సమస్యకు స్వాగతం

మన జీవితంలో సమస్యతో ఎలా పోరాడాలో తెలిపే ఆర్టికల్ 
(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం ) 


సమస్యకు స్వాగతం

-రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)

‘దేవతలు ,రాక్షసులు పాల సముద్రాన్ని మధించకపోతే లక్ష్మిని పొందలేకపోయేవాడివి కదా ! దేహీ అని బలిని అర్థించకపోతే భూమి,ఆకాశాన్ని ఆక్రమించే అవకాశం నీకు లేదు కదా! నీకు సత్యభామతో పాటు శమంతకమణిని సత్రాజిత్తు ఇవ్వకున్నా నీకు అది దొరికేదా! ఇంద్రుడు అంగీకరించకపోతే నందనవనంలో పెరిగిన పారిజాత వృక్షాన్ని పెళ్లగించి నాటించలేకపోయేవాడివి కదా!’

కాసుల పురుషోత్తమ కవి ‘ఆంధ్రనాయక శతకం’లో శ్రీ మహా విష్ణువు గురించి రాసిన ఓ పద్య భావం ఇది. పాలసముద్రాన్ని మధించడం,బలిని అర్థించాల్సి రావడం, సత్యభామను గెలవడం, పారిజాత వృక్షాన్ని భూమి మీదకు తీసుకు రావడం ...ఇవన్నీ శ్రీ మహా విష్ణువు వివిధ సమస్యలను సాధించి తరువాత పొందిన సంపదలు. దేవతలకే తప్పలేదు సమస్యలు. కానీ ఆ సమస్యలే సంపదలకు మూలాలు అని చెప్పడం కూడా పురాణాలకు ఉన్న ఒక ఉద్దేశం కావొచ్చు.

జీవితంలో చాలామంది ఓ సమస్య రాగానే చాలా మంది ఇకనుంచి కష్టాలు మొదలు అనుకుని కుదేలవుతారు. కానీ ఆ సమస్యను సాధిస్తే అమూల్యమైన సంపద సొంతమని గ్రహించేవారు అతి కొద్దిమందే. ఆ కొద్దిమందే జీవితంలో విజేతలు అవుతారు. ఓ సమస్య జీవితంలోకి ప్రవేశించగానే మనలో తెలియకుండానే ఇంకొక అంతర్గత సమస్య ఉత్పన్నం అవుతుంది. అదే అపనమ్మకం. మన మీద మనకుండే అపనమ్మకం. ఆ భ్రమను నిజం చేయడానికి సమస్య శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. సమస్య ఉన్నప్పుడూ సర్వ కాల సర్వావస్థలయందు మనతో ఉండాల్సిన అస్త్రాలు రెండు. అవి ధైర్యం,నమ్మకం. మొదట్లో ఘోర పరాజయంగా కనిపించే సమస్య కాలక్రమాన గొప్ప విజయానికి బీజం అయ్యే అవకాశంలా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణే మైకేల్ బ్లూమ్ బర్గ్ వృత్తి జీవితం. ఆయన బ్లూమ్ బర్గ్ పిఎల్ కంపనీ వ్యవస్థాపకుడు. అదే పేరుతో ఒక స్మారక టెలివిజన్ స్టేషన్ ని కూడా స్టాపించాడు.

ప్రపంచంలో అత్యంత ధనికుల్లో బ్లూమ్ బర్గ్ కూడా ఒకరు.2001లో న్యూయార్క్ నగరానికి మేయర్ గా కూడా ఎన్నుకోబడ్డారు ఆయన. మళ్ళీ 2005 లో కూడా ఆయనే జనం మెచ్చిన నాయకుడు కూడా అయ్యాడు. మూడో సారి కూడా ఆయన మళ్ళీ మేయర్ అయ్యారు. కానీ ఈ విజయపరంపర అంతా కూడా ఓ సమస్యతోనే మొదలయ్యింది. ఆయనను పనిలో నుండి తీసేశారు. 1981 లో ఫిల్కో కార్పరేషన్ అనే వర్తక సరుకులు అమ్మే వాణిజ్య సంస్థ వాల్ స్ట్రీట్ పెట్టుబడి బ్యాంకు ,సాలమన్ బ్రదర్స్ ని తమతో కలుపుకున్నాక , ఇక ఆయన సేవలు తమకు అవసరం లేదని ఆ కంపనీ ఆయనకు చెప్పింది.

ఆయన ఈ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ,’1981 ,ఆగస్టు 1 వ తేదీన ,ఆ శనివారం రోజు నేను చేసిన ఒకే ఒక పూర్తి కాల పదవిని ,నాకెంతో ప్రియమైన గొప్ప వత్తిడి గల జీవితాన్ని నేను వదులుకోవాల్సి వచ్చింది.అదే పదిహేనేళ్ళపాటు ,రోజుకి పన్నెండు గంటలు ,వారానికి ఆరు రోజులు పని చేసిన తరువాత నన్ను బయటికి గెంటేశారు!’

కానీ ఆ రోజు ఆ అవకాశం రాకపోతే బ్లూమ్ బర్గ్ అంతా గొప్ప వ్యక్తిగా ఎదగడానికి అవకాశం చిక్కేది కాదేమో !మైకేల్ బ్లూమ్ బర్గ్ న్యూయార్క్ మాజీ మేయర్ సామర్ధ్యాన్ని అంచనా వేసుకుంటే సరి!

జీవితంలో ప్రతిసారి సంపద సమస్యతోనే సాధ్యం. సమస్య కన్నా మనల్ని ఎక్కువుగా భయపెట్టేది మన చుట్టూ ఒక్కోసారి ఉండే నిరుత్సాహ వాతావరణం. ఆ వాతావరణమే క్రమేపీ ధైర్యాన్ని ,నమ్మకాన్ని చంపేస్తూ ఉంటుంది. మన సామర్ధ్యాలు, నైపుణ్యాలు గురించి ఈ ప్రపంచంలో మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. గుడ్డితనంతో పక్క వారిచ్చే కొలమానాలతో కొనసాగినంతకాలం మనకు సమస్య ఎప్పుడు అసాధ్యమైన అంశమే. ఒక్కసారి మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోకుండా, మన సామర్ధ్యాన్ని సక్రమంగా గ్రహించి తదనుగుణంగా సమస్యను సాధిస్తే సంపద అనే విజయబావుటా ఎప్పుడు మనకై స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆ సంపద అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఇక ఆలస్యం ఎందుకు ?సమస్యకు ధైర్యంగా స్వాగతం చెప్పేద్దామా ?

  • * * *






Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