కథలు
ఈగో
-రచనశ్రీ దత్త (శృంగవరపు రచన)
మనసును ఉల్లాసపరచే మంద్రమైన సంగీతం , కారులోని ఏసి , పక్కన అందమైన భార్య సాన్నిహిత్యం...ఇవేమీ అతన్ని ఆహ్లాదపరచలేదు .
“ఈ రోజు నువ్వు ఎన్నింటికి నిద్ర లేచావో తెలుసా?’ వాల్యూమ్ తగ్గిస్తూ చిరాగ్గా స్వప్నను అడిగాడు అభిజిత్.
“రాత్రి ఎన్నింటికి పడుకున్నానో నీకు తెలుసా ?’ అదే తీవ్రతతో తిరిగి ప్రశ్నించింది స్వప్న.
“అయినా అంతా ఆలస్యంగా నిద్ర పోవాల్సిన అగత్యం ఏమిటో ?”
“ఇప్పుడీ వాదన ఎందుకు ? నేను కూడా నీతో సమానంగా సంపాదిస్తున్నాను .”
“ఇది సంపాదన సమస్య కాదు. మనిషి వ్యక్తిత్వ సమస్య.”
“ఏంటో నీకున్న నాకు లేను అంతా గొప్ప వ్యక్తిత్వం ?” హేళనగా అడిగింది.
“అమ్మ ఎన్నింటికి ఉదయం నిద్ర లేస్తుందో తెలుసా నీకు?”
“పని ఏమి లేకుండా ఇంటి పట్టున ఉంటే నేను కూడా లేస్తాను.”
“ షటప్ ...మేము చదువుకునే రోజుల్లో అమ్మ కూడా వర్కింగ్ ఉమెన్. తాను జాబ్ చేసేది . అయినా మా అవసరాలను కనిపెట్టి , స్కూల్ కి మమ్మల్ని పంపి తాను ఆఫీసుకి వెళ్ళేది.
“ ఏంటి నోరు లేస్తుంది? పెళ్ళికి ముందు నా లైఫ్ స్టయిల్ నీకు తెలియదా? అన్ని తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు?”
“స్వప్నా ...ఈ రోజు మనిద్దరమే. రేపు మనకి పాపో ,బాబూ పుడతారు. వారికో మంచి జీవితం ఇవ్వాలన్నా, క్రమ శిక్షణ తో పెంచాలన్నా ,వారికి ఆదర్శం అవ్వాలన్నా , మన అలవాట్లు ,జీవన విధానం కూడా అలాగే ఉండాలి. మన అమ్మ నాన్నలు కూడా ఉదయం ఎనిమిదింటికి నిద్ర లేస్తే మన ఆలనా పాలనా ఎవరు చూసి ఉండే వారు ?
అయినా నీకు చెప్పాలనుకోవడం నా బుద్ధి తక్కువ. ‘అమ్మా’ అన్న నీకు అపశృతి లోనే వినిపిస్తుంది. ఎన్ని జన్మల పాపాల ఫలితమూ నీలాంటి భార్య దొరికింది నాకు.”
నిశ్శబ్దం రాజ్యమేలింది వారిద్దరి మధ్య ఆఫీసు చేరే వరకు.
కార్ పార్కింగ్ లో పెడుతుంటే విసురుగా డోర్ తీసుకుని , ఆఫీసు లో తన క్యాబిన్ వైపు వెళ్లిపోయింది ఆమె.
రోజు ‘బై ‘ అని మనోహరమైన చిరునవ్వుతో విచ్చుకునే ఆమె పెదవులు ఆ రోజు కోపంతో మౌన ముద్రను దాల్చాయి. ఆ మౌనమే తమ మధ్య ‘ఈగో ‘కి సంకేతంగా అనిపించింది అభిజిత్ కి.
* * *
‘స్వప్నా ...స్వప్నా ‘ఆప్యాయతతో కూడిన పిలుపుతో నిద్ర నుండి మేలుకొంది. ఎదురుగా చూస్తే అత్తగారు.
