సాధికారత వట్టిమాటేనా!

సాధికారత వట్టిమాటేనా!

       -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)

  రాత్రి ఒంటిగంటప్పుడు తన పెదవులకు ఏదో తగిలినట్లనిపిస్తే చప్పున నిద్ర నుంచి లేచి చూసింది ఆమె.ఒకతను ఆమెను ముద్దు పెట్టుకోబోతున్నాడు.ఆమె అతడిని గట్టిగా  పట్టుకుని, చెయ్యి మెలితిప్పుతూ, లైటు వేసి బోగిలోని మిగతా ప్రయాణికుల్ని అలర్ట్ చేసింది.'ప్లీజ్ ...దీన్ని ఇష్యూ చేయకండి',అని అతను బ్రతిమాలుతున్నాడు.

    ఇదంతా గమనిస్తూ కూడా బోగీలోని ఒక్కరూ కూడా ఆమెకు అండగా రాలేదు.అతడిని ఏమీ అనలేదు! చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోయారు.చివరికి అతడిని పోలీసులకు అప్పగించడం జరిగింది.

   తెల్లారే మీడియాకు విషయం చెబుతూ, ఆమె ఎంతో బాధపడింది. ఇదే విషయాన్ని నేను ఫేస్ బుక్ లో పెట్టి ఉంటే 'ఐయామ్ విత్ యూ' అని కామెంట్లు పెట్టేవారు.వాళ్ళ డిస్ ప్లే పిక్ లను కూడా నాకు మద్ధతుగా మార్చుకునేవారు కానీ ఇదంతా సోషల్ మీడియా వరకేనా?నిజ జీవితంలో ఎవరూ బాధితులకు అండగా నిలబడే ధైర్యం చేయలేరా? రాత్రి జరిగిన ఘటన ఈ సమాజం పైన నాకు నమ్మకాన్ని పొగొట్టింది' ఆవేదన చెందింది ఆమె.ఆమె ఎవరో కాదు మళయాళీ సినీ నటి సమాష. సమాజంలో ఓ "సెలబ్రిటీ స్టేటస్‌' ఉన్న ఓ మహిళ ఎదుర్కొన్న చేదు అనుభవం ఇది. తమను ఇబ్బంది పెడుతున్నా పరువు,మర్యాదలకు భంగం వాటిల్లుతుందేమో అని భయపడే రోజుల నుండి నిర్భయంగా సమాజానికి వెల్లడిస్తున్న స్థాయికి మగువ ఎదగడం నిజమైన స్త్రీ సాధికారతకు నిదర్శనమా? లేక ఆమె నిర్భయంగా అడుగులు ముందుగా వేస్తున్నా సంఘం అమెతో కలిసి ఒక్క అడుగు వేయడానికి కూడా సిద్ధంగా లేకపోవడం స్తంభిస్తున్న సమాజ స్పర్శకు చిహ్నమా?

          ఆమెకు మేనత్త ఓ సంబంధం తీసుకుని వచ్చింది. బాగా ఆస్తిపరులు,అబ్బాయికి సర్కారు కొలువు. బంధువుల పెళ్లిలో అమ్మాయిని ఆ అబ్బాయి చూశాడు. మనసు పారేసుకున్నాడు. ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు.అదీ ఆ మేనత్త రాయబారం. పెళ్ళి వయసా దానిది? సమస్యే లేదు” పిల్ల తండ్రి కళ్లెర్రజేసాడు చెల్లి మీద. అయినా ఆమె ప్రయత్నం వీడక తన తల్లి ద్వారా విషయాన్ని ముందుకు కదిల్చింది. 'నువ్వు కట్నకానుకలిచ్చే పరిస్థితుల్లో లేవు. దాని వెనుక ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారసుడి కోసం ముగ్గురు ఆడపిల్లలను కంటివి. ఈ ముగ్గురికీ చదువులు, కట్నాలు ఇచ్చి పెళ్లి చేయగల స్థితిలో ఉన్నావా? నా మాట విని చెల్లెలు తెచ్చిన సంబంధానికి సరే అను' అని పోరింది అమ్మాయి నాన్నమ్మ. మొత్తానికి బలవంతంగా ఆ తండ్రి ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌తో కూతురిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు. కళ్లనిండా నీళ్లతో తలవంచి తాళి కట్టించుకుంది ఆ అమ్మాయి. భవివ్యత్‌ కలలు, లక్ష్యాలన్నిటినీ పమిట చెంగుకు కట్టేనుకొని మౌనంగా కావురానికి బయలుదేరింది. ఏమి తెలియని అ అమ్మాయిని ఏవేమో అడిగాడు ఆమెకన్నాసగం వయసు ఎక్కువ ఉన్న భర్త. బిక్క మొహం వేసింది ఆ అమ్మాయి. కొట్టాడు, భరించింది. కాపురం చేయడం చేతకాదని చీత్కరించాడు అంటే ఏంటో అర్ధం కాని ఆ అమ్మాయి తప్పు తనదే కావచ్చని నోర్మూసుకుంది.

