లక్ష్యం
‘ఒరేయ్ కార్తీక్ ! నీ ఫ్రెండ్ దిలీప్ కి టిసియస్ లో ఉద్యోగం వచ్చిందటగా ...బజార్లో వాళ్ళ నాన్న కనిపించి చెప్పాడు. నాకీ జన్మకు అలాంటి భాగ్యం కలిగించవేమో! క్యాంపస్ జాబ్ రానంత మాత్రాన ...ఇలా ఖాళీగా కవితలు ,కధలు రాసుకుంటూ ...అవి పత్రికలకు పంపటం ..అవి తిరిగి రావడం ...మోటివేషనల్ స్పీకర్ అవుతానని ఊహాల్లో విహరిస్తూ ...ఎంత కాలం ఇలా ఖాళీగా ఇంట్లో కూచుంటావురా? నిన్ను ఏమి అనలేక ,నిన్ను కన్న నేరానికి కనిపించిన వాళ్లందరికీ తమరి ప్రతిభ గురించి చెప్పలేక ఛస్తున్నాను...ఎప్పుడు బాగుపడతావో ఏంటో! అంతా నా కర్మ ...బ్యాంకు లోను తీసుకుని ఇంజనీరింగ్ చదివించాను. కనీసం నెలనెలా ఇన్ స్టాల్మెంట్ కట్టడానికైనా కష్టపడు’, అంటూ కొడుకుని విసుక్కుని లోపలికెళ్ళాడు భాస్కరరావు.
మంచి మూడ్ లో కధ రాస్తున్న కార్తీక్, తండ్రి తిట్లకు నిస్సహాయంగా చెవులు,కళ్ళు అప్పగించాడు. తండ్రి లోపలికెళ్ళాక కధ వైపు చూస్తుంటే, తను రాసిన కధలో పాత్రలు తననే వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. మూడ్ అవుటై, అలవాటు ప్రకారం ఇంట్లోంచి బయటకొచ్చాడు. అప్పటివరకూ కధ చుట్టూ తిరిగిన ఆలోచనలు వెనక్కి తగ్గాయి. ఇంట్లో వాళ్ళు అసలు తననెందుకు అర్ధం చేసుకోవడం లేదో అని ఆలోచించసాగాడు. అలా నడుస్తూ ఊరి చివరికి వచ్చాడు. తనకిష్టమైన స్ట్రాంగ్ కాఫీ తాగాడు.
అసలు అందరికీ చదివిన వెంటనే ఉద్యోగాలు రావాలా? ఉద్యోగమే చదువుకి పరమార్థమా? తన క్లాస్స్ మేట్స్ లో తనలా వాగ్దాటి గలవారు ,కధలు ,కవితలు రాయగలిగిన వారు ఎంత మంది ఉన్నారు? ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్ వేర్ ఉద్యోగమే చేయాలా? చదువుకున్న రంగంలో కాకుండా, అభిరుచి ఉన్న రంగంలో రాణించి సక్సెస్ అయిన వాళ్లెంత మంది ఉన్నారు? తన అభిరుచిని ఇంతా బైట పాదులోనే తుంచేస్తుంటే అంకురించిన ఆలోచనలు ఎదిగేదెప్పుడు?
ఆలోచిస్తూ వెనుదిరిగాడు కార్తీక్.
* * *
కార్తీక్ ప్రపంచమే భావుకత. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిస్థితులని చూసి స్పందిస్తాడు. అలవోకగా అక్షర రూపం కల్పిస్తాడు. తనకు తెలిసిన రీతిలో ఆ సమస్యకు తనేలా స్పందిస్తాడో, పరిష్కారం చూపగలడో సూచిస్తాడు. ఏ సమస్య గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలడు.
ఏదో చేయాలి , సాధించి అన్న తపన, నిర్మాణాత్మకమైన వ్యక్తిత్వం, అదే తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని, అంతర్లీనంగా తనలో శక్తి ఉందని తనపై నమ్మకం ఉన్న యువకుడు. అయితే ఆ శక్తి బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఒక్కసారి గుర్తింపు రావాలి! ఎవరెన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా తనపై తనకి నమ్మకం ఉందబట్టి, ఎవరేమన్నా తన పని తాను చేసుకుపోయే మనస్తత్వం అతనిది.
* * *
రెండేళ్ల తరువాత ....