‘ఏంటి అండీ ...మంచి నిద్రను పాడు చేశారు ...’చిరాకు ధ్వనించింది ఆమె స్వరంలో.
‘నాకు ఒంట్లో బావుండటం లేదు తల్లి. ఈ రోజు కొంచెం నువ్వు వంట చేసుకుని వాడికి, నీకు లంచ్ చేసుకుంటావా స్వప్నా ...’ అనారోగ్యం ఆమె గొంతుని వణికేలా చేస్తుంది.
‘ఏంటి అండీ మీరు ..అసలే చచ్చి చెడి ఒళ్ళంతా హూనం చేసుకుని ఇంటికొచ్చి రాత్రి ఏ రెండింటికో పడుకుంటే పొద్దు పొద్దున్నే ఇలాంటివి చెప్తారు?’ విసుక్కుంది స్వప్న.
‘అసలేం బావుండలేదమ్మా ...అందుకే ‘ అంటూ వెళ్లిపోయింది సులోచన.
‘ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో ...ఇంకెవరి మొహం! ఈవిడ గారి మొహమే ‘, అని చిరాగ్గా అనుకుంటూ లేచింది స్వప్న.
బ్రష్ చేసుకుని ఆమె వంటింటి లోపలికి వెళ్లింది. ఆశ్చర్యపోయింది. అభిజిత్ అప్పటికే కూరగాయలు తరగడం పూర్తి చేశాడు. కావల్సిన ఐటమ్స్ అన్నీ పొందికగా పక్కనే పెట్టాడు.
‘గుడ్ మార్నింగ్ డియర్ ,నా హృదయరాణికి ఈ కాఫీతో స్వాగతం’ అంటూ వేడి వేడిగా పొగలు కక్కుతున్న కాఫీ చేతికి అందించాడు.
పెళ్ళైన తొలి రోజులు గుర్తొచ్చాయి ఆమెకు.
పదినిమిషాల్లో ఆమె వంట చేస్తుంటే ఆహ్లాదంగా జోకులు వేస్తూ , చిన్న చిన్నగా అందిస్తూ అలసట లేకుండా సునాయాసంగా వంట అయ్యేలా చేశాడు.
‘థ్యాంక్ యూ అభి ‘అంది స్వప్న.
‘థ్యాంక్స్ దేనికి స్వప్నా ? అన్నీ పనుల్లోనూ మనం భాగస్వాములమే కదా! ఇంటిని నడపడానికి నాతో పాటు నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు. అలాంటప్పుడు
వంట పని ,ఇంటి పని రెండు కూడా మనవే కదా!’ అభిజిత్ నవ్వుతూ వెళ్లిపోయాడు ఆఫీసుకి రెడీ అవ్వడానికి .
క్రిందటి రోజు జరిగిన కార్ సంభాషణ గుర్తుకొచ్చింది ఆమెకు. అతని మాటల్లో కూడా నిజం ఉందని అనిపించింది.
* * *
‘నన్ను క్షమించు స్వప్నా ...నీ మనస్సుని నిన్న బాధ పెట్టాను’ అన్నాడు అభిజిత్ కార్లో
‘అదేం లేదు అభి ..నువ్వు భవిష్యత్తు గురించి చాలా బాగా ఆలోచించావు. ఇది మనిద్దరికి మాత్రమే సంబంధించింది కాదు. మన కుటుంబ పొదరిల్లుని అందమైన ఉద్యానవనంగా మలచుకోవాల్సిన విషయం. నేను ,నా జీతం ,నా ఆనందం ...ఇంత వరకే ఆలోచిస్తే ఇగో పెరిగి జీవితంలో గ్రోత్ ,గ్రోయింగ్ రెండు ఉండవు. మన అలవాట్లు, మన జీవన విధానం మనకు మాత్రమే పరిమితం అవ్వవు కదా!’
‘అవును స్వప్నా .... అన్నీ విషయాల్లో మనం ఆదర్శవంతంగా ఉండలేకపోవచ్చు. కానీ సంబంధ బాంధవ్య విషయంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించుకుంటే అది మనకున్న పని ఒత్తిడులని కూడా తగ్గిస్తుంది. ఈ చిరాకు ,కోపం పోయి ఒకరికి ఒకరం తోడుగా ఉంటాము.’
