జవాబు లేని ప్రశ్నలు

జవాబు లేని ప్రశ్నలు 


జవాబు లేని ప్రశ్నలు 
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

స్పష్టత,కార్యాచరణా ప్రణాళికలే ఏ వాదానికైనా నిజమైన బలాలు.చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటుందని మనం అనుకుంటాం.కానీ వర్తమానంలో మన దృక్పధానికి అనుగుణంగా చరిత్ర మనకు ఒక్కో రకంగా కనపడుతుంది.అలా మారిన దృక్కోణమే భవిష్యత్తును నడిపిస్తుంది.చరిత్ర ఎప్పుడు పునరావృతం కాదు.కానీ అదే చరిత్రను బూజుచేసి చూపిస్తూ నేటి తర అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ సాగుతున్న సైద్ధాంతిక వాతావరణం దాదాపు అన్ని రంగాల్లోనూ కనబడుతుంది.స్త్రీ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

 దళితులు కుల వ్యవస్థను,కమ్యూనిస్టులు వ్యక్తిగత ఆస్తిని,స్త్రీవాదులు పితృస్వామ్య  వ్యవస్థను ఇలా ఒక్కొక్కరు ఒక్కో చట్రాన్ని ఎన్నుకొని ఎన్ని శతాబ్దాలు గడిచినా వాటినే ప్రధాన అంశాలుగా చిత్రీకరించి సమకాలీన పరిస్థితులు,పరిణామక్రమంలో రూపుదిద్దుకోవాల్సిన కొత్త ఆలోచనలను ఆహ్వానించకుండా తమ తరువాతి తరాన్ని కుహనావాదాలతో మభ్యపెట్టడం మనకు కొత్తేమీ కాదు.

          19వ శతాబ్దంలో కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వారు వెలుగులోకి వచ్చేవరకు స్త్రీ అస్థిత్వం,సమానత్వం వంటి అంశాల గురించి ఎవరు లోతుగా ఆలోచించలేదు.తర్వాత గురజాడ ఇంకా ఎందరో స్త్రీకి కావాల్సిన కనీస స్వేచ్ఛ గురించి ఉద్యమాలు చేసి మరో స్త్రీకు ఓ కొత్త కవాటాన్ని తెరిచారు.క్రమేపీ 21వ శతాబ్దం వచ్చేసరికి దాదాపు స్త్రీలందరూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఇది ఓ నిర్దిష్ట అభిప్రాయం కాదు.కానీ లోతుగా తరచి చూస్తే పెరిగిన వాతావరణం,ఆర్థిక పరిస్థితులు,ప్రామాణికత అనేవి ఆడైనా,మగైనా ఎవరినైనా ప్రభావితం చేస్తాయి.వృత్తిపరంగా చూసుకుంటే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో  బస్సు డ్రైవర్లుగా కూడా 50 శాతం స్థానం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం స్త్రీలకు తెలిపింది.కాకపోతే ఇంకా జరుగుతున్న స్త్రీలపై అత్యాచారాలు అన్న కోణం నుంచే ఆలోచించి సమగ్ర చిత్రమైన 'స్త్రీ సమానత్వాన్ని' మరల రెండు శతాబ్దాల వెనుక చరిత్రలో కుచించివేయడం సమంజసం కాదని కాస్త శాస్త్రీయంగా ఆలోచిస్తే బోధపడుతుంది.

'స్త్రీలపై అత్యాచారాలు నశించాలి.స్త్రీకి సమానత్వం కావాలి' అని గొంతెత్తి అరిచే వాదాల సిద్ధాంతకర్తలు నిజంగా ఆ అత్యాచారాలు నశించాలంటే ఏం చేయాలి?ఇలా చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?'ఇటువంటి ప్రశ్నలు అడిగి చూడండి,స్పష్టమైన సమాధానాలుండవు.ఏదో ఆవేశంలో మాటల ప్రవాహం పరుషంగా పొంగి పొర్లితే 'ఆహా...ఓహో'అని ఆ క్షణాన అనిపించవచ్చు.కానీ కార్యాచరణ విషయానికి వస్తే చిత్తశుద్ధి ఎంతమేరకు అన్నది మనఃసాక్షికి మాత్రమే సంబంధించిన విషయం.ఇటువంటి వాదాలు చివరికి కాలప్రవాహాన్ని తిరోగమించేలా చేస్తాయి.

