నువ్వు నువ్వుగా .....
నువ్వు నువ్వుగా .....
- రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)
సెన్సేషనల్ న్యూస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన వై న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రఖ్యాత ఆటగాడు చంద్రహాస్ తన భార్య ప్రవల్లిక తనను అతిగా ప్రేమిస్తుందని , ఆ అతి ప్రేమే తనని మానసికంగా ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా విడాకులు ఇవ్వాలనుకోవడం నేటి చర్చనీయాంశమైనది.....సాగిపోతుంది వార్తల ప్రవాహం.
వార్తలు చూస్తున్న ప్రవల్లిక ఓ రకమైన ఏదో తెలియని బాధకు అతీతమైన భావానికి లోనైంది. తన విడాకుల వార్తను సెన్సేషన్ గా న్యూస్ ఛానల్ లో వీక్షించే అతి కొద్ది మందిలో ఆమె ఒకరు కావడం అందుకు కారణమేమో! ఒక్కసారిగా ఆమె ఆలోచనలు భర్త మీదకు మళ్లాయి. విడిపోయే ముందు రోజు అతను అన్న మాటలు ఇంకా తడి ఆరకుండా ఆమె మనసును ద్రవింపజేస్తూనే ఉన్నాయి.
‘చూడు ప్రవల్లికా ...ఇద్దరు మనషులు కలిసి జీవించాలంటే వారిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంటే చాలు అని గాఢంగా నమ్మే వ్యక్తివి నువ్వు. నీ ఆలోచనల్లో నేను తప్ప ఇంకేమీ ఉండదు. భార్యా భర్తల మధ్య ఆకర్షణ జీవితాంతం నిలవగలిగినప్పుడే ఆ ఇద్దరి జీవితం మరింత ఉత్సాహంగా,ఆసక్తితో సాగుతుంది. నాకు కీర్తి ప్రతిష్టలు, నన్ను నేను అనుక్షణం గొప్ప వ్యక్తిగా నిర్మించుకోవడం లాంటివి నా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాలు. నా జీవిత భాగస్వామి నా ఆశయాలని అర్ధం చేసుకుని , నాకు తగిన స్పేస్ ఇస్తూ ,అంది అందని ద్రాక్షలా ఉంటూ నాలో ప్రతిక్షణం ఆరాధనను, ఆసక్తిని పెంచుతూ,తాను కూడా తనదైన శైలిలో ఏదైనా సాధించాలి అని నా కోరిక. కానీ నిరంతరం నా గురించే ఆలోచిస్తూ ,ఇంటికి రాగానే ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రపంచంలో నేను తప్ప వేరే విషయం లేనట్టు ప్రవర్తించే నువ్వు అంటే నాకు ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. నువ్వు నన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఇది కాదనలేని సత్యం.
కానీ ఇలా వ్యక్తిత్వాన్ని , ఉనికిని మరచిపోయి ఇలా బ్రతికేవారంటే నాకు అసహ్యం. నువ్వు నువ్వుగానే ఉండాలి అని కోరుకున్నాను. కానీ అలాంటి మార్పు నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. అందుకే విడిపోదాం అని నిర్ణయించుకున్నాను.’
ప్రేమతో అతని గుండె అంతా తానే నిండిపోవాలి అని కోరుకునేది తను. అందుకంటే తన మనసులో , ఆలోచనల్లో అన్నింటిలో భర్త. కానీ అదే తనను అతని నుండి దూరం చేస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. తను చేసింది ఎలా తప్పో ఆమె తర్కనికి అందడం లేదు. ఆ క్షణంలో ఆమె మదిలో మెదిలింది కిరణ్మయి. తన మనస్సులోని ఆలోచనలను సరిగ్గా అర్ధం చేసుకునే తన స్నేహితురాలు.
జీవితంలో ప్రతి దానికి ఓ తర్కం (లాజిక్) ఉంటుందని అని వాదించేది కిరణ్మయి. కానీ ప్రేమ మాత్రం లాజిక్ కి అందని ఓ వింత అనుభూతి అని వాదించేది తను. ఈ సమయంలో ఈ తప్పు ఏ తర్కరహితం వల్ల ఉత్పన్నం అయ్యిందో విశ్లేషించి చెప్పగల వ్యక్తి తనొక్కటే. వెంటనే కిరణ్మయికి ఫోన్ చేసి రమ్మంది.
