సత్ సాంగత్యంతోనే సక్సెస్


సత్ సాంగత్యంతోనే సక్సెస్

                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

అతనితో స్నేహం చాలా కాలా సాగింది. అది ఎంతో దుఃఖకరమైన ప్రకరణంగా మారింది. అతణ్ణి సంస్కరించాలనే భావంతో నేను అతనితో స్నేహం చేశాను. మా అమ్మ, పెద్దన్నయ్య, నా భార్య కూడా ఈ చెడు సహవాసం వద్దని హెచ్చరించారు.

“మీరు చెప్పిన దోషాలు అతనితో ఉన్న మాట నిజమే. కానీ అతనిలో గల సుగుణాలు మీకు తెలియవు. అతడు నన్ను చెడగొట్టలేడు. మంచి దారికి తీసుకుని వచ్చేందుకే అతనితో స్నేహం చేస్తున్నాను. తన దోషాల్ని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు. అందుకే అతనితో చేతులు కలిపాను. నన్ను గురించి మీరు విచారపడవద్దు" అని అమ్మకు, పెద్దన్న య్యకు నచ్చజెప్పాను. నా మాటలు మా వాళ్లకు నచ్చాయని అనలేను. కానీ ఇక వాళ్లు నన్నేమీ అనలేదు. నా దారిన నన్నుపోనిచ్చారు.

తరువాత నాదే పొరపాటని తేలింది. ఇతరుల్ని సంస్కరించడం కోసం మరీ లోతుకు పోకూడదని గ్రహించాను. స్నేహంలో అద్వైత భావం ఉంటుంది. సమాన గుణాలు కలిగినవారి స్నేహమే శోభిస్తుంది. నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక వడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం. అసలు అతి స్నేహం పనికిరాదని నా అభిప్రాయం. సామాన్యంగా మనిషి సుగుణాల కంటే దుర్గుణాల్నే త్వరగా గ్రహిస్తాడు. ఆత్మీయ మైత్రిని, భగవంతుని మైత్రిని కోరుకునేవాడు ఏకాకిగా ఉండాలి లేదా ప్రపంచమంతటితో స్నేహంగా ఉండాలి. అలా నా అభిప్రాయాలు సరైనవో, కావో తెలియవు. కానీ నా స్నేహయత్నం మాత్రం ఫలించలేదు.

ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు రాజ్ కోట్ లో  సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నది. మా ఉపాధ్యాయుల్లో చాలా మంది చాటుగా మద్య, మాంసాలు సేవిస్తున్నారని ఆ స్నేహితుడు నాతో చెప్పాడు.

ఇదంతా నాకు వింతగా తోచింది.

 తరువాత బాధ కూడా కలిగింది. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. "మనం మాంసం తినం. అందువల్ల మన జాతి దుర్బలమైపోయింది. తెల్లవాళ్లు మాంసభోజులు. అందువల్లే వాళ్లు మనల్ని పరిపాలించగలుగుతున్నారు. నన్ను చూడు...బలశాలిని, చాలా దూరం పరుగెత్తగలను. ఈ విషయం నీకు తెలుసు. నేను మాంసాహారిని కావడమే అందుకు కారణం. మాంసాహారులకు కురుపులు లేవవు. గ్రంథులు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా వెంటనే మానిపోతాయి. మన ఉపాధ్యా యులు, రాజ్ కోట్ ప్రముఖులు వెర్రివాళ్లు కాదు. వాళ్లు మాంసం ఎందుకు తింటున్నారనుకుంటున్నావు? మాంసంవల్ల కలిగే ప్రయోజనాలేమిటో వాళ్లకు బాగా తెలును. నువ్వు కూడా వారిలాగే మాంసం తిను. కృషితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మాంసం తిని చూడు... నీకే తెలుస్తుంది ఎంత బలం వస్తుందో!" అని నన్ను ప్రోత్సహించాడు.

