యూనిఫామ్ ఖాకీ కాకపోతే ఏంటీ?

యూనిఫామ్ ఖాకీ కాకపోతే ఏంటీ?

(కన్నడ నియో నోయర్ థ్రిల్లర్ కవలుదారి-క్రాస్ రోడ్స్ )

-రచనశ్రీదత్త(శృంగవరపు రచన) 



సినిమాల్లో ఏదో రకమైన కొత్తదనం ఉంటేనే ఓ మంచి సినిమా చూసామనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.అటువంటి కొత్తదనాన్ని ఓసారి పాతశైలిని మళ్ళీ ప్రవేశపెట్టడం కూడా కావచ్చు. 1940-50 ప్రాంతాల్లో హాలివుడ్ క్రైమ్ సినిమాలకు  'నోయర్ ఫిల్మ్ ' అనే టెక్నిక్ ను అవలింబించేవారు. దీని అర్థం 'డార్క్ ఫిల్మ్ ' అని.ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందాక దానికి కెమెరా యాంగిల్స్ ,విజువల్స్ వంటి సినిమాటోగ్రఫీ సాంకేతికతతో నియో నోయర్ థ్రిల్లర్స్ గా రూపొందిస్తున్నారు. దీనిలో మంచి-చెడు,తప్పు-ఒప్పు,నీతి-అవినీతి లేదా పగ వంటి అంశాలను కెమెరాలోని వివిధ యాంగిల్స్ లో బ్లర్డ్ లైన్లుగా లేదా డార్క్ యాంగిల్స్ తో ఛాయాగ్రహణంలో ఓ టెక్నిక్ గా వాడుతున్నారు. ఇలా  నియో నోయర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన కన్నడ సినిమానే కవలుదరి.దీనర్థం క్రాస్ రోడ్స్ అని.

శ్యామ్ అనే ట్రాఫిక్ పోలీసుకి ఎలా అయినా క్రైమ్ బ్రాంచ్ కి ప్రమోట్ అయ్యి,కేసులు ఇన్వెస్టిగేషన్ చేయాలనే బలమైన కోరిక ఉంది.ఓ రోడ్ వైడెనింగ్ ప్రాజెక్టులో మూడు పుర్రెలు బయటపడతాయి. దానిని మామూలు కేసుగా సంబంధిత పోలీసులు క్లోజ్ చేసినా ఆసక్తితో శ్యామ్ దాన్ని సాల్వ్ చేయాలనుకుంటాడు.

ఆ కేసు ఫైల్ చదువుతాడు. ఆ పుర్రెలను గురించి వచ్చిన రిపోర్టులో ఒకటి 32 ఏళ్ళ మగ మనిషిదని,ఇంకొకటి 25 ఏళ్ళకు పైబడిన మహిళదని,ఇంకొకటి పదేళ్ళ పాపదని తెలుస్తుంది. వారిది ఆత్మహత్య కాదని హత్య అని కూడా తెలుస్తుంది. ఆ కేసు విషయమై అనుకోకుండా లాకప్ న్యూస్ పేపర్ ఎడిటర్ కుమార్ ని కలుస్తాడు శ్యామ్ .

ఆ కేసు ఫైలు ద్వారా ఆ కేసును ముత్తన్న అనే పోలీస్ అధికారి40 సంవత్సరాల క్రితం డీల్ చేశాడని,ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కి చెందిన అధికారి గురుదాస్ నాయుడుకి 80-90 లక్షల విలువలు చేసే బంగారం ఆర్కియాలజీ తవ్వకాల్లో బయటపడటం,సుధాకర్ అనే అధికారి దగ్గర తాళాలు ఉండటంతో వాటి కోసం నాయుడే హత్య చేసి ఉంటాడని,ఆ ఇంట్లో వారిని విచారించగా ఆ రాత్రి నాయుడు కారులో బయటకు వెళ్ళడం చూసామని చెప్పడం,వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా ఆ రాత్రే కుటుంబంతో సహా పారిపోయాడని,కానీ ఆ కారు ప్రమాదానికి గురవ్వడం వల్ల మరణించారని ఆ కేసు ఫైల్ లో ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళకు మరో కొత్త సాక్ష్యం వల్ల కేసు రీ ఓపెన్ చేయాలనుకుంటున్నానని పిటీషన్ పెట్టిన ముత్తన్న తన భార్యా,పిల్లలు యాక్సిడెంట్ లో మరణించడంతో అప్పటినుండి జాబ్ నుండి వాలంటరీ రాటైర్ మెంట్ తీసుకుని,మందులో మునిగిపోతాడు.ఆ కేసు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ ముత్తన్నను కలవాలని నిర్ణయించుకుంటాడు శ్యామ్ .

