ఆ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మారితేనే .....

ఆ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మారితేనే .....
                             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒత్తిడి లేని ఉద్యోగం అని, సుఖంగా ఇష్టానుసారంగా చేసుకోవచ్చనే అభిప్రాయం ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొందరి నిర్లక్ష్య ధోరణి వల్ల సమాజంలో అభిప్రాయం ఏర్పడింది. అటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓ విభాగమే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా. 
విద్య నేటి సమాజంలో పుట్టిన ప్రతి మానవ జీవికి ఓ ప్రాథమిక అవసరం. అంతే కాకుండా అది ఓ హక్కు కూడా. మన భారతీయ సంస్కృతిలో టీచర్ ని దేవుడిగా కొలిచే సంస్కృతి ఉంది. దానికి కారణం వారు తమ కర్థ్యవ్యాన్ని మించి విద్యార్ధులను తమ బిడ్డలా భావించి వారి కోసం శ్రమించడమే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తిని అంకిత భావంతో స్వీకరించకుండా కేవలం  మొక్కుబడిగా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించే ఉదంతాలు ఎన్నో ఇప్పటికీ దేశవ్యాప్తంగా మన దృష్టికి వచ్చాయి. 
అటువంటి బాధ్యతారాహిత్య ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రశ్నించే సినిమానే జ్యోతిక నటించిన తమిళ సినిమా రాక్షసి. ఇది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులనే కాదు, తమ పిల్లల పట్ల బాధ్యత తీసుకొని తల్లిదండ్రులను, విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను, చదువుకోవాల్సిన పిల్లలను బాల కార్మికులుగా మారుస్తున్న కొందరు స్వార్ధపరులను కూడా  గట్టిగా హెచ్చరించే స్వరంలో ప్రశ్నించిన సినిమా ఇది. 
తమిళనాడులోని  పొత్తూరులో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలోని లోపాలను, దానికి కొత్తగా హెడ్ మాస్టర్ గా వచ్చిన గీతా రాణి (జ్యోతిక) తన ధైర్యంతో ఎలా ప్రైవేట్ పాఠశాలల శక్తులను కూడా ఎదిరించి మార్చింది అన్నదే  ఈ సినీ కథాంశం. 
ఆ ప్రభుత్వ పాఠశాలలో అప్పటిదాకా  ఏహెచ్ ఎమ్ తప్ప హెచ్ ఎమ్ లేరు. ఆ ఏహెచ్ ఎమ్  తను హెచ్ ఎమ్ అవ్వడానికి ఎవరిని రాకుండా చూస్తూ ఉంటాడు. అప్పటికే  బి ఎడ్ చేసి ఆర్మీలో పని చేసిన గీతా పట్టుబట్టి మరి అదే స్కూల్ కి హెడ్ మాస్టర్ గా వస్తుంది. వచ్చి రావడంతోనే  జీతాలు మాత్రం తీసుకుంటూ, రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న టీచర్స్ కి వార్నింగ్ ఇవ్వడంతో మొదలుపెట్టి ,టీచర్స్ అందరూ అప్ డెటెడ్ గా ఉండాలని వారిని సంసిద్ధం చేసే వరకు ఆమె ఎక్కడా కూడా రాజీపడదు. అలాగే విద్యార్ధులకు ఆసక్తి కలిగేలా ప్రేయర్ లో వార్మ్ అప్ డ్యాన్స్ వంటివి పెట్టడం, సండే బాక్స్ పేరుతో ప్రతి విద్యార్ధిలో ఉన్న కళను ప్రదర్శించే అవకాశం ఆదివారం ఇవ్వడం వంటి చర్యలు కూడా రోజుల్లో చేస్తుంది. అలాగే తల్లిదండ్రులతో మీటింగ్ పెట్టి ఆ స్కూల్ లో బాలికల కోసం టాయ్ లెట్ వంటి వాటి కనీస అవసరాల నిర్మాణం కోసం చందాలు స్వీకరించడం తద్వారా వారిలో కూడా స్కూల్ అనేది అందరి బాధ్యత అనే స్పృహ కలిగించడం, స్కూల్ ఫండ్స్ గురించి ప్రశ్నించి రోజుల్లోనే స్కూల్ రూపు రేఖల్ని మార్చేస్తుంది. 
అలాగే పిల్లల్లో ఉన్న మతం అనే భావనను తొలగించడం కోసం వారి చేతులకు ఉన్న మత  సంబంధమైన తాడులను కాల్చేస్తుంది. దానితో పెద్ద గొడవైనా ధైర్యంగా ఎదిరిస్తుంది. తొమ్మిదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్ధులు బాలకార్మికులుగా మారారని తెలుసుకున్న ఆమె వెంటనే వారిని పాస్ అని ప్రకటించి ఆ 82 మంది విద్యార్ధుల బాధ్యతను తాను స్వీకరించి వారిని పదో తరగతికి ప్రమోట్ చేస్తుంది. 
ఈ విషయంతో ఆమెను అరెస్ట్ చేయిస్తారు అక్కడి ప్రైవేట్ పాఠశాల యాజమాని. అప్పుడు ఆమె కోసం స్కూల్ యావత్తు వస్తుంది. ఆ 82 మందిలో 79 మంది పదవ తరగతిలో పాసవ్వడంతో ఆమెను విడుదల చేస్తారు. ఆమె పట్టుబట్టి అక్కడికే రావడానికి కారణం ఆమె ప్రేమించిన వ్యక్తి తో కలిసి స్కూల్ గురించి కళలు కనడం కానీ అతను మరణించడంతో ఆ ఆశయాన్ని బ్రతికించడం కోసం. ఇది  సినిమా కథ. 
కానీ ఈ సినిమా మీద ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. తమిళనాడు టీచర్స్ అసోసియేషన్ ఈ సినిమా ప్రభుత్వ ఉపాధ్యాయులను నెగటివ్ గా చూపించినందుకు బ్యాన్ చేయమని డిమాండ్ చేసింది. దానితో పాటు చెన్నై సిటీ కమిషనర్ ని కలిసి స్టే ఆర్డర్స్ సినిమాలోని వివాదాస్పద సీన్ల పట్ల జారీ చేయాలని కూడా డిమాండ్ చేసింది. కానీ ఎన్నో అవార్డులు కూడా ఈ సినిమా పొందింది. 
దీని దర్శకులు గౌతమ్ రాజ్ ఈ సినిమాతో  దర్శకులుగా పరిచయమాయ్యారు. కానీ మొదటి సినిమాతోనే తను చెప్పదలుచుకున్న అంశాల్ని ఘాటుగానే చూపించారు. ఏది ఏమైనప్పటికి ఇలాంటి వారు ఉన్నారన్నది నిజం. ఆ కొందరు మారితేనే విద్య పట్ల ,ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవం పటిష్టంగా ఉంటుంది. 
         *      *      *  

Comments

  1. చాలా మంచి పోస్టింగ్. చేస్తున్నంత కాలం శ్రమలాగా ఉంటుంది కానీ చేరకముందు, రిటైర్ ఐన తరువాత తెలుస్తుంది. ఎంత పవిత్రమైన ఉద్యోగమో అని, భగవంతుడు ఎంత మంచి అవకాశము ఇచ్చాడొకదా అని, అందుకోసము భగవంతుడిని తలసుకోని క్షణముండదు. శ్రమ అన్నది మామూలే. ఉద్యోగముకదా., కాకపోతే చదువులుకన్నా రికార్డు work ఎక్కువైపోయినప్పుడు అసంతృప్తి సహజమే. నమస్కారం.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది యదార్ధం. ఓ సంవత్సరం నేను కూడా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పని చేశాను. పిల్లలతో గడిపే దానికన్నా టీచర్స్ కు అదనపు పనులు పురమాయించడం, బాసిజం వంటివి చూశాక ,అందులోనూ బీటెక్ చదవగానే మొదటిసారి వృత్తి జీవితంలో ప్రవేశించడం,బాల్యం నుండి అందరూ నువ్వు మంచి టీచర్ గా ఉండగలవు అన్న ప్రేరణ తో చేరినా, టీచర్లకు ఆ స్కోప్ తగ్గించి ,మానవ స్పర్శ విద్య కన్నా డిజిటల్ పేరుతో విద్యార్ధుల్లో యాంత్రిక ప్రవృత్తి రూపొందేలా చూడటం వంటివి చూశాక మానేశాను. కానీ సంతృప్తి ఉన్నా , టీచర్స్ కు ఆ స్వేచ్చ ఉండే చోట పని చేయటం బావుంటుంది అనిపించింది. ఆ తర్వాత జర్నలిజం పాఠాలకు గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళినప్పుడు పిల్లల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. మీరు చెప్పింది సత్యం. మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

      Delete
  2. చాలా మంచి చిత్రం.ఉన్నతంగా ఉపాధ్యాయులను చూపించటమే తప్ప ఇందులో కించ పరచిందైతే లేదు.తల్లిదండ్రులలో,నిర్లక్ష్య వైఖరి పెరిగిన ఉపాధ్యాయులనే తప్ప,మనఃస్ఫూర్తిగా పనిచేసే ఉపాధ్యాయులకిది మంచి చిత్రమే.

    ReplyDelete
    Replies
    1. మీరు సినిమాను అర్ధం చేసుకున్న దృక్కోణం ఉన్నతంగా ఉంది. ప్రతి వృత్తిలోని భద్రతా ఎక్కువగా ఉన్నప్పుడూ కొందరిలో కచ్చితంగా నిర్లక్ష్య ధోరణి ప్రవేశించే ఆస్కారం ఉంది. ఆ కొందరి నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు బలి అవుతారు. మీరు అన్నట్టు మనఃస్పూర్తిగా పని చేసేవారికి ఇది మంచి చిత్రమే.

      Delete

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!