  ఇవి అతడు ఒక్క పర్యాయం చెప్పిన మాటలు కావు. అనేక పర్యాయాలు సమయాన్ని సందర్భాన్ని బట్టి చెప్పిన మాటల సారం. మా రెండో అన్నయ్య ఇదివరకే అతని మాటల్లో పడిపోయాడు. పైగా ఆ స్నేహితుని వాదనను సమర్థించాడు కూడా. ఆ మిత్రుని ముందు, మా రెండో అన్నయ్య ముందు నేను దోమ వంటివాణ్ణి. వాళ్లిద్దరూ బలిషులు, దృఢగాత్రులు. నా స్నేహితుని పరాక్రమం చూసి నివ్వెరపోయాను. ఎంత దూరమైనా సరే రివ్వున పరిగెత్తగలడు. ఎత్తు, దూరం దూకడంలో అతడు మేటి. ఎన్ని దెబ్బలు కొట్టినా కిమ్మనడు, నహిస్తాడు. తరచుగా తన పరాక్రమాన్ని నా ముందు ప్రదర్శిస్తూ ఉండేవాడు.

తనకు లేని శక్తులు ఇతరుల్లో చూసి మనిషి ఆశ్చర్యపోవడం సహజం. అందువల్ల అతణ్ణి చూసి

ఆశ్చర్యపడేవాణ్ణి. అతనిలా బలశాలి కావాలనే ఆ నాకు కలిగింది. నేను దూకలేను, పరిగెత్తలేను. అతనిలా దూకాలి. పరిగెత్తాలి... అనే కోరిక నాకు కలిగింది.

నేను పిరికివాణ్ణి, దొంగలన్నా, దయ్యాలన్నా, తేళ్లన్నా, పాములన్నా నాకు భయం. రాత్రిళ్లు గడప దాటాలంటే భయం . చీకట్లో ఎక్కడికీ పోలేను. గదిలో దీపం లేకుండా పడుకోలేను. ఒక దిక్కు నుండి దయ్యాలు వచ్చిమింగివేస్తాయని, మరో దిక్కునుండి పాములు వచ్చి కరుస్తాయని భయం వేసేది. ఈ విషయాలన్నీ నా స్నేహితుడికి తెలుసు.

“పాముల్ని చేత్తో పట్టుకుని ఆడిస్తా. దొంగల్ని తరిమికొడతా. దయ్యాన్ని లెక్క చెయ్యను" అని అంటూఉండేవాడు. అది అంతా  మాంసాహార ప్రతాపమని తేల్చేవాడు.

వీటన్నిటి ప్రభావం నా మీద బాగా పడింది. మాంసాహారం మంచిదని, ఆది నాకు బలం చేకూర్చి, వీరుణ్ణి చేస్తుందని, దేశ ప్రజలంతా మాంసం తింటే తెల్లవాళ్లను జయించవచ్చనే విశ్వాసం నాకు కలిగింది. మాంస భక్షణకు ముహూర్తం నిర్ణయమైంది. ఆది రహస్యంగా జరగాలి! అనే నిర్ణయానికి వచ్చా .

నేను, నా తల్లిదండ్రుల పరమభక్తుణ్ణి. నేను మాంసం తిన్నానని తెలిస్తే వాళ్ల స్థితి ఏమవుతుందో నాకు తెలుసు. ఆప్పటికీ సత్యనిరతి నాలో అధికంగా ఉంది. నేను మాంసభక్షణ ప్రారంభిస్తే నా తల్లిదండ్రుల్ని మోసం చేయవలసి వస్తుందనే విషయం నాకు తెలుసు. అలాంటి స్థితిలో మాంసం తినడం ఎంత భయంకరమైన విషయమో వేరే చెప్పనక్కరలేదు.

కానీ నా మనసంతా సంస్కార దీక్ష మీద కేంద్రీకృతమైంది. నేను మాంసం తింటున్నది రుచికోసం కాదు. మాంసం రుచిగా ఉంటుందని నాకు తెలియదు. నాకు బలం కావాలి. పరాక్రమం కావాలి. నా దేశ ప్రజలంతా పరాక్రమవంతులు కావాలి. అప్పుడు తెల్లవాళ్లను జయించి హిందూ దేశాల్ని స్వతంత్రం చేయవచ్చు. ఇదే నా కోరిక.