లాకప్ ఎడిటర్ కుమార్ ముత్తన్న ఇంటి చిరునామా చెప్తాడు. మొదట్లో నిరాకరించినా ముత్తన్న కేసు విషయంలో సాయం చేయడానికి ఒప్పుకుంటాడు.వారిద్దరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కాబోతున్న మైలూరి శ్రీనివాస్ కి దీనికి సంబంధం ఉందని తెలుస్తుంది.అతనే గురుదాస్ నాయుడు దగ్గర డ్రైవర్ గా చేసిన ఫెర్నాండేస్ అని ముత్తన్న తెలుసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా శ్యామ్ మైలూరి శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్తాడు. అదే సమయంలో మైలూరి శ్రీనివాస్ ముత్తన్నని అతని ఫార్మ్ హౌస్ లోని బంధిస్తాడు.అప్పుడు నిజాలు చెప్తాడు ఫెర్నాండేస్ .ఆ రోజు కారులో గురుదాస్ నాయుడు బంగారం గురించి చెప్పినప్పుడు ఆశ కలిగిందని చిన్ననాటి నుండి ఉన్న పేదరికం వల్ల ఆ బంగారం కోసం తానే చంపించానని ఆ కుటుంబాన్ని,సుధాకర్ ని కూడా అని చెప్తాడు. ఆ ఇంట్లో వారికి సాయంగా ఉంటున్న బబ్లూ అనే యువకుడికి కూడా డబ్బు మీద ఆశ కలిగించి,వారు తినే దాంట్లో నిద్రమాత్రలు అని అతనికి చెప్పి విషం ఇచ్చానని చెప్తాడు. అలా వారు చనిపోయాక,కారు తగులబెట్టి మైలూరి శ్రీనివాస్ గా మారానని,ఆ బబ్లూ మాత్రం లాకప్ ఎడిటర్ కుమార్ గా మిగిలిపోయాడని చెప్తాడు. తర్వాత ముత్తన్నను గన్ తో షాట్ చేస్తారు అతని మనిషి.శ్యామ్ వచ్చినప్పటికీ అంబులెన్స్ హాస్పటల్ కి సకాలంలో ట్రాఫిక్ వల్ల వెళ్ళకపోవడం వల్ల ముత్తన్న మరణిస్తాడు.

శ్యామ్ కుమార్ ప్రాణం ప్రమాదంలో ఉందని అప్పటివరకు కాపాడుతూ ఉంటాడు.కానీ అతని ఆఫీసు వెతికినప్పుడు బయటపడిన వాచ్ మీద బబ్లూకి అది గురుదాస్ నాయుడు ఇచ్చిందని అర్థమవడంతో కుమార్ ని బెదిరిస్తే చెప్తాడు. కుమార్ ద్వారానే అదే విషం ప్రసాదంలో ఇప్పించి మైలూరి శ్రీనివాస్ ని చంపిస్తాడు కుమార్ ,ఇంత జరిగాక కూతురికి మొహం చూపించలేక అదే విషం తిని మరణిస్తాడు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే గురుదాస్ నాయుడు ఆ రాత్రి రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తిని హాస్పటల్ లో చేర్చి కాపాడతాడు,అతనే శ్యామ్ తండ్రి.చివరకు శ్యామ్ ఒంటి మీదకు ట్రాఫిక్ వైట్ షర్ట్ మారి,ఖాకీ షర్ట్ వస్తుంది. అలా సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాని కాలక్షేపం కోసం చూడలేము.ఒక కోణంలో ఆలోచిస్తే ఇల్లాజికల్ గా అనిపిస్తుంది,ఇంకో కోణం నుండి ఆలోచిస్తే అద్భుతంగా అనిపిస్తుంది.ఏకాగ్రతతో చూస్తే తప్ప సినిమాలోని నోయర్ గొప్పతనాన్ని ఆస్వాదించలేము. సినిమాలోని నరేషన్ అద్భుతంగా ఉంది. ప్రతి పాత్రను కనక్ట్ చేయడం లో చాలా ప్రతిభను ప్రదర్శించాడు డైరెక్టర్ .సినిమాలోని ఓ వైవిధ్యాన్ని ఆస్వాదించాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

        *    *     *  

 

             

 

 

 

 

             

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!