రూపమే ప్రథమం
రూపమే ప్రథమం
-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)
ఆ మధ్య ప్రముఖ దిన
పత్రికలోని సాహిత్యం పేజీకి ఓ కవిత పంపాను. ‘సారీ అండీ... మీ కవితలో పోయిటిక్ ఎలిమెంట్
లేదండి ... మేము వేసుకోలేము ...’ అనే సమాధానం వచ్చింది. ఈ ఎలిమెంట్ అంటే ఏంటో నాకు
అర్ధం కాలేదు. ప్రపంచంలో తొలిసారి కవిత రాసినవాడు ఏ ఎలిమెంట్స్ చిట్టాను పక్కన
పెట్టుకుని రాసి ఉంటారు?
అలాగే రోగం
వచ్చినప్పుడు ఏ చిట్టా పక్కన పెట్టుకుని తొలి సారి వైద్యం చేయబడి ఉంటుంది? ఇలా ఎన్నో ఆలోచనలతో నా
బుర్ర నిండిపోయింది. ఏతావాతా అంతా ఆలోచించిన తర్వాత నాకు ఓ విషయం అర్ధం అయ్యింది.
అది ఏమిటంటే ముందు ఏర్పడే రూపం అన్నది ఓ సొంతదారుడి భావవ్యక్తీకరణ, అభిప్రాయాలు, నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత
మేధావి వర్గాలు పరిశోధనలు, అధ్యయనాలు పేరుతో వాటికి లక్షణాలు
ఆపాదిస్తారు.
స్త్రీ కూడా ఇదే
చట్రంలో చిక్కుకుపోయి ఉంటుంది కదా అని నాకు అనిపించింది. స్త్రీ అంటే ఇంటి పని, కుటుంబాన్ని
చక్కదిద్దడం అనేది ఏ శాస్త్రాల్లో, గ్రంధాల్లో ఉందో నాకైతే
తెలియదు. కానీ ఆ ధర్మశాస్త్రాలు,మత గ్రంధాలు లేని ముందు కాలం
ఒకటి ఉంది. అదే మానవుడు ఆది మానవుడిగా ఆవిర్భవించిన కాలం. అప్పుడు స్త్రీ పురుషులు
...ఇలా ఉండాలి ...అలా ఉండాలి ...అని ఎవరు రాసి ఉంటారు? కచ్చితంగా
మొదట్లో ఎవరికీ దీని మీద అవగాహన ఉండి ఉండక పోవచ్చు. కాల క్రమంలో మనుషుల ఊహా,
దాని అంతర్గత భావోద్వేగాల పరంపర, చుట్టూ ఉన్న
పరిస్థితులు, అందులోనూ స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ
...వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు లింగ భేదం ఆధారంగా ఈ అభిప్రాయ
చట్టాన్ని రూపొందించి ఉంటారు.
ఏ మనిషైనా ఎప్పుడు
స్వేచ్ఛగా ప్రవర్తించగలడు?
ఏ వ్యక్తైనా పూర్తి విశ్వాసంతో తన లక్ష్యాన్ని ఎప్పుడు సాధించగలడు?
ఎప్పుడైతే పూర్తి నమ్మకం ఆ వ్యక్తిలో ఉంటుందో అప్పుడే
సఫలీకృతులవుతారు. స్త్రీ అంటే ఇలా ఉండాలి ....అలానే ఉండాలని భ్రమింపజేసే
సిద్ధాంతాలు నిజమే అయితే ఆనాడు ఇందిరా గాంధీ , కిరణ్ బేడి
వంటి వారి ఇళ్ళల్లో ఇదే వాతావరణం ఎందుకు లేదు? ఒక్కసారి
ఆచారాలు. లింగ వివక్ష వంటి వాటిని పక్కన పెట్టి, ఇష్టం
సామర్ధ్యం, ఇష్టాల్ని బట్టే మనిషిని అంచనా వేయడం
ప్రారంభిస్తే నేడు దేశమంతా ప్రబలిన బాల్య వివాహాలు, గర్భ
స్రావాలు ,స్త్రీ అణచివేత వంటివి కనుచూపు మేరలో కూడా కనబడవు.