* * *
‘ప్రేమ తర్కరహితః బుద్ధి తిలోదకః’ అంది కిరణ్మయి.
‘ఏంటే ఏదో కష్టంలో ఉన్నాను కదా అని ...నీతో చెప్పుకుంటే మనస్సు తేలికవుతుందని నిన్ను పిలిస్తే ఇలా ఏదో స్వామీజీలా ఉపదేశవాక్యాలు చెప్తావే ?’ అని విరుచుకుపడింది ప్రవల్లిక.
‘ఇది ఉపదేశ వాక్యం కాదే ...చాలా కాపురాలు విడిపోవడానికి, తల్లిదండ్రులని పిల్లలు భారంగా భావించి వృద్ధాశ్రమాలకి పంపడానికి , మనిషి కేవలం తను, తన కుటుంబం అన్న చట్రానికి పరిమితం అవ్వడానికి అసలైన కారణం ఇదేనే ప్రవల్లికా ...’ అంది కిరణ్మయి .
‘అసలు ఈ విషయాలన్నిటికి , ప్రేమలోని తర్కానికి, బుద్ధికి సంబంధం ఏమిటి? చూస్తూ ఉంటే సైకాలజిస్టుగా కేసులు చూసి చూసి నీకు పిచ్చెకిందేమోనని నాకనిపిస్తుంది’, అంది ప్రవల్లిక.
‘పిచ్చి లేదు ..పైత్యం లేదు ...చెప్పేది సరిగ్గా విని దానిలోని తర్కాన్ని(లాజిక్ ని ) అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు.
ఒక వ్యక్తికి ఈ లోకంలో అంతర్లీనంగా ఎంతమందితో సంబంధం కలిగి ఉంటుంది చెప్పు? తల్లితండ్రులు, జీవిత భాగ స్వామి, సమాజం,స్నేహితులు ...ఈ ప్రవాహం అనేది ఆగదు. జీవితం అంటే ఈ ప్రవాహం అందరితోనూ సాగిపోవడం. అప్పుడే మనిషిలో ఆశించే గుణం తగ్గి అందరితో కలిసి ఉండటం అలవడుతుంది. కలిసి ఉండటం, అందరితో కలసిపోవడం అంటే ఏమిటి? మనలోని గుణాలు అంటే ప్రేమ, వాత్సల్యం ,అభిమానం, ఉపకారం ..ఇలాంటివన్నీ అందరితో పంచుకోవడం. అప్పుడు మనిషికి ‘ఎమోషనల్ డిపెండెన్సీ’ తగ్గిపోతుంది. అప్పుడు అందరితోనూ ఆనందంగా ఉండగలము. తనొక్కడే ఉన్నా ఆహ్లాదంగా ఉండగలడు. అలా ఆనందంగా అన్నీ పరిస్థితుల్లోనూ ఉండగలిగితే అప్పుడు సమస్యలు అనేవే రావు.
కానీ ఇప్పుడు జరుగుతుందేమిటి ప్రవల్లికా ? ఉదాహరణకు నీ విషయమే తీసుకో ... నీలో ఉన్న ప్రేమ గుణాన్ని ఒక వ్యక్తికే పరిమితం చేశావు. స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో పెడితే ఏమవుతుంది? అలానే నీ గుణాన్ని(ప్రేమను) ఓ చట్రంలో (భర్తకు) పరిమితం చేశావు. అన్ని చోట్లా స్వేచ్ఛగా గలగలా పారుతూ గోదారిలా విస్తృతంగా ప్రవహించాల్సిన ప్రేమను సంకుచితం చేశావు. ఎప్పుడైతే ప్రేమ తర్కరహితమవుతుందో అప్పుడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది.’
‘అదేంటి కిరణ్ ...ఓ భార్య భర్తను మాత్రమే ప్రాణంగా ప్రేమించడం తప్పా? అది పాపమా?
