సంకుచితత్వం తృంచి....సమిష్టినే పెంచి

సంకుచితత్వం తృంచి....సమిష్టినే పెంచి

సంకుచితత్వం తృంచి ...సమిష్టినే పెంచి 
                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



సమానత్వాన్ని ఒక పదంలో నిర్వచించాలంటే 'సంతోషం.' మానవ పరిణామ క్రమం నిర్మాణాత్మకంగా  ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే స్త్రీ, పురుషులిద్దరూ బాధ్యతలో  సగభాగాన్ని పంచుకుంటూ అదే వారసత్వాన్ని ముందు తరాల వారికి అందివ్వాలి. 'వ్యక్తిగత సమానత్వం' అనే అంశాన్ని ప్రశ్నించే ముందు 'సమిష్టి సమానత్వం' గురించి లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే సమాజం నీడ కిందన ఏర్పడిన కుటుంబ వ్యవస్థ వ్యక్తిగతమైనది కాదు. కనుక ఓ సమిష్టి వ్యవస్థలో ఉంటూ వ్యక్తిగతంగా మాత్రమే ఆలోచించడం సంకుచిత్వ ధోరణికి సంకేతం. 
స్త్రీ సమానత్వం అనగానే నేడు స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు గుర్తుకొస్తాయి. అవే దాడులు పురుషుల మీద స్త్రీలు చేయడం లేదు కదా! దీనికంతటికీ కారణం పురుషులతో సమంగా స్త్రీలను చూడకపోవడమే అనే ఓ రకమైన ధోరణి మనసులో అస్పష్టంగా ఏర్పడుతుంది. కానీ కాస్త పరిశీలించి చూస్తే నాణేనికి  రెండు వైపులు బొమ్మే ఉండాలంటే కుదిరే అంశం  కాదు. 
బాధ కూడా సంతోషానికి ఓ పరిణామక్రమమే. కాకపోతే ఆ పరిణామం 'ఓ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో ఇంకో సమస్యను కొని తెచ్చుకునే అస్పష్టమైన  ఉద్విగ్నత నుండి జన్మిస్తుంది.' మానసిక  శాస్త్రం లేదా తత్వ శాస్త్రం దేని ప్రకారం చూసినా ఓ మనిషిలో ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి సంతోపడాలనే  పైశాచిక నైజం ఎందుకు అలవడుతుంది? సంతోషం విషయంలో అసంతృప్తి ఏర్పడటం వల్లే కదా! ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అందరూ సంతోషం గా ఉంటే ఏ విధమైన ఘోరాలు జరగవు కదా! ప్రపంచంలో సమస్య ఏదైనా సంతోషమే నిజమైన అత్యుత్తమమైన  పరిష్కారం. 
ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా 'సమానత్వవాదం' పరిపూర్ణరూపంగా పరిపుష్టం అవ్వకపోవడానికి కారణం ఈ వ్యక్తిగత, సమిష్టి కోణాల మధ్య ఏర్పడే అస్పష్టత, అసమతుల్యత. దీని వలన ప్రపంచంలో ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుని యోగులుగా మారి ప్రపంచాన్ని ప్రభావితం చేసినవారు కూడా కుటుంబ వ్యవస్థలో భాగమై, బాధ్యతలు నిర్వర్తించాకే ఏకాంత దర్శనంలోకి ప్రవేశించారు. అలా మారిన తర్వాత కూడా వారు సమిష్టి విలువల్ని ప్రోత్సహించే విధంగానే సమైక్యత, సమానత్వం కలిగి ఉండాలనే ఆత్మను కలిగి  ఉన్నారు వారు. 
ఓ ఆత్మీయస్పర్శకు, వెన్ను తట్టి ముందుకు నడిపించే ప్రోత్సాహానికి, మనఃస్పూర్తిగా పెదాలపై విరిసిన చిరునవ్వుకు, ఎదుటివారి గెలుపును అసూయతో కాకుండా ప్రశంసాపూర్వకంగా చూసే దృక్పథానికి నోచుకున్నవారు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కుటుంబ వ్యవస్థలో లోపించినప్పుడు మనుషుల ఆలోచనాశైలి ఏ రీతిలో సాగుతుంది? గట్టిగా చెప్పాలంటే ఇవన్నీ మన చుట్టూరా ఉన్నవారికి, మిత్రులకు ,కుటుంబానికి మనం ఎక్కడ ఉంటే అక్కడ వెల్లివిరిసేలా చేయడమే సమానత్వమంటే! 
