ఫ్యాంటసీ

ఫ్యాంటసీ

-రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)



ఈ రోజు నల్ల కుక్క నన్ను చూసి మొరగడం లేదు.

ఎందుకో దాన్ని చూస్తుంటే నాకు మా ఆయనే గుర్తుకొచ్చాడు.

‘నిండుగా చీర కట్టుకోలేవు ....టీ షర్ట్ ,జీన్స్ తో వెళతావా ? ... ఇలా అయితే వెళ్ళడం మానెయ్యి ....’

అదేదో మహా పాపం అయినట్టు ....అయినా మార్నింగ్ వాక్ కి చీరలో వెళితే ఏమైనా సౌకర్యంగా ఉంటుందా? ఆయన టూర్ కి వెళ్లినప్పుడు మొదలు పెట్టాను వాకింగ్ .... టీ షర్ట్ తో ఉన్న ప్రతిసారి నల్ల కుక్క నన్ను చూసి మొరుగుతూనే ఉండేది.

ఈ రోజు మా ఆయన మాట మన్నించి చీర కట్టుకునేసరికి అది అరవడం మానేసి తోక ఊపుతుంది. బహుశా ఈ కుక్క పోయిన జన్మలో ‘అనుమానపు మొగుడు’ అయి ఉంటుంది అనిపించింది నాకు.

అడుగులు ముందుకు పడుతున్న నా జీవితంలో ఉత్సాహం వెనక్కి పరుగులు పెడుతున్నట్టు నాకు అనిపించింది. ఈ రోజు పార్క్ అంతా ఖాళీగా ఉంది. ఒకే ఒక్క మనిషి ఉన్నాడు.

మధ్య వయసు ఉండొచ్చు అతనికి. నాకు ఎందుకో మనిషి ముఖాలంటే విపరీతమైన ఆసక్తి. పార్క్ లో ప్రతి రోజు దాదాపు అందరి ముఖాలు ఒక్కసారైనా చూస్తూ ఉంటాను. ఉన్నది ఇద్దరమే కనుక ఆయన మీద ఆసక్తి పెరిగింది. అడుగుల వేగం పెంచి అతన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

అతను చాలా వేగంగా నడుస్తున్నాడు. నా స్పీడు సరిపోవడం లేదు.

మొత్తానికి అతనికి చాలా దగ్గరగా వచ్చేశాను.

ఓ సైడ్ నుండి అతని మొహం చూడాలని ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు.

మొత్తానికి చీర కుచ్చిల్లు అడ్డుపడుతున్నా పరిగెత్తేసి దాదాపు అతని దగ్గరకు వచ్చేశాను.

నా పరుగుల చప్పుడుకి అతను కూడా ఒకసారి తల తిప్పి నా వైపు చూశాడు. అతని మొహం చూసేసరికి నా గుండె వేగం పెరిగింది. ఒక్కసారిగా చెప్పలేనంత ఎక్సైట్మెంట్, ఎన్నాడో పొగొట్టుకున్న పెన్నిధి దొరికినట్టు నాకు అనిపించింది.

నా మొహంలో మారుతున్న హావభావాలు చూసి అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు.

ఓ చిరునవ్వు నవ్వాడు ...

అతని పక్కగా ఉన్న నేను ... ఒక్కసారి ముందుకు గెంతినట్టుగా గెంతి అతనికి అభిముఖంగా నిలబడ్డాను. అతను నా చర్యకు ఆశ్చర్యపోయేలోపే ....అతని భుజాల్ని నా రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని ఊపెస్తూ ‘మిష్టర్ డాన్ ‘అన్నాను .

అప్పటికే నా చేష్టలకు షాక్ అయిన అతను .... నాకు పిచ్చెమో అనుకుంటున్నాడు అనుకుంటా ...

‘వాట్ హ్యాప్నెడ్ మేడమ్ ? ఆర్ యూ ఓకే ?’ అని అడిగాడు

‘సర్ ...మీరు మిష్టర్ డాన్ సీరియల్ లో హీరో కదూ...నేను మీ పెద్ద అభిమానిని ...మిమ్మల్ని కలవాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాను ...అసలు ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తున్నాను అన్న విషయం కూడా నమ్మలేకపోతున్నాను ...ఐయామ్ డయ్యింగ్ టూ మీట్ యూ సర్ ‘ అన్నాను.

‘కామ్ డౌన్ మేడం. ఇక్కడికి రండి ...కూర్చోండి ‘ అంటూ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొన్నాడు.

