శక్తి (మండోదరి ముచ్చట్లు )
సినీ పరిశ్రమలో కమిట్ మెంట్స్
సాధారణమే అనే ఓ
ఉదహరింపుకు వచ్చే స్థాయికి
నేడు స్త్రీ విలువలను
కొందరు తమ పదవులను అడ్డు
పెట్టుకుని దిగజారుస్తున్నారు. ఎంతో కొంత పరపతి,
గుర్తింపుఉన్న సినీ ఆర్టిస్టులైతే కచ్చితంగా
ఏదో ఒక రోజు తమకు జరుగుతున్న అన్యాయాలను
బయట పెడుతున్నారు. కానీ అందరికీ
ఇదే పరిస్థితి వర్తించదు.
ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ మరియు స్మాల్ స్క్రీన్
లలో జరిగే ఈ కమిట్
మెంట్స్ లో ఆ ఆర్టిస్టులను ఇటువంటి వాటికి బలి చేసే ప్రయత్నంలో
ఏజెంట్లు మొదలుకుని
సింహాసనాలు ఉన్నాయన్న ధీమాతో
పెద్ద వారి వరకు అందరూ కూడా బయటికి
చెప్పుకోలేని నిస్సహాయులను ఎక్కువగా
తమ లక్ష్యాలుగా ఎన్నుకుంటున్నారు.
సినీ పరిశ్రమలో
స్త్రీలలో జూనియర్ ఆర్టిస్టులు
తమ కెరియర్ ప్రారంభం నుండి చివరి వరకు కూడా అదే
జూనియర్ ఆర్టిస్టుగానే మిగిలిపోతున్నారు. ఇందులో
కొందరు కార్డు ఉన్న ఆర్టిస్టులైతే, మరి కొందరు కార్డులు లేని వారు. కార్డు న్యాయంగా
దక్కే హక్కు కాదు, పదిహేను వేలు పెట్టి
కొనుక్కోవాల్సిన ఆర్ధిక ముడుపులతో
ముడిపడి ఉంది.
కార్డు కొనుక్కుంటే
అవకాశాలు వస్తాయన్న ఆశ ఆర్టిస్టులది, ఆ కార్డు ఉన్న వారిని
షూటింగ్ లకు పిలిస్తే ఎక్కువ
ఇవ్వాల్సి వస్తుందన్న తెలివితో
కార్డు లేని వారిని తక్కువకు పిలిచే
కుటిలత్వం పెద్దలది. ఈ
ప్రక్రియలో మగవాళ్ళు ఉంటే
మొదట జూనియర్ ఆర్టిస్టులుగా వచ్చినా, తర్వాత ఒకవేళ
అవకాశాలు లేకపోయినా సరే, ఈ కాలంలో ఏర్పరచుకున్న
సంబంధాలతో ఏజెంట్లుగా మారిపోతారు.
మొదట తాము జూనియర్
ఆర్టిస్టులుగా ఉండి వారి కష్టాలను
చూసినా సరే ఒక్కసారి ఏజెంట్ అనే
సింహాసనం రాగానే కమిట్ మెంట్స్ కు తమ ద్వారా ఆర్టిస్టులు
అవుదామని వచ్చే ఆడపిల్లలను
పెద్ద పదవులు అలంకరించిన
సింహాసనాధిపతులకు ఎరలుగా తయారు
చేస్తారు.
ఏజెంట్ల ద్వారా
కాకుండా తమదన్న స్వీయ
పట్టుదలతో ఒకవేళ ఎవరైనా
జూనియర్ ఆర్టిస్టులు సినీ పరిశ్రమలోకి ప్రవేశించినా
వారు రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళి ,సాయంత్రం వరకు వేచి ఉనా సరే వారిని పిలిచే షూటింగ్లు స్వల్పం. ఏజెంట్లు కూడా
ఆడ పిల్లల విషయంలో నటన
తప్ప మిగిలిన అన్నీ
విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు.
తమ దగ్గర
ఉన్న ఆడపిలల్లో ఎవరు
తెల్లగా ఉంటారు,
రిచ్ డ్రెస్సింగ్ ఎవరిది ? ఎవరైతే తమ
మాటకు లోబడి ఉంటారు వంటి
విషయాలను దృష్టిలో పెట్టుకుని
వారిని మాత్రమే షూటింగ్ లకు పిలుస్తారు. తర్వాత వీరిలో
ఎవరైతే తమ మాట విని తాము
చెప్పినట్టు పెద్దలకు ఎరగా ఉండి
తమ జేబులు నింపుతారో వారే ఈ ఏజెంట్ల
లక్ష్యం కూడా.
మొదట ఏజెంట్లతో
మొదలైన ఈ లైంగిక
దోపిడి పెద్దల వరకు పాకుతుంది. ఆ పెద్దలు
తమకున్న ప్రతి అధికారాన్ని
కూడా లేడీ ఆర్టిస్టులను తమ
గుప్పిట్లో బంధించడానికి వాడుకుంటారు. తమకు సహకరించని వారిపై క్రమశిక్షణ రాహిత్యం పేరుతో సస్పెన్షన్లు, వారి
కార్డులు రద్దు చేయటం,వారి పై తమ నాయకుల
బృందంలో ఉన్న వారందరిని ఉసిగొల్పటం
వంటి వాటిని ప్రయోగిస్తారు.
