చిరుదివ్వె నీవైతే ....
‘నీ కవితలకేం? బాగానే ఉన్నాయిలే. ఏదో ఒక పత్రికకు పంపు, అచ్చు వేస్తారులే’,అన్నాడు రచనల సృష్టిలో తారలా వెలుగొందుతున్న ప్రముఖ రచయిత ప్రణీత్ ,వందనతో. ఉత్సాహం నిండిన ముఖంతో, అణువణువూ ప్రోత్సాహకరమైన స్పందన కోసం ఎదురు చూసిన వందన ఒక్కసారిగా డీలాపడిపోయింది. తను రాసిన పది పేజీల కవితలను పది సెకన్లలో తేల్చేసిన ప్రణీత్ వైపు మనస్సులోని నిరుత్సాహాన్ని నెలకు కుదేసి, మొహమంతా చిరునవ్వు పులుముకుని,’థ్యాంక్ యూ సర్! తప్పకుండా పంపిస్తాను’, అని చెప్పి బయటకు వచ్చేసింది వందన.
‘వందన! అయినా నీ కవితలు, రచనలు అద్భుతం. నీకు నువ్వే స్వయంగా ఏదో ఓ పత్రికకు పంపక, ఇలా ఈ ప్రముఖ రచయితల చుట్టూ తిరగడం ఎందుకు చెప్పు?’అంది వందన స్నేహితురాలు కల్యాణి.
‘నీకు తెలియదే...ఓ సారి ఇలాగే ఓ పత్రికకు పంపాను రెండేళ్ళ క్రితం, అది అచ్చవ్వలేదు,’అంది వందన.
‘సమయంతో పాటు నీ శ్రమ,ప్రయత్నాలు పెరగాలి వందనా, అయినా అది రెండేళ్ళ క్రితం సంగతి. నీ రచనాశైలి ఎంతో కొంత మెరుగుపడి ఉంటుంది ఈ రెండేళ్ళల్లో. దానితో పాటు నీ మీద నీకు నమ్మకం కూడా పెరగాలి.కానీ నువ్వు ఇలానే ఉండటం నాకు ఏమీ నచ్చలేదు వందనా’,అంది నిరుత్సాహంగా కల్యాణి.
‘నువ్వు చెప్పింది నిజమే కల్యాణి. కానీ పడిపోయిన ప్రతీసారి కెరటంలా పైకి లేవడానికి నా భయాలు అడ్డు వస్తున్నాయి. ఏదో ఇలా ప్రయత్నాలు సాగిపోని’, అంది వందన.
‘సర్లే! ఇంతకీ ఈయన ఏమన్నారు?’అని అడిగింది కల్యాణి.
‘ఏమంటారు? ఏదో పత్రికకు పంపిస్తే అచ్చేస్తారులే అని అన్నారు అంతే’, అంది నిర్లిప్తంగా వందన.
‘ఇంకా ఏమనాలి చెప్పు? అమ్మా నీ కవిత అద్భుతం. నాకివ్వు నేనే ఫెయిర్ చేసి నీ అడ్రస్ తో నీ పేరు మీద రాసి స్వయంగా ఎడిటర్ కి ఇస్తాను. ఇది కచ్చితంగా అచ్చు అవుతుంది. అమోఘం! అని అంటారనుకున్నావా?’ ఎగతాళిగా అంది కల్యాణి.
మొహం చిన్నబుచ్చుకుంది వందన.
‘సర్లే ఇల్లొచ్చేసింది. ఇక నే వెళ్తున్నా. ఒకవేళ అమ్మ అడిగితే మీ ఇంటికి వచ్చానని చెప్పు. సరేనా? ‘ అని అనేసి సమాధానం కోసం ఎదురుచూడకుండా ఇంటివైపు వెళ్ళిపోయింది వందన.
వందన పుస్తకాల పురుగు. మంచి సాహిత్య భాషని, ఆలోచనా శక్తిని సరస్వతీ దేవి నుండి పుణికిపుచ్చుకుంది. మ్యాగజైన్ మొదలుకుని పెద్ద గ్రంథం వరకు ఏది చదివినా అందులో ఉన్న ప్రత్యేకతలను అరక్షణంలో గుర్తించి, ఆ నైపుణ్యం తనలో ఎంత ఉందో బేరీజు వేసుకుని దానికి తగ్గట్టు సాధన చేస్తుంది. గొప్ప రచయిత్రి అవ్వాలని ఆమె కల. ఎంతోమంది ప్రముఖ రచయితల్ని కలిసి వారితో ఏ విషయం మీద అయిన చర్చించగల దిట్ట. కానీ ఎందుకో ఓ రకమైన న్యూనతాభావం ఆమెను వెంటాడుతూ ఉంది.