‘మీ పేరు కాంచన కదూ... మీరు డిటెక్టివ్ రచయిత్రి కదూ ...మీ నవలలు నేను చదివాను. సుమారు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన నా సీరియల్ మిష్టర్ డాన్ గుర్తు పెట్టుకోవడం నేను ఇంకా నమ్మలేకుండా ఉన్నాను.’

‘చిన్నప్పటి నుండి నాకు సాహసాలంటే చాలా ఇష్టం సర్. నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడూ మొదటి సారి మీ సీరియల్ చూశాను. తరువాతి నా రచనల్లో తెలియకుండా మీరే హీరో అయిపోయారు. మీ మ్యానరిజమ్స్ ని నా నవలల్లోని నాయకుడికి అన్వయించేదానిని. మిమ్మల్ని చూడాలని ,కలవాలని ,మీతో ఓ లాంగ్ రైడ్ కు వెళ్లాలన్నది నా ఫ్యాంటసీ సర్....’

నా చివరి వాక్యానికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఎటూ లెక్కవేసిన ఆయన వయసు ఇప్పుడు అరవై ఉంటాయి అని నాకు తెలుసు.

‘సర్ ...ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు ....మీ నంబర్ నాకు ఇవ్వరా ప్లీజ్ ?’

ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.

‘చూడమ్మా ...ముందు నువ్వు స్థిమితపడు ... ఇటువంటి ఫ్యాంటసీ ఉండటంలో తప్పు లేదు, కానీ ఇప్పుడు మీరు పేరు పొందిన రచయిత్రి ...మీకంటూ ఓ కుటుంబం ఉంది ....ఆ పరిధిలో నిలబడి ఆలోచించే ప్రజ్ఞ లేకపోతే సాహితిలోకంలో పడిపోతారు. జీవితంలో మొదట నచ్చినవారు ఎప్పుడు అద్భుతంగానే కనిపిస్తారు. ఇటువంటి ఫ్యాంటసీలు ఎక్సైట్మెంట్లు మనిద్దరికి సరిపడవు. ఇక నేను వెళ్తానమ్మా ....’ అన్నారాయన .

వెళ్లడానికి సిద్ధమైనట్లు నిలుచున్నరాయన. అరవయిలో ఉన్నా నలభైఏళ్ళ వ్యక్తి లానే ఉన్నాడు.

ఎందుకో ఆ క్షణం నా మనసు వశం తప్పింది.

గభాలున నిలుచుని ఆయన్ని గట్టిగా కౌగలించుకున్నాను.

నేను కౌగిలి నుండి విడిపోయేలోపే ... నా జబ్బ మీద పడ్డ ఓ బలమైన చేయి నన్ను గట్టిగా లాగింది. నేను ఎవరా అని చూసేలోపే కళ్ళు బైర్లు కమ్మెలా నా చెంప పగిలింది.

మొరుగుతూ నల్ల కుక్క ...దాని పక్కన నా భర్త .

నా ఫ్యాంటసీ కి రూపమైన ‘మిష్టర్ డాన్ ‘ నా భర్త కళ్లలోకి చూడలేక ,అవమాన భారంతో వెళ్లిపోయాడు.

‘ఎంతకీ తెగించావే నువ్వూ?’ ఆయన నోటిలో నుండి మాటలు కాస్త పచ్చి బూతులుగా మారాయి. అప్పుడే పార్కులో జనాలు పెరుగుతున్నారు. అందరూ నా వైపే చూస్తున్నారు. అవమాన భారం తో నా మనస్సు భూమిలోకి క్రుంగిపోతున్నట్లు అనిపించింది.

పార్కు లో సగంలో ఆగిపోయిన శారీరక దాడి నా భర్త ఇంట్లో పూర్తి చేశాడు.

* * *

ఆ రోజు మా తొలి రాత్రి.

పెళ్లి అయిన ప్రతి స్త్రీ భర్త తనని బాగా అర్ధం చేసుకుంటాడని , అతనికి తానే ప్రాణం అనే ఊహాల్లో బ్రతుకుతూ ఉంటుంది. ఆ కోవకు చెందిన స్త్రీనే నేను కూడా.

పెళ్లయ్యే నాటికి నా వయసు 25. అప్పటికే కధలు ,కాకరకాయలు అంటూ రాసేస్తూ ఉండేదాన్ని. కానీ చిన్నప్పటి నుండి నాకున్న ఒకే ఒక ఫ్యాంటసీ ‘మిష్టర్ డాన్ తో లాంగ్ రైడ్ .’

