సమాజం శిక్షించిన నిర్దోషి ధనంజయ్ రాయ్ ఛటర్జీ

సమాజం శిక్షించిన నిర్దోషి ధనంజయ్ రాయ్ ఛటర్జీ 
       (ధనంజయ్ రాయ్ ఛటర్జీ కేసు ఆధారంగా తీసిన బెంగాలీ సినిమా ) 
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన )





మన దేశంలో రేప్ అండ్ మర్డర్ కేసులు ఇప్పటి వరకు ఎన్నో వెలుగులోకి రావడం, నిందితులకు శిక్షలు పడటం కూడా మనం చూశాం. మన దేశంలో హత్య చేసినందుకు 21 వ శతాబ్దంలో  న్యాయపరంగా ఊరి శిక్ష పడిన మొదటి వ్యక్తి ధనంజయ్ రాయ్ ఛటర్జీది. హెటల్  పరేక్ అనే 15 ఏళ్ళ హై స్కూల్ బాలికను రేప్ అండ్ మర్డర్ చేసినందుకు 14 సంవత్సరాల కారాగార వాసం తర్వాత అతన్ని ఊరి తీశారు. కానీ చివరి వరకు ధనంజయ్ తనను తాను నిర్దోషిగా చెప్పుకుంటూనే ఉన్నాడు. అసలు నిజంగా ఏం జరిగింది? 'సర్ కామ్ స్టాన్షియల్ ఎవిడెన్స్ '(
circumstantial evidence) పేరుతో ఈ కేసులో ఓ నిర్దోషినే దోషిగా చేశారని తర్వాత మానవ హక్కుల సంఘాలు కూడా ఘోషించాయి. కోల్ కతా ఐఎస్ ఐ ప్రొఫెసర్లైన  దేబాశిష్ గుప్తా, ప్రోబల్ చౌదరి ,పరమేష్ గోస్వామి ఈ విషయం పట్ల ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కూడా చేసి 'కోర్ట్ -మీడియా -సొసైటీ  అండ్  ద హ్యాంగింగ్ ఆఫ్ ధనంజయ్ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించాయి. ఈ పుస్తకం మరియు కేసు ఆధారంగా తీసిన బెంగాలీ సినిమానే ధనంజయ్.
నిజంగా ఈ సినిమాను చూస్తుంటే ధనంజయ్ మన పక్కనే ఉండి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి చనిపోయేవరకు ప్రయత్నస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. కొల్ కతా లోని ఓ అపార్ట్మెంట్ లో హెటల్ పరేక్ తన తల్లిదండ్రులు., సోదరుడితో నివసించేది. వారు ఉంటున్న అపార్ట్మెంట్ లో ధనుంజయ్ రాయ్ ఛటర్జీ సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవాడు.మార్చ్ 5,1990 న తన షిఫ్ట్ లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉన్నాడు ధనంజయ్. ఆ ఉదయం పరీక్ష రాయడానికి వెళ్ళిన హెటల్ పరేక్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సాయంత్రం ఆ తల్లి బయటికి ఓ అరగంట వెళ్ళి తిరిగి వచ్చేసరికి కూతురు హత్య చేయబడి ఉండటం, వాచ్ మెన్ తో పాటు కొందరు ఆ సమయంలో ధనంజయ్  ఆ అపార్ట్మెంట్ కి వచ్చినట్టు చెప్పడం, అదే సమయానికి ధనంజయ్ పారిపోవడం తర్వాత మూడు నెలల తర్వాత అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ధనంజయ్ ఆ సమయంలో ఎందుకు పారిపోయాడు? అసలేమీ జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కానీ ,అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో చూసే ప్రయత్నం కానీ, అదే రోజు తమ ఇంట్లో వాచ్ కూడా అతను దొంగతనం చేశాడని చెప్పిన  ఆ తల్లి  సాక్ష్యం , తర్వాత అక్కడ ఓ బటన్ ఉండటం,ఇలా సాక్ష్యాలన్నీ గందరగోళంగా ఉన్నప్పటికీ, మీడియా ఇచ్చిన హైప్ వల్ల, అదే సమయంలో అతన్ని ఊరి తీయాలని బెంగాల్  ముఖ్యమంత్రి భార్య మీరా భటర్జీ కూడా ఉద్యమించటం వాటి వల్ల జరగాల్సిన సవ్యమైన రీతిలో విచారణ జరగకుండానే ధనంజయ్ కి మొదట 14 ఏళ్ళ శిక్ష తర్వాత 2004 లో ఊరి శిక్ష వేయడం జరిగింది. 