ఓ కళాకారుని మనసు ప్రోత్సాహం తప్ప మరేమీ కోరుకోదు. అదే మనస్ఫూర్తిగా లభిస్తే ఆత్మవిశ్వాసానికి సోపానం అవుతుంది. అది లోపించినప్పుడు కళాకారునిలోని ‘కళ’ కు ప్రేతకళ వస్తుంది. అదే వందనను ఆత్మన్యూనతకు అడుగు దగ్గరగా నిలబెట్టింది. ఇక తను ‘మంచి పాఠకురాలి’ స్థాయిలోనే ఉండిపోవడం ఉత్తమం అనిపించింది వందనకు.
ఆ రోజు ‘దశాబ్ద ఉత్తమ రచయిత’ పురస్కార వేదిక జరుగుతుంది. ఆ ఉత్తమ రచయిత వందనే. స్టేజీ మీదకు వచ్చి మాట్లాడమని నిర్వాహకులు కోరారు.
‘మేడమ్ ..మేడమ్ ..’అన్న పిలుపుతో ఒక్కసారి గతంలో నుండి వాస్తవంలోకి వచ్చి పడింది వందన. ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న ఆలోచనల నుండి బయటపడింది. ఇలా మాట్లాడటం,స్పీచ్ లు ఇవ్వటంలో ఆరితేరిపోయింది వందన.ఆ రోజు కూడా రచయితగా ఆమె జీవితంలో మైలురాయిగా మిగిలిపోయింది.
* * *
‘మీ కవిత నాకు మెయిల్ చేయండి. నేను రాసి ఎడిటర్ గారికి ఇస్తాను. ఒక్కసారి ఓ పత్రికలో అచ్చయితే మీరు రచయితగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు’,అన్నాడు శ్రీనివాస్, వందనతో ఫోన్ లో.
‘థ్యాంక్యూ సో మచ్ ...ఇప్పుడే మెయిల్ చేస్తాను’, అని ఫోన్ పెట్టేసింది వందన. వెంటనే మెయిల్ చేసింది.
తన కవిత చదివాక ఈయన ఏమంటాడో? గత చేదు అనుభవాలు ఆమె మనస్సును వీడటం లేదు. ఈయన కూడా పేలవంగానే మాట్లాడతాడేమో! శ్రీనివాస్ అప్పటికే తెలుగు సాహిత్యంలో ఓ ప్రముఖ రచయిత.
మెయిల్ చేసిన పది నిమిషాలకు ఆమె ఫోన్ మోగింది. ‘శ్రీనివాస్ సార్ ‘ అన్న పేరు స్క్రీన్ మీద వచ్చింది. ఎందుకో ఓ మూల భయం,మరోమూల ఉత్సాహం ఆమె మనస్సును ఆక్రమించింది.
‘హల్లో ‘అంది మెల్లగా.
‘హల్లో .. .నిజంగా మీ కవిత అద్భుతం. నేనే ఫెయిర్ చేసి రేపే పత్రికాఫీసులో ఇచ్చేస్తాను. కచ్చితంగా పబ్లిష్ అవుతుంది.చూడండి..’అన్నాడు శ్రీనివాస్.
‘నిజంగానా? థ్యాంక్యూ సో మచ్ సర్ ‘ఆనందంలో మాటలు కరువయ్యాయి వందనకు.
‘ఏమైనా మార్పులు చేయొచ్చా ?’అడిగాడు శ్రీనివాస్.
‘తప్పకుండా సార్ ‘నమ్రత తొణికిసలాడింది ఆమె స్వరంలో.
‘ఇంకా ఏమనాలి చెప్పు? అమ్మా నీ కవిత అద్భుతం. నాకివ్వు నేనే ఫెయిర్ చేసి నీ అడ్రస్ తో నీ పేరు మీద రాసి స్వయంగా ఎడిటర్ కి ఇస్తాను. ఇది కచ్చితంగా అచ్చు అవుతుంది. అమోఘం! అని అంటారనుకున్నావా?’ అని ఎగతాళిగా కల్యాణి అన్న మాటలు వందన మనస్సులో మెదిలాయి.
అప్పటి నుండి వందన వెనుదిరిగి చూసింది లేదు. శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఎన్నో కవితలు, రచనలు చేసింది. అవి ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేశాయి.
శ్రీనివాస్ లాంటి వ్యక్తులు అరుదు అని అన్పించింది వందనకు. ఎంతో మంది ప్రముఖ రచయితలు, గాయకులు, డైరెక్టర్ల దగ్గరికి ఆ కళాపాలు ఎంతో కొంత ఉన్న క్రొత్తవారు ప్రోత్సాహం కోసం రావడం సర్వ సాధారణం. తరువాత వారి దగ్గర నుండి కనీస ప్రోత్సాహం కూడా లభించకపోవటం కూడా సాధారణమే. కానీ ఓపికగా చదివి, తప్పుల్ని దిద్ది ఆయన తన పేరుతో పంపడం నిజంగా అద్భుతం అనిపించింది ఆమెకు.