నా భర్త కూడా ఓ సినీ నిర్మాత ,ఆర్టిస్ట్ కూడా . నిశ్చితార్థం నుండి మొదటి రాత్రి అయ్యే వరకు నన్ను బాగా ప్రేమించాడు. ఆ ప్రేమ శాశ్వతం అని నేను నమ్మేశాను. అతని దగ్గర ఏ విషయం దాయకూడదని నాకు అనిపించింది. అందుకే మిష్టర్ డాన్ గురించి కూడా చెప్పేశాను. ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నించి, చిరునామా కూడా కనుక్కుంటాను అని నాకు మాట ఇచ్చాడు కూడా.

కానీ అదే నా జీవితాన్ని తరువాత నరకంగా చేస్తుందని నేను ఊహించలేదు.

ప్రపంచంలో ఊహే లేని మనిషి ఉండదని నా అభిప్రాయం. ఆ ఊహకు కొన్ని సార్లు ఫ్యాంటసీలు కలిపితే క్రియేటివిటీ అని కూడా నన్ను నేను సమర్ధించుకుంటాను నన్ను నేను చాలా సార్లు.

ఆ ఊహాలు ,ఫ్యాంటసీలు బొత్తిగా లేని వ్యక్తి నా భర్త అని నాకు అనిపించేది.

కానీ నా భర్త రసికుడు అని అన్నీ పత్రికలు దాదాపు ఘోషిస్తూ ఉంటాయి. క్రమంగా నాకు అర్ధం అయింది ఏమిటంటే కొందరు భర్తలు భార్యల దగ్గరే భావుకులుగా,ప్రియులుగా ఉండరని.

దీనికి తోడు నా మీద ఉన్న అనుమానం నన్ను హౌస్ అరెస్టు అయ్యేలా చేశాయి. ఏ రోజూ కూడా పెళ్ళికి ,పార్టీకి ,సినిమా కి దేనికి కూడా తీసుకు వెళ్ళేవాడు కాదు. అయిదేళ్లుగా ఇదే తంతు. అతి కష్టం మీద మార్నింగ్ వాక్ కి ఒప్పుకున్నాడు.

కానీ నాకు బాగా తెలుసు ఈ రోజూ నా జీవితంలో మధురమైన ఘట్టం అనుకున్న ఈ కలయిక అనుకోని దారుణాలకు కచ్చితంగా దారి తీస్తుందని. ఎందుకంటే నా భర్త విష వృక్షం కనుక!

* * *

ఒంటి మీద దెబ్బలు ఇంకా మానలేదు.

కానీ నా జీవితంలో సంతోషంగా గడిపింది పెళ్లి కాక ముందు, మళ్ళీ నిన్న మార్నింగ్ వాక్ లో.

సుమారు సంవత్సరం క్రితం పట్టిన కలం ఆ మీటింగ్ స్ఫూర్తి తో గుర్రంలా పరుగెట్టింది. నవలలో కథానాయకుడి పాత్రను నా ‘మిష్టర్ డాన్ ‘ లో చూసుకుంటూ గొప్పగా మలుచుతున్నాను .

ఇంతలో టీవి గగ్గోలు పెట్టింది ఫ్లాష్ న్యూస్ తో.

‘ప్రముఖ సినీ నటులు ,బుల్లి తెర నటులు అయిన మిష్టర్ డాన్ ఫేమ్ అయిన కులకర్ణి గారు దారుణ హత్యకు గురయ్యారు…’

ఇక మిగిలిన వివరాలు చూసే ధైర్యం నాకు లేకపోయింది.

నా భర్త సడన్ గా విదేశాలకు వెళ్లడానికి ,ఈ హత్యకు ఉన్న సంబంధం నాకు చూచాయిగా అర్ధం అయింది.

* * *

రెండు రోజులు గడచిపోయాయి. ఎందుకో నేను కులకర్ణి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలని నా మనసు దహించుకుపోతుంది. ఇంకా నా భర్త ఇంటికి తిరిగి రాలేదు. తప్పో ,ఒప్పో తెలియకపోయినా ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తాళం వేశాను.

పోలీసు స్టేషన్ కి వెళ్ళాను.