ఇది జరిగిన తర్వాత జరిగిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ని ఈ సినిమాలో మళ్ళీ కేసు రీ ఓపెన్ చేసిన లాయర్స్ ద్వారా ఆ ఇన్వెస్టిగేషన్ ని అసలు నిజాలను మనకు కనిపించేలా చేశారు దర్శకులు అరిందమ్ సిల్. 
మొదట ఏ వ్యక్తి హత్య ఏ సమయంలో జరిగింది అనేది తెలుసుకోవడానికి ఆ మనిషి కడుపులో ఉన్న అజీర్ణం అవ్వని ఆహారం ద్వారా కూడా చెప్పవచ్చు. హరేక్ పటేల్ కడుపులో 100 గ్రాముల ఆహారం జీర్ణం కాలేదు. అంటే ఆమె మరణం మధ్యాహ్నం 2:30 -3:30 మధ్య సంభవించి ఉండవచ్చు. సాధారణంగా రేప్ జరిగినప్పుడు శరీర పై భాగాలతో పాటు కింది భాగాల మీద దెబ్బలు ఉంటాయి. కానీ హెటల్ పరేక్ ముఖం, మెడ మీద మాత్రమే 21 ఇంజూరీస్ ఉన్నాయి. కింద ఎటువంటి డ్యామేజ్ లేదు. అంటే అది కచ్చితంగా రేప్ కాదు, ఇష్టాపూర్వకంగా జరిగిన సెక్స్  మాత్రమే. 
ఆ రోజు మీడియా హెటల్ పరేక్ చేతులు, కాళ్ళు కూడా విరిచేశాడని రాశాయి. కానీ ఆమె మధ్యాహ్నం మరణించడం వల్ల  సాయంత్రం వరకు ఆ మృతదేహం అలాగే ఉండటం వల్ల రిగస్  మార్టేమ్ వల్ల శరీరం గట్టి వల్ల అలాంటి ఊహాగానాలు పెరిగిపోయాయి. ఆరు గంటలకు శరీరాన్ని చూసిన ఆ కుటుంబం తొమ్మిది గంటల వరకు కూడా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదు. 
మీడియా విషయానికి వస్తే రోజుకో కొత్త వార్తను జోడించాయి. మొదటి రోజు ఆమె మరణం సంభవించినప్పుడు రాని ఎన్నో విషయాలు ఆ తర్వాత జోడించబడ్డాయి. తమ కూతుర్ని రోజు ధనంజయ్ ఏడిపించేవాడని, అందుకే అతన్ని తీసెయ్యమని ఫిర్యాదు మార్చ్ 2 న చేశానని, మార్చ్ 4 కు వేరే అపార్ట్ మెంట్ కు చేశారని చెప్పిన ఆ తండ్రి మళ్ళీ మార్చ్ 5 ఉదయం అతను మళ్ళీ అక్కడే పని చేస్తున్నా ఎందుకు ఏమి అడగలేదో చెప్పలేకపోయాడు. అతన్ని ట్రాన్స్ ఫర్ చేశామని, ఆర్డర్ ఇచ్చామని చెప్పిన ఆ ఏజెన్సీ అధికారి, మరి ధనంజయ్ స్థానంలో నియమించిన వ్యక్తి  ఆర్డర్  మాత్రం సబ్మిట్ చేయలేదు. వీటిన్నంటినీ గమనిస్తే  హత్య తర్వాత హడావుడిగా సృష్టించిన సాక్ష్యాలుగా మాత్రమే అనిపిస్తాయి. 
అలాగే ఆ ఇంట్లో దొంగలించబడిన లేడీస్ వాచ్ మళ్ళీ ధనుంజయ్ ను అరెస్ట్ చేసినప్పుడు అతని ఇంట్లోనే దొరికిందని దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత , ఆ తల్లి వాచ్ సీరియల్ నంబర్ , ఇక్కడ ధనుంజయ్ దగ్గర దొరికిన సీరియల్ నంబర్ మ్యాచ్ అయ్యాయా ? లేదా ? అనే విషయం కూడా చెక్ చేయలేదు. 