ఇండియా ,ఆస్ట్రేలియా 20/20 మ్యాచ్ సెమీస్ చూద్దామని టీవి ఆన్ చేశాడు. ఛానల్ మార్చేలోపు వినిపిస్తున్న న్యూస్ అతన్ని ఛానల్ మార్చనివ్వలేదు.
‘ప్రపంచంలో అన్నింటికంటే మనిషికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు. జీవితంలో ఆనందాన్ని నింపేది ప్రశాంతత. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియక ఉరుకుల, పరుగుల జీవితంలో పడి విపరీతమైన ఒత్తిడికి లోనై ఆత్మ హత్యలకు పాల్పడుతుంది యువత. ఆ జాబితాలో రెండేళ్ల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరిన దిలీప్ అనే యువకుడు ఒత్తిడి తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. టీవీలో వార్తలు సాగిపోతున్నాయి.
కార్తీక్ ఉలిక్కి పడ్డాడు. టీవీలో దిలీప్ క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు. సోఫాలో వెనక్కి వాలిపోయాడు. కళ్ల ముందు కాలేజీలో తన పక్కనే కూచునే దిలీప్ కనిపించాడు. కార్తీక్ మనసు గతంలోకి పరుగెట్టింది. కన్నీళ్లు అతని చెంపను నిమురుతున్నాయి.
* * *
దిలీప్ బొమ్మలు బాగా వేసేవాడు. కాన్వాస్ మీద పోర్త్రైట్స్ ,లాండ్ స్కేప్స్ అద్భుతంగా ఆవిష్కరించేవాడు. ఓ సారి క్లాస్ లో కూచునే , క్లాస్ రూమ్ నీ, స్టూడెంట్స్ నీ అందంగా పెయింట్ చేశాడు. ఆ పెయింటింగ్ ను కాలేజీ ఆడిటోరియంలో ఉంచి అందరికీ తెలిసేలా, చూసేలా ఏర్పాటు చేయించారు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ .
అతనిలోని క్రియేటివిటీ గురించి ఆ రోజు అందరూ మాట్లాడుతూ ఉంటే ,’దిలీప్ నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదరా.....ఆ టాలెంట్ తో క్రియేటివ్ డిజైనర్ ఫీల్డ్ లోకి వెళ్లావంటే టాప్ రేంజ్ కి ఎదిగిపోవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలదేముంది!రొటీన్ , అందరూ చేసేవే ...యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ ‘ అన్నాడు కార్తీక్.
‘ఆపరా బాబు! నువ్వు నీ ఉపన్యాసాలు , జీవితంలో కళ అయినా డబ్బు ఉంటేనేరా ..మనకు ఏది నచ్చిందని కాదు ...ఏది చేస్తే మనం స్థిరపడగలమో అందులోకి చొచ్చుకుపోవాలి. నువ్వు చెప్పినట్టు ‘క్రియేటివిటీ’ తో పెయింటింగ్ రంగంలో ఎదగాలంటే కనీసం పదేళ్ళైనా పడుతుంది. అంతా ఓపిక మనకు లేదు బ్రదర్ .....ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరి, యుఎస్ వెళ్ళి సెటిలవ్వాలి. ఆ తర్వాతే క్రియేటివిటీ గురించి ఆలోచిస్తా! కధలు ,కాకరకాయలు, స్పీకర్ అనే సుత్తి కధలు ఆపి నువ్వు కూడా సాఫ్ట్ వేర్ జాబ్ గురించి ఆలోచించు ‘, అని హిత బోధ చేశాడు దిలీప్.
* * *
ఆలోచనల్లో మునిగిపోయిన కార్తీక్, సెక్రటరీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు.
‘సర్ ...ఈ రోజు ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో మోటివేషన్ క్లాస్. కానీ మీరు క్యాన్సిల్ చేయమన్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం చెయ్యమంటారు ?’ అడిగాడు సెక్రటరీ.
‘క్యాన్సిల్ చేయకు. మోటివేషన్ క్లాస్ ఉంటుందని, వస్తానని చెప్పు ‘, అన్నాడు కార్తీక్.
* * *
ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం విద్యార్ధులతో నిండిపోయింది.
‘డియర్ ఫ్రెండ్స్ .....గుడ్మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ‘ విధ్యార్ధులని ఉద్దేశించి అన్నాడు కార్తీక్.
