నమ్మిన దారిలో నడవటం.
నమ్మిన దారిలో నడవటం....
-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)
‘ఒరేయ్ శ్రీను ...నిన్న సాఫ్ట్వేర్ బూమ్ లో ఉంది. ఈ రోజు లేదు. అలాగే ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ డమ్ లో ఉంది. రేపు ఇది ఉంటుందో లేదో తెలియదు. కానీ తెలివైనవాడెప్పుడూ డిమాండ్ నాడి పట్టుకుని ఎదుగుతూ ఉంటాడు. నచ్చింది, నమ్మింది అంటూ విడిగా ఏం ఉండవు. దేనికి సంపాదన ఉంటుందో చూసుకుని చొచ్చుకుపోవడమే సక్సెస్ అంటే ...అర్థమైందా?’
‘చూడు చిన్నా...ఈ మ్యూజిక్, యాక్టింగ్ మన కడుపులు నింపవు. నీకు నీ మీద నమ్మకం ఉండటం కన్నా ప్రపంచం నిన్ను నమ్మడమే చాలా ముఖ్యం. ఇప్పటికే ఈ రంగాల్లో తలపండిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ధీటుగా ఈ పోటీలో నిలబడటం చాలా కష్టం. వచ్చిన జాబ్ లో జాయిన్ అయిపో ...’
మన చుట్టూ ఇలా హితబోధలు చేసేవారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. జీవితం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఏ ఒక్కరి లక్ష్యాలు, కలలు ఇంకొకరితో పొసగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంగాలు ఒకటవ్వచ్చు కానీ దాని మీద వ్యక్తులకు ఉండే అనురక్తి మాత్రం ప్రవృత్తులపై ఆధారపడి ఉంటుంది.
సహజంగా మన జీవితం మన చేతుల్లోనే ఉంది అని మనం అనుకుంటాం. కానీ అది పరిసరాలు, కుటుంబ ప్రభావాల చేతుల్లో ఎక్కువ చిక్కుకుని ఉంటుంది. మనం నిరంతరం మన ప్రవృత్తి నిర్దేశిత మార్గంలో పయనించడం అన్నది మన మనోధైర్యం పైనే ఆధారపడి ఉంటుంది.
నమ్మిన దారిలో నడవటం, నచ్చింది చేయడం అన్నిటికన్నా కస్టమైన అంశాలు. అందులోనూ మనకు నచ్చింది అందరి ఆమోదం పొందేది అయితే మన జీవితం సాఫీగానే ఉంటుంది. కానీ అది కాస్త వినూత్నమైనది, అందరి అభిరుచులకు భిన్నమైనది అయితే మాత్రం నిజమైన యుద్ధం అప్పుడే మొదలవుతుంది.
అందరికీ నచ్చాలంటే :
మనం నమ్మిన దారి కొత్తదై, దాన్ని అందరూ గుర్తించి, మనం కూడా విజేతల చిట్టాలో ఉండాలంటే దానికి కొన్ని దశలు ఉన్నాయి. ప్రతి దశలో మనం ఎంత దృఢంగా ఉన్నాం అన్న దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది.
1)ప్రిపరేషన్ పీరియడ్:
ఈ దశలో మనకు నచ్చినదేమిటో స్పష్టంగా ఓ అవగాహనకు రావాలి. అలవాట్లు, అభిరుచులు, దృఢంగా నమ్మిన లక్ష్యం వీటి మధ్య ఉండే తేడాను గుర్తించాలి. ఆ తేడాను గుర్తించి ఆ నచ్చిన అంశాన్ని లక్ష్యంగా మలచుకోవాలి. దాన్ని పేపర్ మీద పెట్టాలి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఆ లక్ష్యం విజయాన్ని గురించి సహేతుకంగా కన్విన్స్ చేసుకోగలగాలి. స్వీయ అవగాహన దృఢంగా ఉండటమే ఈ దశలోని కీలకాంశం.