‘నీ జీవితంలో ఓ గొప్ప వ్యక్తిని నీవు కలవాలంటే అంతకు ముందు కనీసం ఓ పది మంది పనికిమాలిన వాళ్ళను కలవాల్సి ఉంటుంది’ ,అన్న సూక్తిలోని నిజం అప్పుడు ఆమెకు బోధపడింది.
* * *
‘చిరుదివ్వె నీవైతే...ప్రపంచ వెలుగుకు స్పూర్తి నీవవుతావు ...’
జీవితంలో అన్నింటికన్నా గొప్ప విషయం మనం ఒక్కరమే అందలం ఎక్కడం కాదు. ఈ రోజు మనకి ఎన్నో కంపెనీల పేర్లు తెలుసు. కానీ అందులో పని చేసి, వాటి పేరు సార్ధకం అయ్యేలా చేసిన ఉద్యోగుల పేర్లు మనకు తెలియదు. కానీ వారందరి ఏకైక లక్ష్యం కంపెనీ పేరు అజరామరం అవ్వడం. అలాగే సాహితీలోకమే మన ‘కంపెనీ’ అయినప్పుడూ దానిలోని క్రొత్త నీరును ఆహ్వానించడం, చిరుదివ్వెలను వెలిగించడం ఏ కళాకారుడు అయినా ఆ కళ పట్ల పాటించాల్సిన కనీస బాధ్యత. అది మరచి ఎదుటి వారి ఎదుగుదలకు అడ్డుకట్ట వెయ్యాలనుకుంటే స్వాతికిరణం సినిమాలో ‘ముమ్ముట్టి’లా మిగిలిపోతాము.
‘స్వాతికిరణం సినిమా చూశావా?’అని అడిగాడు శ్రీనివాస్, ఏదో లోకంలో మునిగిపోయినట్టు ఉన్న ఆమెను.
‘చూశాను సార్ ...గురువైన ముమ్ముట్టి శిష్యుడి ఎదుగుదలకు అడ్డుపడి తానే అతని మరణానికి కారణమై చివరికి పశ్చాత్తాపపడినా పిచ్చివాడిగా మిగిలిపోతాడు’ అంది వందన.
‘వెరీ గుడ్. విత్తనం వెయ్యగానే మొక్క మొలవదు. దానికి దన్నుగా ఎరువు, నీరు కావాలి. అలాగే ఎంతమందికి నీవు ఆ దన్నుగా నిలబడగలవు అన్నదే నీ విజయానికి మూల స్తంభం అని గుర్తుంచుకో. నీలోని ఈ విస్తృత స్వభావమే నిన్ను జగమంత కుటుంబ భావనకు దగ్గర చేస్తుంది. మళ్ళీ బహుశా నిన్ను కలవలేకపోవచ్చు. ఇవే నా ఆఖరి మాటలు. నువ్వు సాహితీ శిఖరాగ్రాన్ని త్వరలోనే చేరుకోవాలని కోరుకుంటూ వీడ్కోలు తీసుకుంటున్నాను మిత్రమా’ అన్నాడు శ్రీనివాస్. ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి వందనకు.
తన జీవితంలోని చివరి అంఖాన్ని ఓ ప్రశాంతమైన ప్రపంచంలో గడపటానికి వెళ్ళిపోతున్న శ్రీనివాస్ ని చూసి ఓ మూల ఆనందపడుతున్నా మరో మూల ఓ నిజమైన స్నేహితుడిని కోల్పోతున్నందుకు బాధపడింది వందన.
పాత జ్ఞాపకాల నుండి బయటపడి కొన్ని వేల చిరుదివ్వెలను వెలిగించడానికి తెరదించింది వందన. తనకొచ్చిన వందలాది మెయిల్స్ కవితలు, రచనలు పంపిన వేల మంది అభిమానుల రచనలు పరిశీలించి సూచనలు, సలహాలతో ప్రపంచ వెలుగుకు స్పూర్తి అవ్వడానికి తనను తాను మరింత సిద్ధం చేసుకుంది వందన ఆ పయనంలో.
* * *
స్పూర్తి మనిషిని తారాజువ్వలా పైకి తీసుకువెళ్తుంది. ఆ స్ఫూర్తికి మూలం వెన్ను తట్టి ప్రోత్సహించే ఓ ఆలంబన. మన జీవితంలో మనకు ఎంతోమంది తారసపడుతుంటారు. కళను నైపుణ్యమనే తపస్సులో ఉషస్సును చేసి ‘గుర్తింపు’ అనే సూర్యకిరణం కోసం ఎదురు చూసే కళాకారులెందరో. వారికో చిన్న మాట, ఓ మంచి స్పందన వేయి ఏనుగులెక్కిన సంబరాన్నిస్తాయి. ఇవ్వడంలో ఇంత ఆనందాన్ని పంచగలిగినప్పుడు ఆ అనుభూతిని ఆస్వాదించడం వరం కాదు!
* * *



Comments
Post a Comment