స్పృహ

స్పృహ 

-రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)



ఆమెను చూసిన క్షణం నుండి ఆమె మా ఊహాలకు ప్రాణంగా మారింది. ఇదివరకు మేము ముగ్గురము కలిసినప్పుడు మా మధ్య చాలా విషయాలు దొర్లేవి. కానీ ఇప్పుడు అవేమీ గొంతు దాటి పెద్దగా రావడం లేదు. దానికి కారణం ఆమె. ఇదివరకు ఆఫీసు ఎప్పుడు ఖాళీగానే ఉండేది. మేము ముగ్గురం ఆఫీస్ లో కలుసుకునేది కూడా తక్కువే. బయట కలుసుకున్న దాదాపు అది మందు కొట్టడానికే అయ్యేది.

ఇదివరలో మాకు డ్రస్సింగ్ గురించి కూడా పెద్ద పట్టింపు కూడా ఉండేది కాదు. ఇన్ షర్ట్ చెయ్యడం మానేసి దాదాపు పది సంవత్సరాలు అయిపోతుంది. యాభైల్లో ఉన్నాం కదా!అందుకేనేమో దానికంత ప్రాధాన్యత ఇవ్వలేదు.

కానీ ఆమె వచ్చాక మా వయసు మర్చిపోయాము. పై నుంచి కింది వరకు డ్రస్సింగ్ విషయంలో మేము చూపుతున్న శ్రద్ధ చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. పది అయితే కానీ మంచం దిగని మేము ఏడింటికల్లా లేచి తయారయ్యి పరుగులు పెట్టుకుంటూ తొమ్మిదికల్లా ఆఫీస్ కు చేరుకుంటున్నాము. ఎందుకంటే ఆమె ఎనిమిదిన్నరకే ఆఫీస్ కి వచ్చేస్తుందిగా!

రాజు ,చంద్ర ,నేను ముగ్గురం కలిసి ఓ న్యూస్ వెబ్సైట్ ని ,యాప్ ని, మ్యాగజైన్ ని రెండేళ్ల క్రితం ప్రారంభించాం. ప్రపంచం అంతా డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ముగ్గురం జర్నలిస్టులము ,వార్తా పత్రికల్లో పని చేసిన అనుభవం ఉంది మాకు. కానీ ఎంతో పెట్టుబడి పెట్టి మొదలుపెట్టి ఓ మంచి ఆఫీస్ లో ఆర్భాటంగా సాగుతున్న ఆధునిక పోకడలను పట్టుకోలేకపోవడం మా లోపం. దానిలో వచ్చే లాభాలు పక్కన పెడితే దానికే మేము నజరాణాలు పెట్టాల్సి వస్తుంది. దానితో సంవత్సరానికే దానిపై శ్రద్ధ తగ్గిపోయింది.

మా ముగ్గురికి రెండు తరాలకి సరిపడ ఆస్తి ఉంది. ఏదో గుర్తింపు ,గొప్ప పేరు రావాలన్న తపనతో పెట్టినవే తప్ప అది మా భుక్తి కాకపోవడం వల్ల క్రమేపీ మా ఆఫీస్ మాకు అప్పుడప్పుడు బార్ గానే మిగిలిపోయింది. వారానికొకసారి మొక్కుబడిగా ముగ్గురం ఆఫీస్ కి వెళ్ళడం, ఇంటి దగ్గరనుండే ల్యాప్ టాప్ లో ఏదో ఒక వార్త వెబ్సైట్లోను , మ్యాగజైన్ విషయానికి వస్తే నెల పని ఓ రెండ్రోజుల్లో పూర్తి చేయడం మాకు అలవాటు అయిపోయింది. రాబడి వాటిపై రాకపోయిన ఓ పత్రిక, వెబ్సైట్ ,యాప్ ఉన్నాయని చెప్పుకోవడం మాకో తృప్తి లెండి !

