బాలీవుడ్ బ్యాడ్ బాయ్

బాలీవుడ్ బ్యాడ్ బాయ్ !

-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)



సినీ తారలను నింగిలోని తారల్లా తెర అనే ఆకాశంలో చూస్తూ వారిని రేయి జిగేళ్ళల్లో తప్ప పగటి వెలుగుల్లో ఓ కోణంలో వాళ్లూ మనలా ఉంటారని కలలో కూడా ఆదమరచి అనుకోవడానికి వీలు లేని పరంపరను వారసత్వంగా ప్రేక్షకులకు అందించే వైభవ రంగమే సినీరంగం.

  కొందరి జీవితాలు కొన్నిసార్లు ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తాయి. విజయం,పరాజయం మధ్యలో ఉండేదే జీవితం. ఆ జీవితం విజయం కన్నా కూడా ముఖ్యమైనది. అలా జీవితాన్ని కోల్పోయిన వ్యక్తే సంజయ్ దత్. జీవితం కన్నా విలువైనది ఏమి లేదని తెలుసుకునేటప్పటికీ జీవితం మనకు మొండి చెయ్యి చూపిస్తుంది. అదే జీవిత రహస్యం. అందుకే తప్పక చూడాల్సిన సినీ బయో పిక్ సంజయ్ దత్ ది. 

తండ్రి క్రమశిక్షణ ‘స్వేచ్చ కోల్పోయాను, కోల్పోతున్నాను’ , అన్న భావన అతనిలో కలిగించింది. చెడు సావాసాలకు దగ్గరై, ఆ క్రమంలో డ్రగ్స్ కి బానిసై చివరికి టెర్రరిస్ట్ అనే ముద్ర నీడలో కొన్నాళ్లు ఉండి, అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అతను. ఇది పూర్తిగా వ్యక్తిగత కోణం. మరి రంగుల లోకంలో మాత్రం లోటు లేని నటనామకుట వీరుడు. ఆయనే సంజయ్ దత్. గొప్ప నటులైన సునిల్ దత్, నర్గీస్ దత్ కుమారుడు.

ఇటువంటి బయోపిక్ అవసరమా? ఒరిగేదేమిటి? అతను ఏం చేసినా గొప్పవాడు అని చెప్పడానికి కంకణం కట్టుకుని ఈ సినిమా తీస్తున్నారా? కచ్చితంగా ఇటువంటి సందేహాలు వస్తాయి. బయో పిక్ అంటే ఓ వ్యక్తి గురించి మాత్రమే తీసే సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో తలెత్తే ప్రశ్నలకు సమాధానమిచ్చే సాక్ష్యం కూడా. రాజ్ కుమార్ హిరాని కొంతమేరకు అదే చేశాడు కానీ సంజయ్ దత్ జీవితంలో వివాదాస్పదమైన ఎన్నో కోణాలు అయితే చూపించలేదు. 1992-93 మధ్య జరిగిన బొంబాయి బాంబ్ బ్లాస్ట్ లోని ఓ కోణానికి మాత్రమే ఈ సినిమా పరిమితం అయ్యింది. త్రీ ఇడియట్స్ , పీకే, మున్నా భాయి స్థాయిలో ఉన్న అంచనాలను మాత్రం ‘సంజూ’ అందుకోలేకపోయింది.

