మహత్తరమైన మనోచిత్రాలు

మహత్తరమైన మనోచిత్రాలు 
(వార్త ఆదివార అనుబంధ పత్రికలో ప్రచురితం) 


మహత్తరమైన మనోచిత్రాలు

మీరేదైనా సాధించాలనుకుంటే

దాన్ని ముందుగా మీ మనసులో స్పష్టంగా దృశ్యీకరించుకోవాలి"

                                                        -అలెక్స్ మోరిసన్.

ప్రతి వారం వేలాది శ్రోతల ఎదుట కచేరీ చేస్తూ కచేరీల నిమిత్తం నిత్యం ప్రయాణిస్తూ, మీ పాటలు లక్షలాది రికార్డుల రూపంలో అమ్ముడవుతూ. ఏదో ఒక రోజు ఇదంతా వాస్తవంగా జరుగుతుందని గాయనిగా మీరు మీ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో ఎప్పుడైనా కల గన్నారా?

          ప్రఖ్యాత గాయని సెలీన్ డియోనికి ఒకానొక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్న ఇది. ఇందులో చెప్పిన ఏ విశేషమూ తనకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదని, ఎందుకంటే ఐదేళ్ల పసిపిల్లగా ఉన్నప్పటినుంచే తాను ఈ విజయాన్నంతా తన మనోఫలకం మీద దృశ్యీకరించుకునేదాన్నని ఆమె జవాబిచ్చింది.

       ఆమె చెప్పిందేదీ అతిశయోక్తి కాదు. విజయంలోని ప్రతి అంగుళం కోసం ఆమె అహర్నిశలూ ఊహాతీతంగా కఠోర శ్రమను కొనసాగించింది. ఒక ప్రకాశవంతమైన, శక్తి వంతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకు నేందుకు సంగీత ప్రపంచంలో ఒక తారగా వెలిగేందుకు తనలో దాగిన శక్తి సామర్థ్యాల న్నింటినీ పూర్తిగా ఉపయోగించుకునే నైపుణ్యాన్ని ఆమె చిన్నతనం నుంచే అభ్యసించింది.

 

       ప్రపంచ స్థాయి మేటి క్రీడాకారుడలు కూడా తాము తమ ప్రతిభను ఎంత శక్తిమంతంగా ప్రదర్శించాలన్న విషయాన్ని ముందుగానే మనసులో దృశ్యీకరించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు.

        ఒక స్కేటర్ క్లిష్టమైన విన్యాసాన్ని ప్రదర్శించినా; ఒక టెన్నిస్ క్రీడాకారుడు సమర్థవంతంగా ఆటలో తన పటిమను చూపించినా; ఒక గోల్ఫ్ క్రీడాకారుడు మరింత దూరం సూటిగా, సవ్యదిశలో బంతిని కొట్టినా- ఇవన్నీ ఆయా విజేతలు వాస్తవంగా తాము సాధించబోయే విజయ ఫలాన్ని ముందుగానే మనసులోనే ఊహించుకుంటారు.

ఇతరులకు కనిపించని విషయాన్ని మీరు దర్శించగలగడమే దశ్యకరణ.

                                                            - జోనాథన్ స్విఫ్ట్

          పెద్ద కల కనడం తప్పు కాదు. అది శక్తి సామర్థ్యాలకు తగినదా, కాదా అని ఆలోచించాల్సిన పని లేదు. అది మన మనసుకు నచ్చింది అయి ఉండి, మనలోని నిర్మాణా త్మక ఉత్పాదకతను సృజనాత్మకంగా పెంచగలిగేది అయినప్పుడు దాన్ని ముందే దృశ్యీకరణలో చూడడం అన్నది, తెలియకుండానే మన ఆత్మవిశ్వాస స్థాయిని పదింతలు చేస్తుంది.