‘అవును అభి! నిన్న నువ్వు చెప్పింది నిజం. మన అమ్మనాన్నలు కూడా మనల్ని ఇలానే బాధ్యతారాహిత్యంగా పెంచి ఉంటే నేడు మనం ఇలా లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగే వారిమే కాదు. రేపు పిల్లలు పుడితే మనమే ఏ ఏడింటికో ,ఎనిమిదింటికో లేస్తే వారికి మంచి అలవాట్లు. నడవడి ఎలా అబ్బుతాయి?’
‘ఎంత గొప్పగా చెప్పావు అభి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్లానింగ్ ఉన్నట్టు సమాజానికి తెలిసినా, తెలియకపోయినా పర్వాలేదు. కానీ తమ తల్లితండ్రుల మధ్య అవి ఉన్నాయని ఇద్దరూ తమని సమానంగా చూస్తూ ఉద్యోగం చేస్తున్నా సరే ఏ విధంగాను తమ పట్ల నిర్లక్ష్యంగా ఉండరు అని పిల్లలకి అనిపించాలి.’
‘అవును స్వప్నా ...దీనికి మనం కష్టపడి చెయ్యాల్సింది అంటూ ఏమి లేదు. ఇద్దరం ఒకే రంగంలో పనిచేస్తున్నాం. దానిలోని సాధకబాధకాల్ని ఓ సవాలుగా తీసుకుని పరిష్కారాలు ఆహ్లాదంగా వెతుకుదాము. వీటిని ఇంటికి భారంగా మోసుకు వెళ్లొద్దు. ఓ గంట ముందు లేచి ఇద్దరం కలిసి పని చేసుకుందాము. దీనితో మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ కార్యరూపం దాల్చి ‘ఇగో’ కి మనిద్దరిని దూరం పెడుతుంది. అవసరమైతే అన్ని విషయాల్లో అమ్మ సాయం తీసుకుందాం . ఏమంటావు ?’
‘తప్పకుండా అభి ...అత్తమ్మ సలహాలు,సూచనలు మాత్రమే కాదు..మనం కూడా అత్తమ్మను బాగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు అత్తమ్మను ఓ వంటమనిషిలా మాత్రమే చూశాను . అది ఎంత తప్పో ఇప్పుడు అర్ధం అవుతుంది. తన అమ్మతనంతో నాకు ఎంత దగ్గరవ్వాలి అని ప్రయత్నించిన నేనే దూరం పెట్టాను. ఇప్పుడే అర్ధం అవుతుంది ఆవిడ విలువ ఏంటో’, గొంతులో సన్నని జీర ధ్వనించింది స్వప్న కంఠంలో.
‘బాధపడకు స్వప్నా ...అమ్మ అన్ని అర్ధం చేసుకోగలదు. తనకు నువ్వు అంటే ప్రాణం. బహుశా నీకు గుర్తుండే ఉంటుంది. మనం ప్రేమించి, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సుమారు ఓ ఆర్నెల్లు కష్టపడి వారిని ఒప్పించి మన పెళ్లి చేసింది అమ్మే.’
‘అవును అభి ...ఈ రోజు నుంచి మనిద్దరం ‘ఇగో’ ని వదిలి గోయింగ్, గ్రోత్ మీద దృష్టి పెడదాం. అది ఉద్యోగపరంగాను , కుటుంబపరంగాను కూడా ‘, అంది స్వప్న.
‘ఇగో ఈర్ష్యను సృష్టిస్తుంది ...
కానీ ఆశావాద దృక్పథం ఆనందాన్ని సృష్టిస్తుంది...
ఎలా ఉంది నా సాహిత్యం?’ చిలిపిగా నవ్వుతూ ప్రశ్నించాడు అభి.
‘సాహిత్యం ఏమోగాని మహాశయా...కాస్త చూసి నడపకపోతే శివసాయుజ్యమే మనకు గమ్యం అవుతుంది’, అంది మాటకు మాటగా స్వప్న.