స్వరాజ్యం అనే మాట ఆప్పటికి నా చెవిన పడలేదు. కానీ స్వతంత్ర్యం అంటే ఏమిటో నాకు తెలుసు. సంస్కారవు పిచ్చి నన్ను అంధుణి చేసింది. రహస్యంగా మాంస భక్షణం చేసి, తల్లిదండ్రులకు ఈ విషయం తెలియనీయకుండా రహస్యంగా ఉంచాలి. ఇలా చేయడం సత్యపథాన్నుండి తొలగడం కాదనే నమ్మకం నాకు కలిగింది.

మొదటిసారి మాంసం తీసుకున్న రాత్రి కష్టమైపోయింది. ఏవేవో పీడకలలు రాసా గాయి. కన్ను మూత పడేసరికి నా కడు పులో బతికివున్న మేక 'మే....మే' అని అరిచినట్లు అనిపించడం, తుళ్లిపడి లేవడం! ఇష్టపడే మాంసం తిన్నాను కదా! అని ఊరట చెందడం. ఇది వరున.

నా మిత్రుడు అంతటితో నన్ను వదల లేదు. మాసంతో రకరకాల పాకాలు వండి తేవడం ప్రారంభించాడు. ఈ విధంగా సంవత్సరం గడచింది. మొత్తం ఆరు మాంసపు విందులు ఆరగించాను. నన్ను మాంసాహా రిగా మార్చాలని, భ్రష్టుణ్ణి చేయాలని దీక్ష వహించినందున మిత్రుడే డబ్బు ఖర్చు పెడతూ ఉండేవాడు. దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత నాకు ఆకలి వేసేది కాదు. ఇంటికి వచ్చి ఆకలి లేదని చెప్పవలసి వచ్చేది. మా అమ్మ అన్నానికి పిలిచేది. "ఆకలి లేదంటే" కారణం అడగకుండా ఊరుకునేది కాదు.

"అన్నం అరగలేదు. అందువల్ల ఆకలి కావడం లేదని" అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఈ విధంగా అబద్దాలు చెప్తున్నప్పుడు ఈ బాధగా ఉండేది. అమ్మకు అబద్ధం చెబుతున్నాను అని కుమిలిపోయేవాడ్ని. మా బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే మా తల్లిదండ్రుల గుండెలు బద్ధలైపోతాయని నాకు తెలుసు. ఈ విషయాన్ని తలచుకొని బాదపడుతూ ఉండేవాణ్ణి,

అతని స్నేహం నన్ను వ్యభిచార రంగంలోకి కూడా దింపేదే. కానీ తృటిలో ప్రమాదం తప్పిపోయింది. మాంస భక్షణ ప్రారంభించిన కాలం నాటి మరికొన్ని దోషాలు కూడా ఉన్నాయి. మా బంధువైన  ఒకరి సావాసంలో పడి సిగరెట్ తాగాలని నాకు సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. నాకు 13 ఏళ్ల వయసులో (అంతకంటే తక్కువ ఉండవచ్చు.) మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుండి కొంచెం బంగారం దొంగిలించాను. మా అన్న ఇరవై రూపాయలు అప్పు బడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా? అని ఆలోచించాం మేమిద్దరం. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దాంట్లో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. ఆ వని చేశాం. అప్పు తీర్చాం. కానీ ఈ చర్యను నేను సహించలేక పోయాను.

