లేచిందా ...నిద్ర లేచిందా ?

లేచిందా ...నిద్ర లేచిందా ?

-రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)


మొన్నా మధ్య టీవీలో ఏదో పాత సినిమా వస్తే చూస్తూ ఉన్నాను. సినిమా పేరు గుండమ్మ కధ. అందులో ఓ సీన్ లో కథానాయకుడు పప్పు రుబ్బుతుంటే కథానాయిక పక్కన నిలబడి ఉంది. ఈ లోపు ఓ పాట ఘోల్లుమంది.

‘లేచింది ....నిద్ర లేచింది మహిళా లోకం ...దద్దరిల్లింది పురుష ప్రపంచం.’ ఆ కధకు, ఆ పాటకు ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్ధం కాలేదు. కథానాయకుడు జీవన భృతి కోసం పనిలో భాగంగా పప్పు రుబ్బుతున్నాడు. ఈ విషయమే వేమన గారు, బ్రహ్మం గారు, వేదాలు చెప్పాయట.

మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ...ఈ విషయాన్ని పాటేసుకుని మరి చెప్పేశాడు ఆ కథానాయకుడు. మగవాడు పప్పు రుబ్బితే స్త్రీ నిద్ర లేచినట్టా ...? అసలే ప్రశ్నించే బుర్ర. ఒక దాన్నుంచి వంద ప్రశ్నలు పుట్టేస్తాయి.

చరిత్ర క్రమాన్ని తొలి నుంచి పరిశీలిస్తే మాతృస్వామిక వ్యవస్థ, పితృ స్వామిక వ్యవస్థ రెండు కూడా కాలం, పరిస్థితులని బట్టి ఉనికిలో ఉన్నాయి. అభిప్రాయాలు, అనుకూలతను బట్టి పేర్లలో మార్పులు ఉండవచ్చు. ఈ రెండు వ్యవస్థలు, రెండు రకాల శరీర తత్వ బేధాలు ,రెండు పార్టీలు ...ఇలా ఏది చూసుకున్నా ఒకటి ఇంకోదానికి ప్రత్యామ్నాయం అయితే కాదు. ఆ రెండు సహకార స్వరూపాలే.

స్త్రీ మాత్రమే వంట చేయాలని ఏ వంటపాత్ర మీద రాసి ఉంది? తల్లి అయ్యాక తనే అన్నీ బాధ్యతలు తీసుకోవాలని ఏ ఆడబిడ్డ నొసటి మీద రాసి ఉంది. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది ఓ లింగ భేద ప్రశ్న కాదు. ఓ జాతి పరిణామక్రమ ప్రశ్న. ఇది స్త్రీ వాదం కానే కాదు...ఇది కచ్చితంగా సమానత్వ అస్తిత్వ ప్రశ్న. మీరు ఒక ప్రశ్న సంధించవచ్చు. ఎప్పటినుంచో స్త్రీలలో అధిక శాతం వంట, ఇంటి బాధ్యత తీసుకుంటే పురుషుడు కుటుంబ పోషణ కోసం ఉద్యోగ బాధ్యత తీసుకున్నాడు. అధిక శాతం మంది స్త్రీలతో సహా దీనికి అంగీకరించినప్పుడు .... ఈ గోలంతా ఏమిటి అన్న ప్రశ్న ఉదయించవచ్చు!

దీని గురించి ఓ చిన్న కధ చూద్దాం. అనగనగా ఓ ఊళ్ళో కోడి కష్టపడి గుడ్లు పొదిగింది. ఆ గుడ్లలోకి ఎలా వచ్చిందో ఏమో ఓ గ్రద్ద గుడ్డు కూడా వచ్చి చేరింది. కొన్నాళ్ళకి చిట్టి పొట్టి కోడిపిల్లలు బయటికి వచ్చాయి. వాటితో పాటు గద్ద పిల్ల కూడా బయటికి వచ్చింది. మెల్లగా అది కూడా కోడిపిల్లల్లో కలిసిపోయింది. ఆకాశంలో గద్దల్ని చూసినప్పుడల్లా ... అబ్బా , ఎంత బాగా ఎగురుతున్నాయో ...అయిన నేను కోడి పిల్లను కదా ...ఎగరలేను అనుకునేది. మిగిలిన కధ చెప్పనవసరం లేదు.

