మగువ మనసు (మండోదరి ముచ్చట్లు )

మెరిసే తారలు

                              -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)


 

            స్త్రీకి సినిమాకు ఉన్న సంబంధం జీవన్మరణ యుద్ధం లాంటిది. ప్రతి ఒక్కరికి తమ వృత్తిలో అంచెలంచెలుగా ఎదగాలని ఉంటుంది. గ్లామర్‌ రంగం అందుకు మినహాయింపు ఏమీ కాదు. సినిమాకు, మిగిలిన వృత్తులకు ఓ కొట్టొచ్చే తేడా ఉంది. ప్రతి వృత్తిలోనూ మేధస్సు, సామర్భాల ఆధారంగా ఎదుగుదల ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం మేని మెరుపులే ప్రామాణికం. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ దశలు ప్రతి వ్యక్తి అనుభూతించి అనుభవించాల్సిందే. ఇది ప్రకృతి ధర్మం. దీనికి ఎవరికి మినహాయింపు లేదు. అదే ఆరోగ్యకరం కూడా. కానీ తెరపై తారలా మెరవడం” అన్నది ఎక్కువశాతం స్త్రీ సౌందర్యానికి గుర్తింపే అవడం అన్నది ఎందరో సినీతారల జీవితాల్ని మధ్యలోనే ముగిసేలా చేసింది. ఒక్కసారి ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక హోదా, ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తాక, మామూలుగా జీవించడం చాలా నిస్సారంగా తోస్తుంది. కానీ ఈ తెరపై వెలుగులు ఎంతకాలం శోభిస్తాయో ఎవరికీ అంతుపట్టని అంశమే.

            ఇవన్నీ పైకి కనిపించే జిలుగులే. కానీ ఈ పూరేకుల పరిమళం కోసం జీవితంలోని మిగిలిన పార్య్వాలు వక్కన పెట్టాల్సిన అవసరాలు నిత్యం  తలెత్తుతాయి. ఎన్నో వదంతులు షికారు చేస్తాయి. జీవితంలో చిచ్చు పెడతాయి. పైకి ఆరాధన అనే ముసుగు లోలోపల అసభ్య ఆలోచనల పరంపర ఇటువంటి ద్వంద్వ మనస్తత్వ వైఖరులతో ఓర్పుగా నెట్టుకురావాల్సిన పరిస్థితులు. ఇది సమాజ స్పందనలోనే ఓ కోణం. అవసరాలను అవకాశంగా మలచుకొని దిగజార్చాలని చూసే విషనర్ప నీడ ఇంకోవైపు! ఇన్ని భరించి ఎలాగో నిలదొక్కుకుంటే కొత్త తారలు జిగేల్మంటే పాతముఖాలు వెలవెలపోవాల్సిందే.

            ఇన్నిటి మధ్యా.. ఎన్నో అసాధ్యాల మధ్య.. సాధ్యానికి సంకేతంగా నిలిచిన అతిలోక సుందరి ఆమె. నాలుగవ ఏటే బాలనటిగా సినీతెరకు పరిచయమైన ఆమె మూడు తరాల నాయకులతో నటించి సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ను తన ముగ్ధత్వ సౌందర్యంతో, నటనతో మంత్రముగ్దుల్ని చేసింది. తొలి మహిళా సూపర్‌ స్టార్‌ గా బాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది.

            ఆమె బ్రహ్మ సౌందర్య దృష్టికి, అద్భుత సృష్టికి నిదర్శనమైన దివంగత నటి శ్రీదేవి. నిత్యయవ్వనంతో విలసిల్లిన ఆ దేవీ నేడు దేవలోకాలకు వెళ్లిపోయినా ఆమె స్మృతులతో చిరకాలం మనసుల్లోనే ఉంటుంది అభిమానులకు. ఈ సందర్భంలో స్రీ తెరరంగ ప్రవేశం పరిణామాలు ఏ ప్రామాణికతకు నిదర్భ్శనాలో అన్నది వ్యక్తిగత వివేకానికే వదిలేసే అంశం. 1970వ దశకం నుండి 21వ