ఆ రోజు మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకు వెళ్ళిన ధనంజయ్ తిరిగి ఇంటికి వస్తుంటే అతన్ని కలిసిన కొందరు సెక్యూరిటీ మిత్రులు అతన్ని పారిపొమ్మని కారులో బలవంతంగా వేరే చోట ఎందుకు దింపారు? కావాలనే అదే సమయంలో ధనంజయ్ అక్కడికి వస్తానన్నా అతన్ని భయపెట్టి ఎందుకు ఆ కారులో పంపారు? అసలు ఆ కారు ఎలా వచ్చింది ? ఇదే మిత్రులను పోలీస్ అధికారులు తమ ఇంట్లో కొన్ని రోజులు రాజాలా ఎందుకు చూసుకున్నారు ? అసలు సాక్ష్యుల్లో ఏ ఒక్కరూ చెప్పే సాక్ష్యం ఇంకొకరు చెప్పే దానితో పోలిక లేకుండా ఉన్నప్పటికీ కనీసం 'బెనిఫిట్ ఆఫ్ డౌట్ 'కు కూడా అవకాశం లేకుండా ఎందుకు అతనికి శిక్ష పడేలా చేశారు?
అసలు ఈ సంఘటన జరిగిన వెంటనే హెటల్ పరేక్ కుటుంబం ఎందుకు అక్కడి నుండి ముంబై కు తరలిపోయింది ? ఆ రోజు పరీక్ష తర్వాత ఇంటికి లేటుగా వచ్చిన హెటల్ పరేక్ తన తల్లి ముందే బట్టలు మార్చుకుంటునప్పుడు ఆమె లోదుస్తులు చూసిన తల్లికి అక్కడ బ్లీడింగ్ కనబడటంతో  ఆమె అప్పుడు ఇంటర్ కోర్స్ లో పాల్గొందనే విషయం అర్ధమై ,పరువు పోయిందన్న  కోపంతో  ఆమెను దారుణంగా కొడుతుంది ,ఆమె చనిపోతుంది. ఆ తర్వాత దాన్ని ప్లాన్ ప్రకారం ఆ హానర్ కిల్లింగ్ ను మర్డర్ గా మార్చడానికే ఇదంతా చేసినట్టు మనకు ఈ  కేసును క్షుణ్ణంగా గమనిస్తే అర్ధమవుతుంది. 
ఊరి శిక్ష తర్వాత ధనంజయ్ శరీరాన్ని తీసుకోవడానికి కూడా ఆ కుటుంబం అంగీకరించలేదు,తమకు జరిగిన అన్యాయానికి. మన దేశంలో ఎక్కడా స్త్రీలపై అత్యాచారాలు జరిగినా, వెంటనే నిందితులకు శిక్ష పడాలనే ఒత్తిడి అటు అధికారుల మీద ఎక్కువవుతుంది. దీనికి కారణాలు అనేకం. తమ తప్పు లేకుండా ఉండటానికి అధికారులు చేసే పనులు ఇలా కొన్ని సార్లు నిర్దోషులను దోషులను చేయవచ్చు. కానీ భారతీయ శిక్షా స్మృతి సూత్రమే 'వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ,కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు' అని. కానీ దానికి మన దేశంలో ఉన్న గౌరవం ఇటువంటి కేసులను చూస్తే అర్ధమవుతుంది. 
నిజం గెలుస్తుందో లేదో తెలియదు, కానీ మీడియా సపోర్ట్ ,నాయకుల సపోర్ట్ ,పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఏది అయినా సత్యమనే నిరూపించవచ్చు ,నిర్దోషులను కూడా దోషులను చేయవచ్చు  అని ఈ కేసు నిరూపిస్తుంది. తమ రాజకీయ లబ్ది కోసం నాయకులు ,తమ టి ఆర్ పి కోసం మీడియా, తమ గుర్తింపు కోసం మహిళా సంఘాలు ..ఇలా ఎవరి లబ్ది కోసం వారు ...కానీ నిజంగా నిజాలు విచారించే వరకు నిజాన్ని చూసే సహనం ఎవరికి ఉంది ? మనం చూడకపోయినా , సాక్ష్యులు సృష్టించబడినా సరే నలుగురు అనేది నిజమనుకుని సాగే సమాజ పయనంలో ఇలాంటి  ధనంజయ్ రాయ్ ఛటర్జీ లు ఎంతమందో ! 
         *      *      *  

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!