సంబంధ బాంధవ్యాలు ఆ ప్రేమతోనే కదా బలపడేది ? ఆఖరికి ఏ రోజు నేను పుట్టింటికి కూడా వెళ్లలేదు. నా అభిరుచులు కూడా పక్కన పెట్టాను. తానే లోకంగా గడిపానే ..అదే తప్పా ?’
‘మళ్ళీ మొదటికే వచ్చావు ప్రవల్లికా ..తినగ తినగా వేము తియ్యనుండు అంటారు ..
అలాగే తింటూ ఉంటే స్వీట్ కూడా వెగటుగానే ఉంటుంది. ‘అతి’ అనేదే ఏ బాంధవ్యాన్నైనా దెబ్బతీస్తుంది.
మదర్ థెరిస్సా ది ప్రేమే! షాజహాన్ ది ప్రేమే! ఓ భార్యకు భర్త మీద ఉండేది ప్రేమే. తల్లితండ్రులకి పిల్లల మీద ఉండేది ప్రేమే. కానీ ప్రేమ అనగానే విశ్వజననీయమైన మదర్ థెరిస్సా ప్రేమ మాత్రమే ఎందుకు గుర్తుకొస్తుంది? ఎందుకంటే అది మానవత్వంతో కూడిన ప్రేమ.
ఎవరో అన్నట్టు ...
‘ఐశ్వర్యరాయిలా ఉండాలంటే అదృష్టం ఉండాలి...
థెరిస్సా లా ఉండాలంటే మానవత్వం ఉంటే చాలు.’
నీవు నీవుగా ఉండకుండా, నీలో ఉన్న ప్రేమను నలుగురికి పంచకుండా ఒక్క నీ భర్త చుట్టూనే తిరగడం వల్ల జీవితం నిన్ను మిగిలిన అంశాలన్నిటికి దూరం అయ్యేలా చేసింది. నీ పుట్టిల్లు , చిన్నప్పటి నుండి నీకున్న సామాజిక స్పృహ అన్ని నీకు పరాయి అయ్యాయి నేడు ఈ సంకుచిత్వ ప్రేమ వల్ల.
ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండాలంటే ప్రేమను సమస్థితిలో ఉంచాలి. అన్ని విషయాల్లోనూ దాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
అప్పుడు మాత్రమే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిన ‘నేను మాత్రమే’ అన్న భావనా నుండి బయట పడి ‘ప్రపంచంతో నేను’ అన్న పరిధిలోకి అడుగుపెడతాము.
ఆలోచించు ప్రవల్లికా ...నిన్ను ఓదార్చి నువ్వే రైట్ అని చెప్పే మనిషిని కాదు నేను ...తర్కంతో ఆలోచించి ప్రపంచంతో కలిసి బ్రతకడం నేర్చుకొమ్మని మాత్రం చెప్పగలను.’
ఆలోచనల్లో మునిగిపోయిన ప్రవల్లికకు కిరణ్మయి ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలియలేదు.
ప్రపంచానికి, సమాజానికి మధ్య లింకు ఎక్కడ తెగిపోతుందో క్రమక్రమంగా అర్ధమవ్వసాగింది ప్రవల్లికకు. దానితో పాటు తన తప్పు కూడా అర్ధమవ్వసాగింది.
* * *
‘ఆంటీ ...నేను వేసిన ఈ పువ్వుల పెయింటింగ్ ఎలా ఉందో చెప్పరా?’ అంటూ చుట్టూముట్టిందో చిన్నారి.
‘ఆంటీ ..నేను వేసిన ఈ పెయింటింగ్ ఎలా ఉందో చెప్పరూ?’ అని గడుసుగా అడిగాడో ఓ గడుగ్గాయి.
మాట్లాడటానికి వీలు లేకుండా ఆ చిన్నారుల ముద్దు ముద్దు మాటలు వారి గడుసు చేష్టలు , పెయింటింగ్ నేర్చుకుంటూ ,అది తనకి చూపించాలని వారు పడే తపన ...అంతా ప్రవల్లికకు కొత్త ప్రపంచంలా ఉంది.
ఈ లోపు వెనక నుండి వచ్చి కళ్ళు మూశాడు ఇంకో గడసరి.
‘ఆంటీ ...మీ కోసం నేనేం తెచ్చానో చెప్పుకోండి చూద్దాం’
‘నువ్వే చెప్పమ్మా ..’
