బానిస భయమే విధేయతా?

బానిస  భయమే విధేయతా? 
(విధేయన్ మలయాళం సినిమా)
 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 

సినిమాలలో  ఎన్నో వైవిధ్యాలు. కొన్ని సినిమాలు ఆ కాలానికి, సమయానికే వర్తిస్తే కొన్ని మాత్రం నిరంతర ప్రక్రియలకు దర్పణంగా నిలిచిపోతాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే  విధేయన్. మమ్ముట్టి, గోపకుమార్ ప్రధాన పాత్రల్లో, ఆదూర్ గోపాలకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేరళ రచయిత పాల్ జచారియా 'భాస్కర పట్టేలారమ్ ఎంటే జీవితావమ్'  నవలకు దృశ్య కల్పన. దీనిని రచయిత కర్ణాటక లోని శిరాడి గ్రామంలో ఉన్నప్పుడూ శేఖర  గౌడ్ పటేల్ గురించి విన్నదాన్నే ఈ నవలగా మలిచానని  పేర్కొన్నారు.దక్షిణ కర్ణాటకలోని యజమాని అతని సేవకుడి మధ్య ఉండే సంబంధమే ఈ నవాలాంశం.  దీనిని సంబంధం అనేకంటే  భయంతో ఏర్పడిన బానిసత్వం అని కచ్చితంగా చెప్పవచ్చు. 
తొమ్మి కేరళ నుండి కర్ణాటకలోని ఓ గ్రామానికి   వచ్చిన వలస కూలీ. అక్కడ భాస్కర్ పటేల్ కు మందు,మగువ అనేవి వ్యసనాలు. బలవంతంగా తనకు నచ్చిన ఆడవారిని అనుభవిస్తూ, మందు తాగుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఊరికి వచ్చిన తొమ్మి భాస్కర్ పటేల్ కంట పడతాడు. భాస్కర్ పటేల్ కు పొగడ్తలంటే మక్కువ. పక్కన ఉన్న నలుగురు జనం మెచ్చుకోలు కోసం, వారి ముందు తన గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు చూపించుకోవడం కోసం దౌర్జన్య పూరితంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలానే తొమ్మితో కూడా ప్రవర్తిస్తాడు. 
తొమ్మి భార్య ఒమనా. మొదట అవమానించినప్పుడు పటేల్ మీద విపరీతమైన కోపం తెచ్చుకున్న తొమ్మి తర్వాత అతన్ని ఏమి చేయలేని నిస్సహాయతలో ఉండిపోతాడు. పటేల్ తన భార్య ఒమనాను అనుభవించినా, అది ఆమెకు ఇష్టం లేకపోయినా భయం వల్ల భరిస్తాడు. తర్వాత పటేల్  తొమ్మికి,ఆతని భార్యకు  కొత్త బట్టలు ఇచ్చి అతన్ని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. అలా అప్పటి నుండి పటేల్ దగ్గర ఉండిపోతాడు తొమ్మి. 
భర్త అరాచకాలు గురించి తెలిసిన సరోజ ఎన్ని సార్లు పటేల్ కు మంచి చెప్పినా అతను వినిపించుకోడు. ఈ విషయాలు కొడుక్కి తెలియకూడదని దూరంగా ఉంచి చదివేలా ఏర్పాటు చేస్తుంది సరోజా.రోజురోజుకి పటేల్ అరాచకాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ ఊరిలో ఉన్న ఓ పెద్ద మనిషి కోడలును బలవంతంగా అనుభవిస్తాడు. ఆ ఊరికి తమ్ముడు తప్పిపోయాడని వచ్చిన ఓ వ్యాపారి  చావు దెబ్బలు కొడతాడు అహంకారంతో. ఇవన్నీ సరోజ దృష్టికి రావడంతో భర్తను మారమని మంచి వచనాలు చెప్తుంది. భార్య అలా చెప్పడం నచ్చని పటేల్ భార్యను హత్య చేద్దామనే నిర్ణయం తీసుకుంటాడు. 