ప్రపంచానికి తానెవరో తెలియని కాలంలో.. అంటే 1990ల్లో హాలీవుడ్ నటుడు జిమ్ కారి 'నటనకు పారితోషికం' అని రాసుకుని, తనకు తానే పది మిలియన్ డాలర్ల చెక్కును సమర్పించు కున్నాడట. ఆ చెక్కుమీద తారీఖు మాత్రం 1995 నాటికి 'కృతజ్ఞతా పూర్వకంగా' అని పేర్కొన్నాడట. జిమ్ కారీ మాటల్లో చెప్పాలంటే, అది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఒకవేళ అంత డబ్బును పారితోషికంగా పొందాలంటే తాను ఆ స్థాయికి తగిన వ్యక్తులను, అంతటి భారీ స్థాయి ప్రాజెక్టుల్లోను పని చేయాలన్న విషయం ఆయనకు బాగా తెలుసు.

       తరువాతి కాలంలో ఆ మేటి నటుడు తాను నటించిన 'ఏస్ వెంచురా', 'ది మాస్క్' అనే చిత్రాలకుగాను పారితోషికంగా 800,000 డాలర్లని పొందాడు. అటు తర్వాత 1994లో ‘దంబ్ అండ్ దంబర్ చిత్రానికి ఏడు మిలియన్ల డార్లు, 1995లో మరిన్ని మిలియన్ డాలర్లని ఆయన ఆర్జించాడు.

        అంకిత భావంతో లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా ఉపచేతనా శక్తి ఎంత ప్రతిభావంతంగా పని చేస్తుందో చెప్పడానికి జిమ్ కారీ తాలూకు 'పోస్ట్ డేటెడ్ చెక్ అనే ఈ ప్రయోగం మంచి ఉదాహరణ. లక్ష్యం గురించి ఆలోచించడం. మనసులో మనో చిత్రాల్ని రూపొందించుకోవడం అన్నది. సుదీర్ఘ ప్రాతిపదికన మన మనోరథాన్ని సాఫల్యం చేసుకునేందుకు బాటలు పరిచే ప్రక్రియ.

        మీరు కనుక దేన్నయినా స్వప్నిస్తే, దాన్ని సాధిస్తారు. - వాల్ట్ డిస్నీ.

          మన జీవితం అంతా ఒక మనోచిత్రంగా మనకు తిరిగి దొరక్కపోవచ్చు. అన్ని జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచి ఉండకపోవచ్చు. మన సంబంధ బాంధవ్యాలు, వృత్తిలో అనుభవాలు, ఇంకా ఇతర సంఘటనల ఆధారంగా మనం నిరంతరాయంగా మనో చిత్రాల్ని రూపొందిస్తూనే ఉంటాం. మన మనోచిత్రాలకు ఏ విషయం ఆధారమన్నది అప్రస్తుతం. కానీ దీనికి సంబంధించిన ఒక కీలకమైన విషయం ఉంది. మనం కేవలం మనం మాత్రమే. మన సొంత మనోచిత్రాల్ని నియంత్రించుకోగలం.

        మనం తలుచుకోవాలే కానీ, కొత్త కొత్త మనో చిత్రాల్ని తలచినదే తడవుగా ఆవిష్కరించవచ్చు. మనలో శక్తివంతమైన అనుభూతుల్ని, స్పందనల్ని రేకెత్తించే కొత్త మనోచిత్రాల్ని ఆవిష్కరించి, వాటి మీద దృష్టిని కేంద్రీకరించినట్టయితే, మన చర్యలు కూడా ఆ చిత్రాలకు అనుగుణంగానే ఉంటాయి.

కనుక ఆశించిన ఫలితాన్ని దృశ్యీకరిం చుకోవడమే విజయానికి తొలి మెట్టు. ఊహాశక్తికి ఆకాశమే హద్దు.గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే, ఇలాంటి మనోచిత్రాలుఉన్నఫళాన, రాత్రికి రాత్రి ఫలించవు. కానీ ఓర్పు వహిస్తే, నిరంతరాయంగా ఈ మనోచిత్రాలపై దృష్టిని కేంద్రీకరిస్తే అప్రయత్నంగానే ఆశలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి.

 

 

 

 

 


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