కథలు
సోమవారంతో సమరం
-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)
‘గుడ్ మార్నింగ్ వేకప్
గుడ్ మార్నింగ్ వేకప్’
అలారం సుప్రభాతంతో మెలకువ వచ్చింది నాకు. టైమ్ ఉదయం నాలుగున్నర గంటలు. నిద్రాదేవి ఇంకొంచెం సేపు తన ఒడిలో సేదతీరమన్నట్టుగా అనిపించి,అలాగే బద్ధకంగా మంచాన్ని కరుచుకుని ఉండిపోయాను.
‘చింటూ ఇక నిద్రలేమ్మా ....నాలుగున్నర అయింది ...మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి ...బోలెడు దూరం కూడాను ...’అమ్మ చెవి దగ్గర జోరీగమంత్రం జపించసాగింది.
స్కూల్ అంటే నేనేదో చిన్నపిల్లని అనుకునేరు. స్కూల్ లో టీచర్ ని. చిన్నప్పటి నుండే నాకు సోమవారానికి అస్సలు పడేది కాదు. సెలవు సుఖం తరువాత తిరిగి కష్టాన్ని అలవాటు చేసుకోవడానికి చేసే ఆలోచనల సమరమే ఈ సోమవారం అని నా అభిప్రాయం. దానితో పాటు స్లీప్ టెస్టులు, ఎగ్జామ్స్ అన్నీ సోమవారంతోనే మొదలయ్యేవి. ఈ సోమవారం నాడే మార్కులు ఇచ్చేవారు. నా జీవితంలో నిండి ఉన్న ఆనందాన్ని అమాంతం రాక్షసిలా వారానికొకసారి లాక్కునే పెనుభూతంలా కనపడేది సోమవారం నాకు.
వీటన్నింటికి తగ్గట్టు సోమవారం ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ ఉండేది చిన్నప్పుడు. నాకసలు ఇంగ్లీష్ అన్నా , ఇంజెక్షన్ అన్న ఫోబియా. ఇంగ్లీష్ కి సాధారణంగా మేడమ్సే ఉంటారనుకుంటా. (సినిమాల్లో వాస్తవానికి దగ్గరైన విషయం ఇది. ఈ విషయం నేను ఇంగ్లీష్ టీచర్ అయ్యాక తెలిసిందనుకోండి.అది వేరే విషయం.) స్కూల్ లో నా ప్లేస్ ముందు బెంచ్ అయినా వెనక బెంచీలో నక్కి కూర్చొనేదానిని ఇంగ్లీష్ పీరియడ్ లో. అది కూడా సోమవారమే సుమా!
మాకు ఆ రోజుల్లో వారానికి నాలుగు పీరియడ్లు ఇంగ్లీష్ ఉండేవి. మూడు పీరియడ్లు లెసన్స్ చెప్పడానికి ,నాలుగో దానిలో ఆ మూడు క్లాస్సుల్లో చెప్పిన వాటి నుండి ప్రశ్నలు అడగడానికి. ఆ ప్రశ్నల పీరియడ్ సోమవారం అవ్వడం కూడా సోమవారం నా బద్ధ శత్రువు అవ్వడానికి ఓ కారణమైంది. అలా సోమవారం నన్ను అకస్మాత్తుగా కష్టాల అటక ఎక్కించేది.
అలాగే ఎలాగో చిన్నప్పటినుంచి నాకున్న సోమవార బద్ధక వ్రతాన్ని మోసుకుంటూ స్కూల్ కి బయల్దేరాను. ఎలాగైతేనేం ఎనిమిది గంటల కల్లా చేరుకున్నాను.
స్టాఫ్ రూమ్ కి వచ్చి రాగానే ఓ పిడుగు లాంటి వార్త. మా డిపార్ట్మెంట్ లో ఓ టీచర్ మానెయ్యడంతో ఆవిడ వర్క్ లోడ్ మాకు పంచారు. మనస్సంతా చిరాకు, మళ్ళీ ఇదంతా సోమవారం నాడే జరగడం. ఆ చిరాకునంతా మనసులో మోసుకుంటూ నా క్లాస్ కి వెళ్ళాను.
