జైలు గోడల్లో ప్రేమ జన్మిస్తుందా? మరణిస్తుందా?

జైలు గోడల్లో  ప్రేమ జన్మిస్తుందా? మరణిస్తుందా?  
     -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) 


నవలా సాహిత్యం లేదా లేదా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీయడం ఎప్పుడు కత్తి మీద సాము లాంటిదే. మలయాళ సాహిత్యాన్ని కొంత మేరకు సినీ రూపంలో తీసుకువచ్చిన దర్శకులు ఆదూర్ గోపాలకృష్ణ గారనే చెప్పాలి. ఆయన ఎంచుకోవడం కూడా రిస్క్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్నవే ఎంచుకున్నారు. మతిలుకాల్ కూడా ఆయన చేసిన అటువంటి సాహసానికే నిదర్శనం. వైకోమ్ మహమ్మద్ బషీర్ అనే మలయాళ రచయిత, ఉద్యమకారుడు తన జీవితంలో జరిగిన విషయాలని మతిలుకాల్ అనే పేరుతో నవలగా రచించారు. దానిని సినిమాగా మలిచారు ఆదూర్ గోపాలకృష్ణ. 
మమ్ముట్టి బషీర్ పాత్రకు ప్రాణం పోశారు. ఓ రచయిత,ఉద్యమకారుడు అయిన బషీర్ బ్రిటిష్ కు వ్యతిరేకంగా రాసినందుకు బషీర్ కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అప్పటికే గొప్ప రచయిత అయిన బషీర్ ను అందరూ గుర్తిస్తారు.మధ్యలో రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు,కానీ బషీర్ ఒక్కడిని మాత్రం విడుదల చెయ్యరు.  అక్కడ ఒంటరితనాన్ని భరించలేక తోటి జెయిల్ మేట్స్ తో సరదాగా గడుపుతూ ఉంటాడు. అయినా ఆ ఒంటరితనం అతన్ని వేధిస్తూనే ఉంటుంది. అక్కడ గులాబీ మొక్కలు నాటుతాడు. వాటి పూలు చూస్తూ మైమరచిపోతాడు. కానీ మనిషిగా ఒంటరితనాన్ని ఎలా జయించాలో తెలియని స్థితిలో నారాయణి అతనికి పరిచయం అవుతుంది. 
ఆ పరిచయం కూడా విచిత్రమైన పరిచయం. ఆ జెయిల్ లో మధ్యలో ఉన్న గోడ అవతల లేడీస్ సెల్ ఉంటుంది. ఓ సారి అనుకోకుండా ఆ గోడ వైపు నడుస్తూ ఈల వేస్తాడు బషీర్. అది విని అటువైపు నుండి ఓ స్త్రీ స్వరం ఎవరు అని ప్రశ్నిస్తుంది. అలా ఆ అమ్మాయి మొహం కూడా చూడకుండానే ప్రేమలో పడతాడు బషీర్. కేవలం మాటలను బట్టి ఆమె పేరు నారాయణి అని,వయసు 25 అని,14 ఏళ్ల జైలు శిక్ష అని తెలుసుకుంటాడు.అలా రోజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. 
ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలని తాపత్రయపడతారు. ఆ తర్వాత రోజు తను ఆసుపత్రికి వెళ్తానని అక్కడ కనీసం చూసుకుందామని అడుగుతుంది. తన కుడి చెంప మీద పుట్టు మచ్చ ద్వారా తనని గుర్తించమని నారాయణి, తన చేతిలో ఉన్న ఎర్ర గులాబీతో తనను గుర్తించమని బషీర్ ఆ గోడకు అవతల ,ఇవతల మాట్లాడుకుంటారు. 
అప్పటి వరకు ఉన్న ఒంటరితనం ఎందుకో నారాయణి వల్ల మాయమైనట్టు భావిస్తాడు బషీర్. అలా తర్వాతి రోజు ఆమెను కలవచ్చు అనే ఆనందంలో ఉన్నప్పుడే అతన్ని ఆ రోజే విడుదల చేస్తున్నట్టు వార్త వస్తుంది. నారాయణి పరిచయం అయ్యేంతవరకు ఎంత త్వరగా విడుదల అవుతానా అని ఎదురుచూసిన బషీర్ అప్పుడు ఆ విడుదల కూడా నారాయణిని తన నుండి దూరం చేసే జైలులా అనిపిస్తుంది బషీర్ కి . దీనితో సినిమా ముగుస్తుంది. 
జైల్ జీవితం అంటేనే ఒంటరితనం. దానికే మనిషి ఎక్కువ భయపడతాడు. జైల్ లో ఏళ్ళకు తరబడి గడపటం ఎంత కష్టంగా ఉంటుందో అక్కడ గడిపే ఖైదీలకే అర్ధమవుతుంది. అక్కడ భోజనం, బట్ట ,గూడు ఉన్నా కూడా మనిషిని మానసికంగా ఆ ఒంటరితనం ఎంతో క్రుంగదీస్తుంది. అటువంటి వాతావరణం  బయటి నుండి సినిమాలో అదే భావన ప్రవేశపెట్టడం, చూసే ప్రేక్షకుల మనసులో ఆ జైల్ పట్ల ఆ వాతావరణ మనస్తత్వాన్ని దృశ్యీకరించడంలో ఆదూర్ గోపాల్ కృష్ణ గారు విజయవంతమయ్యారు. 
జైల్ లో ప్రేమ జన్మించినా అది జైల్ గోడలకే పరిమితం లేదా ఆ గోడలు ఎప్పటికీ ఆ ప్రేమకు ప్రతికల్లా నిలిచి ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా రచయిత బషీర్ ఆ పేరు పెట్టి ఉండవచ్చు.  జైల్ లో ఖైదికి మరో ఖైదికి మధ్య కూడా అదే గోడలు ఉంటాయి,అవి ఒంటరితనాన్ని నిర్మించే బంధనాలు అని కూడా సూచించే ప్రయత్నం కూడా అయ్యి ఉండవచ్చు. 
ఒంటరితనంలో మనిషి ప్రేమ కోసం ఎలా పరితపిస్తాడో కూడా ఈ సినిమా అంతర్లీనంగా సూచిస్తుంది. మళ్ళీ ఆ జైల్ నుండి విడుదల అయ్యాక  ఆ ప్రేమ మీద భావం కూడా మారవచ్చు. కానీ మనిషి జీవితంలో ప్రేమ కూడా పరిస్థితుల ప్రభావాన్ని అనుసరించి జన్మిస్తుంది, మరణిస్తుంది అని అంతర్లీన సూత్రాన్ని చెప్పే సినిమా ఇది. 
                                  *     *    *   

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!