దాదాపు రోజూ లైంగికంగా దాష్టికమే. పెళ్లయి అర్నెల్లయినా గర్భం రాలేదని అత్తగారి పోరు ప్రారంభమైంది. ఆ వంకతో అత్త, భర్త చేయిచేసుకున్నారు.మనసుకు, శరీరానికి తగిలిన గాయాలతో పుట్టిల్లు చేరింది.

           ఆ అమ్మాయిని చూసి తల్లి మనసు తరుక్కుపోయింది. ఇక్కడ మళ్లీ మేనత్త, నానమ్మ పెత్తనం తీసుకుని “అత్తింట్లో అవన్నీ మామూలే, సర్దుకోవడం నేర్పించు పిల్లలకు” అని అమ్మాయి తల్లికి చెప్పి, ఆ అమ్మాయిని తిరిగి అత్తింటికి పంపించారు. అక్కడా షరా మామూలే. ఈసారి పిల్లలు పుట్టడం కోసం మందులు, మాకులు ఇప్పిస్తామని నాటువైద్యుల చుట్టూ తిప్పారు. పిల్ల ఆరోగ్యం చెడిపోయింది. పుట్టింటికి పంపారు. అరునూరైనా సరే వెళ్లనని భీష్మించుకుంది ఆ అమ్మాయి చదువుకుంటానని తండ్రి కాళ్లు పట్టుకుంది. తల్లిదండ్రులకు బిడ్డ పరిస్థితి అర్ధమైంది. కోర్టుకు వెళ్లాలనుకున్నారు. బాల్యవివాహం కింద వీళ్లకూ అక్షింతలు పడతాయని బంధువుల్లో ఒకరు వారించడంతో కుల పెద్దలను కూర్చోబెట్టి సమస్యను పరిష్మరించుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అత్తింటికి వెళ్లకుందా కాలేజీకు వెళ్లడం మొదలుపెట్టింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఎక్కడో మారు మూల పల్లెల్లో కాదు హైదరాబాద్‌లోనే.

          ఆడపిల్లలకు శారీరకంగానే కాదు మానసికంగా కూడా పరిపక్వత చాలా అవసరం. ఇప్పటి పిల్లలు చాలా ప్రేమగా పెరుగుతున్నారు. పద్దేనిమిదేల్లొచ్చినా ఇంకా అమ్మానాన్నను పట్టుకునే ఉంటున్నారు. పైగా అప్పటికి వారి చదువు ఇంటరే. లోకం తెలియని వయసు.

అంతేకాదు వాళ్ల జీవితంలోకి వచ్చేకొత్త వ్యక్తిని అంగీకరించలేరు. కాబట్టి 21 ఏళ్లు అనేది అమ్మాయిల పెళ్లికి సరైన వయసు. అప్పటికీ ఓ డిగ్రీ వస్తుంది. వాళ్ల జీవితాన్ని వాళ్లే నడుపుకునే శక్తి వస్తుంది. డిగ్రీ వరకు చదువుకుంటే పెళ్లి తర్వాత ఏవైనా సమస్యలు వచ్చినా ధైర్యంగా బతకగలరు. కాబట్టి కుటుంబపరంగా సమాజపరంగా.. పెళ్లికి సరైన వయను 21 అని ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

          ఓ వైపు ధైర్యంగా జీవితంలో నిలబడి విజయం సాధించిన మగువలకు సమాజం నిస్సహాయత, ఆ నిస్సహాయతను ఆయుధంగా మలచుకొనే కీచకుల నుండి ముప్పు ఇంకోవైపు కన్నవారే కసాయిలుగా మారి ఆడపిల్లల కలల్ని కన్నీబిగా మారుస్తున్న వైనాలు వెలుగులోకి వస్తున్నాయి. అడుగులు వనితలవైనా.. ముందడుగు సమాజానిది, కుటుంబానిది కూడా అయితే స్త్రీ సాధికారత అన్న పదం తన అస్థిత్వాన్ని వాస్తవంలో చూసుకోగలుగుతుంది.

  *    *  * 











Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