కార్ ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేస్ కి రావడంతో వారి మాటల ప్రవాహానికి కూడా బ్రేక్ పడింది ఆ రోజు.
* * *
‘తన ఇల్లేనా?’ అని అనిపించింది సులోచనకు. ఎప్పుడు ఇల్లు అంతా తాను సర్దడం, దాన్ని చిందరవందరగా చేయడం...ఇదే జరిగే తంతు. అలాగే ఎప్పుడు తాను పొద్దున్న టీ ,కాఫీ ,భోజనాలతో సర్ది పంపడం ...కానీ ఈ రోజు దానికి వ్యతిరేకంగా జరుగుతుందేమిటబ్బా అని ఆశ్చర్యపోయింది ఆమె.
బాల్కనీలో కూర్చుని ఉత్సాహంగా తమ వంట తామే చేసుకుంటున్న కొడుకు,కొడల్ని చూస్తే ఆమె మనస్సు దానినో అద్భుతంగా చూసింది. ఇలాంటి రోజు ఎప్పటికీ కలే అనుకున్న తనకు అది నిజం చేసి చూపిన వారికి చూసేసరికి ఆమె మనసు సంతోషపు కెరటం అయ్యింది.
‘అత్తమ్మా కాఫీ’ అంటూ మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ అందించింది స్వప్న.
‘అమ్మా ...కాఫీతో కాంబినేషన్ గా ఈ స్పైసి ఫ్లెవర్ ట్రై చేయి ..’అంటూ కొడుకు ఇంకో పక్క ...ఆ తల్లి గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుంది.
ఆమె తిరిగి మాట్లాడేలోపే ‘అత్తమ్మా ...నువ్వు ఇంకో గంటలో చక్కగా రెడీ అయిపోవాలి. చకచకా నువ్వు టిఫిన్ చేసేస్తే మనం బయటికి వెళ్తున్నాం ఈ రోజు. సరేనా? టైమ్ లేదు. తొందరగా కాఫీ తాగేసి రెడీ అయిపోవాలి’, అంది ఆప్యాయంగా స్వప్న.
ఎందుకో మాటలు రావడం లేదు సులోచనకు. గంట తరువాత వారి కారు ఊరి బయట ఉన్న వృద్ధాశ్రమం దగ్గర ఆగింది.
‘ఒరేయ్ అభి ...నన్ను ఊరి చివర ఉన్న వృద్ధాశ్రమానికి నెలకోసారైనా తీసుకెళ్లారా ... అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది నాకు’ అన్న తన మాటలు గుర్తుకొచ్చాయి సులోచనకు.
స్నేహితులతో తనని ఆప్యాయతతో చూసుకుంటున్న కొడుకు, కొడలితో ఆ రోజు ఓ తీపి జ్ఞాపకం అయ్యింది సులోచనకు.
‘ఏమిట్రా ఈ అనూహ్య మార్పు?’ సులోచన అడిగింది కార్ లో అభిని.
‘అంత అనూహ్యం ఏమి లేదు అత్తమ్మా ...ఇన్నాళ్ళు మీరు వేరు, నేను వేరు అని అనుకున్నాను. కానీ అభి నా కళ్ళు తెరిపించాడు. సహకారం అందించాడు. ఇప్పుడు మనమందరం ఒక్కటే. మన కుటుంబం ఒక్కటే. ఒకరికొకరం సహకరించుకుంటూ, సలహాలు తీసుకుంటూ జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవాలని నిర్ణయించుకోవాలనుకున్నాను.
‘చాలా ఆనందంగా ఉంది స్వప్నా నాకు. ఇంత మంచి మనసున్న కూతురిని కోడలిని చేసిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.’
వారిద్దరిని చూస్తూ మొత్తానికి ‘ఇగో’ పోయి అసలైన ‘గోయింగ్ ఇన్ లైఫ్’ వచ్చింది అనుకున్నాడు హాయిగా మనసులో అభి.
* * *



Comments
Post a Comment