‘రంగా తాత చూడకుండా దొర జామ పండు కోసి తీసుకొచ్చాను ఆంటీ ...’ నవ్వుతూ జేబులోని కాయ తీసి ఆమె చేతిలో పెట్టాడు.
‘ప్రవల్లికా ...ఇప్పటికే సాయంత్రం అయిపోయింది ...ఇక ఇంటికి వెళ్దామా?’
‘లేదమ్మా ...నాకు ఇక్కడ చాలా బావుంది ...ఇంకాసేపూ ఈ పిల్లలతోనే ఉంటాను ...’
‘చూడమ్మా ..నీకు అంతగా నచ్చితే మన ఊరి మునసబుగారితో మాట్లాడి మన ఊరి మధ్యలో ఉన్న జాగాను బాగు చేసి అక్కడే పెయింటింగ్ స్కూల్ పెట్టిస్తాను. అప్పుడు రోజు అక్కడే ఉంటూ వీళ్ళందరికి నేర్పించవచ్చు. సరేనా తల్లి ?’ అడిగాడు శ్రీనివాస్ కూతురులోని మార్పు చూసి పరమానందభరితుడై.
‘థ్యాంక్ యూ నాన్న ...అదేదో త్వరగా చేయండి .’
‘తప్పకుండా తల్లి.’
ప్రపంచంలో ఎంత ప్రేమ ఉందో ఆ పిల్లల్ని చూసాకే అర్ధమయ్యింది ప్రవల్లికకు. నువ్వు నువ్వుగా బ్రతకడం అంటే నీకున్న అభిరుచులని అందంగా మలుచుకుంటూ అందరికీ ఉపయోగపడేలా బ్రతకడమే అని ఆమెకు బోధపడింది.
* * *
‘కిరణ్మయి నువ్వు చేసిన మేలుకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు.’
‘అవేం మాటలు చందూ...ప్రవల్లికా నీకు భార్య మాత్రమే కాదు ,నాకు స్నేహితురాలు కూడా. తనలోని మార్పు మనందరికీ , తనకి కూడా ఆనందదాయకం అయినప్పుడు అంతకు మించిన సంతోషం ఏముంటుంది చెప్పు?’
‘నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కిరణ్ ....మా అత్తయ్య వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ...ఎప్పుడు పుట్టింటికి దూరంగా నా కోసం ఉండి పోయే తను ...వాళ్ళతో ఆనందంగా గడపటం ...ఒకప్పటి తన పెయింటింగ్ లోకంలో మునిగి పోవడం ...ఖాళీగా ఉన్నప్పుడు ఆశ్రమాలకు వెళ్ళి అందరితో అరమరికలు లేకుండా ఆనందంగా గడపటం ..
ఇవన్నీ నిజంగా తమ కూతురేనా? అన్నంత సంభ్రమాన్ని వారికి కలిగిస్తున్నాయి అంటే నమ్ము వారికి. ..నీకో విషయం తెలుసా కిరణ్ ? తన కోసం ఓ పెయింటింగ్ స్కూల్ కూడా పెట్టే ప్రయత్నంలో ఉన్నారు మా మావయ్యగారు. కానీ నాకో భయం ఉంది కిరణ్.’
‘భయమా! దేనికి ?’
‘మనం ఆడిన విడాకుల నాటకం అంతా బయట పెట్టాల్సిన సమయం వచ్చింది కదా! ఇదంతా తనని మార్చడానికి మనందరం కలిసి ఆడిన నాటకం అని తనకు తెలిస్తే , తాను నన్ను క్షమిస్తుందంటావా కిరణ్ ?’
‘నిజంగా తనలోని మార్పు శాశ్వతం అయితే క్షమిస్తుంది. లేకపోతే తనలో ఆ మార్పు వచ్చేవరకు మనం వేచి ఉండాలి’, అంది కిరణ్మయి .
‘అలాగే జరుగుతుందని నమ్ముతున్నాను కిరణ్.’
* * *
చాలా బావుంది రచన గారు...నైస్💐💐💐💐
ReplyDeleteధన్యవాదాలండీ
Deleteఅతి ఏది ఏమైనా ebbande. బాగుంది
ReplyDelete