సమస్యకు పరిష్కారం జరిగాక కూడా ఉత్పన్నమయ్యే  దుష్పరిణామాలు ఎక్కడో సరి చేసుకోవాల్సిన పునాదుల్ని సూచిస్తాయి.లోతైన ఆలోచనా,కార్యాచరణపై స్పష్టత లేనివాళ్ళు ఆవేశాన్ని  అస్త్రంగా సంధించి విసిరే మాటల బాణాల ప్రభావం నిజంగా ఎంతమేరకు ఉంటుందంటే అది విన్నవారు ఆ ఉపన్యాస ధోరణిని,భావోద్వేగాల్ని ఇష్టపడుతున్నారు,ఇంకో ఉపన్యాసం కోసం ఎదురుచూస్తున్నారు తప్ప ఆలోచించడం లేదు.ఆలోచనకు పురికొల్పే లోతైన స్పష్టత  లేకపోవడం వల్లే ఓటికుండ శబ్దంలాగా ధ్వని చేసి మాయం అవుతుంది.ఏ కుటుంబ వ్యవస్థలోనైనా 'స్త్రీ' తన తరువాత తరాన్ని నడుపుతుంది.పిల్లల పెంపకం మొదలుకుని దాదాపు ఇంట్లోని అన్ని వ్యవహారాలను దక్షతతో నడిపేది ఆమె. అంటే కుటుంబంలోని  వ్యక్తుల్ని ఆమె ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.అంటే మార్పును తీసుకురాగల శక్తి కూడా ఆమెలోనే ఉంటుంది.ఆ స్వయంశక్తిని గుర్తించి ఆమె నిర్మాణాత్మకంగా ఆచరణను అమలు పరచినప్పుడు నిజమైన వ్యక్తిగత 'స్త్రీ సమానత్వం' వచ్చినట్టు.

          పురుషుడికి కూడా ఇంటి బాధ్యతల్లో భాగం ఉంటుంది.కానీ సంబంధాలు,అనుబంధాలని బలంగా నడిపించే భావోద్వేగాలు 'స్త్రీ'లో ఉన్నంత తీవ్రంగా పురుషుడి వ్యక్తీకరణలో కనపడదు.అంటే అంతర్లీనంగా 'మార్పు' అనేది ప్రశ్న అయినా సమాధానం అయినా దాని ఉనికి 'స్త్రీ'యే.

          సమానత్వం,స్వేచ్ఛ అనేవి ఒక్కోసారి వ్యక్తిగత కోణంలోనూ,ఇంకోసారి సమాజకోణంలోను దర్శనం ఇచ్చే అంశాలు.ఇంత లోతైన అంశాల్ని,ఇంత విస్తృత పరిధి గల అంశాలను వ్యక్తిగత దూషణల,పాపులారిటీ మాస్కులుగా ఉపయోగించుకున్నంతకాలం అది ఓ 'మైక్ 'అంశం గా మాత్రమే మిగిలిపోతుంది.సమాధానం లేని కార్యాచరణ లేని వాదాల్ని 'పిడిగుద్దు'గా పౌరుల మీద గుప్పించినంతకాలం సమాధానం లేని ప్రశ్నలాగే స్త్రీవాదం మిగిలిపోతుంది.పరస్పరం స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడటం సృష్టిసూత్రం.

          'ఆధారపడటం' అనేది వ్యక్తిని తక్కువ చేసి,ఇంకొక వ్యక్తిని అధికంగా చూపే అంశం కాదు.జీవితాన్ని సులువుగా,ఆహ్లాదంగా గడపటానికి,మారటానికి ఉన్న అవకాశం మాత్రమే.ఈ విషయం మీద పరిపూర్ణ స్పష్టత,అవగాహన లేనంతవరకు అసలైన వాదం ఎప్పుడూ వక్రీకరించబడుతూనే  ఉంటుంది.అసలైన విషయం వక్రీకరణ కోణంలో సాగినంత కాలం అభివృద్ధి గమనం తిరోగతిగా పరిణమిస్తుంది.సమాధానాల్లేని ప్రశ్నలని,స్పష్టమైన లోతైన అవగాహన లేని అంశాలను పిడివాదాలుగా మన నెత్తిన రుద్దే కుహనా వాదులంతా ఇకనైనా మేల్కొంటే బావుంటుంది.

            *      *      *  




Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