సమానత్వమంటే  మనమంతా ఓకే కుటుంబం అనే సంఘీభావం. సమానత్వం అనేది ఇంత విస్తృత పరిధి ఉన్న అంశం అయినప్పుడు దానిని వ్యక్తికో, ఓ వ్యక్తిగత  అంశానికో పరిమితం చేయడం అనేది పరిష్కారానికి బహుదూరంగా నిలబెట్టే భావజాలానికి దారితీస్తుంది. అప్పుడు సమిష్టి సంతోషం అనే అంశానికి బహుదూరం నుండి నిలబడి ఓ వ్యక్తి గురించో , ఓ అంశం గురించో మాత్రమే ఆలోచించే కింది మెట్టులో ఉంటాం. 
అమ్మ,నాన్న, నాయనమ్మ, తాతయ్య, పిల్లలు  అందరూ కలిస్తేనే  కుటుంబం. అదే ఇప్పుడు అమ్మ,నాన్న, పిల్లలకు కుదించబడింది. అంటే దానర్ధం  అమ్మానాన్నల బాధ్యత పెరిగింది అని. కానీ ఇంటా,బయటా అన్ని బాధ్యతలు నిర్వర్తించలేక కొన్ని కొత్త విలువలను వెలుగులోకి తెచ్చారు. పుస్తకాలు,ప్లే స్కూళ్ళు , గాడ్జెట్లు  ఇవే కుటుంబ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి పిల్లలకు ఇవ్వబడిన ప్రత్యామ్నాయాలు. మనుషులతో మెలిగితేనే కదా మానవ స్పర్శ తెలిసేది. అప్పుడే కదా మానసిక ప్రజ్ఞ, మానవ సంబంధాలు, ఎదుటివారి మనసు నొప్పించకుండా మెలగడం, ఏది తప్పు ? ఏది ఒప్పు ? వంటి విషయాలు తెలిసేవి. మీరే ప్రాణం లేని వస్తువులతో కాలం గడుపుతున్నప్పుడు  నిజంగా ప్రాణమున్న మనుషులుగా వాళ్ళు స్పందించాలని ఆశించడం ఎంతవరకు సబబు? విత్తు ఒకటైతే ఫలం ఇంకొకటి ఎలా వస్తుంది? ఆ విష ఫలమే సమాజంలో చీడ పురుగుగా మారి దాష్టీకాలకు కారణం అవుతుంది. 
మూలాన్ని ఖండించడం మాని బాధితులైన వారు బాధను పోగొట్టుకునే క్రమంలో ఇంకొకరికి బాధను కలిగిస్తూ ఉంటే వారినే తప్పు పడుతూ పోతే, ఈ పరంపర ఎక్కడ ఆగుతుంది? సమానత్వం అంటే సమానంగా డబ్బు సంపాదించడం కాదు, సమానమైన హోదాలు కలిగి ఉండటం కాదు, నిజమైన సమానత్వం అంటే మన తదుపరి తరానికి 'సంతోషం' అనే విలువలు అందించడం. దానికయ్యే శ్రమలో సమభాగం బాధ్యత తీసుకోవడం. 
డబ్బుతోనో, హోదాతోనో  సమానత్వ ఉనికిని నిలుపుకోవాలంటే అది ఎంతకాలం నిలబడుతుంది? మనల్ని వ్యక్తిగా గౌరవించలేని వారు మనం చంద్రుని మీదకు వెళ్ళి వచ్చినా సరే సత్కరించరు. అటువంటివారి గుర్తింపు కోసం ఓ ముసుగులో బ్రతకడం దండగ. జీవితాల్ని సమగ్రచిత్రంగా చూడటం ప్రధాన అంశం. ఆ సమగ్రచిత్రంలో ఒక వ్యక్తి కాదు ఉండేది, ఓ తరం -ఓ సమాజం -ఓ దేశం. సమిష్టి సంతోషమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఎక్కడైనా వ్యక్తిగత వివక్ష తలెత్తితే అప్పుడు అందరూ సమిష్టిగా ఆ సమస్యకై నిలబడి పరిష్కారాన్ని సాధించడం ఉత్తమం. అంతే కానీ సమిష్టిగా సంతోషాన్ని, విలువల్ని పక్కన పెట్టేసి అదే సమిష్టి సమాజంలో బతుకుతూ కేవలం వ్యక్తిపరమైన సంకుచిత పోరాటాలు చేయడం దీర్ఘ కాలంలో మానవహృదయ చిత్రాన్ని పూర్తిగా తల్ల కిందులు  చేస్తాయి. ఓ గొప్ప ఆశయం ఫలించాలంటే,ఎందరో శ్రమించాలి. ఎన్నో త్యాగాలకు సిద్ధం కూడా కావాలి. కానీ ఆ 'ఆశయం ఆత్మ' ఏమిటి అనే స్పష్టత లేకుండా ఆవేశపూరిత విన్యాసాలు ఎన్ని చేసినా అది నిజమైన ప్రభావాన్ని  ఎవరి పైనా చూపదు. ఓ వాదం అది సమానత్వమే కాదు అది ఏదైనా సరే వెలుగులోకి వచ్చినప్పుడు అందరూ దాన్ని ఆమోదించకపోయినా కనీసం దాని గురించి ఆలోచింపజేసేలా ఉండాలి. అలా లేనప్పుడు సమాజాన్ని, సమిష్టి బాంధవ్యాన్ని వీడిన ముడి ఎక్కడో ఉందన్నమాటే! సమిష్టి సంతోషం, దృఢపరిచే అనుబంధాలు, ఆత్మవిశ్వాసంతో సాగే ముందు తరాలు ప్రతికలుగా సమానత్వం  రెపరెపలాడాలని ఆశిద్దాం! 
     *      *     *   

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష