అతి సర్వత్రా

అతి సర్వత్రా

-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)


‘ఓం దేశనాయకాయ నమః

ఓం దేశనాయకాయ నమః ‘

అతని మనసులోని మాటలు స్వరపేటికతో నిమిత్తం లేకుండా గాలిలో ఘోషిస్తున్నాయి. అదేనేమో అభివృద్ధి అతివృష్టి!!! టెక్నాలజీ మహిమ...!

ఇదివరకట్లా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా మనసులో అనుకుని దాన్ని దానికి తెగిన ఫ్రీక్వెన్సితో సమన్వయపరిస్తే చాలు మన భావాలు ఎదుటి వారికి అర్ధమైపోతాయి.

ఇదివరకు కేవలం మాంత్రికులకు మాత్రమే సొంతమైన వెంట్రిలాక్విజంను సరికొత్త కోణాల సమ్మేళనంతో అందరికీ అందుబాటులోకి తెచ్చేశారు మన గూగుల్ జనరేషన్ శాస్త్రవేత్తలు. సమాజంలోని అందరూ ఈ అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారా? ఇంతటి అభివృద్ధి నిజంగా అవసరమా? అభివృద్ధికి అర్ధం ఏమిటి? అన్న విషయాల మీద పరిశోధన చేస్తున్న మన శంకేష్ కి పేరుకి తగ్గట్టే ఇన్ని అనుమానాలు వచ్చేశాయి మరి ...విక్రమార్కుడంత పట్టుదల, భగీరధుడంతటి ప్రయత్నం, కృష్ణుడిలా పని ఎలా అయినా సాధించే నైపుణ్యం ఉన్న మనవాడు ఇంకెందుకు ఊరుకుంటాడు? సరాసరి దేశనాయకుడికే తపస్సు చేయడం మొదలుపెట్టాడు.

దేశనాయకుడికి తపస్సు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? చెప్పడం మర్చిపోయాను. మామూలుగా అందరూ జరిగేదంతా జ్యోతిష్కులకే తెలుసని అనుకుంటారు. (వాదనలు లేవు న్యూట్రల్ స్టేట్మెంట్ ఇది)

కానీ ఏ వృత్తిలో నిష్ణాతుడైనవాడు ఆ రంగంలో రాబోయే పెనుమార్పుల గురించి కచ్చితంగా చెప్పగలడు. కానీ అన్నీ రంగాలను జోడించి రాబోయే సమాజం ఎలా ఉండబోతుందో చెప్పే దూరదృష్టి, జ్ఞానం రచయితల సొంతం. ఇలాంటి రచయితలు సాహిత్యానికి కొత్తేమీ కాదు.

ఆంగ్ల రచయత అమిష్ రాసిన పుస్తకాలు ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా, ది సీక్రెట్ ఆఫ్ ది నాగాస్, ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్ర ...వీటిలో రచయిత ఊహ అంతా మనిషి తన సత్కర్మలతో దేవుడు అవ్వడం. మరి దాని ప్రభావమో ఏమో చివరికి ఆ నవలలోలానే మామూలు మనిషే దేవుడు అవ్వడం. ఆ దేవుడే దేశాన్ని పాలించడం. అతన్నే దేశనాయకుడు అనడం. మరి ఆ దేశనాయకుడి కోసమే మన శంకేష్ తపస్సు చేయడం.

మన టెక్నాలజీ దేశనాయకుడు తన రోబో బాడీ గార్డులతో చివరికి ప్రత్యక్షం అయ్యాడు. (టెక్నాలజీ పుణ్యంతో మనుషుల పనులన్నీ రోబోలే చేస్తున్నాయి)

ఓ దేశపౌరా! ఏమి నీ కోరిక ? నా పదవి తప్ప ఏమైనా కోరుకో అన్నాడు దేశనాయకుడు. (ఇదంతా మనసులో అనుకోవడం ద్వారానే జరిగిపోతుంది సుమా!)