దశాబ్దం వరకు టెక్నాలజీ, మానవ సంబంధాల్లో మార్పు వచ్చినా అన్ని 'అందం నిలుపుకోవటం' అన్న ప్రాతిపాదిక పునాదిగా సాగినవే. నేటి శ్రీదేవి మరణం కూడా ఈ కోణంలో ఆవిష్కరింపదగినదే!            “అధునిక హీరోయిన్లకు తీసిపోనంత నాజూగ్గా కనిపించేందుకు ఆమె కఠినమైన ఆహార నియమాలు పాటించేవారు. గతంలో ముక్కు ఆపరేషన్‌ చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య బరువు నియంత్రించడానికి లైపొ సెక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఇలాంటి వాటివల్ల హార్మోన్ల అనమతుల్యత ఏర్పడుతుందని వలుపరిశోధనలు వెల్లడించాయి. అలాగే లైపోసెక్షన్‌ చేయించుకున్న వారిలో 76 శాతం ఆత్మహత్యలకు పాల్పడ్డారని అమెరికాలో చేసిన పరిశోధనలో తెలిసింది. దీనిని బట్టీ ఆమె చాలాకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, డి(పెషన్‌తో బాధపడుతున్నదని భావించాల్సి వస్తున్నది. అన్నీ కలిసి ఆమెను గుండెపోటుకు గురి చేసి ఉంటాయి ఇది కొందరి నిపుణుల అభిప్రాయం. అయితే ఇటీవల దుబాయ్‌ వైద్యులు ఆమె మృతదేహానికి చేసిన పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గుండెపోటు కాదు, నీళ్లటబ్బులో మునిగి, ఊపిరాడక మరణించారని తేల్చారు.

            మరణానికి ముందు ఆమె మద్యం సేవించినట్లు, ఆమె రక్తం నమూనాలో తేలినట్లుగా ప్రకటించారు. అసలు వాస్తవం ఇంకా తెలియాల్సి ఉంది. ఇది అతిలోకసుందరి గాధ మాత్రమే కాదు. ఇంతకుముందు ఆర్తీ అగర్వాల్‌ కూడా ఈ అందం నిలుపుకునే ప్రయత్నంలోనే ప్రాణాలు పణంగా పెట్టింది. ఓ సినిమా కోసం శరీరంపై ప్రయోగం చేసిన అనుష్క కూడా పూర్వపు ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయింది. ఓ స్త్రీ కూతురిగా, భార్యగా, సహోదరిగా, తల్లిగా, అత్తగా, నానమ్మగా ...ఇలా జీవితంలోని దశలను బట్టీ ఒక్కో పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఓ అనుబంధంలో ఎక్కువ సౌకర్యం ఉందని అక్కడే ఉండిపోతానంటే ఓ కుటుంబమే నాశనం అవుతుంది. అలాగే 'తెరపై తార అన్నది కేవలం ఒక దశకు సంబంధించినది మాత్రమే” అనే నిజాన్ని ఆంగీకరించలేక ఓ కృత్రిమ లోకాన్ని సృష్టించే క్రమంలో పరిస్థితులు వికటించి మానసిక అశాంతిని, అనారోగ్యాన్ని అసంతృప్తిని క్రమక్రమంగా పెంచుతూ ఉంటాయి. ఈ తెర గుర్తింపు ఎందరో వ్యక్తుల్ని జీవితంలోకి తీసుకువస్తుంది.     ప్రతీ వ్యక్తికి జీవితంలో చిన్నాచితక ఇబ్బందులు, పొరపొచ్చాలు ఉంటాయి. వాటి (ప్రభావం వల్ల స్వాంతన కావాలి అని కోరుకునే సందర్భాలు రావచ్చు. అలాంటి బలహీన క్షణాలే దీర్ఘ కాలంలో సమస్యల వలలోకి నెట్టేస్తాయి. వ్యక్తిగత జీవితానికి కూడా విస్తరించే ఈ తెర జిలుగులు సామాజిక గుర్తింపు కోసమే తప్ప వ్యక్తిగత బాధ్యతలు, అనుబంధాలకు వర్తించవు అనే విషయాన్ని న్పష్టంగా క్రమబద్దీకరించుకోవాలి. తెరపై మెరిసే ప్రతి తార తాను సాధారణ మనిషిగా అంటే విపరీతమైన గుర్తింపు లేని వ్యక్తిగా ఉండే జీవితాన్ని కూడా ఆస్వాదించేలా తనను తాను సిద్ధం చేసుకోవాలి. ఈ రెండు జీవితాలకు మధ్య ఉండే చీలికను అర్ధం చేసుకొని ముందుకు సాగితేనే హాయిగా బతకవచ్చు.

            గుర్తింపునే ప్రాణవాయువుగా భావించి పయనిస్తే అందరి ఆమోదం కోసం ప్రకృతికి విరుద్దంగా శరీరం వికటించేలా ప్రయోగాలు చేయాలనే తపన దాని దుష్పరిణామాల గురించి ఆలోచించకుండా చేసేలా ప్రేరేపిస్తుంది. అటువంటి ప్రలోభాలకు దూరంగా ఉండి వాస్తవమైన శరీరం (వయసుకు తగ్గట్టు)తో ఉంటూ ఆరోగ్యంగా ఉండే దశ ఉంటే చాలు అనే భావనతో సాగితేనే తెరపై మెరిసే తార నిజజీవితంలో కూడా మెరుస్తుంది. 'నటన-గుర్తింపు' జీవితంలో ఓ భాగమే తప్ప అవే జీవితం కావు అనే భావనను ఆమోదించి, అహ్వానించే తారలలోకం వెల్లివిరియాలని ఆశిద్దాం!

                                          *      *      *  









Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