ఓ టెర్రరిస్ట్ కథను నేను ఎందుకు రాయాలి? అని ఓ పాత్ర ద్వారా ప్రేక్షకుల్లోకి పరకాయ ప్రవేశం చేసి కొంతమేరకు తన మోటివ్ ని వ్యక్తపరిచాడు హిరాని. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే సినిమాల్లో బయోపిక్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం కేవలం సంఘటననే ఆధారంగా తీసుకుని సినిమా తీసినప్పుడు సంఘటన గాఢత మనిషి ప్రాధాన్యతను తగ్గిస్తుంది. కానీ మనిషి నే పాత్రగా ఎన్నుకుంటే అప్పటికే ప్రేక్షకుల్లో ఉన్న అన్ని రకాల అభిప్రాయాలకు సమాధానం చెప్తూ కన్విన్స్ చేస్తూ సినిమాలో ప్రేక్షకుల్ని లీనం అయ్యేలా చేసే అధిక శ్రమ కూడా దర్శకుడి మీదే పడుతుంది. అందులోనూ ఎన్నో ఆరోపణలను ఎదుర్కొని , వాటిల్లో కొన్ని నిజం అని ఋజువు అయిన ఓ స్టార్ గురించి సినిమా తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి. రాజ్ కుమార్ హిరాని కి ఈ ప్రయత్నంలో నూటికి నూరు ఇవ్వలేకపోయినా, ప్రయత్నానికే ఎక్కువ మార్కులు పడతాయి. దానికి కారణం కేవలం ఒక్క సంఘటన తప్ప వివాదాస్పదమైన ఎన్నో విషయాలు వైవాహిక జీవితం లాంటి అంశాలు పక్కన పెట్టివేయబడ్డాయి. బాలివుడ్ బ్యాడ్ బాయ్ కి కొంతమేరకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది.

‘బయోపిక్’ అన్నది మనం టీవీలలో చూసింది, పేపర్లలో చదివింది కాదు. అవన్నీ తెలిసినా,ఋజువైన సంఘటనల ఆధారంగా వెలుగులోకి వచ్చేవి. కానీ ‘బయోపిక్’ ఎప్పుడు ఆ వ్యక్తి స్వగతంగా ఆవిష్కరించుకునే కోణమే. ఆ కోణంలో తనను తాను సమర్ధించుకునే అంశాలే ఎక్కువ ఉండవచ్చు కూడా. వీటితో పాటు చర్చించాల్సిన ఇంకో అంశం ఏమిటంటే ‘బయోపిక్’ ను ఓ మామూలు సినిమాలా కాకుండా ఓ ప్రత్యేక సినిమాలా చూడాలి.

ఓ సినిమాలోని పాత్రల ఔచిత్యంతో ప్రేక్షకులు తమను తాము చూసుకోవడం మామూలు చిత్రాల్లో జరిగేదే! కానీ ‘బయోపిక్’ లో మాత్రం ఆ వ్యక్తి కోణం నుండి చూస్తే మాత్రమే ‘సినిమా ఆత్మ’ ను అర్ధం చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనకున్న అభిప్రాయాలూ, జడ్జిమెంట్లు, అందరితో చర్చించిన అంశాలు కలగాపులగం చేసుకుని చూస్తే ‘బయోపిక్’ తన ఉదాత్తతను కోల్పోయినట్టే.

సంజయ్ దత్ జీవితం నిజంగా సినిమాకు మంచి కథ అవుతుందా? ‘Bad Choices make good stories’, అన్న డైలాగ్ ద్వారా పై ప్రశ్నకు సమాధానం స్పష్టం చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో నాయకుడి జీవితంలో ఎక్కువ శాతం ఉంది డ్రగ్సే. ‘బీస్ సాల్ జెయిల్ యా బీస్ గ్రామ్ కొకైయిన్ ‘ అన్న డైలాగ్ తో డ్రగ్స్ జీవితంలో సంజయ్ దత్ కి ఎంత సన్నిహితంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు హిరాని. డ్రగ్స్ బారి నుండి బయట పడటానికి అమెరికాలో వైద్యం కోసం వెళ్లినప్పుడు , అక్కడి డాక్టర్ ఓ ఫార్మ్ ఇచ్చి అందులో అతను వాడిన డ్రగ్స్ ని టిక్ చెయ్యమన్నాడు. దాదాపు అన్ని టిక్ చేయడం లాంటి సంఘటనల ద్వారా హిరాని ఎంతో సౌమ్యంగా ఎన్నో చీకటి కోణాలు చెప్పే ప్రయత్నం చేశాడు.