2)పిక్చర్స్ పీరియడ్ :
ఒక్కసారి ఆ లక్ష్యం ఏమిటో తెలిసాక , దానిలో చేయదగ్గ ప్రయోగాలు ఏమిటో ఊహాచిత్రంలో చూడాలి. అదే వృత్తిలో ఉండి విజేతలైన వారు చేసిన ప్రయోగాల్ని నిశితంగా పరిశీలించాలి. ఆ లక్ష్యంపై మీ ఇష్టం యొక్క ధృఢతను పెంచుకోవాలి. ఆ ఇష్టమే మిమ్మల్ని సరికొత్త ప్రయోగాలకు ప్రేరేపిస్తుంది. ఆ ప్రయోగాల దృశ్యాల్ని పుస్తకంపై బొమ్మల్లోనో ,గీతల్లోనో పెట్టండి. మీ లక్ష్యంపై ఇష్టాన్ని మరికాస్త పెంచే ప్రక్రియ ఇది.
3 ) ప్లానింగ్ పీరియడ్ :
ఇప్పుడు ఇక ఎక్కడ. ఎలా మొదలుపెట్టాలి అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోవాలి. ఖర్చులు దాని మీద ఎంత పెట్టాల్సి రావచ్చు అని ఒక అంచనాకు రావాలి. ఎంతకాలం శ్రమించాక ఆదాయం వస్తుందో కూడా ఉజ్జాయింపుగా తెలుసుకోగలిగి ఉండాలి. ప్లాన్ చేసిన ప్రతి సారి ప్లాన్ ఎ ,ప్లాన్ బి , ప్లాన్ సి అని మూడు ఉండేలా చూసుకోవాలి. ఒకటి విఫలమైతే ఇంకోటి ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్లాన్ ను మొదట ఓ నెలకు చేసుకోవాలి. తర్వాత విజయ వైఫల్యాలను బట్టి మార్చుకుంటూ ఉండాలి.
4 ) ఇండిపెండెంట్ పీరియడ్:
ఒక్కసారి ప్లానింగ్ అయిపోయాక ఖర్చులు మరియు ఇతర అవసరాలు తీరడానికి ఓ పార్ట్ టైమ్ వనరును ఏర్పరచుకోవాలి. అది కచ్చితంగా మీ లక్ష్యానికి దగ్గర చేసే నైపుణ్యాన్ని మెరుగుపరిచేలా ఉండాలి. ఓ కొత్త దారిలో నడుస్తున్నప్పుడు ఎందరో నిరుత్సాహపరచడం సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో మన కనీస అవసర విషయాల్లో మనం స్వతంత్రులం అయ్యి ఉంటే అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
5 )స్ట్రగులింగ్ పీరియడ్ :
ఒక్కసారి లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలు పెట్టాక వైఫల్యాలు కూడా రావచ్చు. ఎందుకంటే అన్ని ప్రయోగాలు దీర్ఘ దృష్టితో సాగకపోవచ్చు. వైఫల్యాల్ని తట్టుకుని స్ట్రగులింగ్ పీరియడ్ లో ముందుకు సాగడమే అన్నిటి కన్నా కీలకాంశం. చాలామంది ఇక్కడే వెనుదిరుగుతారు. ఇక్కడ నిలబడగలిగితే విజయం మీదే.
6)సక్సెస్ పీరియడ్ :
ఇక మిగిలింది విజయలక్ష్మి మిమ్మల్ని వరించడమే. ఒక్కసారి విజయం వచ్చాక దానిని నిలబెట్టుకోవడమే ఇంకా ముఖ్యం. సక్సెస్ పీరియడ్ అంటే ఒక స్థితిలో ఉండిపోవటం కదా. ఇంకో తరహా సక్సెస్ కోసం కొత్తగా ప్రయత్నించటం.
అమలు చెయ్యటానికి సిద్ధంగా ఉన్న ఆలోచన కన్నా శక్తివంతమైనది ఏది లేదు. అటువంటి ఆలోచనకు నమ్మకం అనే ఆయువును పోసి, లక్ష్యంగా మలచుకుని విజయలక్ష్మి వరించేవరకు పోరాడితే ప్రపంచమే గుర్తిస్తుంది మిమ్మల్ని విజేతగా.
* * *


Comments
Post a Comment