గాజుబొమ్మ

 చదువరి 

    గాజుబొమ్మ 

                                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



 స్త్రీ మనసులో అతి సున్నితత్వం,పూర్వ ఉదంతాలు గాఢమైన ముద్ర వేసినప్పుడు అవి ఆమెను ఎలా జీవితంలో వనక్కి లాగుతాయో తెలిపే నవలే యలమంచిలి ఝాన్సీ లక్ష్మి గారి 'గాజు బొమ్మ.' హిమబిందు మంచి భావుకురాలు. మంచి గాయకురాలు కూడా. ఆమె స్నేహితురాలు   కరుణ ,ఆమె అన్న శ్యామ్ సుందర్  ఆమెతో కలిసి ఆమె ఊరికి వస్తారు. ఆ పల్లెటూరిలో ఉన్న చూడాల్సిన ప్రాంతాలన్నీ ఎంతో ఉత్సాహంతో వారందరికీ చూపిస్తుంది. కానీ  ఆమె  ఎందుకో హఠాత్తుగా దుఃఖిస్తూ ఉంటుంది. దానికి కారణం చెప్పదు. 

తర్వాత హాస్టల్ కు వచ్చాక కరుణ తన అన్నయ్య శ్యామ్ సుందర్ తో కలిసి ఓ గది అద్దెకు తీసుకుని ఉండాలని నిర్ణయించుకున్నాక తన స్నేహితురాలైన హిమాబిందును కూడా తనతో పాటు అక్కడే ఉండమంటే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అలా శ్యామ్ సుందర్ తో ఏర్పడిన పరిచయం ఇద్దరి మనసుల్లో అవ్యక్తమైన ప్రేమ జన్మించేలా చేస్తుంది. తర్వాత కొన్ని రోజులకు కరుణకు పెళ్లి కుదిరి పెళ్లయిపోతుంది. 

ఆ తర్వాత శ్యామ్ సుందర్ ,హిమబిందు మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడే తన ప్రేమను వెల్లడిస్తాడు శ్యామ్ సుందర్. దానికి సమాధానంగా అతని చేతిలో ఓ డైరీ పెడుతుంది  హిమబిందు. దాని ద్వారా అప్పటికే ఆమెకు ఆమె బావ వంశీతో వివాహమైందని, కానీ అతను క్యాన్సర్ తో మరణించడంతో ఆమె ఆ జ్ఞాపకాల నుండి బయటపడటానికి  డిగ్రీ చదువుతుందని అతనికి అర్ధమవుతుంది. 

ఆ పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రేమించిన శ్యామ్ సుందర్ ఆమె తల్లిని ఒప్పించి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివమాడతాడు. కానీ ఆమె మాత్రం శారీరకంగా అతనికి దగ్గర కాలేకపోతుంది. రోజు రాత్రి వంశీ రాసిన డైరీ చదువుతూనే ఉంటుంది. ఆమెను ఆ మూడ్ నుండి బయటకు తీసుకురావడానికి ఆమెను ఆగ్రా తీసుకువెళ్తాడు. అప్పటికే ఆమెకు ఓ సారి హార్ట్ ఎటాక్ వచ్చి ఉండటం వల్ల మళ్ళీ శ్యామ్ సుందర్ ఆమెను ఉద్రేకపరచడంతో ఆమెకు మరలా గుండె పోటు రావడంతో మరణిస్తుంది. 

గాజు బొమ్మలా పెరిగిన హిమబిందు ఆ గాజు బొమ్మ లా ఉండలేని పరిస్థితి కల్పించబడినప్పుడు మరణించింది. స్త్రీలైనా ,పురుషులైనా జ్ఞాపకాలు సర్వసాధారణం. వాటి నుండి బయటపడక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని వదిలి ఇంకో కొత్త మార్గంలో పయనించక తప్పదు. అలా మార్పుకు అలవాటు పడలేని సున్నితత్వం గట్టిదైన జీవితంలో పనికి రాదు కూడా. ఈ నవలను కథ కోసం కాకుండా ఆ సున్నిత భావాల వ్యక్తీకరణ ను రచయిత్రి వ్యక్తపర్చిన తీరు కోసమైనా చదవాల్సిందే. 

*     *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!