మరబొమ్మలా మనిషి కారాదు!


 మరబొమ్మలా మనిషి కారాదు!

      -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)

ఈ జనరేషన్‌ పిల్లలకు నచ్చనివి ఏమిటి? ఒకటి వినటం రెండోది చదవడం! ఇది నా సొంత అభిప్రాయం కాదు. సుమారు 30 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉంటూ ఓ ప్రఖ్యాత పాఠశాలను నడుపుతూ మారుతున్న తరాల పిల్లల అంతరాలు లోతుగా పరిశీలిస్తున్న ఓ ఉపాధ్యాయుని అనుభవాలతో ధృవపరచబడిన సత్యం. సమాజంలో ఎప్పుడూ వెలుగులోకి వచ్చే అరాచకాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఏదో తెలియని ఓ ప్రత్యామ్నాయ ప్రవృత్తి ధోరణి స్రీ, పురుష సంబంధాలపై గాధంగా (ప్రభావం చూపుతుంది అన్న విషయం స్పష్టం అవుతుంది. దీనికి బీజాలు బాల్యంలోనే పడతాయి అన్నది ఎవరూ కాదనలేని సత్యం. 

బాల్యం అంటే ఏమిటి? పిల్లల ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులే. కానీ ఉపాధ్యాయులు! (9) పిల్లల లోకం వాళ్లే మరి! రోజుకి సగంపైగా వారితో గడుపుతూ, మిగిలిన రోజుల్లో కూడా దాదాపు కాలాన్ని వారి గురించే ఆలోచించే చిన్నారులని ఎక్కువ ప్రభావితం చేసేది వారే అన్నది కూడా మనం తప్పకుండా ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ రోజుల్లో అక్షరాస్యులకి కొరత ఏముంది? మరి అక్షరాల తూకం ఓ వైపు, అరాచకాల పాపం ఇంకోవైపు... ఎందుకో ఈ దుస్థితి? లోతుగా పరిశీలిస్తే తరాల మార్పుతో కొట్టుకుపోతున్నప్రవాహంలో ఏదో అవాంతరం వచ్చింది అనేది సత్యం. అదే మార్పుకి, మానవ స్పర్శకు మధ్య రగులుతున్న సందిగ్ధ సంఘర్షణ. 

టెక్నాలజీ డిజిటల్‌ విద్యనేఅసలైన విద్యగా భావిస్తున్న నేటి పరిస్థితులు మనుషులకు మెషిన్లతో, గాడ్జెట్లతో ఎలా మెలగాలో నేర్పిస్తున్నాయే కానీ మనుషులతో మానవత్వంతో ఎలా మసలుకోవాలో మాత్రం తెలుసుకునేలా చేయలేకపోతున్నాయి. అన్నది కూడా సమకాలీన దుష్పరిణామాలను దృశ్యాలుగా చూస్తున్న తర్వాత అంగీకరించాల్సిన సత్యమే. మనిషికి ఓ వ్యక్తిత్వం రూపొందే క్రమంలో బాల్యంలోని ప్రభావాలు బలమైన పాత్రను పోషిస్తాయి. అ దశలో విద్యార్థిగా అతను జీవితం పట్ల అలవర్చుకున్న ఆశావాద దృక్పధమో లేక నిరాశావాదమో భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. విత్తుని బట్టే కదా వృక్షం! క్షేత్రాన్ని బట్టే కదా విత్తు! బాల్యం నుండి ప్రారంభ యవ్వనదశ వరకు ఉండే కాలంలో మనుషుల ప్రభావం, పరిస్థితుల  వ్రభావం తీవ్రంగా ఉంటుంది. అదే విధంగా గుడ్డిగా అవలంభించడం అనే పంధా కూడా ఉంటుంది. ఆ కీలక దశలో అనుకరణ కూడా ఉంటుంది. 

నేటి పరిస్థితులలో అంతర్జాల మమేకం అవుతున్న పిల్లల్ని నిజంగా బాల్యంలో ప్రభావితం చేస్తున్నవి ఏమిటి? మనుషులు కాదు గాడ్జెట్లు.మానవస్పర్శ కొరవడిన విద్య మనుషుల్లో పశుప్రవృత్తిని ప్రేరేపిస్తుంది. ఒకప్పుడు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ఓ ఇంటి వాతావరణాన్ని తలపించేవి. ఉపాధ్యాయుల తిల్లే ఆశీర్వాదాలుగా భావించేవారు. అప్పట్లో దానితో అతి చిన్నచిన్న విషయాలను గురించి విపరీతంగా ఆలోచించే ధోరణికి ఆస్కారం ఉండేది కాదు. కానీ నేటి పరిస్థితుల్లో పిల్లలకు పాఠశాలల్లో  ఏది తప్పో, ఏది ఒప్పో గట్టిగా మందలించే ఆస్కారం కూడా లేదు. ఇదినాణేనికి ఓ వైపు.