సైనా నేహ్వాల్ లాంటి
వారు వరల్డ్ నంబర్ 1 అవ్వగలిగిందంటే దానికి కారణం ఆమె తల్లితండ్రులు. ఆమె తల్లితండ్రులు తన
ఇష్టాన్ని, సామర్ధ్యాన్ని తెలుసుకోవడమే. కొందరు మన మిత్ర
వర్గం ...మరికొందరు ప్రపంచం పరిచయం చేసే విజయ మార్గంకు తగ్గట్టుగా పిల్లలను తయారు
చేస్తారు తప్ప వారి శక్తి సామర్ధ్యాలు, అభిరుచులు పట్టించుకోరు.
పరిణితి చెందిన ధోరణే వారిని ప్రపంచానికి విజేతలుగా పరిచయం చేసింది.
ఈ ప్రపంచంలో దేనికైనా
రూపమే ప్రధమం. తర్వాత ఆపాదించబడిన లక్షణాలు వ్యక్తుల్ని బట్టి మారిపోతుంటాయి.
ఎప్పుడో ఓ వర్గానికి దాని రూపం బట్టి ఆపాదించబడిన లక్షణాలని తరతరాలుగా చెరగని
ముద్రలుగా అందిస్తూ పోవడం ఏం న్యాయం? ప్రజల ఇష్టాన్ని బట్టి, వారి
నమ్మకాల్ని బట్టి పాలకులు మారిపోతుంటారు. ఈ ప్రపంచాన్ని నడిపించేదే ఇష్టం. ఇంటికి
చుట్టాలొస్తే మంచి నీళ్ళు ఇవ్వడం సంప్రదాయం. కానీ ఇలాంటి పనులన్నీ ఆడవాళ్ళకే
అప్పజెప్తూ ఉంటారు. ఇటువంటి పనులకి ఆడ పనులు అని పేరు పెట్టేస్తూ ఉంటారు.
ఆ పనులు చేయడానికి
పెద్ద సామర్ధ్యాలు, ఇష్టాలతో పని లేదు. ఆ పనులు ఆడవారు చేయకూడదు అని కాదు నా ఉద్దేశ్యం. ఈ
రకమైన ఆలోచన ధోరణిని చిన్నప్పటి నుంచి పిల్లల మెదడుల్లో ప్రవేశ పెట్టడం వల్ల మగ
పిల్లల్లో ఆధిపత్య ధోరణి, ఆడ పిల్లల్లో మెతక ధోరణిని తెలియకుండానే
ప్రవేశ పెడుతున్నారు.
దీర్ఘ కాలికంగా
పాతుకుపోయిన ఈ ధోరణులే స్త్రీలపై అకృత్యాలకు దారి తీస్తున్నాయి. చిన్నప్పటి నుంచి
తల్లితండ్రులు ఆస్తిగా అందించే మెతక ధోరణి స్త్రీలలో వారిలో ఆపదను ఎదుర్కునే
శక్తిని ధూరం చేస్తున్నాయి. మగవారి ఆధిపత్య ధోరణి అకృత్యాలకు సంకేతాలుగా
నిలుస్తాయి. రూపం ప్రధమం. లక్షణాలు అనేవి మార్పుతో అనుసంధానం. ఈ భావజాలం బలంగా
అందరూ నమ్మేవరకు, ముందుకు తీసుకుపోయేవరకు కీచక పర్వాలు పునరావృతమవుతూనే ఉంటాయి. మారాల్సింది
మనుషులు కాదు, మార్చాల్సింది చట్టాల్ని కాదు ....మారాల్సింది
ఇష్టం, సామర్ధ్యాల పై నమ్మకాలు.
* * *

Comments
Post a Comment