ఈ లోపు ఆరవ తరగతి నుండి పదవతరగతి వరకు ఉన్న పిల్లలందర్ని కాన్ఫరెన్స్ హాల్ కి క్లాస్ టీచర్ లతో రమ్మని నోటీసు.
‘హమ్మయ్య ...ఓ క్లాస్ చెప్పే ప్రయాస తప్పింది ‘, అని సంబరపడుతూ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. అందరూ పిల్లలు వచ్చిన తరువాత ప్రిన్సిపల్ మైక్ తీసుకున్నాడు.
చెప్పే వాడికి వినేవాడు లోకువ అన్నట్టు చెప్పాల్సినవి రెండు, మూడు ముఖ్యాంశాలు అయినా మొత్తం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టాడు. మొత్తానికి ఓ అరగంట దంచేశాక అసలు విషయాన్ని చివర్లో చెప్పాడు.
‘మిష్టర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ ‘, ‘మిస్ స్కూల్ ఆఫ్ ది ఇయర్’ అనే రెండు పోటీలు స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా నిర్వహించాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. దానిలో మూడు రౌండ్స్ ఉంటాయి. అందులో మొదటి రౌండ్ లో పాల్గొనేవారు అందరూ తమకిష్టమైన విషయం మీద మాట్లాడాలి. రెండో రౌండ్ లో ప్రతి ఒక్కరూ తమకున్న ప్రత్యేక కళను ప్రదర్శించాలి.(సంగీతం ,నాట్యం ,కవిత్వం ...వగైరా ) మూడో రౌండ్ లో ర్యాంప్ వాక్ సంప్రదాయ దుస్తుల్లో. మూడు రౌండ్ ల మార్కులు ,దానితో పాటు ఆడియన్స్ ఛాయిస్ రౌండ్ ....వీటి మార్కుల్ని బట్టి విజేతల ఎంపిక ఉంటుంది. ఇదండీ విషయం.
ఫస్ట్ రౌండ్ అప్పటికప్పుడు కండక్ట్ చేస్తున్నామని ప్రకటించారు. స్టూడెంట్స్ లో ఆసక్తి ఉన్నవారిని చేతులెత్తమన్నారు. ఎవరు ఎత్తలేదు. చివరికి పది నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు మెల్లగా ఓ మూల నుండి ఓ చెయ్యి పైకి లేచింది. అందరి కళ్ళు అటువైపు తిరిగాయి. నేను కొంచెం దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ చెయ్యి ధీరజ్ ది. నా క్లాస్ వాడే. నా దిగ్భ్రాంతి కి కారణం ఓ చిన్న కధ. అది తర్వాత చెప్పుకుందాం కానీ ముందు ప్రస్తుత విషయంలోకి వచ్చేద్దాము.
‘వెనుక ఎక్కడో కూర్చొన్నాడు ధీరజ్. మెల్లగా వెనుక నుండి మైక్ దగ్గరికి నడుస్తున్నాడు. వాడి పేరులో ఉన్న ధైర్యం వాడి నడకలో లేదు. వీడు ఇంతమంది ముందు మాట్లాడగలడా? వీడికి ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఇలాంటి విషయాల్ని శోధించడంలో నా మెదడు చాలా బిజీ అయిపోయింది. నా ఆలోచనలతో నిమిత్తం లేకుండా వాడి పాటికి వాడు మైక్ దగ్గరికి వెళ్ళాడు. నాలానే నా క్లాస్ కి మిగిలిన సబ్జెక్ట్స్ కి వెళ్ళే టీచర్ లు కూడా అదే షాక్ లో ఉన్నరింకా! వాడు మైక్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘జపాన్ దేశస్థులకు ఫ్రెష్ గా ఉండే చేపలంటే చాలా ఇష్టం. వాటిని తినడానికే వారు ఎక్కువ ఇష్టపడతారు. కానీ కొన్నాళ్ళకి జపాన్ తీర ప్రాంతంలోని చేపలు దాదాపు అయిపోయాయి. అప్పుడు అక్కడి జాలరులు ఓ కొత్త పరిష్కారాన్ని చూపారు. దాని ప్రకారం పెద్ద తెర పడవల్ని నిర్మించి దూర ప్రాంతాలకు వెళ్ళి చేపలు పట్టడం. కానీ దురదృష్టవశాత్తూ వారు ఎక్కువ దూరం వెళ్లాల్సి రావడంతో వారు తిరిగి వచ్చేసరికి చేపలు ఫ్రెష్ గా ఉండేవి కాదు. దానితో సమస్య మళ్ళీ పునరావృతమైంది. మరలా దీన్ని పరిష్కరించడానికి ఓ కొత్త ఉపాయాన్ని కనుగొన్నారు. ఈ సారి తెర పడవల్లో రిఫ్రీజరేషన్ సామాగ్రి సమకూర్చుకున్నారు. రిఫ్రీజరేటర్ లో ఉండే చేపలు, ఫ్రెష్ చేపలు ఒకే తాటిలో ఉండవు. మళ్ళీ ఫలితం శూన్యం. ఇలా కాదని ఈ సారి ఇంకో అమోఘమైన పరిష్కారంతో ముందుకొచ్చారు.