‘ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట నా అనుభవాల్లోంచి వచ్చిందే. ఎదుటివారు మాట్లాడే దాన్నుంచి మంచిని తీసుకోండి, చెడుని వదిలెయ్యండి అని చాలా మంది చెప్తూ ఉంటారు ....కానీ దానిని ‘మంచి’ అనే దానికంటే అందులో మీకు ఉపయోగపడే వాటిని తీసుకోవడం మంచిది అంటాను’, అని ఆగాడు కార్తీక్.
‘ఎక్స్ క్యూజ్ మీ ! సర్ ! ఈ రెంటికీ తేడా ఏముంది ?’ అన్నాడో విద్యార్థి వెనుక నుండి.
‘గుడ్ ! మీరిప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నారు. దానికి సంబంధించిన సాంకేతిక ప్రగతి, సంబంధిత సూక్ష్మ విషయాలు కూడా ‘మంచి’ జాబితాలోకి వస్తాయి. కానీ మీ కల ఓ బిజినెస్ మ్యాన్ అవ్వడమైతే మీకు బిజినెస్ స్కిల్స్ ‘ఉపయోగపడే’ జాబితాలోకి వస్తాయి. ఉపయోగపడేవి అంటే దిక్సూచిలా మనల్ని మన కల వైపు నడిపించేవి’, చెప్పాడు కార్తీక్.
‘అలా అయితే సర్ మేమందరం ఇంజనీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మానేసి ఎప్పుడో కలగన్నామని ఎండమావుల వెంట పరుగులు తీసి చేతిలో ఉన్న ఉద్యోగాలు వదులుకోమంటారా?’ రెండో వరుసలో కూచున్న స్వప్నిక ప్రశ్నించింది.
‘అలా అనడం లేదు. నేను ముందే చెప్పాను. ఇక్కడ మీకు చెప్పేవి కేవలం నా అనుభవాల్లో బలంగా సరైనవని అనిపించినవే.
మనుషులు రెండు రకాలుంటారు. మనసుకు నచ్చిన దాని కోసం వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టే ధైర్యం ఉన్నవాళ్లు. వాళ్ళల్లో ఆత్మ విశ్వాసం ఎక్కువ ఉంటుంది.
మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిలయ్యేవాడు. ఒక సంస్థను స్థాపించి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం అతని కల. అతని క్లాస్ మేట్ అన్నీ సబ్జెక్ట్స్ లో మంచి ర్యాంకులతో పాసయ్యేవాడు.
చివరికి బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ సంస్థ స్థాపించి, క్లాస్ మేట్ కి తన కంపెనీ లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చాడు.
ఇక రెండో రకం వాళ్ళు గోడ మీద పిల్లి లా ఉంటారు. ఏ అవకాశం ముందోస్తే దాని వైపు దూకేస్తారు. స్థిరమైన మనస్తత్వం కాదు వాళ్లది. అన్ని పడవల్లోనూ కాలు పెడతారు. కానీ ఎందులోనూ వీరికి నమ్మకం, స్థిరత్వం ఉండదు. మనశ్శాంతి అంతకంటే ఉండదు. కాబట్టి మీరు ఏ రకానికి చెందిన వారో మీరే నిర్ణయించుకోండి.’
‘అయితే నచ్చింది సాధించే వరకు ఉద్యోగం చెయ్యకూడదంటారా?’మరో విద్యార్థి అడిగాడు.
‘గుడ్! ప్రొఫెసర్ అవుదామని కల గన్న వాడు టీచర్ అయ్యాడనుకోండి. తన కల నెరవేర్చుకోవడానికి కావల్సిన నైపుణ్యాలని సంపాదించుకోవాలన్న కసిని పెంచుతుంది ఆ ఉద్యోగం. నువ్వు మొదటి రకం అయినప్పుడు, అనుకున్నది సాధించేవరకు నిద్రపోనివ్వదు.
కానీ అదే వ్యక్తి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయ్యాడనుకోండి ...అది అతన్ని అతని కల నుండి దూరం చేస్తుంది. ఎందుకంటే ,తన కల నెరవేర్చుకోవడానికి తగినంత సమయం కేటాయించనివ్వదు ఆ ఉద్యోగం.
చదివిన చదువుకి సార్ధకత ఉద్యోగమే అనుకుంటే, ఆ ఉద్యోగం మనలోని అసలైన నైపుణ్యాలని పెంపొందించేలా ఉండాలి. కలలు నెరవేర్చుకునేందుకు దోహదపడాలి.’