ఈ రెండేళ్లలో నేటి నాగరికతతో ప్రవహించే సత్తా ఉన్న జర్నలిస్టులు,రచయితల్ని ఉద్యోగులుగా తీసుకోవాలనే ప్రయత్నం కూడా చేశాం. కానీ యువత అయితే మాకు మరి పరిణతి చెందని వారి లాగాను, అనుభవం ఉన్నవారు మరి చాదస్తం ఉన్నవారిలాను అనిపించారు. అందుకే ఆ ఆలోచనను పక్కన పెట్టి ఏదో ఇలానే రెండేళ్లు గడిపేసాం.

కానీ ఇదే సమయంలో ఆమె మా ప్రపంచంలోకి వచ్చింది. ఆమెను మొదటిసారి కలిసినప్పుడు ఆమె వయసు గురించి మాలో మేము చాలా తర్జన భర్జన పడ్డాము. కానీ మాలో ఒక్కరం కూడా ఆమె సరైన వయసు కనిపెట్టలేకపోయాము. ఆమె సివీ చూశాక అవాక్కయ్యాం. ఆమె శరీర సౌష్టవంలో పరిణతి,ఆలోచనల్లో సంపూర్ణత, వీటికి తగ్గట్టు ఆమె ఒడ్డు పొడుగు చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె వయసు 30-35 సంవత్సరాల వయసు ఉంటుందని ఊహించాము. పరిణతి వయసుతో వస్తుందనే మా అభిప్రాయం ఆమెను చూడగానే తుడుచుకుపోయింది.

మొదటి రోజు ఆమె ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వచ్చినది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ కళ్ళల్లో ,ఆ మనిషిలో ఏ మూల బెదురు అన్నదే లేదు. గంటసేపు ఓ అమ్మాయి అనర్ఘలంగా పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతుంటే అచ్చెరువొందని మగధీరుడెవ్వడు! ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ముందు ఉన్నది మగ వాళ్ళు అనే స్పృహను ఆమె అసలు ఖాతరు చేయనే లేదు. చాలా పరిణతి చెందినట్టు అన్నీ అంశాల గురించి అందులోనూ మాకు కూడా అందని విషయాల గురించి మాట్లాడుతుంటే ...అందులోనూ మధ్య మధ్యలో ఇంగ్లిష్ లో అదరగొట్టేస్తుంటే ...ఇంటర్వ్యూ పానెల్ లో ఉండి కూడా ఆమెని ఏమి ప్రశ్నించలేకపోయాము. జీతం గురించి మాకో పట్టింపు ఉన్న ఆమెను వదులుకోవడం ఇష్టం లేక అప్లికేషన్ ఫారంలో ఉన్న ఎక్స్పెక్టెడ్ సాలరికి వెంటనే ఒప్పేసుకున్నాం.

ఆమె మాకెంతగా నచ్చేసిందంటే అతి తక్కువ సమయంలోనే ఆమె మా బిజినెస్ పార్టనర్ కూడా అయిపోయింది. రోజు పొద్దున్నే ఆమె ఆఫీస్ కి వచ్చేసేది. రాత్రి తొమ్మిది వరకు ఉండేది. వెబ్సైట్ ని ,యాప్ ని ,మ్యాగజైన్ ని ఆర్నెళ్లలో లాభాలలో నడిచేలా చేసింది. ఆమెను ప్రతి రోజు అలా చూస్తూ ,ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటమే మాకు లాభాల కన్నా మాకు బాగా నచ్చిన అంశం.

* * *

సంవత్సరం తిరిగేసరికి మా ఆఫీస్ స్టాఫ్ సంఖ్య రెండొందలకు పెరిగింది. ఇదంతా కూడా ఆమె చలవే . మేము ముగ్గురము యాభైల్లో ఉన్నవాళ్లమే. ఇన్నేళ్ల అనుభవంలో ఒక్క రిమార్క్ కూడా లేదు మా మీద. పరస్త్రీలతో సంబంధాలు పక్కన పెడితే వాళ్ళతో చనువుగా మాట్లాడటానికే ధైర్యం చాలేది కాదు మాకు. కానీ ఎందుకో ఆమె మాత్రం మాకు బాగా నచ్చేసింది.