పరిస్థితుల్ని ఎలా కల్పిస్తే అలా ప్రతిస్పందించడం ప్రతి జాతి సహజ లక్షణం. ఈ పరిణామ క్రమంలో కొన్ని పనులు స్త్రీనే చేయాలి అని ఎక్కడో ఓ చోట ప్రారంభమయిన సాంప్రదాయం క్రమంగా అన్నీ ప్రాంతాలకి, ఇళ్లకు పాకి ఉండవచ్చు.

ఆడవారు చేసే పనులు మగవారికి అప్పజెప్పి ఉంటే ....ఇప్పుడున్న పని, బాధ్యతలు తారుమారుగా ఉండేవి. ఇది దేవుడు రాసిన వ్రాత కాదు. ప్రకృతి ధర్మం అంత కన్నా కాదు. స్వతంత్రంగా ఆలోచించలేని, తటస్థ వైఖరి కలిగి ఉండే మనుషులందరిపైనా కొందరు తెలివిగా ప్రయోగించిన ఓ వింత సూత్రం. దీనికి ధర్మాన్ని ఆపాదించడం పెద్ద ఘోరం.

ఇకపోతే మనం మళ్ళీ పాటలోకి వచ్చేద్దాం. మహిళా లోకం మేల్కొల్పుకి , పురుష ప్రపంచానికి సంబంధం ఏమిటి? ఈ జీవితం ప్రతి ఒక్కరికి ఓ సుందర స్వప్నం. తమకు ఇష్టమైన ఆశయాల్ని సాధించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతిభే ఏ రంగంలోనైనా గీటు రాయి. మరి వ్యక్తి సామర్ధ్యాల తూకంలో లింగ వివక్ష ఎక్కడ నుంచి వచ్చింది? భిన్నమైన ఆలోచన రీతులు , శరీర తత్వాలు కలిగిన వారు స్త్రీ, పురుషులు.

కార్ల్ యూంగ్ (జంగ్ ) అనే మానసిక శాస్త్రవేత్త సనాతన సంకేతం అనే భావనను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ప్రకారం ఈ భావన రెండు రకాలు. స్త్రీ మూర్తి తత్వంలో కనిపించే పురుష సనాతన సంకేతం (పురుష స్వభావం ), పురుష మూర్తి తత్వంలో కనిపించే స్త్రీ సనాతన సంకేతం( స్త్రీ స్వభావం). అంటే ప్రతి మనిషి ... అది స్త్రీ అయినా, పురుషుడు అయినా తమ పరిస్థితులకి లోబడి ప్రవర్తించడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అలాంటి అంతర్లీన మనస్తత్వ కోణాన్ని పరిశీలించడం మానేసి...కొన్ని లక్షణాలని బహిర్ముఖంగా ఆపాదించడం ఎంత వరకు సబబు?

స్పృహలో లేకపోవడాన్ని నిద్ర అంటాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధుల్లో తమ బాధ్యతలు నిర్వర్తించకపోతే సృష్టి మనుగడే అసాధ్యం. కొన్ని ప్రత్యేక పనులతో కూడిన ఓ చిట్టా తయారు చేసి, అవి చేసేస్తే గొప్పతనాన్నిఆపాదించి...ఇంకొన్ని పనులని మామూలు పనులుగా వర్గీకరించడం ఏం భావసమానత్వం ? ఈ ఆలోచనల క్రమంలో అందరూ భాగస్వాములు కాకపోవచ్చు. ఆచరణ శైలికి మాత్రం అందరం సాక్ష్యులమే .

* * *




Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!