కార్తీక్ వాక్ప్రవాహం కొనసాగుతుంది. మధ్య మధ్య అడ్డొచ్చే ప్రశ్నలు క్రమంగా ఆగిపోయాయి.
‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాం. కానీ ముందుగా ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించాలి. అంటే విద్య పూర్తయిన వెంటనే ఏదో ఒక దానిలో స్థిరపడాలనే ఆలోచన మంచిదే. అయితే ఆ ఆలోచనల్ని మీరు కన్న కలల వైపు నడిపించడానికి ‘యువర్ డ్రీమ్ ....యువర్ లైఫ్ ‘ అనే పేరుతో ప్రతి కాలేజీలోనూ ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. మీ కలలకు, నైపుణ్యాలకు సంబంధించిన విషయాలను మొదటి సంవత్సరం నుంచే ఈ ప్రత్యేక విభాగంలో నమోదు చేస్తారు. దానికి తగ్గట్టు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు మీకు మార్గ దర్శకం చేస్తారు. అలా మీ చదువు పూర్తయ్యేనాటికి మీ కలలను నెరవేర్చుకునే మార్గాలు సుగమం అవుతాయి.
‘నచ్చిందా ? వచ్చిందా ? అనే సందిగ్ధము నుండి బయట పడి నచ్చిన దానిని అందరూ మెచ్చేలా సాధించేలా యువతకు దిశా నిర్దేశం చెయ్యడమే ఈ ప్రత్యేక విభాగం లక్ష్యం’, అని ముగించాడు కార్తీక్.
* * *
నెల రోజుల్లో ఇరవై ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘యువర్ డ్రీమ్ – యువర్ లైఫ్’ సెల్స్ ఏర్పాటయ్యాయి. ప్రముఖ పర్సనాలిటీ డెవలప్ మెంట్ స్పీకర్ కార్తీక్ యువత కోసం చేస్తున్న కృషి, ధృడ సంకల్పమే దీనికి కారణం.
* * *
ఆ రోజు కార్తీక్ బర్త్ డే. అతడి ఇంజనీరింగ్ క్లాస్ మేట్, మరణించిన దిలీప్ బర్త్ డే కూడా అదే రోజు కావడం యాదృచ్చికం. కాలేజీ లో చదువుకున్న నాలుగేళ్లు ఇద్దరూ కలిసే ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చేవాళ్లు. దిలీప్, కార్తీక్ ఫ్రెండ్స్ అయినా వారి ఆలోచనలు వేరు. దాంతో దిలీప్ ని కాపాడలేకపోయాను అన్న బాధ కార్తీక్ ని వదలటం లేదు.
ఆ రోజు రాత్రి పడుకోబోయేముందు కార్తీక్ మనసులోనే దిలీప్ కు ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు’ తెలియజేశాడు. దిలీప్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు తనకు రాసిన ఉత్తరం లోపలినుంచి తీసి చదవడం మొదలు పెట్టాడు.
‘ఒరేయ్ కార్తీక్ .....
నువ్వు చాలా తెలివైనవాడివి . నువ్వెప్పుడు కలలు, ప్రత్యేకతలు ,సాధించడం ...లక్ష్యం లాంటివి చెబుతుంటే ...నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక , చేతకానితనానికి అవి నువ్వు పెట్టుకున్న పేర్లు అనుకునేవాణ్ణి. మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో నాకు జాబ్ రాగానే ఏదో సాధించాను అనుకున్నాను.
నెలకు యాభై వేల జీతం నా ఇగో ని సంతృప్తి పరిచింది కానీ … నా లక్ష్యానికి , నా కలకు దూరమవుతున్నానని తెలుసుకోలేకపోయాను. అనుక్షణం ఒత్తిడి,భయం, అసహనం, టార్గెట్స్ ...వీటితో నాకు తెలియకుండానే నాలో కోపం పెరిగిపోసాగింది.
