడు తెలుసుకుంటాము?ఏదో వెర్రిగా మనతో ఉండేవారు ఎప్పటికీ మనతోనే ఉండిపోతారనే కంఫర్ట్ జోన్ ను ఏర్పరచుకుని మనం ఎన్ని అసంతృప్తులతో ఉన్న ఆ జోన్ ఉన్నదని సంబరపడటం,ఆ తర్వాత ఆ జోన్ అసలు లేదని తెలిసే సరికి ఏం చేయాలని నిస్సహాయతలో ఉండిపోవడం ఎన్నో జీవితాల్లో సహజంగా జరిగిపోయేవే. కనుక మీ జీవితం గురించి ఆలోచించేటప్పుడు మీ జీవితంలో ప్రతి అంశంలో మీ గురించి,మీకు ఉన్న అవగాహన గురించి ఆలోచించండి. ఎవరో ఉన్నారు కనుక మీ జీవితానికి వచ్చిన ఢోకా లేదనే నమ్మకం అన్నీ సార్లు మంచిది కాకపోవచ్చు.కనుక మన జీవితం గురించి మనం జాగ్రత్త పడటం,మన ఆలోచనలు,మన చుట్టూ ఉండే వాతావరణం గురించి ఎప్పుడూ అవగాహనతో ఉండటం మాత్రం తప్పనిసరి అవ్వాలి. ఈ నవలలో ఆలోచించడంలో ఎలా మార్పులు చేసుకోవచ్చో,మనం ఉన్న భ్రమల నుండి ఎలా బయటపడవచ్చో,అలానే అన్నింటిని కేవలం సూచనలుగా కాకుండా అప్పటికే జరిగిన పరిశోధనలను కూడా పేర్కొని జలంధర గారు ఎంతో చక్కగా రాశారు. వ్యక్తిత్వ వికాసంతో వచ్చే కల్పనా సాహిత్యం నేడు అందుబాటులో ఉన్నా,మానసిక శాస్త్రం-మనుగడ-భ్రమలను చీల్చుకుని వెలుగును ఎలా చూడాలో మన జీవితాలన్నీ చూసి చెప్పే రచనలు మాత్రం స్వల్పం. అటువంటి అరుదైన రచనను అందించిన జలంధర గారి రచనలు మానసికంగా అప్పటి వరకు ఉన్న ఢోల్లలను మనకు మనమే చూసుకునేలా చేస్తాయి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!