యాభైల్లో పడ్డాక మగాళ్లకు ఓ వింత ప్రవృత్తి ఉంటుంది. అందరి మగాళ్లలో అది ఉందో లేదో తెలియదు కానీ మాలో మాత్రం అది ఉంది. అమ్మాయిల అందం కన్నా ఆమె ప్రవృత్తి ,పరిణతి బాగా ఆకర్షిస్తుంది ఈ వయసులో. కానీ వారికి పెళ్లైపోయింది ,వయసెక్కువ అనే భావన కలగగానే వారి మీద గౌరవమే ఉంటుంది గాని ఆరాధన కలగడం అనేది జరగదు.

కానీ ఆమె యవ్వని .ఆలోచనల్లో ఎప్పుడు మా కన్నా ముందే ఉండేది. అందుకే ఆమె మాకు ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఇన్నాళ్ళు మాకు జీవితం పట్ల పెద్ద అసంతృప్తి లేదు ,కానీ ఆమె వచ్చాక మేము ఇంకో పాతికేళ్లు తరువాత పుడితే బావుండేది అనిపించింది.


* * *

ఆ రోజు ....

గెస్ట్ హౌస్ లో మా ముగ్గురితోనే ఉన్న రోజు ఆమె మాటలింకా మా చెవుల్లోనే ఉన్నాయి. మమ్మల్ని ఆమె ఎప్పుడు త్రిమూర్తులు అని పిలిచేది.

‘చూడండి త్రిమూర్తులు ... మనుషులు మనకు దగ్గరవుతూ దూరం అవ్వడానికి నాకు తెలిసినంత వరకు కారణం ఒకే ఒక్కటి. అది ఆడ,మగ అనే అతి స్పృహ మనలో తెలియకుండానే కలిగి ఉండటం. భార్యాభర్తలని చూడండి. వాళ్ళిద్దరూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. కానీ ఏ భర్త అన్ని విషయాలు భార్యతో చెప్పడు. అలాగే ఏ భార్య అన్ని విషయాలు పంచుకోదు. దానికి కారణం ఆడ,మగ అనే అతి స్పృహ కలిగి ఉండటం.

జీవితంలో ఎదగాలంటే ఆ భావనను మించి ఉండాలి. నాకు మీ ముగ్గురుని చూస్తే మీరు మగవాళ్లు ...మీ దగ్గర ఇంకోలా ఉండాలి, మిమ్మల్ని చూడగానే నా డ్రస్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి ,కొంచెం సిగ్గు ఇంకొంచెం భయం కూడా అభినయించాలి అని నాకు అనిపించదు.

మనం నలుగురం ఒకటే కదా అనిపిస్తుంది. అప్పుడు ఏ రకమైన అసహజ ప్రవర్తన మన మధ్యకు రాదు. నాకు ఏ మాత్రం ఆ స్పృహ లేనప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారు అనే దాని గురించి ఆలోచించడమే నాన్సెన్స్ కదా! కనుక మీరు ముగ్గురు మాత్రమే గెస్ట్ హౌస్ లో ఉన్నారు ...రావచ్చా ? రాకూడదా ? అని ఆలోచించలేదు. నా ఆలోచనలు అంత సంకుచితమైనవి కాదు.