యాంత్రిక జీవితంలో ఇరుక్కుపోయిన నా కలల కాన్వాస్ రంగులు లేక వెల వెల పోయినట్టు అనిపించింది. నా క్రియేటివిటీ అంతా అర్థరాత్రులు కన్నీరు కారుస్తూ, కలలోకి వచ్చేది. నువ్వు చెప్పినట్టే , నాకు ఇష్టమైన క్రియేటివిటీ ఫీల్డ్ లోనే నా ఈ శ్రమనంతా వెచ్చించి ఉంటే నాకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేది. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ఇమడలేక , అనుక్షణం కళ్ల ముందే ఉండే టార్గెట్స్ పూర్తి చేయలేక, క్రమంగా నా ఉనికి కోల్పోతూ అభద్రతా భావానికి లోనవ్వుతున్నాను. ఈ మధ్య తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఉద్యోగం ఊడిపోయింది.
ఇన్నాళ్ళు ఉన్న ఉద్యోగం మత్తు వీడిపోయింది. మళ్ళీ ఉద్యోగం రావాలంటే కొన్నాళ్లు గ్యాప్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ . మొన్నటి వరకూ తీసుకున్న జీతం కంటే తక్కువ జీతంతో సర్దుబాటు చేసుకోవాల్సిరావడంతో నా వల్ల అయింది కానీ, నా భార్య వల్ల కాలేదు. ఇంట్లో సమస్యలు, ఉద్యోగంతో ఒత్తిళ్లతో చివరకు సంసారం దెబ్బతింది.
అపార్థాలు,అనుబంధాలు,అనుమానాలు ,కేసులు, విడాకులు ...ఇవన్నీ మూకుమ్మడిగా నా మనసు మీద దాడి చెయ్యనారంభించాయి. ఇల్లాలు లేని ఒంటరి బ్రతుకు బ్రతకలేననే విరక్తి నాలో ప్రవేశించింది. ఆఫీస్ కి వెళ్లాలనిపించడం లేదు.
మూలపడేసిన ‘పెయింటింగ్ కళ’ మొదలు పెడదామని ఎంత ప్రయత్నించిన మనసులో అశాంతి కుంచె అంచుల్ని ఇంచు కూడా కదలనియ్యడం లేదు. ఒంటరితనం క్రమంగా జీవితం మీద ఆశల్ని అణచివేయసాగింది. నువ్వు నీ కలల్ని సాకారం చేసుకోవడంలో ఆరోహణం ఉంటుంది.
నాబోటి వాళ్ళు టెన్షన్ , అస్థిరత్వంతో పిరికివాళ్ళుగా మిగిలిపోతుంటే, నూటికొక్కడు నీలాంటి వాడులా ఆశా కిరణమై ఉదయిస్తారు. కలలకు దూరమైన యువత నా లాగా అనామకుల్లా మిగిలిపోకూడదు. నీ కధల్లోని చైతన్యం, నీ మాటల్లోని ఉత్తేజం రెంటినీ కలగలిపి, నువ్వు యువత కలల్ని సాకారం చేసే దిక్సూచివి కావాలని ఆశిస్తూ…
జీవితంలో ఓడిపోయిన ఓ పిరికివాడు ...’దిలీప్’
* * *
కార్తీక్ .....కళ్ళలో తడి. ఆ లెటర్ చదివిన ప్రతి సారీ, జీవితంలో తనకు మరో దిలీప్ కనబడకుండా ఇంకా ఏం చేయాలా? అన్న కసి రెట్టింపు అవుతుంది తనలో. ఆ కసిలో నుంచి ఆవిర్భవించిందే ‘యువర్ డ్రీమ్ -యువర్ లైఫ్ .’
మనం చేసే ప్రతి పని మన లక్ష్యానికి దూరంగా లేదా దగ్గరగా తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత, అంతర్గత నైపుణ్యం ఉంటుంది. చదువు పూర్తయ్యాక ఆ నైపుణ్యాన్ని వెలికి తీసి దాన్ని మెరుగుపరచుకునే ఉద్యోగాలు వెతుక్కునే వారి సంఖ్య చాలా తక్కువ. లక్ష్యం దిశగా అడుగులు వేసేవారే కలల్ని సాకారం చేసుకోగలుగుతారు. జీవితంలో ఎలాంటి అసంతృప్తిని తొంగిచూడనివ్వరు.’
క్షణికావేశాలకు, బలహీనతలకు లొంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత కోసం చేపట్టబోయే కొత్త ప్రాజెక్ట్ కోసం అన్వేషించడం మొదలు పెట్టాయి కార్తీక్ ఆలోచనలు.
* * *



Comments
Post a Comment