విజయం ఒక ప్రయోగం

విజయం ఒక ప్రయోగం 
      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 




భారతదేశంలో  మొదటి స్పేస్ ఫిల్మ్ గా టిక్:టిక్:టిక్ అనే సినిమా విడుదలైంది. అది నిజంగా పెద్ద ప్రయోగం. కచ్చితంగా ఆ ప్రయోగం నూరు శాతం విజయవంతం కాలేదు. కానీ సినీ చరిత్రలో తనకో గుర్తింపు సాధించి ఎప్పటికీ అందరూ గుర్తు పెట్టుకునే విజయంగా ముద్ర వేసుకుంది.

            పై సినిమా గురించి చదువుతుంటే మీకు మీ జీవితం కూడా కొన్నిసార్లు ఇంతే అని అనిపించడం లేదూ!జీవితంలో చాలాసార్లు మీరు తీసుకోవాలని అనుకున్న  నిర్ణయాలని ఎంత మంది తోసి పుచ్చలేదు! ఎన్నిసార్లు మీతో మీరే రాజీ పడిపోలేదు!

            గెలుపు,ఓటములు ఎప్పుడు వెంట్రుకవాసిలో నిలబడేవే. కానీ ప్రయత్నం నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఓడిపోయాను. ఇక నా తలరాత ఇంతే అనే మాటలు నిత్యం మనం వింటూనే ఉంటాము. కానీ ఒక్కసారి ఎన్నిసార్లు ప్రయత్నించాము? అని ప్రశ్నించుకుంటే, అది పదిసార్లకు మించి ఉండకపోవచ్చు.

            ఎడిసన్  గురించి మీరందరూ వినే ఉంటారు. ఆయన ఎన్ని వేలసార్లు ప్రయత్నించాడో మనందరికీ తెలిసిందే! ఆయన విజయ రహస్యం ఒక్కటే. అది ప్రయత్నాలతో కూడిన ప్రయోగాలు. ఎడిసన్ జీవితాన్ని మించిన స్పూర్తి ఏది ఉండదంటే అతిశయోక్తి కాదు.

            చిన్నప్పుడు ఎడిసన్ కోళ్ళను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేవాడు. ఆ పరిశీలనలో ఆయనకొక వింత ఆలోచన వచ్చింది. కోడిపెట్ట గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదగటం కోసం తన పొట్ట కింద పెట్టుకుని, వెచ్చని తన రెక్కల చేత కప్పి ఉంటుంది కదా! ఆ దృశ్యాన్ని తిలకించిన ఎడిసన్ , మనుషులు మాత్రం ఆ విధంగా కోడి పెట్టకు బదులుగా,తాము కోడిగుడ్ల మీద పరుండి గుడ్లను ఎందుకు పొదగకూడదు  అని ఆలోచించారు. వెంటనే కోడిగుడ్లను పొట్ట కింద పెట్టుకుని వాటి మీద పడుకున్నారు ఇంటిలో. అందులో కొన్ని చిట్లిపోయాయి.

            మరొకసారి ఎడిసన్ కు ఇంకో ఆలోచన వచ్చింది. అదేమిటంటే ఏదయినా మండుతున్న వాటిని చూడటానికి ఎలా ఉంటుందా అని! మంటలు ఎలా ఉంటాయో చూడాలంటే మరి దేనికయినా నిప్పంటించక తప్పదు కదా! దేనికి నిప్పంటించితే తాను బాగా చూడగలడు  అని కొంచెంసేపు ఆలోచించి పశువుల పాకకు నిప్పంటించడానికి నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టే వెళ్ళి పాకకు నిప్పు పెట్టారు. మంటలు ఉవ్వెత్తున లేచాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ దూరంగా నిలబడ్డారు.

            అంతటితో ఆయన ఆగిపోలేదు. పక్షులు మాత్రమే ఎందుకు ఎగురుతాయి? మనం మాత్రం ఎందుకు ఎగరకూడదు? అని ఆయన ఆలోచించారు. వాటిని కొన్ని రోజులు జాగ్రత్తగా పరిశీలిస్తూ గడిపారు. ఓ రోజు ఓ ఉపాయం తట్టింది. కడుపు నొప్పికి ఉపయోగించే సోడాను సంపాదించి దాన్ని నీళ్ళల్లో కలిపారు. ఆయన ఆలోచన ఏమిటంటే ఆ సోడా నీళ్ళల్లో కరిగిపోయిన తర్వాత, ఆ నీళ్ళను తాగితే శరీరంలో ఆ నీరు కాస్త ఆవిరిగా మారి శరీరాన్ని తేలికగా చేస్తుందని, అప్పుడు అంతకంటే తేలికగా ఆకాశంలో ఎగరవచ్చని.