           ఇంకోవైపు ఇటు వైవు సమాజాన్ని లాగినపరిజామాలను పరిశీలిస్తే ఓర్పు నశించిన కొందరి ఉపాధ్యాయుల విపరీత క్రమశిక్షణ పద్దతులు దీనికి దారితీస్తాయని అనుకోవచ్చు. లాలిత్యం, ఆత్మీయత ధ్వనించాల్సిన వాతావరణంలో అతిక్రమశిక్షణ ఏలుతున్న ప్రవృత్తి దానికి ప్రత్యమ్నాయంగా వచ్చిన పోకడలే “మ్యాన్‌ వెర్సస్‌ మెషిన్‌' ట్రెండ్‌కి దారితీసింది. 12 ఏళ్ల వయసు నుండి ఇరవై ఏళ్ల వయసు వరకు మాయాలోకం ఈ వయనులో శారీరకంగా వచ్చే మార్పులు పిల్లల మనఃస్థితిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఆ సమయంలో సరైన దిశానిర్దేశం లేకపోతే గాడితప్పే ఆలోచనలు వ్యక్తులనేకాదు సమాజాన్ని సర్వనాశనం చేస్తాయి. ఆ దశలో పిల్లలు తమ మనసులోని భావాలను నలుగురితో పంచుకోవడానికి సిగ్గుపడతారు. తమ మనసులో ఊగిసలాడే సందేహాల్ని ఎలా ఛేదించాలో తెలియక సతమతమయ్యే ఈ దశలో మానవ స్పర్శ కరువైతే తప్పొప్పుల విచక్ష పిల్లలు కోల్పోతారు. సరైన విద్య అందించకపోతే మాధ్యమాలే గురువులు అవుతాయి వారికి.

          సినీ మాయజాలం ఓవైపు.. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఇంకోవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బ్లూవేల్‌ ఉదంతాలకు మూలం కూడా ఈ మానవన్పర్శ కొరవడిన విద్యవల్లే.ఒంటరితనం, వయసు ఉక్కిరిబిక్కిరి, మాధ్యమాల వెల్లువ వీటితో సహవాసం చేసే ఈ ప్రారంభ యవ్వనదశ పిల్లల్ని క్రమక్రమంగా పైశాచిక ప్రవృత్తి వైపుకు మళ్లేలా చేస్తుంది. మొదట పెంకితనం, మొండితనంతో మొదలయ్యే ఈ ధోరణులు తర్వాత పైశాచికత్వానికి దారితీస్తాయి. ఆ తరహా పైశాచిక ధోరణులే చివరికి అసమానత్వ స్థితికి దారి తీస్తాయి. ఒకరిపై ఒకరు యాసిర్లతో, కత్తులతో తెగబడేలా చేస్తాయి.

          ఓ మనిషి సంపూర్ణ వ్యక్తిత్వం బాల్యంలోని బీజాలతోనే మొదలవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉదయించవచ్చు. మరి ఇంతకు పూర్వం టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందనప్పుడు ఇటువంటి అకృత్యాలు జరగలేదా అని, కానీ చాలావరకు జరిగిన అరాచకాలన్నీ మాధ్యమ ప్రేరేపితాలే అన్నది మాత్రం వాస్తవం. టెక్నాలజీతో మాధ్యమాల దూకుడు జెట్‌ స్పీడ్‌ను అందుకున్నాయి. ఓ మంచి పని చేయాలన్నా లేకపోతే ఓ మారణకాండకు పాల్పడలన్నా ఓ మోటివ్‌ అయితే కచ్చితంగా ఉంటుంది.

          మానవస్పర్శ వల్ల మనిషిలో ఎదుటి వ్యక్తి జీవితంలో సాధ్యాసాధ్యాలు, అనుకూలాలు, ప్రతికూలాలు అర్ధం చేసుకునే ప్రజ్ఞ, పరిణితి అలవడతాయి. ఆ క్రమంలో 'నాది..నాకే సొంతం కావాలి, లేకపోతే ఇంకెవరికి దక్కకూడదు..” అనే విపరీత ధోరణికి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే విద్య మానవీయ కోణం మనిషిలో సంస్కారంగా రూపొందుతుందో అప్పుడు మానవత్వంతో మరో ప్రపంచం వైపు సృష్టి పయనిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒకరి మధ్య తెరగా నిలబడుతున్న విపరీతమైన ఇండివిడ్యువాలిటీ అందరి మధ్య పెద్ద గ్వాప్‌ని సృష్టిస్తుంది. ఒక్కసారి ఆ తెరను దించేసి ఓ ఆత్మీయ స్పర్శతో ముందడుగు వేస్తే చాలు. మిగిలిన సుధీర పయనం దానంతటదే ప్రకృతితో సాగుతుంది. మొదటి అదుగు విద్యదైతే వసుధైక కుటుంబ స్ఫూర్తితో నిండదా సృష్టి!

   *   *   * 















 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