ఇవి మహాత్మాగాంధీ తన ఆత్మకథ అయిన సత్యశోధనలో రాసుకున్న విషయాలు. గాంధీజీ చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లే సమ యంలో ఒకసారి స్కూల్లో ఇన్ స్పెక్షన్ జరిగింది. ఇన్ స్పెక్షన్ కి వచ్చిన జైల్స్ అనే అధికారి పిల్లల అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకు 5 మాటలు ఇచ్చాడు. వాటిల్లో కెటిల్ అనే మాట ఒకటి. దాన్ని గాంధీజీ తప్పుగా రాశారు. ఇది గమనించి ఉపాధ్యాయుడు తన బూటుకాలితో నొక్కి తప్పు దిద్దుకోమన్నట్లు సైగ చేశాడు. కానీ ఆయన దిద్దలేదు. ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పు దిద్దుకోమని సైగ చేశారన్న విషయం గాంధీ తెలుసుకోలేకపోయాడు. ఒకరి పలకమీద చూసి రాయకుండా ఉండేందుకే మాష్టారు అక్కడ ఉన్నారని గాంధీజీ భావం. మిగతా పిల్లలంతా రాసిన ఐదు పదాలు సరిగ్గా ఉన్నాయి. ఒక్క గాంధీజీవి తప్ప, తర్వాత మాష్టారు విషయం చెప్పినా, ఆయన మాటలు గాంధీజీ మీద పని చేయలేదు.

స్వయంగా గురువే తప్పు చేయమని ప్రోత్సహించినా తను నమ్మిన విలువలకు బాల్యం నుండే నిలబడ్డ బలమైన వ్యక్తి మహాత్మా గాంధీ. కానీ అంత గొప్ప వ్యక్తి కూడా చెడ్డ మిత్రునివల్ల చెడు అలవాట్ల వైపు మళ్లారు.

స్నేహితుడు చెడ్డవాడు అని తెలిసినా అతన్ని సంస్కరిద్దామని స్నేహం మొదలు పెట్టిన ఆయన క్రమేపీ ఆ మిత్రుని ప్రలోభం లోనే పడిపోయాడు.స్నేహితుని బలహీనతలను, భయాలను బలాలుగా మిలిచేవాడే నిజమైన మిత్రుడు. కానీ ఆ బలహీనతలను అడ్డు పెట్టుకొని వ్యక్తిత్వాన్ని ఇంకాస్త దిగజార్చేవాడే చెడ్డ మిత్రుడు,

అతనికి ఆ ఆలవాట్లు తప్పు అని అనిపిం చకపోవచ్చు. సమర్థించుకోవడానికి బలమైన కారణాలు ఉండవచ్చు. కానీ విలువలు, ఆశయాలు, అలవాట్లు వ్యక్తిగతమైన అంశాలు.. వాటిమీద స్వీయ నియంత్రణే తప్ప పర నియంత్రణ ఎప్పుడూ ఉండకూడదు.

మంచి స్నేహితులని మించిన బలం లేదు. కానీ ఆ 'మంచి' అనే పదాన్ని మిత్రుల కోసం మార్చేస్తూ ఉండటం క్రమ క్రమంగా మనిషిని పాతాళానికి తోసేస్తుంది. మనిషికి గుర్తింపు మొదట ప్రతిభతో రావచ్చు. కానీ ఆ గుర్తింపు వికసించేది మాత్రం మంచి మిత్రుల సాంగత్యంలోనే. దీనికి అర్జునుడు, కర్ణుడే ఉదాహరణలు.

కర్ణుడి ప్రతిభ వల్ల, ఆతని లక్షణాల వల్ల మొదట్లో అతన్ని గొప్పవాడిగా అంగీకరించినా తరువాత కౌరవుల సాంగత్యంతో పూర్తిగా క్షీణించి, పారక్రమం ఉండి కూడా ఊహించని రీతిలో మరణాన్ని పొందాడు.

‘ఒకర్ని మార్చడానికి అనే మభ్యపెట్టుకునే మాటలు వాస్తవానికి చాలామటుకు నిలబడవు, చెడు మార్గంలో మళ్లుతున్న వ్యక్తిని స్నేహంతో, సన్మార్గంలోకి మళ్లించాలంటే వ్యక్తిత్వరీత్యా ఎన్నో రెట్లు అధిక ఆత్మబలం కావాలి. అది ఒక్కసారి మీరిపోయినా మనం ముళ్ల దారిలో పడటం ఖాయం!

   *     *    *

 

 

 

 

 







Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