ఈ విషయం తొమ్మికి చెప్పి, ఆ రోజు సరోజను భయటకు పిలవమని అదే సమయంలో గన్ ని శుభ్రం చేసే నెపంతో యాక్సిడెంటల్ గా పేలినట్టు చేసి ఆమెను చంపవచ్చు అనే పథకం చెప్తాడు. సరోజను అక్కలా భావించే తొమ్మి ఆ పని ఇష్టం లేకపోయినా సరే యాజమాని మాట కోసం అంగీకరిస్తాడు. అలాగే ఆమెను పిలుస్తాడు. ఆ తూటా గురి తప్పి తొమ్మికి తగులుతుంది. ఎలాగో చచ్చిపోతాడు కాబట్టి శ్మశానానికి తీసుకురమ్మని అంటాడు పటేల్. కానీ సరోజ పట్టు పట్టి హాస్పటల్ లో చేర్చి ఆతని ప్రాణాలు నిలబడేలా చేస్తుంది. ఒమనా ఇంటికి వెళ్ళి ఆ సమయంలో ఆప్తురాలిగా కూడా ఉంటుంది. 
అప్పటికే పటేల్ ని అంతం చేసే ప్రయత్నంలో ఉన్న ప్రత్యర్ధులు తొమ్మిని సాయం అడుగుతారు. తొమ్మి అంగీకరించినా ఆ తూటా గురి తప్పడంతో పటేల్ ప్రాణాలతో బయటపడతాడు. ఆ తర్వాత ఆ ఊరిలో ఉన్న దేవాలయంలో చేపలు పట్టడానికి తొమ్మిని కూడా వెంట తీసుకువెళ్తాడు. వ్యక్తిగతంగా అది ఇష్టం లేకపోయినా పటేల్ కోసం వెళ్తాడు తొమ్మి. ఆ తర్వాత సరోజను తను హత్య చేశానని దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి తొమ్మి సాయం అడిగి, అతనితో కలిసి ఆమె ఊరి పోసుకున్నట్టు చేసినా, దానిని ఎవరు నమ్మరు. సరోజ అన్నలు అతన్ని చంపడం కోసం వెంటాడుతుంటే అతనితో తొమ్మి కూడా ఉంటాడు. అతన్ని వారు హత్య చేసే వరకు తొమ్మి పటేల్ వెంటే ఉంటాడు. పటేల్ మరణించిన తర్వాత తనకు స్వేచ్చ వచ్చినట్టు భావించి సంతోషిస్తాడు తొమ్మి. 
విధేయత అనేది నమ్మకంతో వచ్చేది లేదా భయంతో జనించేది. అలా భయంతో పటేల్ పట్ల తొమ్మికి కలిగింది. అందుకే తనను చావు నుండి కాపాడకపోయినా, తన భార్యను అనుభవించినా, తనను అవమానించినా, తనకు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తున్నా సరే తొమ్మి ఆ భయంతోనే పటేల్ పట్ల అతను మరణించేవరకు విధేయత ప్రదర్శించాడు. 
ఇది ఓ పటేల్, అతని సేవకుడి మధ్య కనిపించే బంధమే కాదు. మన సమాజంలో తమ అధికార  ప్రదర్శన కోసం ఇతరులను తక్కువగా చూస్తూ ,వారిని భయపెట్టి తమ అవసరాలు తీర్చుకునే ప్రవృత్తి కలిగిన ప్రతి ఒక్కరి జీవనయానం. ఆ భయం నేటికీ సమాజంలో సజీవంగానే ఉంది. పటేల్ ,జమిందారీ లాంటి పదాలు మాయమయ్యాయి కానీ భయపడే వారి మనసుల్లో బానిసత్వం మాత్రం ఇంకా జీవించే ఉంది. కాలం మారితే సమస్యలు అంతమవ్వవు. వాటి రూపం మార్చుకుంటాయి అంతే. ఈ భయం వల్ల జన్మించే విధేయత కూడా అంతే. 
           *      *        *  

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