తండ్రి అతి క్రమశిక్షణ తో వచ్చిన అసహనం, తల్లి మరణం, ప్రియురాలి బ్రేకప్ లాంటి కారణాలు కొంత మేరకు అతన్ని డ్రగ్స్ కి బానిసగా మార్చాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో అంశం ఏమిటంటే మిగిలిన ఎన్నో కోణాలు పక్కన పెట్టేసినా , అటువంటి మార్గంలోకి మళ్లడానికి గల పరిస్థితులను, ప్రతి సందర్భంలోనూ, అతని మనఃస్థితిని ప్రేక్షకులకి తెలిసేలా చేయడం.

ఈ సినిమాకు ఇంకో కోణం కూడా ఉంది. ఇది సంజయ్ దత్ కథ మాత్రమే కాదు. తమ పిల్లలు వ్యసనపరులైనప్పుడు తీరని వ్యధను అనుభవించే ఎందరో తల్లితండ్రుల కథ. ‘నువ్వో టెర్రరిస్ట్ తండ్రివి’ అని జనాలు అన్నప్పుడు ఆ తండ్రి పడే వేదన, ‘తన తండ్రి టెర్రరిస్ట్’ అని వినవచ్చే వార్తలను కడుపున పుట్టిన బిడ్డలు తెలుసుకోవడం లాంటి సన్నివేశాలు ఎంతో సున్నితంగా ప్రేక్షకుల్ని ఆలోచనలో పడవేస్తాయి.

‘You deserved a better son’, అన్న డైలాగ్ తో తాను తప్పు చేశాననే ఒప్పుకోలును, ఎటువంటి సమర్థింపులతో కప్పిపుచ్చుకొని సంజయ్ దత్ ను నిజాయితీగా చూపిస్తాడు దర్శకుడు. ఇవన్నీ సినిమాలోని వ్యక్తిగత భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు.

‘పరేష్ రావల్’ నిజ జీవితంలో ‘సునీల్ దత్’ కూడా ఇంత బాగా తన మానసిక క్షోభను వ్యక్తపరచలేడేమో అన్నంత బాగా నటించడం సినిమాకు పాజిటివ్ పాయింట్. ‘రణబీర్ కపూర్’ సంజయ్ దత్ పాత్రకు ప్రాణం చేశాడు. సాధారణంగా బయోపిక్ లో ఉండే బోర్ డమ్ పోగొట్టడానికి వీలైనంత హాస్యాన్ని చొప్పించడం కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

సినిమాలో చెప్పుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ, సినిమా చూసి బయటకు రాగానే చాలా సన్నివేశాలు జ్ఞప్తిలో ఉండవు. దానికి కారణం ‘సునీల్ దత్ ‘ పాత్ర చిత్రీకరణ ఉన్నంత గాఢంగా ‘సంజయ్ దత్’ పాత్ర చిత్రీకరణం లేకపోవడం కావచ్చు. గ్యాంగ్ స్టర్ ఆధారిత సినిమాలు చేసిన సంజయ్ దత్ ను వీలైనంత మేరకు చూపించలేదనే అనిపిస్తుంది. విపరీతమైన సున్నిత మనస్కుడిగా చూపించడం తెలియకుండానే వ్యక్తిగత గాఢతను పలుచన చేసింది.

ఏదీ ఏకమైనప్పటికీ బయోపిక్ లు తీయడమే పెద్ద సాహసం. అటువంటి సాహసం చేసిన హిరాని ప్రయత్నం దాదాపు హిట్ టాక్ ను అందుకుంది. కానీ ప్రేక్షకులకు హిరాని మీద ఉన్న అంచనాలు త్రీ ఇడియట్స్, పీకే స్థాయివి కనుక అంతమేరకు ఆ దిశలో నిరాశ మిగిలిందనే చెప్పవచ్చు.

* * *



Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!