నాయకా ...నా అనుమానాల నివృత్తికే సమయం సరిపోవడం లేదు. ఈ పాలన ఎత్తుగడలు నాకెందుకు స్వామి? అన్నాడు శంకేష్.

సరే నాయనా ...ఇప్పుడు నీకొచ్చిన అనుమానాల పట్టిక ఏమిటి? అని అడిగాడు దేశనాయకుడు మనస్సులోనే శంకేష్ దాడికి తనని తాను సంసిద్ధం చేసుకుంటూ.

నాయకా....అభివృద్ధి అంటే ఏమిటి? మనుష్యులతో మనుషులు కలవకుండా ఒంటరిగా గడపటమేనా? కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడమేనా? ఎప్పుడో 21వ శతాబ్దంలో పెళ్లి అనే ప్రక్రియ ఉండేదని చరిత్రలో చదువుకున్నాము. పిల్లలు తల్లి కడుపులో నుండి పుడతారని, నవమాసాలు కడుపులోనే ఉంటారని చదువుకున్నాము. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమకు కావల్సిన లేదా ఊహల్లో ఉన్న వ్యక్తినో బ్లూ ప్రింట్ ఇస్తే జెనెటిక్ టెక్నాలజీ తో అలాంటి వ్యక్తిని కృత్రిమంగా తయారు చేయడం, తరువాత మనసులో అనుకున్నట్టే ఆ వ్యక్తి ప్రవర్తించడం తద్వారా భావప్రాప్తితో ఆనందాన్ని పొందడం.

ఏమిటి నాయకా ఈ అభివృద్ధి? అమ్మ ,నాన్న ఉండేవారని పుస్తకాల్లో చదువుకున్నాము. కానీ ఇప్పుడు ఎవరైనా పిల్లలు కావాలనుకుంటే తమ డిఎన్ ఏ పంపడం, ఆ రూపు రేఖలతో మళ్ళీ కృత్రిమంగా పిల్లలను పుట్టించడం , వారిని రోబో పెంపకంలో ఉంచడం , తర్వాత తమ ఆస్తులని పిల్లలకు పంచడం ...ఏమిటి నాయకా ఈ అభివృద్ధి? ఆఖరికి చావుని నియంత్రించే సోమరసాన్ని కూడా కనుక్కున్నాము. దానితో జనాభా అదుపు లేకుండా పెరిగిపోయింది.

ఈ అభివృద్ధిని ఇప్పుడే పుడుతున్న (సారీ...కృత్రిమంగా తయారు చెయ్యబడుతున్న )జనరేషన్ ,ఆది నుండి ఆహ్వానిస్తున్నారు. కానీ 21 వ శతాబ్దపు చివరార్ధంలో సంబంధ బాంధవ్యాలలో మునిగి తేలినవారు ఆహ్వానించగలుగుతున్నారా? వారు తమ జనరేషన్ తో తమ పద్దతుల్లో తీసుకెళ్తున్నారు. అందుకే సమాజం మానవులు, మర మానవులు అన్న రెండు వర్గాల కింద చీలిపోయింది. మొదటి వర్గం వారు దేశంలోని కొన్ని ప్రాంతాలను తమ ప్రదేశాలుగా ప్రకటించేసుకున్నారు . ఇలా దేశాన్ని రెండు వర్గాలు పంచేసుకున్నాయి.

కేవలం మనుషులని జంతువుల నుండి వేరు చేసి ఓ విభిన్న ఉత్కృష్ట జాతిగా నిలబెట్టేది ఏ సంబంధ బాంధవ్యాలే కదా! చరిత్ర పుస్తకాల్లో మనుష్యులు నోరు తెరిచి మాట్లాడే వారని పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప అలాంటి వారు ఉంటారని కూడా తెలియకుండా పోయింది. (మొదటి వర్గం వారు తమ స్వంత ప్రాంతాలుగా ప్రకటించుకున్న ప్రదేశాల్లో రెండో వారి ప్రవేశం నిషిద్దం.) అభివృద్ధి అంటే ఆవిష్కరణల అతివృష్టితో తిరిగి మనం ఆది మానవుడి వెనుక స్థితికి వెళ్లిపోవడమేనా?