అదే మాట
విని వారికి లోబడి ఉంటే వారికి
అందరికీ న్యాయంగా చెందాల్సిన నిధుల్లో వీరికి
మాత్రం ప్రత్యేక కోటాలు ఇస్తారు
అదేదో తమ సొంత ఆస్తి అయినట్టు. పదవులు కేవలం ధనార్జనకు,
సినీ స్త్రీలను లోబర్చుకోవడానికి వాడే
సాధనాలుగా మాత్రమే నేడు
సినీ పరిశ్రమలో మిగిలిపోయాయి అన్నది
కాదనలేని నిజం.
ఇకపోతే ఇది
నాణేనికి ఓ వైపు. ఇంకో
వైపు కథ కూడా స్త్రీలను
ఆటవస్తువులుగా మార్చే
సంస్కృతిని పెంపొందించేదే. ఎంతో మంది స్త్రీలు
మొదట్లో పొరాడి అలసిపోయి ఇంకా
పోరాడినా దండగ అనే
అభిప్రాయానికి వచ్చినప్పుడు లొంగిపోతారు. తర్వాత తాము
కూడా నెట్ వర్కులు ఏర్పాటు చేసుకుని తమను నమ్ముకుని వచ్చే
ఆర్టిస్టులను పెద్దల ప్రాపకం కోసం
తమ ఎరలుగా వాడుకుంటారు.
సింహాసనం పురుషుడిది
అయితేనే ఈ సమస్యలు
అని కచ్చితమైన నిర్దారణకు
రాలేము, ఇక్కడ
వ్యక్తిగత అవకాశాల ఆధారంగా తమ
సొంత లాభాల కోసం స్త్రీ అయ్యి కూడా తోటి స్త్రీలను ఈ ఉచ్చులో బిగించేవారు
కూడా ఎందరో ఉన్నారు.
కానీ ఎక్కువశాతం మంది మగ
నాయకులు ప్రెసిడెంట్ ,సెక్రటరీ
,క్యాషియర్ లాంటి
పదవులను ఎరగా వాడుకుని
ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులను ఈ
కూపంలోకి లాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే
సినీ రంగంలో వీరిని పక్కన పెడితే
కొన్ని సినిమాల్లో ఒకరో ఇద్దరో కాకుండా పదుల సంఖ్యలో
అసిస్టెంట్ డైరెక్టర్లుగా వ్య్వహరించే వారుంటారు. జూనియర్ ఆర్టిస్టులకు
ఎవరి మాట వినాలో కూడా తెలియని పరిస్థితి. ప్రతి ఒక్కరూ వారిని ఎలా
తమ దారిలోకి తెచ్చుకోవాలా
అనే ఆలోచించేవారే ఉంటారు
అనడంలో అతిశయోక్తి లేదు.
ఇది జూనియర్
ఆర్టిస్టులైన స్త్రీలకే కాదు
సినిమా రంగంలో ఉన్న ప్రతి స్త్రీ
పైకి చెప్పుకోకపోయినా
అనుభవిస్తున్న వ్యథే. కానీ మిగిలిన
వర్గాల వారికి సినీ అనుభవంతో
ఎదుగుదల ఉంటుంది. కానీ జూనియర్
ఆర్టిస్టులు ఎన్నాళ్ళయినా సరే
అక్కడే ఉండిపోతారు. వారికి స్క్రీన్ మీద
నిమిషాల నిడివితో కూడా
కనిపించే అవకాశాలు బహు స్వల్పం. అందుకే వారి
జీవితంలో ఉండే ఈ
అభద్రతా భావనను తమ ఆయుధంగా
మలచుకుంటున్నారు సింహాసనాధిపతులు.
సినిమానే నమ్ముకునే కళాకారులు ఎవరైనా
సరే అందులో ఎన్ని
ఒడిదుడుకులు ఉన్నా సరే
ఆ మాయాజాలం నుండి తప్పించుకోలేరు. ఇకపోతే కుటుంబం,బంధువులు,స్నేహితులు ఇన్నేళ్ళుగా సినిమాల్లో
ఉంటున్నావు, ఎప్పుడు
స్క్రీన్ మీద కనిపించవే? అని అడుగుతూ ఉంటారు. కానీ జూనియర్
ఆర్టిస్టులు ఎప్పుడు తెర మీద వెనుక
ఎక్కడో ప్రేక్షకుడి కన్ను
పోలేనంత దూరంలోనే ఉండిపోతారు. వారు లేనిదే సినీ
పరిశ్రమ లేదు. కానీ సినీ పిచ్చి ఉన్న
వారిని అప్పటికప్పుడు తీసుకోవడం
వల్ల ఫ్రీగా చేయించుకోవచ్చని,
సినిమా పేరుతో అమ్మాయిల్ని లోబర్చుకోవచ్చని కూడా
సింహాసనాలను అధిష్టించిన పెద్దలు వారు ఎప్పటికీ బయటకు
చెప్పుకోలేరన్న ధీమాతో వారిని
బలిపశువులను చేస్తున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం వారి సమస్యలు బహిరంగంగా చెప్పుకునే ధైర్యం కలిగి ఉండటం కాదు. సినిమా జీవితంలో ఓ భాగమే కానీ, సినిమానే జీవితం కాదు, బ్రతకడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి అనే భరోసా బాధితుల్లో నిండి ఉండటమే.
* * *




Comments
Post a Comment