ప్రేయసి పాత్రకే పరిమితమెందుకు ?

ప్రేయసి పాత్రకే పరిమితమెందుకు?

ప్రేయసి పాత్రకే పరిమితమెందుకు ? 
                           -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) 



ఆరోగ్యానికి హాని కలిగించే సన్నివేశాలు, ఏ జీవినైనా హింసించే సంఘటనలు సినిమాల్లో ఉంటే
ఆరోగ్యానికి హానికరం అని, ఏ జీవికి నిజంగా హాని జరగలేదని సినిమాల్లో ధృవీకరిస్తారు. కానీ స్త్రీలపై
అత్యాచారాల సన్నివేశాలు వచ్చినప్పుడు వాటి వల్ల ఏ ప్రభావం ఉండదు అన్నంత సహజంగా
చూపిస్తారు. నిజానికి సినిమాలలో స్త్రీ ఎప్పుడు ఆటల్లో అరటిపండే. ఎక్కడో స్త్రీ ప్రధాన పాత్రధారి
సినిమాలలో  తప్ప స్త్రీని ఎప్పుడు పురుషుడి స్టేటస్ కి చిహ్నంగానో ,గ్లామర్ డాల్ గానో మాత్రమే
చూపడానికి పరిమితం చేస్తున్నారు.
సినిమాల్లో జరిగేవి ఏవి నిజం కాదనే అందరికి తెలుసు. అందులో నాయకుడి చిత్రీకరణ
నిజానికి బహుదూరంగా ఉంటుంది. అయినా అది సినిమా అని దాన్ని కేవలం వినోద దృష్టితోనే
చూడాలన్నది అందరం ఒప్పుకోవాల్సిన సత్యమే. ఓ గొప్ప సబ్జెక్ట్ ఉన్న సినిమాలో కూడా స్త్రీని
ప్రేయసి పాత్రకే పరిమితం చేయడం సినిమాల్లో కూడా ఆమె సహజ ఊహలకు, అంచనాలకు తగ్గట్టు
ఉండాలి అనే దృక్పథానికి సంకేతం.
సినిమా తెరపై నటించే నాయకుల్ని చూసినంత గౌరవంగా నాయికలను చూడరు. తెరపై ఓసారి
కనపడితే చాలు అని అనుకునే మనస్తత్వం కలవారే ఎక్కువ. ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్సు కోసం
సంగీత, రవితేజ పడే తపన చూస్తే తెరకున్న గ్లామర్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఆ తపనలో పాత్ర
ఔచిత్యాల స్వేచ్చ స్త్రీలకు ఏమాత్రం ఉండదు.
ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే సినిమాల్లోని అత్యాచారాల సన్నివేశాల్ని తర్వాత కొన్ని
యూట్యూబ్ ఛానల్స్ లో అప్ లోడ్ చేయడం. వాటి కింద కామెంట్స్ లాంటివి పరోక్ష అత్యాచార
ప్రవృత్తిని ప్రదర్శించేవే. ఎంతో సున్నితంగా ఉండాల్సిన ఆ ఫ్యాంటసీలు నేడు వికృత రూపాన్ని
దాలుస్తున్నాయి.
ఆ వికృతమైన ఫ్యాంటసీలే సైకో మానసిక ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయి. అవి కొంతమేరకు
హత్యాచారాలకు  పాల్పడేలా చేస్తున్నాయి. ప్రతి స్త్రీకి ఉండే వ్యక్తిగత స్వేచ్చ గురించి సమాజంలో
అందరికీ తెలియదు. అలాగే పురుషుడి గురించి కూడా తెలియదు. ఎందుకంటే వ్యక్తిగత కోణాలు
ఎవరికి వారివి ఉంటాయి. కనుక తెరపై ఉండే ఈ హీరో హీరోయిన్లను కొంత మేరకు అనుకరించే
ధోరణి చాలా మందిలో ఉంటుంది.
ఆ ధోరణే కొంతమేరకు సమాజంలో సంకుచిత్వానికి కారణం అవుతుందని చెప్పవచ్చు. సినిమా
ఒక కళ. దాని లక్ష్యాలు, లక్షణాలు శాస్త్రీయమైనవే. కానీ పోటీ ప్రపంచంలో ఏ రసం ఎంతమేరకు
ఉండాలి అన్న నిబద్ధతపై కోల్పోయిన పట్టే దాన్ని కేవలం వాణిజ్య దృక్పథానికే పరిమితం
చేస్తుంది.
సినిమాలు థియేటర్లలో చూసే వారిలో మగవారి సంఖ్యే అధికం. కనుక ఆడియన్స్ పల్స్ పేరుతో
సినిమాల్లో ఆధిపత్య ధోరణి కొనసాగుతూనే ఉంది. స్త్రీలు కూడా పురుషుడు అలాంటి ధోరణితో
ఉండడమే నాయకుడి లక్షణంగా పరిగణించడమే స్త్రీ ప్రేక్షకుల ఆదరణను కూడా చూరగొంది.
సినిమాల్లో స్త్రీ పాత్ర గురించి సినిమా చూసిన తర్వాత ఔచిత్య రీత్యా చర్చించుకునే వారి
సంఖ్య కూడా తక్కువే. ఇలా ఏ కోణం నుండి చూసినా స్త్రీ ఓ ఆబ్జెక్ట్ గా చిత్రీకరించబడుతుంది
అన్నది వాస్తవం. సినీరంగంలో ఎప్పుడైనా స్త్రీ సమస్యలపై సినిమాలు వచ్చినప్పటికీ వాటిని
విభిన్న రుచిగా పరిగణిస్తున్నారే తప్ప స్త్రీ ప్రధాన పాత్రల్లో ఉన్న సినిమాలను సహజమైనవాటిగా
పరిగణించే సంస్కృతి ఇంకా రాలేదు.
ఏదీ ఏమైనప్పటికీ సినిమాల్లో స్త్రీ, జీవితంలో స్త్రీ ఎక్కడ కూడా ఊహల్లో కూడా స్త్రీకి గొప్పతనం
ఆపాదించే పరిస్తితి లేదు. అటువంటి కోణం సహజంగా పరిఢవిల్లే సంస్కృతి రావాలని ఆశిద్దాం!
* * *






























 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