‘కులకర్ణిని చంపింది నా భర్తే ...’ ఆ రోజూ పార్క్ లో జరిగిందంతా చెప్పాను. ఇన్స్పెక్టర్ నన్ను వింతగా చూశాడు.

‘భార్య పరాయి వాడిని కౌగలించుకుంటే ఏ భర్త అయినా చెంప పగలగొట్టకుండా సన్మానం చేస్తాడా ?’ అని నా వైపు ఎగా దిగా చూశాడు.

పోలీసు స్టేషన్ లో అందరూ నన్ను వింతగా చూస్తున్నారు.

ఇంతలో నా భర్త అక్కడికి రానే వచ్చాడు.

‘నమస్తే సర్’ అన్నాడు ఇన్స్పెక్టర్ గౌరవంతో .

మౌనంగా తల ఊపాడు నా భర్త.

‘పద ఇంటికి ‘ అన్నాడు.

మౌనంగా ఆయన్ని అనుసరించాను.

* * *

‘కాంచనా ....నీకు ఎలా చెబితే అర్ధం అవుతుందో నాకు అర్ధం అవ్వడం లేదు.నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో ఏ భర్త తన భార్యను పరాయి మగాడికి పరిచయం చేయడానికి ఇష్టపడడు. అలాగే తన భార్యను పరాయి మగాడితో చూసి తట్టుకోలేడు కూడా.

నీ లోకం వేరు ...నా లోకం వేరు! మన అభిరుచులు వేరు. నువ్వు అందంగా ఉంటావు కనుక కాస్తా అనుమానం ఉన్న మాట నిజమే కానీ ...మరి మనుష్యులని చంపేంత దుర్మార్గుడిని కాను నేను. నువ్వు చాలా మంచి దానివని నాకు తెలుసు. నాకు ఎన్నోసార్లు నీ ఫ్యాంటసీ గురించి చెప్పావు. అతన్ని కనుక్కోవడం నాకు కష్టమైన పని కాదు. కానీ మొదట నీకు ‘ఇన్స్పిరేషన్ ‘ అయిన వ్యక్తి నా కన్నా నీ జీవితంలో ఎక్కువైపోతాడేమోనని భయంతో నిన్ను కట్టుదిట్టం చేశాను... అంతే ... నన్ను అర్ధం చేసుకో...ఇంతకు మించి నేను ఏం చెప్పలేను...’

నా భర్తను ఎంతవరకు నమ్మాలో నాకు అర్ధం కాలేదు. కానీ తనతో పూర్తిగా మాట్లాడటం మానేశాను.

సినిమా రంగంలో చిన్న పుకారు చాలు జీవితాలను నాశనం చెయ్యడానికి. నా భర్త కులకర్ణిని చంపాడన్న వార్త ఎంత గట్టిపడిందంటే అందరూ నా భర్తను హంతకుడిలా చూడటం మొదలు పెట్టారు.

ఎంతో కష్టపడి నిర్మించుకున్న కెరియర్ నా వల్ల నాశనం అయ్యింది. మానసికంగా ఆయన చాలా కృంగిపోయాడు. నేను ఆయనను బొత్తిగా పట్టించుకోవడం మానేశాను.

తన గది దాటి బయటకు రావడం మానేశాడు. ఏ ఒక్క అవకాశము తన వరకు రాలేదు. మూడు నెలలు గడచిపోయాయి.

ఆత్మహత్యతో తన జీవితాన్ని ముగించుకున్నాడు.

అతని చావు నాలో కన్నీళ్లు ద్రవింపజేయలేదు.

‘తగిన శాస్తి జరిగిందిలే. మనిషిని చంపితే ఆ పాపం ఊరికే పోతుందా?’ అని అనుకునేంతా నా మనసు రాటుదేలిపోయింది .

బ్రతకడానికి నాకు ఏం ఇబ్బందులు లేవు. నేను ఆర్ధికంగా స్వతంత్రురాలినే.

* * *

ఇంకో నెల గడచిపోయింది.

‘కులకర్ణిని ఆస్తి కోసం కన్న కొడుకులే దారుణంగా హతమార్చారు. సాక్ష్యాధారాలతో నిరూపించిన పోలీసు శాఖ ...ఆ కుట్రలో అల్లుడుకి కూడా భాగం ఉండవచ్చు అని అనుమానం ఉంది ...’

అప్పటి వరకు అన్ని తట్టుకుని సుమారు 12-15 సార్లు సాగిన నా గుండె స్పందన ఆ క్షణం ఆగిపోయింది.’

* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!