            నీళ్ళలో ఆ సోడాను కలిపి మరిగించారు. ఒక మిత్రుడి చేత తాగించారు. అతను గాలిలో ఎగరడం మాట ఎలా ఉన్నా, అనారోగ్యం పాలయ్యాడు. ఎడిసన్ పైన చెప్పినవన్నీ తన బాల్యంలో చేశాడు. తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. కానీ ఎప్పుడు తన ప్రయోగాలను ఆపలేదు. ఇవన్నీ ఏడేళ్ళ వయసు రాకముందే ఎడిసన్ చేసిన ప్రయోగాలతో కూడిన ప్రయత్నాలు.

            ఇప్పుడు చెప్పండి. మనం మన జీవితంలో ప్రయత్నాలను ఎప్పుడు మొదలు పెడతాం? చక్కగా చదువులన్నీ అయిపోయి విచక్షణాజ్ఞానం వచ్చాక. పుట్టినప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టిన  ఎడిసనే  అన్ని వైఫల్యాలు ఎదుర్కుంటే మనం ఎన్ని వైఫల్యాల తర్వాత  విజయాన్ని సాధిస్తామో అన్న విషయానికి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి.

            అందరికి ఓటములు వస్తాయి అని చెప్పడం ఉద్దేశం కాదు, కానీ జీవితంలో కచ్చితంగా వైఫల్యాల దశ అనేది ఉంటుందని, దానికి మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి అని స్పష్టం చేయడమే ముఖ్య భావన.

            పాఠశాలకు వెళ్ళకముందే ఇన్ని విషయాలు ఆలోచించే శక్తి ఉన్న ఎడిసన్ పాఠశాలలో మాత్రం చదువు రాణి పిల్లవాడి కిందే జమకట్టబడ్డాడు. కానీ వేటిని ఆయన లక్ష్యపెట్టలేదు. వార్తాపత్రికల నమ్మే బాలుడిగా తర్వాత తన జీవితాన్ని ప్రారంభించి, తన ఊహాశక్తితో  వందలాది ప్రయోగకర పరికరాలను సృష్టించి, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు స్థాపించి, సుమారు మూడు వేల పేటెంట్ల హక్కులను సాధించి, సుమారు 13,000 నూతన కల్పనలు గావించి, 2,500 కోట్ల డాలర్ల డబ్బును సంపాదించి, మానవజాతికి మరచిపోలేని సేవ చేసిన ఎడిసన్ ను ఎవరు మర్చిపోగలరు?

            తెలుగు భాష గొప్పది  అని వ్యాఖ్యానించే హక్కు అందరికి ఉండదు. ఎందుకంటే ఓ బాష గురించి అభిప్రాయాన్ని వెలిబుచ్చాలంటే ఎన్నో భాషలు తెలిసుండాలి. కనుక బహుభాషాకోవిదులైన పి.వి.నరసింహారావు లాంటి  వారికే ఆ అర్హత ఉంటుంది.

            అలాగే విజయం మీద ఓ నిర్ణయానికి రావాలంటే వైఫల్యాలను ఎదుర్కునే శక్తి ఉన్నవాళ్లకే సొంతం. కనుక             మిమ్మల్ని ఎందరూ ఎన్ని రకాలుగా నిరుత్సాహపరచినా ప్రయత్నాలు, ప్రయోగాలు ఆపకండి. ఎందుకంటే 2+2=4 అన్నది  ఎంత సత్యమని మీరు నమ్ముతారో తమకు నచ్చిన విషయాన్ని ప్రయత్నలోపం లేకుండా ప్రయోగ ధోరణితో కొనసాగిన వారికి విజయం తథ్యం అన్నది కూడా అంతే యదార్ధం.

            ఈ సమాజంలో ప్రతి దానికి  ఓ అర్హత ఉంటుంది. అలాగే విజయం సాధించడానికి ఉన్న అర్హత అలుపెరగని ప్రయత్నాలు, ప్రయోగాలే. అవి చేస్తూ ఉన్నంత వరకూ విజయప్రయోగం ఓటమి పాలయ్యే ప్రశ్నే లేదు.

    *             *          * 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!