అదేమిటంటే పడవల్లో చేపల ట్యాంకులు సమకూర్చుకున్నారు. చేపల్ని పట్టి ఆ ట్యాంకులో వేసేవారు. చివరికి ఫ్రెష్ చేపలే ఉండేవి. దీనిలో కూడా ఓ సమస్య ఏర్పడింది. చేపలన్నీ ఆ ట్యాంకులో ఉండిపోవడం వల్ల బద్ధకంగా అయిపోయాయి. కదలని , బద్ధకంతో నిండిన చేపల్ని జపనీస్ ఇష్టపడరు. ఈ సారి తెలివైన జాలరి సంఘం ఓ కొత్త పరిష్కారంతో ముందుకు వచ్చింది.
అదేమిటంటే ప్రతి ట్యాంకు లో షార్క్ ని పెట్టడం. తమ శత్రువు అయిన షార్క్ ని చూడగానే చేపలు ఊత్సాహాన్ని పుంజుకొని తప్పించుకుని తిరుగుతూ ఉండేవి ప్రాణాల కోసం. కచ్చితంగా కొన్ని చేపలు షార్క్ లకు ఆహారం అయ్యేవి. కానీ ఆ షార్క్ భయం మిగిలినవాటన్నిటిని చురుగ్గా చేసింది. చివరికి జపనీస్ కోరుకున్న ఫ్రెష్ ఫిష్ వారికి దొరికింది.’
ఇది మాజీ హిందూస్థాన్ యూనిలివర్ వైస్ ఛైర్మన్ అయిన ఆర్. గోపాల కృష్ణన్ రాసిన ‘ది కేస్ ఆఫ్ ది బొన్సై మేనేజర్’ అనే పుస్తకంలోని ఓ కధ.
జీవితంలో ఓ శత్రువు ఉన్నప్పుడే మనలోని సామర్ధ్యం అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఉదాహరణకు వారంలోని అన్ని రోజుల కన్నా సోమవారం అంటే చాలామందికి ఓ రకమైన అయిష్టం ఉంటుంది. దానికి కారణం అంతకు ముందు వచ్చే ఆదివారం మనలో ఓ సుఖానుభూతిని కలిగిస్తే, సోమవారం తిరిగి మనల్ని మన కర్తవ్య దీక్ష వైపు నడిపిస్తుంది. జీవితంలో ఏ పరిస్థితి అయినా ఎంత త్వరగా అనుకూలంగా మారగలం అనేదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది.
పై కధలో ‘షార్క్ ‘ చేపలకు శత్రువే కావొచ్చు. కానీ దాని వల్లే చేపలు ఎంతో ఉత్సాహంతో బద్ధకాన్ని వదిలిపెట్టి తమ కర్తవ్య రంగంలోకి రెట్టించిన ఉత్సాహంతో రంగప్రవేశం చేశాయి. అలాగే సోమవారం కూడా ఓ షార్క్ లాంటిదే.
‘జీవితంలో శత్రువులు, నిర్మాణాత్మక విమర్శకులు లేకపోతే వారిని నువ్వే సృష్టించుకో. నీ చెడ్డతనంతో కాదు, నీ సామర్ధ్య నైపుణ్యాలను చూసి ఈర్ష్య పుట్టెంతగా అభివృద్ధి చెంది సృష్టించుకో ‘, అంటూ ముగించాడు ధీరజ్.
హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. వాడి కళ్ళలో అంతా ఆత్మవిశ్వాసాన్ని , ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదు క్లాస్ లో.
‘అవిగో వినరా చప్పట్లు .....అవే గదరా ఆఖలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు’, అన్న భమిడిపాటి రాధాకృష్ణ గారి నాటకం ‘కీర్తి శేషులు’ లో అన్నట్లు అన్ని వందల మంది చప్పట్లు వాడితో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అనుకుంటా.
వాడు చెప్పిన విషయంలో ఎంతో ప్రేరణ ఉంది. వాడికి గొప్ప విశేషణాలు ఉపయోగించడం చేతకాకపోవచ్చు కానీ వాడి మనస్సులో ప్రతి క్షణం గొప్ప అంతర్మధనం జరుగుతూ ఉందని, వాడు పైకి కనపడేటంత మొద్దు కాదని ఆ రోజుతో అందరికీ అర్ధం అయిపోయింది.
క్లాస్ టీచర్ గా క్లాస్ లో ఉన్న ప్రతి విద్యార్ధిలో ఉన్న ఇతర కళల్ని గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన నాకు ఈ రోజు ధీరజ్ చాలా పెద్ద విషయం నేర్పాడు. తల్లి తండ్రులు పిల్లల్ని చాలా వరకు ప్రభావితం చేస్తారు. ధీరజ్ తల్లితండ్రులు ఎడముఖం ,పెడ ముఖం. వారిద్దరి ప్రవర్తనా వాడి చిన్న మనసుపై ఎంతో ప్రభావం చూపింది.
వాడు ఎవరితోనూ కలవడు. వాడు చదువుతాడో , చదవడో కూడా అర్ధం కాదు. ఓ జడ పదార్ధంలా ఉండేవాడు. కానీ పరిస్థితిని, వాడు అనుభవిస్తున్న మనోవేదనని అనుక్షణం అంతర్మధనం చేస్తున్నాడని నాకు అప్పుడే అర్ధం అయింది.
పన్నెండువందల మంది విద్యార్ధుల్లో ఏ ఒక్కరూ చూపని చొరవని వాడు మొదటిసారే మాట్లాడేంతగా చూపాడంటే వాడిలో ఆలోచనాశక్తి ఎంతగా పరిణతి చెంది ఉంటుంది? ఆ పరిణతే వాడిలో భయాన్ని అధిగమించేలా చేసింది. నిత్య ఆలోచనా సంఘర్షణే మనిషిని శక్తిమంతుడిగా రూపొందిస్తుంది అనుకుంటా!
ఆ క్షణం నుండి ధీరజ్ పట్లే కాదు, సోమవారం పట్ల, నేను చేస్తున్న పని పట్ల కూడా నా అభిప్రాయం మార్చుకోవాలనుకున్నాను.
జీవితంలో చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణుల మాటలు మనం విని ఉండవచ్చు. వారి మాటల ప్రభావం మన మీద పని చేసి ఉండవచ్చు. దానికి కారణం వారు మన ఆలోచనా దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తారనే నమ్మకం మనలో నిండి ఉండటం. లేదా వారు ఆచరించి చెప్పడం కావచ్చు. కానీ మన చుట్టూ ఉండే ఎంతోమంది మనకు ప్రేరణను ఇస్తున్నా దానిని తీసుకోవడానికి మన మెదడు ఇష్టపడదు. దానికి కారణం మన కన్నా ఆర్ధికంగా, వృత్తిపరంగా ఏదో రకంగా పైమెట్టున ఉన్నవారే ప్రేరణ ఇవ్వడానికి అర్హులు అని మన మెదడు ట్యూన్ అయింది కనుక.
‘మేము గెలవాల్సిందే ...కానీ ఓడిపోయాము’ అనే దాని కంటే -‘మేము ఓడిపోవాల్సిందే ..కానీ గెలిచాము ‘ అని అనడంలోనే క్రీడా స్ఫూర్తి ఉంది. దానికి నిదర్శనమే ధీరజ్.
‘కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీ శ్రీ . కాదేదీ ప్రేరణకు అనర్హం అంటాను నేను అది సోమవారం అయినా సరే.