ఇంకా లోతుగా పోతే , నన్ను నిజంగానే మీరు ఏమైనా చేసినా ...ఆ స్త్రీ తత్వ స్పృహే నాలో లేనప్పుడు ...నాలో లేని ఆ భావనను మీరు ఎలా ఆస్వాదించగలరు? మీరు నాకు ఎప్పుడు స్నేహితులే. మీలో ఉన్న ఎన్నో విలువలు నాకు తెలుసు. ఇన్ని రోజులు ఆఫీస్ లో ఒంటరిగా మీ ముగ్గురితో ఉన్నప్పుడూ కలగని భావన ఈ గెస్ట్ హౌస్ లో మాత్రం ఎలా కలుగుతుంది? వుయ్ ఆర్ ఫ్రెండ్స్ ఫరెవర్ బాస్ .’

ఆ రోజు ఆమె మాటలు ఇప్పటికీ మాకు కొత్త గానే అనిపిస్తూ ఉంటాయి. ఆమె ఏమి మాట్లాడినా అలానే ఉంటుంది.

స్త్రీ అంటే అలా ఉండాలి ,ఇలా ఉండాలి అన్న ఊహలు మాకుండేవి. వయసుతో పాటు అవి పెరిగిపోయాయి. కానీ ఆమెను చూశాక ఏ ఇతర స్త్రీని ఇంత ఆసక్తి తో చూసింది లేదు. మా భుజం మీద మిగిలిన ఆమె స్నేహ స్పర్శ ఈ ప్రపంచంలో మాకు స్త్రీలను చూడగానే మనసులో సాగే అసభ్య ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆమె పక్కన నడుస్తూ ఉంటే ప్రపంచాన్ని జయించిన భావన మా మనస్సుల్లో ఉండేది.

* * *

ఊహించని ఆ రోజు రానే వచ్చేసింది.

ఎవరూ మనతో కలకాలం ఉండరు కదా! తన లక్ష్య సాధన వేటలో మమ్మల్ని మళ్ళీ ఒంటరిని చేసి ఆమె వెళ్లిపోయింది.

గతి లేని మనసుని శృతి చేసిన ఆమె ఇక మాతో ఎప్పటికీ ఉండదు.

కానీ మా మనసుల్లో అతి స్పృహ మాత్రం ఆమెతో పాటు ఎంతో కొంత తీసుకువెళ్ళిందనే అనుకుంటున్నాము  !

* * *





Comments

  1. చాలా బాగుందండీ కథ. ఉద్యోగం చేసే స్త్రీల పట్ల ఎంత సహజంగా మెలగాలో, అలా మెలగడానికి కారణం ఏమిటో , చాలా చక్కగా చెప్పారు ఆమె మాటలలో, ఆమె పాత్రతో.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ. ఎప్పుడో ఓ సారైనా ప్రతి స్త్రీ ఈ సందర్భాన్ని ఎదుర్కొక తప్పదు. దానిని ఎదిరించడానికి మనం చూసే కోణం మారాలి. అప్పుడే పరీక్షకారం సాధ్యం అవుతుంది.

      Delete
  2. కథా వస్తువు చాలా కొత్తగా ఉంది. నడక విధానం నచ్చింది. పాత్రల పేర్లు చెప్పకుండా బాగా రాశారు. కానీ కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఉన్నట్టుండి ముగించే సరికి కథా అసంపూర్తిగా ఉన్నట్టు తోస్తుంది. ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. కథ పెంచే కొద్దీ స్పృహ అంశానికి దూరమై సాగతీత ఎక్కువయ్యేలా అనిపించింది. అందుకనే యాబ్ స్ట్రాక్ట్ పద్ధతిలో కేవలం ఆ అంశం స్పృశించాక ముగించడం జరిగింది. అందులోనూ ఓ ప్రవృత్తికి అలవాటు పడిన వారు ఓ అమ్మాయి చెప్పడం వల్ల మారినట్టు కథ సాగించినా సరే అది వాస్తవానికి దూరం అయిపోతుందన్న భావనతో వాస్తవానికి దగ్గరగా ఉన్నంతవరకే కథను నడిపించటం జరిగింది. మీ అమూల్యమైన అభిప్రాయానికి ధన్యవాదాలు.

      Delete

Post a Comment

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