నలుగురు కలిస్తేనే కుతంత్రాలు. ఇద్దరు మాట్లాడుకుంటేనే అర్ధాలు, అపార్థాలు. అవేమీ లేకపోవడంతో కలతలు, సమస్యలు లేకపోవడంతో దేశనాయకుడికి పని లేకుండా పోయింది ఈ మధ్య.

చాలా కాలం తరువాత తన మెదడుకి పదునుపెట్టే ఆలోచనల ఆనవాలైన శంకేష్ ప్రశ్నలతో తత్తరపడసాగాడు దేశనాయకుడు. అయినా తమాయించుకుని తన రోబోలకి సంజ్ఞ చేశాడు. వెంటనే ఆ రోబోలు ఏ ప్రశ్నలను ఫీడ్ చేసి ఆ రంగాల్లో నిష్ణాతులైన వారికి పంపాయి.

తన మనస్సులోవన్ని అనుకుని దేశనాయకుడికి వినిపించేలా చేసిన తరువాత ఆ భావోద్వేగంలోనే పది నిమిషాలు ఉండిపోయాడు శంకేష్ . తరువాత తేరుకుని దేశనాయకుడి వైపు చూశాడు సమాధానం కోసం.

‘నాయనా శంకేష్ ...నీ ఆవేదనలోని అర్ధాన్ని గ్రహించగలను. దీనికి మూలం సుఖానికి నిర్వచనం తెలియకపోవడం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాన్ని అన్వయించుకుని ఆ సుఖం కోసం తమ పరిజ్ఞానంతో ఆవిష్కరణలు చేయడం. ఉదాహరణకు పుట్టుక-మరణం సహజం అని తెలిసినా ఆ మరణం లేకపోవడమే సుఖం అని అనిపించింది కొందరికి. అందుకే సోమరసం ఆవిష్కరించబడింది. అలాగే స్వరపేటికను ఉపయోగించకుండా ఉంటే చాలా శక్తిని ఆదా చేయవచ్చు అనే దాన్నే సుఖం అని ఇంకొందరు భ్రమించి ఇంకో ఆవిష్కరణకు పూనుకున్నారు. ఆధారపడటం అధమం అని , స్వతంత్ర భావనే ఉత్తమం అని , దాన్నే సుఖం అని భావించి , కొందరు పెళ్లి -కుటుంబం అనే అంశాలకు చరమ గీతం పాడారు. వీటన్నిటిని క్రమంగా సమాజం ఆమోదించింది. ఇలా ఒక్కొక్కరు తమ తమ సొంత అభిప్రాయాల చట్రంతో సమాజాన్ని నిశ్శబ్ద నిశీధిని చేశారు.

మనం సైన్స్ లో చదువుకునే రిసైక్లింగ్ పద్దతే ఈ సమాజంలో జరుగుతూ ఉంటుంది శంకేష్ . ఎప్పుడైతే పాత నీరే బావుందని అనిపిస్తుందో అప్పుడు అటువైపే మల్లుతుంది సమాజం. చిన్న చిన్న ఆటుపోట్లు ,కలతలు లేనిదే సుఖానికి నిర్వచనం ఉండదని తర్వాతి శతాబ్దం వారు గ్రహిస్తారు. అప్పుడు మళ్ళీ మనం శతాబ్దాల వెనక్కి వెళతాము.

భేతాళ నిశ్శబ్దంలో మునిగి ఆలోచనల్లో తేలుతున్న శంకేష్ ని చూసి సంతృప్తితో తన రోబోలకి సంజ్ఞ చేసి అంతర్ధానమయ్యాడు దేశనాయకుడు.

* * *








Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!