ఇంకేంటి కధ సుఖాంతం అనుకుంటున్నారు కదా ....అలా అయిపోతే అది మనుషుల కధ ఎలా అవుతుంది చెప్పండి? మహాత్ముల కధ అవుతుంది కదా! నేను మామూలు మనిషిని కదా!
ధీరజ్ మాటల ప్రభావం ఆ రోజు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఓ నోటీసు. ఐదు గంటలకు మీటింగ్ అని. ఉస్సూరుమనిపించింది ప్రాణానికి. ఈ స్కూల్ లో మీటింగ్ అంటే రాత్రి ఏడో, ఎనిమిదో , తొమ్మిదో అది అయ్యే సమయం ఎవరూ చెప్పలేరు. మోటివేషనల్ మీటింగ్ అట. ఎవరి గూటికి వారు చేరుకునే తాపత్రయంలో ఉన్నప్పుడూ ఈ మోటివేషన్ మైండ్ లోకి ఎంత వరకు ఎక్కుతుందో నాకైతే అర్ధం కాలేదు.
మొదలైంది మీటింగ్. ఎవరో కల్నల్ అట. పదేళ్ల క్రితం ఈ స్కూల్ కి ప్రిన్సిపల్ గా చేసాడట. ఎంతసేపు దంచుతాడో అని అనుకున్నాను. ఐదారు నిమిషాలు మాట్లాడాడు అంతే. తర్వాత టీచర్ లు తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు.
సర్ ఓ స్టూడెంట్ తో మంచి బంధం ఎలా ఏర్పరచుకోవాలో మీరే నేర్పించారు. ప్రతిసారి క్లాస్స్ రౌండ్స్ కి మీరే వచ్చేవారు. ఆ రోజు బాగా వాన పడుతుంది. పిల్లలందరూ చక్కగా వానచినుకుల్తో ఆడుకుంటున్నారు. ఈ లోపు మీరు రౌండ్స్ కి వస్తున్నారన్న వార్త వచ్చింది. నేను వెంటనే పిల్లల్ని సైలెంట్ గా కూర్చోపెట్టాను. మీరు మెచ్చుకుంటారేమోనని అనుకున్నాను. కానీ మీరు వచ్చి ఇప్పుడే కదా పిల్లలు ఆ వాన, చిరు చినుకుల అనుభూతుల్ని ఆస్వాదించగలిగేది అని అన్నారు. నిజంగా మీ నుండే మేమేంతో నేర్చుకున్నాము సర్ ‘, అంది సైన్స్ టీచర్.
‘నేను ఓ సారి క్లాస్లో ఓ విధ్యార్ధిని ఏడో ఒక విషయం గురించి మాట్లాడమని అడిగాను. అప్పుడు వాడు సీలింగ్ ఫ్యాన్ గురించి మాట్లాడాడు. అందులో ఓ వాక్యం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ‘ఫ్యాన్ కి మూడు చేతులుంటాయి. అవి తిరిగితే మనకు గాలి వస్తుంది. మనకు రెండు చేతులుంటాయి. కానీ వాటి వల్ల గాలి రాదు .’ ఈ మాటలు వినగానే అందరూ నవ్వారు. ఫ్యాన్ కు ఉండే రెక్కల్ని బ్లేడ్స్ అని అంటారని వాడి వయస్సుకి తెలియకపోవచ్చు. కానీ ఎంతో సునిశితంగా, తర్కంగా ఆలోచిస్తూ సాగిన వాడి పరిశీలనను మాత్రం నేను అభినందించాల్సిందే. స్టూడెంట్స్ లోని సృజనాత్మకతను మెరుగు పరుస్తూ తప్పులు దిద్దడమే టీచర్ బాధ్యత. నేను నేర్చుకుంది టీచర్ అయ్యాకే ‘, అని ఆయన ముగించాడు.
మీటింగ్ నలభై నిమిషాల్లో ముగిసింది. పొద్దున నుండి జరిగిన విషయాలు మొత్తానికి సోమవారంపై సమరం పూరించిన నన్ను సంధి చేసుకునేలా చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే స్ఫూర్తిని సోమవారంతో నింపుకోవచ్చని బోధించాయి.
* * *



Comments
Post a Comment